ఎలా మాట్లాడాలి
Dharma Vaani – K C Das Memorial Charitable Trust
మనకి సనాతన ధర్మంలో ఋషులు మన జీవినావిధానానికి కావాల్సిన శాస్త్రమును వేరు వేరు సందర్భాలలో వేరు వేరు పురాణాలలో అందిస్తూ వచ్చారు. వాటిని ఒక్కసారి మన్మాడు మననం చేసుకుంటే మన యావజ్జివితము వారికి ఋణపడటమే కాకుండా, మన వంశాభివృద్ధికి ఎంతో చేసిన వారి ఋణము ఎలా తీర్చుకోవాలో అని మనకనిపిస్తుంది. అటువంటి ఒక అంశము గురించి తెలుసుకుందాము.
మనకి నీతిశాస్త్రం ఒకటి భోదిస్తుంది. అది మాట్లాడే విషయములో. మనిషి మాట్లాడటానికి ఎప్పుడు ఉవ్విలూరుతూ ఉంటాడు. అయితే భగవంతుడు మనిషికి రెండు చెవులు ఇచ్చి ఒకటే నోరు ఇచ్చాడు. అంటే ఎక్కువ వినండి, తక్కువ మాట్లాడండి అని. కొంతమంది ఉంటారు మహానుభావులు తక్కువ మాట్లాడుతూ ఉంటారు. మితభాషిత్వం కలిగినవారు. కానీ ఎక్కడ చూసినా, సహజముగా మాట్లాడటానికి ఇష్టపడతాడు కనుక వినటానికి ఓపిక కావాలి, ఓర్పు కావాలి, సహనం కావాలి, ఆసక్తి కావాలి, ఆ సబ్జెక్టు ఏదైతే విషయము మాట్లాడుతున్నారో మనిషి ఆ సబ్జెక్టు మీద అనురక్తి కావాలి, ఇవి లేకుండా మనిషి వింటూ ఉండటం కష్టం. అందువల్ల మాట్లాడటానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాడు మనిషి.
అయితే మనిషి మాట్లాడే మాటలు ఎలా ఉండాలి? ‘సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్
న బ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ స్సనాతనః’, అని ధర్మశాస్త్రం పేర్కొంటోంది. సనాతన ధర్మంలో మనము చెప్పిన విషయమేమిటంటే ‘సత్యమే పలకాలి, అసత్యము పలుకకూడదు’ అని. అయితే అసత్యం పలకటం ఈవాళ సమాజములో చాలా సహజమైపోయింది. రోజుకు నూరుమాటలు మాట్లాడితే అందులో చాలా అసత్యాలు ఉంటున్నాయి, ముప్పై నలభై మాటలు తప్ప మిగితావన్ని అసత్యాలే ఉంటున్నాయి. అది చాలా ప్రమాదం. కనుక మాట్లాడే మాటలు సత్యముగా ఉండాలి.
‘సత్యమునే పలుకవలెను’, అనేది ఒక వ్రతముగా తీసుకుంటే సత్యమునే మాట్లాడుతూవుంటాము. ఆ మాట్లాడే సత్యము కూడా ‘ప్రియం బ్రూయాత్.’ ప్రియమైన వంటి విషయం, అంటే అవుతలివ్యక్తికి, వినేటటువంటివారికి ప్రియమును చేకూర్చేవంటిది, అంటే ప్రీతిని, సంతోషాన్ని, ఆ మాటలు వినటం వల్ల కలిగిన సంతోషాన్ని చేకూర్చే విధముగా మాట్లాడాలి కానీ, సత్యము మాట్లాడమన్నారు కదా అని కటువుగా మాట్లాడితే ‘యదార్థవాది లోకవిరోధి’ అందుకే వచ్చింది.
అంటే ఇక్కడ కావాల్సింది ప్రజ్ఞత కాదు, విజ్ఞతతో అవతలివ్యక్తికి ఏ విధమైన కష్టం కలుగచేయకుండా ఉంటటువంటి మాటలు ప్రీతికరమైనవి. ప్రతి వారిలో మంచి ఉంటుందండి, ఆ మంచిని వెతికి పట్టుకొని మాట్లాడమని దీని భావం, అంతే కానీ మరొక ఉద్దేశం కాదు. ‘సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్.’ బ్రూయాత్ ఆంటే ‘మాట్లాడమని’, ‘ప్రియం బ్రూయాత్’ ఆంటే ప్రియమైనటువంటివే మాట్లాడమని. ఆలా అని అవతలి వ్యక్తికి ఆనందం కలిగించటం కోసం, అతనికి ప్రీతిని కలిగించటం కోసం, ముఖస్తుతి చెయ్యటం కూడా కూడదు.
‘న బ్రూయాత్ సత్యమప్రియం.’ అప్రియమైనటువంటివి సత్యమైనా పలుకకూడదు అని శాస్త్రం పేర్కొంటోంది. ఆంటే నిజంగానే కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని విషయాలు మనము మాట్లాడితే అవతలికి వ్యక్తికి కష్టాన్ని కలిగినచవచ్చు. అటువంటప్పుడు సత్యమైనటప్పిటికి కూడా, నిజమైనప్పటికీ కూడా ఆ విషయాన్ని మాట్లాడకపోవడం ఉత్తమం.
అలాగే ‘ప్రియంచ నానృతం బ్రూయాత్’, అతనికి ఇష్టం కదా అని ముఖస్తుతి మాటలు, అబ్బదపు మాటలు, అసత్యపు మాటలు, మెప్పుకోలు మాటలు, లేనిపోనివి కల్పించి అతనికి సంతోషాన్ని కలిగించటం కోసం మాట్లాడే అసత్యపు మాటలు మాట్లాడకూడదు. అందువల్ల ఈ సూత్రాన్ని కనుక గుర్తుంచుకుంటే ‘సత్యం బ్రూయాత్.’ చాలా సందర్భాలలో మాట్లాడకుండా ఉంటే అసత్యాన్ని పలుకావలసిన అవసరం రాదు. మనిషి తొందరపాటుతో మాట్లాడుతూ ఉంటాడు, తొందరపడి మాట్లాడతాడు. అందువల్ల సత్యమనేటువంటి వ్రతాన్ని పాటించటం కోసం ఇది సూత్రముగా ఇచ్చారు మనకి.

ఎక్కడ సత్యాన్ని పలుకలేమో అక్క మౌనముగా ఉండటం మంచిది. సాధ్యమైనంతవరకు మాట్లాడినవన్నీ కూడా అవతలి వ్యక్తులకు ప్రీతి కలిగించేటటువంటివి, సంతోషాన్ని కలిగించేటటువంటివి, ఆనందాన్ని కలిగించేటటువంటివి అలవాటు చేసుకోవాలి.
అప్రియమైన విషయాలు సత్యమైన మాట్లాడకుండా ఉండి, అలాగే అవతలి వ్యక్తికి ప్రీతి కలిగిస్తుంది కదాని అనవసరపు విషయాలు మాట్లాడకుండా ఉంటే ఇది వాచక తపస్సు అవుతుంది. ధర్మస్య విజయోస్తు.