Skip to navigation
K C Das Memorial Charitable Trust
Donate
  • Home
  • About
  • Library
    • Dharma Vaani
    • Sri Lalitha Sahasra Naamavali
    • Dharmavaaradhi e-Magazine
    • Guru Vaani
    • Saradamba TV (Grandly Launched)
  • Dharmika Programs
    • All programs
    • Hanuman Chalisa
    • Gayathri Japam
    • Bala Japam
    • Calendar
  • Spiritual Education
  • Community Welfare
  • Contact
Donate
  • Instagram
  • YouTube
  • Facebook
  • Instagram
  • YouTube
  • Facebook
Donate

హనుమంతుడు – కార్యసాధన లక్షణాలు

మనము ఏదైనా ఒక పని సాధించాలంటే అందుకు ముఖ్యముగా ఉండాల్సిన లక్షణాలు ఏమిటి? కార్యసాధనలో విజయం సాధించాలన్న పట్టుదల కలిగి ఉండి, మార్గములో ఎదురయే కష్టనష్టాలను తట్టుకొని, ఏ ప్రలోభాలకు లొంగకుండా చివరి వరకు ముందుకు సాగిపోయేవారే విజేతలుగా నిలుస్తారు. ఇందుకు అనేక ఉదాహరణలు మన పురాణాల్లో కనిపిస్తాయి. అందులో ఒక ఉదాహరణ రామాయణంలోని సుందరకాండలో గల ‘హనుమంతుడి సముద్రలంఘనం’

‘గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసమ్ – రామాయణ మహా మాలా రత్నం వందే అనిలాత్మజమ్’ – ‘గోమాత యొక్క పాదాల మధ్య దూరాన్ని దాటినంత సునాయాసంగా సముద్రాన్ని దాటి దోమలను చంపినంత సులభంగా రాక్షసవధ చేసి రామాయణం అనే వజ్రమాలలో ఒక వజ్రంలాగా నిత్యం మెరిసే ఆంజనేయ నీకు నమస్కారము’, అని వాల్మీకుల వారు హనుమను కీర్తిస్తారు. ఒక గోవు గనుక నడుస్తూ నడుస్తూ ఎలాగైతే ఒక పిల్ల కాలువను అవలీలగా దాటవేస్తుందో అంత సులువుగాను హనుమంతులవారు శతయోజనాల సముద్రాన్ని అవలీలగా దాటవేశారు. శత యోజనాల సముద్రాన్ని దాటటం అనే అసాధ్యమైన కార్యాన్ని సాధించిన హనుమంతులవారు, ఆ కార్యసాధనలో ఏ ఏ లక్షణాలను ప్రదర్శించారో ఒక శ్లోకం ద్వారా వివరించారు వాల్మీకి మహర్షి సుందరకాండలో.

సుందరకాండ – ప్రధమ సర్గ – 198 శ్లోకం
యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ – ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం స్వకర్మ సు న సీదతి॥
తాత్పర్యము: “ఓ హనుమా, నీవలె గట్టి ధైర్యము, దూరదృష్టి, సమయస్ఫూర్తి, పటుత్వముగలవాడు తన కార్యసిద్ధి యందు ఎన్నడును వైఫల్యమును పొందడు”.

కార్యసాధన కోసం మనకు ప్రధానముగా ఉండాల్సిన లక్షణములు నాలుగు – “ధృతిః, దృష్టిః, మతిః, దాక్ష్యం” అని సనాతన ధర్మంలో మహర్షులు పేర్కొన్నారు. ధృతి అంటే ‘దైర్యం, పట్టుదల’, ఎట్టి పరిస్థితులలోనూ సడలని ప్రయత్నమే ధృతి. దృష్టి అంటే ‘ఏకాగ్రత, లక్ష్యం మీద తదేక ద్రుష్ఠి’, మతి అంటే ‘బుద్ధిబలం, మేధస్సు, సమయానుకూలంగా ఆలోచించగలగటం’, దాక్ష్యం అంటే ‘సమర్థత, దక్షత కలిగి ఉండటం, శక్తి సామర్ధ్యాలు’. ఈ నాలుగు మనకి హనుమంతుడు వారి చరిత్రను మనం చదివి అర్థం చేసుకుంటే, హనుమత్ వైభవంలో మనకి విశేషంగా కనిపిస్తాయి.

