మనిషి సాధించవలసింది ఏమిటి?
Dharma Vaani – K C Das Memorial Charitable Trust
మానవ జీవితములో మనము సాధించవలసినదేమిటి అని ఒక్కసారి ఆలోచన చేస్తే, సనాతన ధర్మం మనకు చెప్పినటువంటి విషయము ధర్మసముపార్జన మాత్రమే మనము సాధించాలి. మిగితావన్ని క్షణికము. అసలు మనిషై పుట్టినవాడు సాధించవలసినదేమిటి?
‘ధనేన కోసే పశవశ్చ గోష్టే స్త్రీ గృహద్వారే, జనః శ్మశానే దేహాశ్చితాయాం పరలోక యానాం, దర్మానుగో గచ్ఛతి జీవఏకః‘, అని ధర్మశాస్త్రం పేర్కొంటోంది.
జీవుడు ఒక్కడిగా ఈ లోకంలోకి వస్తాడు. సంపాదిస్తాడు కష్టపడి, దాని కోసం ఎండనక, వాననక, రేయి అనేక, పగలు అనేక దానికోసం విపరీతముగా కష్టపడతాడు, చమటోడుస్తాడు, ఎన్నో ఇబ్బందులు పడతాడు, ఎంతో శ్రమపడతాడు, ధనాన్ని సంపాదిస్తాడు. ఈ సంపాదించిన ధనము ఎక్కడుంటుంది అంటే ధనేన కోసే, కోశాగారములో ఉంటుంది, బీరువాలో ఉంటుంది. ఆ ధనాన్ని మనిషి చూసుకుంటూ ఉంటాడు, సంతోషిస్తూ ఉంటాడు.
‘పశవశ్చ గోష్టే‘, అంటే పశువులన్ని కూడా కోష్ఠములో ఉంటాయి. పూర్వకాలములో బాగా సంపద కలిగిన వారు ఎవ్వరు అంటే పశుసంపద కలిగినవారు. ‘ఆయనకేమండి బాగా పశుసంపద కలిగినవాడు’, అంటుంటారు. ఇప్పుడు ‘వంద ఎకరాల పొలం’ ఉందని ఎలా అంటున్నారో, పాడి సంపద, పశుసంపద అని ఆలా వర్ణించేవారు. కావున ‘పశవశ్చ గోష్టే.
‘స్త్రీ గృహద్వారే‘, అంటే అనుకూలవతి, రూపవతి అయినటువంటి భార్య గృహద్వారం వరకు వస్తుంది. ఈ ప్రాణం పోయిన తరువాత, శరీరం పడిపోయిన తరువాత జరిగేది ఇది. అప్పటిదాకా సంపాదించిందంతా బీరువాలో ఉంటది. ఇప్పటి భాషలో చెప్పాలంటే బ్యాంకుల్లో, కాగితం మీద లేదా కంప్యూటర్లలో ఒక అంకెలగా కనిపిస్తుంది తప్ప, ఏ ప్రయోజనం ఉండదు. ఈ రోజుల్లో పశు సంపద లేకపోయినా భూములు, ఇల్లు ఇత్యాదివి ఉండవచ్చు. ఆ భూములన్నీ కాగితం రూపములో బ్యాంకు లాకర్లలో, ఇళ్లలో ఉంటాయి.
‘జనః శ్మశానే‘, ‘నాకు అనేక మంది బంధువులు ఉన్నారు’, అని విర్రవీగుతూ ఉంటాము, కానీ మన శరీరం పడిపోయిన తరువాత వారు స్మశానం వరకు మాత్రమే రాగలరు.
‘దేహాశ్చితాయాం పరలోక యానాం, దర్మానుగో గచ్ఛతి జీవఏకః‘, అంటే శరీరం పడిపోయిన తరువాత ఆ చితికి నిప్పుపెట్టాక, ఆ జీవుడి పరలోక యాత్ర ప్రారంభం అయిన తరువాత, అతని వెంట వచ్చేది ఆ జివి ఆచరించిన ధర్మం మాత్రమే. మిగితావన్ని కూడా ఎలా వచ్చాయో, అలాగే ఉండిపోతాయి.

కావున మన యధాశక్తి ధర్మాన్ని ఆచరించటానికి, ధర్మసముపార్జనకు ప్రయత్నించాలి. సమయాన్ని ధర్మానికి వెచ్చిద్దాము. ధర్మం అంటే ఒకరొకొకరు సహాయపడటమే, అదే పరోపకారం.