లక్ష్య సాధన – దృష్టి
Dharma Vaani – K C Das Memorial Charitable Trust
లక్ష్యసాధన కోసం మనకి ఉండాల్సిన తదుపరి లక్షణం దృష్టి. దృష్టి అంటే లక్ష్యం మీద తదేక దృష్టి. దాన్ని మనము concentration అంటాము. దేని మీద అయితే ద్రుష్టి పెడతామో దాన్ని సాధించటం కోసం మనస్సులో కొత్త కొత్త ఆలోచనలు తట్టి, ఏ మార్గములో వెళితే ఆ పని సుళువవుతుందో, మనసులోనే ఉత్పన్నం అవుతుంది కార్యసాధనకొరకు.
అయితే సాదారణముగా జరిగేదేమిటంటే ఒక లక్ష్యము ఏర్పరుచుకొని దైర్యం చేసిన తరువాత, మనస్సును దానిమీద నిలపటం కష్టం అవుతుంది. Distractions అంటారు. దాని మీద మనస్సు నిలువనీయకుండా ఉండటం మనస్సు యొక్క లక్షణం. అటు ఇటు పెరిగెడుతూవుంటుంది. దానికి ఏది బాగా కనిపిస్తే అటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ నచ్చినదాన్నే మరల మరల గుర్తు చేస్తూ ఉంటుంది. కానీ దానికి నచ్చ చెప్పుకొని మనమేర్పరుచుకున్న లక్ష్యం వైపు మరల్చుకోగలగాలి.
ఉదాహరణకు ఒక పిల్లవాడిని ఉయ్యాలలో వేసి వెనకాల ఎక్కడో ఏదన్నా శుబ్రంచేసుకుంటున్నా, వంట చేసుకుంటున్నా ద్రుష్టి అంతా కూడా ఆ పిల్లవాడి మీదే ఉంటుంది. ద్రుష్టి అంటే కేవలం చూడటం కాదు. తన పని తాను చేసుకుంటూనే ఉయ్యాలలోని పిల్లవాడు కదిలాడా లేదా అని చూస్తూ ఉంటుంది. ఆవిడ వచ్చినప్పుడే ఆ పిల్లవాడు కదులుతూ ఉంటాడు. అంటే మనస్సు పిల్లవాడి మీదనే కేంద్రీకరించబడి ఉంటుంది, తన పని తాను యాంత్రికంగా చేసుకుంటూ పోతుంది. అలాగే కార్యాలయాలలో చాలా సందర్భాలలో చూస్తూ ఉంటాము, “అయ్యో భోజన సమయం అయిపోతుంది, నేను అసలు గమనించనేలేదు”, అని అంటూ ఉంటారు.
అంటే ఏ లక్ష్యం మీద అయితే మన ద్రుష్టి పడుతుందో, చూసే వారికి ఏదో పని చేస్తూ ఉన్నట్లు ఉంటుంది కానీ, మనస్సు దాని యందు లగ్నం అయి ఉంటుంది. ఆ లగ్నం అయిన మనస్సు కార్యసాధనకు ఉపయోగిస్తుంది. కనుక ఏదయితే లక్ష్యాన్ని పెట్టుకున్నామో ఆ లక్ష్యం మీదకు మనస్సు పెట్టాలి. మనస్సును ఆ లక్ష్యం మీద పెట్టాలి అంటే ownership , task management ఉండాలి. ఈ ownership ఎప్పుడొస్తుందంటే ఆ లక్ష్యాన్ని మనము సంపూర్ణముగా ఆకళింపు చేసుకున్నప్పుడు. ‘దాని కొరకు మనము ప్రయత్నము చేస్తాము’ అని మన మనస్సుకు అనిపించి, ఒకరి కొరకు కాకుండా మన కొరకు మనము ప్రయత్నం చేసినప్పుడే ఆ ownership వస్తుంది. అది వస్తే కానీ మనస్సు దాని యందు నిలువదు. లేని పక్షములో బాహ్యకమైన వేరే పనులు గాని, దృశ్యాలు గాని, మనుష్యులు గాని, మాటలు గాని మనస్సును తేలికగా అటు తిప్పేస్తారు. అటు తిప్పనీయకుండా మనస్సును లగ్నము చేసి ఉంచేది ఈ దృష్టి.

దృష్టి అంటే కేవలము చూడటము కాదు మనస్సుతో చూడటం, మనస్సును దాని ఏందే ఉంచటం. ఇందుకు ఒక ఉదాహరణగా ప్రహ్లాదుడుని పేర్కొనవచ్చు. ‘ పానీయంబులు ద్రావుచుం గుడుచుచున్ భాషించుచున్ హాస లీ లా నిద్రాదులు చేయుచుం దిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృ తాస్వాద సం ధానుండై మఱచెన్ సురారిసుతుఁ డే త ద్విశ్వమున్ భూవరా!’ అని శ్రీ పోతన ఆ ప్రహ్లాదుడిని గురించి పేర్కొంటాడు. తాను ఏ పని చేస్తున్నా, తన తండ్రి ఎన్ని కష్టాలు పెట్టినా కూడా తన దృష్టిని ఆ విష్ణుమూర్తి మీదనే నిలబెట్టి ఉంచాడు ప్రహ్లాదుడు. అదే ద్రుష్టి అంటే. అందుకనే ‘రాక్షసులలో ప్రహ్లాదుడను నేను’ అంటాడు శ్రీకృష్ణపరమాత్మ గీతలో.
ఆ స్వయం విష్ణుస్వరూపమైనటువంటి శక్తి మనలో ఉన్నది. దాన్ని మనము లక్ష్యం వైపు తిప్పి దృష్టిగా దాన్ని ఉంచగలిగితే ఆ కార్యసాధన సుళువైతుంది. ఆ ధృతి ఉంటె, స్థితికారకుడైన ఆ విష్ణుభగవానుడుకి లభించినటువంటి సర్వఫలితములు మానవుడు కూడా సాదించవచ్చని మనము చాలా సందర్భాలలో, చాలా పురాణాల్లో ఈ విషయాలు తెలియజేస్తారు.