హనుమంతుల వారి దగ్గర ఏమిటి ఆ నాలుగు లక్షణాలు అంటే దృతి అంటే మొదట Determination కావాలి. ఏదైనా పని చేయాలంటే ముందు Determination కావాలి. ‘ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్‌ ధీరుల్‌ విఘ్న నిహన్యమానులగుచున్‌ ధ్రుత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్‌ గావునన్‌’ అని విఘ్నం కలుగుతుందేమో అని భయపడి మధ్యలో వదిలేస్తూ ఉంటారు, అసలు మొదలుపెట్టరు. మొదలు పెట్టాలి అంటే Determination కావాలి.

ఆ దృతి ఏమిటి? ఆ Determination హనుమంతుల వారికి ఉన్నది. ‘యధా రాఘవ నిర్ముక్త శర స్వాసన విక్రమ’, “నేను రాముడి బాణం లాగా లంకకు వెళ్తాను, వెళ్లి లంకలో చూస్తాను. అక్కడ సీత కనబడితే సరే లేకపోతే ఆ రావణుడిని తీసుకొని వచ్చి రాముడి కాళ్ళ దగ్గర కట్టేసి తెచ్చి పడేస్తాను”. అప్పటికి ఇంకా సముద్ర లంఘనం చెయ్యలేదు హనుమ. వంద యోజనములు ఎగరగలవా లేదా అనేటువంటి చర్చ జరిగిన తర్వాత హనుమంతుల వారి దగ్గరికి వచ్చి జాంబవంతుడు చెప్తాడు, “నువ్వు ఎగరగలవయ్యా”. అప్పటిదాకా ఆయన ఎగరగలను అని కూడా అనుకోలేదు, కానీ Determination మాత్రం వచ్చేసింది. ఎందుకు వచ్చింది? ‘యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం’, రాముడి స్తోత్రం చేస్తే ఆయన కనబడతాడు.

హనుమాన్ చాలీసా చేస్తే హనుమంతుడు వస్తాడు అని ఎవరు చెప్పలేదు. “తుమ్హరే భజన రామకో పావై । జన్మ జన్మ కే దుఖ బిసరావై”, ‘నీ భజన చేస్తే రాముడు లభిస్తాడయ్యా’. ఎందుకు? ఆయన అనేది ఏమి లేదు, ‘నాహం కర్త హరిహి కర్త’. అది ఆయన రాసింది. కాబట్టి తాను ఎంత సాధించినా ఎలా ఒదిగి ఉండాలి, ఎంత ఎత్తు ఎదిగినా ఎలా తగ్గి ఉండాలి, అనేటువంటిది హనుమంతుల వారి జీవితం గురించి మనం తెలుసుకోవాలి. కాబట్టి దృతి.

రెండవది దృష్టి. దృష్టి అంటే vision మన భాషలో చెప్పుకోవాలంటే “Yes, I am going to go, I am going to do, I am going to get”. అంతే రెండో ఆలోచన లేదు. అవుతుందా కాదా! ‘సందేహ సంశయాత్మ వినశ్యతి’, అంటుంది భగవద్గీత. సందేహాలు పెట్టుకున్నామా ఏ పని సాధించలేము. “నా వల్ల అవుతుంది”, అనేటువంటి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో ఏ పని చేసినా సాధిస్తావు. కాబట్టి దృష్టి.

