స్నాన విశిష్టత
Dharma Vaani – K C Das Memorial Charitable Trust
సనాతన ధర్మంలో ఋషులు మనకి ఏ ఆచారాన్ని, ఏ విషయాన్ని అందించినా, Health , happiness and hope అంటే ఆశతో జీవించండి, ఆనందముగా జీవించండి, ఆరోగ్యముతో జీవించండి అనే సూత్రాన్ని అనుసరించి అందించారు.
స్నానం అత్యంత విశిష్టమైనది ధర్మశాస్త్రాలు, పురాణాలు పేర్కొంటున్నాయి. మనము స్నానం చేయకుండా ధార్మిక కార్యక్రమాలను చేయకూడదు అని శాస్త్రం పేర్కొంటోంది. ద్విజులు ఆచరించాల్సిన నిత్యకర్మలలో ‘స్నానం’ మొదటికర్మ అని పరాశర స్మృతి మనకు తెలియజేస్తోంది.
‘అస్నాత్వానాచరేత్కర్మ జపహోమాది కించన లాలాస్వేద సమాకీర్ణ శ్శయనా దుత్తితః పుమాన్’ అని ‘స్మృతిరత్న మహోదధి’ పేర్కొంటోంది. మనము రాత్రి వేళ నిద్రించి, పగలు మేలుకొన్న తరువాత చొంగ, చమట ఇత్యాదివన్నీ మన శరీరము మీద ఉంటాయి. మన నవరంద్రాల నుంచి రాత్రి పగళ్లు దుర్గంధము స్రవిస్తూనే ఉంటుంది. మన శరీరము మీద ఉండే ఆ దుర్గాంధమంతా స్నానముతో తొలగిపోతుంది. మనల్ని శుచిగా ఉంచేది స్నానము. స్నానం దేహాన్ని శుద్ధిచేసి మనకు శాంతాన్ని కలిగిస్తుంది. అందుకే స్నానం అత్యంత విశిష్టమైనది. స్నానంతో రూపం, తేజస్సు, బలం, శౌచం, ఆయుస్సు, తపస్సు, ఆరోగ్యం, కోరికలు లేకపోవటం, చెడ్డకలలు కన్న దోషం పోవటం, మేధస్సు పెరగటం అనే పది ఫలాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
ప్రాతః కాలములో ఆచరించే స్నానం అతి విశిష్టమైనది. ‘సర్వమర్హతి శుద్ధాత్మా ప్రాతఃస్నాయీ జపాదికమ్’ అని ‘స్మృతిరత్న మహోదధి’ పేర్కొంటోంది. ప్రాతః కాలములో స్నానము చేసేవారికి దృష్టలోక సౌఖ్యము (మన కంటికి కనిపించే ఫలితాలైన శరీర శుభ్రత, ఇహలోక సౌఖ్యము), అదృష్టలోక సౌఖ్యము (మన కంటికి కనిపించని ఫలితాలైన పాపనాశనము, పుణ్య ప్రాప్తి, పరలోక సౌఖ్యము) రెండూ కూడా లభిస్తాయి. ప్రాతఃకాలం స్నానం ఆచరించనివాడికి సంధ్యావందనం, జపహోమాది కర్మల ఆచరణకు అర్హత లభించదు అంటుంది శాస్త్రం.
బ్రహ్మచారులు కనీసం రోజుకి ఒక్కసారన్నా(ప్రాతః కాల స్నానం ఉత్తమం) స్నానమాచరించాలి . గృహస్థులు, వానప్రస్థులు రోజుకి రెండూ సార్లు (కనీసం ప్రాతఃకాల, సాయంకాల స్నానం) స్నానమాచరించాలి. యతులు (సన్యాసం స్వీకరించిన వారు) రోజుకి మూడుసార్లు (త్రి సంధ్యలలో) స్నానమాచరించాలి. ప్రాతః స్నానముతో దేవతాప్రీతి, మద్యాహ్న స్నానంతో పితృదేవతాప్రీతి , సాయంత్రము ఆయుస్సు వృద్ధి కలుగుతుందని పెద్దలు చెప్తారు.
మనము స్నానం ఎలా ఆచరించాలో కూడా శాస్త్రాలు పేర్కొన్నాయి. స్నానం సమంత్రముగా (మంత్రపూర్వకముగా) గాని, ఆమంత్రముగా (సాధారణముగా) గాని ఆచరించవచ్చు. పంచాంగములతో – సంకల్పము, సూక్తపఠనము, మార్జనము, అఘమర్షణము, దేవాది తర్పణములతో కూడిన స్నానము ఎంతో విశిష్టం. సంకల్పపూర్వకముగా స్నానం చేయటం ఉత్తమం.
మనము స్నానం ఆచరించే ముందు పఠించాల్సిన శ్లోకం. – “శ్లో|| గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి | నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ||”. “ఓ పవిత్ర గంగా, యమునా, గోదావరి, సరస్వతీ, నర్మదా, సింధు, కావేరీ నదీమతల్లులారా!, నేను స్నానం ఆచరించే ఈ నీటిలో ప్రవేశించి నన్ను అనుగ్రహించండి.”, అని శ్లోకార్ధం. ఈ శ్లోకం ద్వారా సమస్త నదుల శక్తిని మనము స్నానం చేసే నీటిలో ఆవాహన చేస్తున్నాము. ఇలా ప్రార్థన చేసి, ఆ నీటితో స్నానం చేయటం ద్వారా ఆ పుణ్యతీర్థాల్లో స్నానం ఆచరించిన పుణ్యఫలం లభిస్తుంది.
