కర దర్శనము
Dharma Vaani – K C Das Memorial Charitable Trust
మనము నిద్ర లేచిన తరువాత చేయాల్సిన మొదటి పని
మనము ప్రతి రోజు నిద్ర నుండి లేవగానే చెయ్యవలసిన ముఖ్యమైన విషయం ఒకటుంది.
సాధారణముగా మనము సకాలములో నిద్ర లేస్తే గనుక, బద్దకంగా వళ్లు విరుచుకోవటం, అటు ఇటు దిక్కు చూడటం, గడియారం వైపు చూడటం, ఫోన్ చూడటం, కిటికీ చూడటం ఇత్యాదివన్నీ చేస్తుంటాము. సనాతన ధర్మాన్ని అనుసరించి మనము ఉదయం నిద్ర లేవగానే మన రెండు అరచేతులని ఒక దగ్గిరకు చేర్చి, ఈ క్రింది శ్లోకం మననం చేసుకొని, మన రెండు అరచేతులని కంటి నిండుగా చూసుకోవాలి.
ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే మన రెండు చేతులను చూస్తూ మనము మననం చేయాల్సిన ప్రార్థన శ్లోకం – కరాగ్రే వసతే లక్ష్మీ , కరమధ్యే సరస్వతీ, కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కర దర్శనం,
ఈ శ్లోకం అర్థం మనము ఇలా చెప్పవచ్చు. – “కరము అంటే ‘చేయి’, వసతే అంటే ‘నివసించటం’. నా అరచేయి మొదటి భాగములో (వేళ్ళు చివర) సంపదకు అధిదేవతయైన లక్ష్మిదేవి నివసిస్తుంది. అరచేతి మద్యలో విద్యకు అధిదేవతయైన అయిన సరస్వతిదేవి నివసిస్తుంది. అరచేతి చివరలో (మడి కట్టు) శక్తికి అధిదేవతయైన అయిన గౌరిదేవి నివసిస్తుంది. పవిత్రమైన ముగ్గురు అమ్మలు ఉన్న ఈ చేతిని ఉదయమున నేను దర్శిస్తున్నాను.”
మన పెద్దలు ఏ ప్రార్థన అయినా ఒక ప్రయోజనాన్ని ఉద్దేశించి చెప్తారు. ఈ ప్రార్థన వెనుక ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుందాము.
కరాగ్రే వసతే లక్ష్మీ – మన చేతి వేళ్ళ చివర లక్ష్మిదేవి నివసిస్తుంది. ఎలా? మనము ఏదయినా పని చేసి ధనాన్ని సంపాదిస్తాము. మనము ఏ పని చెయ్యాలన్నా మన చేతి వేళ్ళ అవసరం ఎంతైనా ఉంటుంది. మనలోని నైపుణ్యం అంతా మన చేతి వేళ్లతోనే ఉంటుంది. ఉదాహరణకు ఒక కళాకారుడు తన చేతి వేళ్లతోనే వీణను మీటగలడు, ఒక కళాకారుడు తన తన చేతి వేళ్లతోనే వేణువును పలికించగలడు. ఒకరి రాత (తలరాత కాదండోయి, చేతిరాత) బాగుండటం వారి చేతుల్లోనే ఉంటుంది.
కరమధ్యే సరస్వతీ – సరస్వతీ అంటే జ్ఞానము. జ్ఞానప్రదాత అయిన సరస్వతి మాతను ప్రాతః కాలములో ఒక్కసారి తలచుకోవాలి. సరస్వతి అనుగ్రహం లేకపోతే మనకి ఏ విద్యా లభించదు. మన చేతి వేళ్ళ మధ్యలో సరస్వతి దేవి నివసిస్తుంది. ఎలా? మనము చేతి వ్రేళ్ళు మరియు అరచేయి సాయంతో రాయడం, చదవడం చేస్తాము. మనము జాగర్తగా గమనిస్తే, ఏదైనా వ్రాసేటప్పుడు మన చెయ్యిని మధ్యకు వంచి వ్రాస్తుంటాము. ఒకవేళ మన చెయ్యిని అలాగే నిటారుగా ఉంచితే సరిగ్గా వ్రాయలేము. అలాగే ఒక పుస్తకాన్ని చదువుతునప్పుడు ఆ పుస్తకాన్ని మన చెయ్యి మధ్యలో పెట్టుకుంటాము.
కరమూలే స్థితా గౌరీ – శక్తి అంటే అమ్మవారు. గౌరి చేతిలోనే ఉండాలి, ఉంటేనే ఆ చేతితో ఏమైనా చెయ్యగలుగుతాము. రోజంతా శ్రమించాలన్న శక్తి కావాలి. గౌరిదేవి అనుగ్రహం లేకపోతే మనము శక్తిహీనులమే. మన చేతి వేళ్ళ చివర గౌరిదేవి నివసిస్తుంది. ఎలా? మనము రోజంతా ఏ పని చెయ్యాలన్నా (ఉదాహరణకు దానం చెయ్యాలన్నా, ధర్మం చెయ్యాలన్నా, ఏదైనా ఒక కార్యం సాధించాలన్నా, ఒక కారు నడపాలన్నా, ఒక సంతకం పెట్టాలన్నా) చెయ్యి, ఆ చేతులలో శక్తి రెండు అవసరమే.

“త్రిశక్తి స్వరూపమైన మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఎక్కడో లేరయ్యా, నీ చేతులలోనే ఉన్నారు, నీవే చూసుకొని దాన్ని నీవే సాదించుకో”, అనే ఆత్మవిశ్వాసాన్ని కలిగించే శ్లోకంతో రోజును ప్రారంభము చెయ్యగలిగితే ఆ రోజంతా కూడా ఉత్సాహముగా, ఉల్లాసంగా గడిచిపోతుంది అని సనాతన ధర్మంలో పెద్దలు మనకందించారు.
మనము ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ఈ శ్లోకం ఒక్కసారి మననం చేసుకొని, మన చేతులతో ముఖాన్ని నిదానంగా తుడుస్తూ, కళ్ళను తెరచి అరచేతులను కంటి నిండా చూసుకుంటే, రోజంతా ఉత్సహంగా గడపగలుగుతాము అని సనాతన ధర్మం పేర్కొంటోంది.