మూడవది మతి అంటే బుద్ధి. ‘బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగతా అజాడ్యం వాక్పటుత్వం చ హనుమాత్ స్మరణాత్ భవేత్’. హనుమత్ స్మరణతో మనకు లభించేటువంటి అష్టసిద్ధులు ఏమిటి అంటే ‘బుద్ధి బలము యశః ధైర్యము నిర్భయత్వము”

సుగ్రీవుడు భయపడుతూ ఉన్నాడు. చూసి చూసి ఒకసారి చివాట్లు పెట్టాడు హనుమంతుల వారు. “ఊరికే ఎందుకయ్యా భయపడతావు? ఋష్యముఖ పర్వతానికి వాలి రాలేదు. ఆయనకి శాపం ఉన్నది, మతంగ మహా శాపం. కాబట్టి ఇక్కడికి రాడు, తలపగిలిపోతుంది”, అంటాడు. “కాబట్టి నువ్వు ఊరికే భయపడకు. వాళ్ళు ఎవరో వస్తున్నారు. ఎందుకు? నేను వెళ్లి మాట్లాడి వస్తాను”, అని ధైర్యం చెప్పాడు.

నిర్భయత్వము హనుమ ఉపాసన చేసేటువంటి వారికి Automatic గా కలుగుతుంది ‘భయనాశనః’, విష్ణు సహస్రనామంలో వచ్చే నామాలు. ‘భయం కలిగించేటువంటి వాడు ఆయనే, పోగొట్టేటువంటి వాడు ఆయనే’. హనుమంతుల వారి జీవిత చరిత్ర మనం చదివితే ప్రతి సన్నివేశంలో కూడా మనకి ఒక సందేశం మనకు అందిస్తూ ఉంటారు ఆయన.

మతి అనేది బుద్ధి. ఎక్కడ వాడారు బుద్ధిని? సురస దగ్గర వాడారు. ఆవిడ నోరు తెరిచిన కొద్దీ ఈయన కూడా తెరిచి, పెద్దగా పెద్దగా అయ్యి, ఆవిడ నోరు మూయడానికి ఎంత Time పడుతుందో, ఈ లోపల సూక్ష్మ బుద్ధితో సూక్ష్మ శరీరం దాల్చి లోపలికి వెళ్లి బయటికి వచ్చి, “అయిపోయిందమ్మా వెళ్లి వచ్చేసాను. బ్రహ్మ గారు ఇచ్చిన వరం పూర్తి అయిపోయింది. ఇప్పుడు నేను రామకార్యం మీద పెడుతున్నాను, నన్ను ఆశీర్వదించు”, అన్నాడు. అలాగే రెండు మూడు సందర్భాల్లో వాడారు ఆయన.

ఆయన లంకకు వెళ్ళిన తర్వాత సీతమ్మ వారిని వెతుకుతూ వెతుకుతూ చివరగా అశోకవనంలో శింశుపా వృక్షం నీడలో ఒక స్త్రీని చూశారు. మలినమైనటువంటి వస్త్రాలు, రాక్షసులందరూ చుట్టూ ఉన్నారు, ఒక మానవకాంత ఉపవాసం చేస్తూ దీనావస్థలో ఉన్నటువంటి స్త్రీ. వెంటనే ఆయన jump చేసి ఈవిడే సీత అనలేదు. ఎందుకంటే అంతకు ముందే ఒక చిన్న అనుభవం జరుగుతుంది ఆయనకి. రావణ మందిరంలో చూస్తూ ఉన్నప్పుడు మండోదరిని చూసి సీత అనుకుంటారు. “అస్ఫోటయామాస చుచుంబ పుచ్ఛం ననంద చిక్రీడ జగౌ జగామ| స్తంభాన్ ఆరోహాన్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం”, అని మన వాల్మీకి మహర్షి చురకేశారు.

ఆయన ఏమన్నారంటే హనుమంతుల వారు రావణ మందిరంలో ఉన్నటువంటి మండోదరిని చూసి సీత అనుకొని ఒక్క నిమిషం పాటు ఆనందపడ్డారు. అప్పటికి చాలా మందిని చూశారు, వారిలో సీత కనపడలేదు. ఇక్కడ ఒక స్త్రీ కనిపించింది, తేజస్సుతో ఉన్నది, తేజో రూపమై ఉన్నది, కాబట్టి సీత అనుకున్నారు. వెంటనే ఆనందముతో తోక ఎత్తి కింద కొట్టారు. కోతికి ఆనందం వస్తే ఏం చేస్తుందంటే తోకను కొడుతోంది. అలా హనుమ ఆనందంలో తోకను తీసి ముద్దు పెట్టుకున్నారట, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు దూకారు ఆనందంగా, గబగబా స్తంభం పైకి ఎక్కారు, మళ్ళీ దిగేసారు. స్వామి కోతి యొక్క లక్షణం అక్కడ ప్రదర్శించారు ఒక్క క్షణం. మళ్ళీ వెంటనే ఆయనే ఆలోచించారట.