మనము స్నానము ఆచరించేటప్పుడు గంగా మాతని స్మరించటం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. ‘గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాంశ తైరపి, ముచ్యతే సర్వ పాపేభ్యో విష్ణు లోకం సగచ్ఛతి ||’- అని శాస్త్రం పేర్కొంటోంది. ‘గంగా’, ‘గంగా’ అనే ఆ నదీమతల్లి పేరుని ఎవరైతే స్మరిస్తారో, వారు గంగానదికి వంద యోజనములు దూరములో ఉన్న కూడా, వారి పాపాలన్నీ నశించి విష్ణులోకమును పొందుతాడు అని అర్థం. మనము స్నానం ఆచరించేటప్పుడు ‘గంగా’,’గంగా’, ‘గంగా’ అని మూడుసార్లు ఆ తల్లిని స్మరిస్తే, గంగా నదిలో స్నానం ఆచరించిన పుణ్యఫలం లభిస్తుంది.

వ్యాసుల వారు వ్యాసస్మృతిలో మనము ఎక్కడ స్నానం ఆచరిస్తే ఉత్తమమో వివరిస్తూ ఇలా పేర్కొన్నారు – “నదీషు దేవఖాతేషు తటాకేషు సరస్సుచ | స్నానం సమాచరేన్నిత్యం నదీ ప్రస్రవణేషుచ”- నదులలో గాని, దేవాలయములలో ఉండే పుష్కరిణులలో గాని, తటాకాలలో గాని, సరస్సులలో గాని, చెరువులలో గాని నిత్యం స్నానం ఆచరించాలి.
నది స్నానం అతి అతివిశిష్టమైనది. నదులలో స్నానం ఆచరించటం వల్ల, ప్రవహించే నదిలో ఉండే విద్ద్యుత్ తరంగాలను మన శరీరం గ్రహించి ఆరోగ్యాన్ని, ఉత్సహాన్ని పొందగలుగుతాము. మనము గమనిస్తే అనేక ప్రముఖ దేవాలయములు నదుల సమీపములోనే ఉంటాయి. ఉదాహరణకు కాశిలో గంగానది. పూర్వపు రోజులలో జనులు నదీతీరాలలో తమ నివాసమును ఏర్పరుచుకునేవారు. కానీ ఈ రోజులలో అనేక కారణముల చేత నదీతీర నివాసం అందరికి సాధ్యం కాదు. కనుక మనకు ఎప్పుడు అవకాశం లభించినా కూడా నది స్నానం తప్పక ఆచరించాలి. కనీసం సంవత్సరములో ఒకటి రెండు సార్లయినా, నది స్నానానికి తప్పక ప్రయత్నం చెయ్యాలి.
దేవాలయములలో ఉండే పుష్కరిణులలో ఆచరించే స్నానం కూడా అతి విశిష్టమైనది. ప్రతి పుణ్య క్షేత్రములో పుష్కరిణ ఉంటుంది. ‘శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామిపుష్కరిణీ తటే’ అని ఆ స్వామిని కీర్తిస్తాము. పూర్వకాలములో ప్రతి దేవాలయ ప్రాంగణములో పుష్కరిణ గాని కొలను గాని ఉండేది. దేవాలయ ప్రాంగణములలో ఉండే విద్ద్యుత్ తరంగాలు పుష్కరిణ నీటిలో చేరి, ఆ శక్తి పుష్కరిణ స్నానం వల్ల మనకి లభిస్తుంది. తద్వారా మనస్సు, శరీరం ప్రశాంతతని, ఆరోగ్యాన్ని పొంది, మరింత ఉత్సహముతో ధర్మకార్యాలను నిర్వర్తించగలుగుతాము.
ఒకవేళ నది స్నానం, పుష్కరిణి స్నానం ఆచరించే అవకాశం లభించకపోతే, మన నివాసాలకు సమీపములో ఉండే తటాకాలలో గాని, సరస్సులలో గాని, సెలయేరులలో గాని, చెరువులలో స్నానం ఆచరించాలి. కానీ, ఆయా సరస్సులు, చెరువులు పారిశుభ్రముగా ఉండి, అందులోని నీరు పరిశుభ్రముగా ఉండాలి. సముద్ర స్నానం కూడా అతివిశేషమైనది అని పెద్దలు చెప్తారు. మనకు అవకాశం లభించినపుడల్లా నదులలో, పుష్కరిణులలో, తటాకాలలో, సరస్సులలో, చెరువులలో, సెలయేరులలో, బావుల దగ్గిర తప్పక స్నానం ఆచరించాలి.
నదీస్నానము ఉత్తమ ఫలితమును, చెరువులు కోనేరులలో స్నానం మధ్యమ ఫలితమును, బావులు పంపులలో స్నానం సాధారణ ఫలితమును అందిస్తుంది.
ఇలా మహర్షులు మనకు స్నాన విశిష్టతను గురించి, స్నాన విధుల గురించి ఎన్నో విషయాలను తెలియపరిచారు. ఈ నియమాల నుంచి వ్యాధిపీడుతులకు, అశక్తులకు కొంత సడలింపు ఉంటుంది. స్నానం శరీరాన్ని శుభ్రపరిచే కర్మ మాత్రమే కాదు. స్నానం మన మనస్సుకు స్వచ్ఛతను అందిస్తుంది. నీటిలో ఉండే శక్తి అపారం. ఈ శక్తి మనలోని నెగటివ్ ఎనర్జీని తొలగించి శరీరంలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది, మంచి ఆలోచలను, ఆరోగ్యాన్ని మనకందిస్తుంది.
సంప్రదాయబద్దంగా ఋషులు మనకందించిన స్నానవిధులను మనమందరము తప్ప ఆచరిద్దాము, ఆ పరమాత్మ ఆశీస్సులను అందుకుందాము.