‘రాముని సీత ఇటులుండునా’, అని సుందరకాండలో గానం చేసారు మహానుభావులు MS రామారావుగారు. అక్కడ ఆ సందర్భంలో “రాములవారి సీత ఇలా ఉంటుందా ఇక్కడ, కాదు కాదు నేను తప్పు పడుతున్నాను”, అని వెంటనే బుద్ధి ప్రయోగించి ఆలోచించారు.

లంకలో అనేక ప్రదేశాలు గాలించిన అనంతరం చివరకు అశోకవనంలో శింశుపావృక్షము కింద ఉన్న సీతమ్మను చూస్తారు హనుమ. దీనముగా, మలినమైన వస్త్రాలతో, ఉపవాసాలతో దీనావస్థలో ఉండి, రాక్షస స్త్రీలు తన చుట్టూ కాపలాగా ఉన్న ఒక స్త్రీని గమనిస్తారు హనుమ. అయితే ఆ తల్లి సీతమ్మే అని వెంటనే నిర్ణయించుకోలేదు హనుమ. ‘తర్కయామాస సీతేతి కారణైరుపపాదిభిః’- ‘ఉపవాసాలతో కృశించియున్న ఆ విశాలాక్షిని చూచి ఈమె సీతయా అని తర్కించ సాగెను హనుమ’, అంటారు మహర్షి సుందరకాండలో. తాను చూసిన ఆ స్త్రీ సీతయా కదా అని నిర్ధారణ చేసుకోవటం కోసం తన బుద్దిని వినియోగించి తర్కముతో ఆలోచించారు హనుమ. “తుల్యశీలవయోవృత్తాం తుల్యాభిజనలక్షణామ్| రాఘవోఽర్హతి వైదేహీం తం చేయమసితేక్షణా” – “రాముడి గుణములే కలిగిన ఈమె నిస్సంశయముగా సీతయే. శీలములో వయస్సులో తుల్యులు, గుణములలో తుల్యులు అగు వీరిలో రాఘవుడు వైదేహి కి తగినవాడు అలాగే నల్లని కళ్ళు గల ఆమె రామునకు తగినది” అని తన మేధాశక్తితో ఆ తల్లి సీతయే అని నిశ్చయించారు హనుమ. రామాయణములోని అనేక సంధర్భాలలో హనుమ తన బుద్దిని వినియోగించి విజయాలను సాధించారు.

ఆ తర్వాత దాక్షం, capability ఉండాలి. దాక్ష్యం అంటే capability. capability కి ఆయన ఏం చేస్తారంటే అనే దానికి ఒక ఉదాహరణ. అమ్మవారిని దర్శించిన తర్వాత అప్పుడు ఆలోచిస్తారు ఆయన, “మూడు – సామధాన భేదములు అయిపోయినాయి, దండోపాయం ఒకటి చేయాలి. ఈ రావణుడి దగ్గర ఎంత శక్తి ఉన్నది చూద్దాం. ఒకసారి నేను కాస్త అల్లరి చేస్తేనే కదా నన్ను పిలిచేది, వాళ్ళందరూ వచ్చేది”, అని ఆయన ఆ అశోక వనమంతా ధ్వంసం చేసి, రాక్షసులతో యుద్ధం చేసి 80 వేల మందిని ఆయన ఒక్కరే సంహారం చేస్తారు. ఆ తర్వాత మంత్రి కుమారుడిని, అక్ష కుమారుడిని సంహరిస్తారు.

అందుకనే “అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం”, అంటారు. అక్షకుమారుడుతో యుద్ధం చేయడం సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఇంద్రజిత్ తమ్ముడు అక్ష కుమారుడు, అంటే ఇంద్రజిత్ కి ఉన్న శక్తులు ఉన్నాయి ఈయనకు కూడా. ప్రత్యేకమైనటువంటి వరాలు ఉన్నాయి. ఎటువంటి రథం ఉందంటే ఈ రథాన్ని ఆకాశంలోకి తీసుకువెళ్లగలడు, అక్కడి నుంచి యుద్ధం చేయగలడు. రథంలో నుంచి బయటికి వచ్చి ఆకాశంలో నిలవగలడు, భూమి మీద అక్కర్లేదు. ఇది ఆయనకు ఉన్నటువంటి విశేష లక్షణం. అందుకనే ‘కపీశమక్షహంతారం అన్నారు, అక్ష కుమారుడిని చంపినటువంటి వాడికి మిగతా రాక్షసులు పెద్ద లెక్క కాదయ్యా’, అని. అందువల్ల ఆ దక్షత.

ఎక్కడ ఏది ప్రదర్శించాలో అక్కడ అది ప్రదర్శించారు. ఆయన లంక నుంచి తిరిగి వచ్చిన తర్వాత జాంబవంతుడు అడుగుతాడు, “చెప్పవయ్యా ఎలా వెళ్ళావు? ఏమిటి?” అని. 200 శ్లోకాల్లో చెప్పాడు వారి దగ్గిర. తరువాత రాముడి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్కటే మాట అన్నారు రాముడితో, “సీతమ్మ వారిని చూశాను”, అని. అనవసరమైన మాటలు మాట్లాడరు. అందుకని ఈ విషయం రాముడికి ముందే తెలుసు. మొదట చూసినప్పుడే లక్ష్మణుడితో అంటాడు, “ఇలాంటి వాడు ఒకడు మంత్రిగా మన దగ్గర ఉంటే అన్ని సాధించవచ్చు లక్ష్మణ”. అంటే ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ ఎంత మాట్లాడాలి. Diplamocy ఈ రోజుల్లో మనం నేర్చుకోవాలి అంటే.

బ్రహ్మగారు హనుమకు ఒక వరం ఇచ్చారు. ఏమిటా వరం? హనుమంతుల వారు ఏం చేస్తారు అంటే శత్రువులందరికీ భయంకరంగా కనబడతారు. ఎవరు ఆ శత్రువులు అని అడిగారు మహర్షి. ఈయనకు ఎవరు శత్రువులు ఉంటారు ఎవరైతే రామ నింద చేస్తారో, ఎవరైతే దైవ నింద చేస్తారో, ఎవరైతే వేద నింద చేస్తారో, ఎవరైతే శాస్త్ర నింద చేస్తారో, ఎవరైతే ధర్మ నింద చేస్తారో వాళ్ళందరినీ ఆయన భయపెడతాడు. ఎవరైతే వేదాన్ని,శాస్త్రాన్ని,దైవాన్ని నమ్ముతారో వాళ్ళందరికీ అభయం. ఇది బ్రహ్మ గారు హనుమకు ఇచ్చిన వరం.

ఎందుకు ధర్మమునందు అనురతుడై ఉన్నాడు ఆయన, రాముడికి బంటుగా ఉన్నాడు. రాముడు అంటే ధర్మమే కాబట్టి రాముడి యొక్క బంటుగా ఉన్నాడు కనుక ధర్మమునందు పట్టుకొని ఉన్నాడు ఆయన. అందువల్ల ఎవరైతే ధర్మము నందు అనురక్తులై ఉంటారో వాళ్ళకి అభయాన్ని ఇస్తాడు.

హనుమ రూపాలు – ప్రసన్నఆంజనేయస్వామి

K C Das Memorial Charitable Trust

Paropakarardham Idam Sareeram

  • Instagram
  • YouTube
  • Facebook
Address
H.No. 11-13-119, 14/B, Road No. 3, beside Axis Bank, Alkapuri Colony, Ramakrishnapuram, Kothapet, Hyderabad, Telangana 500035
View on map
Contact
contact@kcdastrust.org
+91 94948 77070
04:00 PM to 08.30 PM IST

© 2026 K C Das Memorial Charitable Trust. All rights reserved.

Terms and ConditionsPrivacy Policy