గురువాణి
గురుపౌర్ణమి సందర్భముగా పూజ్య గురుదేవుల అనుగ్రహ భాషణం.
“గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః”, ఈ శ్లోకం మనకి సనాతన ధర్మంలో చిన్నతనం నుంచి అమ్మ ఒడిలో నుంచి నేర్పిస్తారు. ఈ శ్లోకం రాని వాళ్ళు అంటూ సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళు ఎవరూ ఉండరు. కానీ ఈ శ్లోకంలో గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః అంటే గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువే మహేశ్వరుడు అని. అలాగే బ్రహ్మే గురువు, విష్ణువే గురువు, మహేశ్వరుడే గురువు అని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ వ్యాసపూర్ణిమ అని కూడా అంటారు. వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం అని ఒక నానుడి. మనిషి జీవితం ఎలా ఆనందమయం చేసుకోవాలో, సంతోషంగా ఎలా గడపాలో మనకి వేదం చెప్పింది కానీ వేదం ఏం చెప్పిందో మనకు అర్థం కాదు, అర్థం చేసుకోలేము.
సామాన్యులకు పండితులకి కూడా ఈరోజు కష్టంగానే ఉంది. వేద మంత్రాల సారము తెలుసుకొని ఆచరించాలంటే అది ఎంతో కష్టమైనటువంటి పని. సామాన్యులకు అది ఎలా అందుతుంది. కనుక మహనీయుడైనటువంటి వ్యాస మహర్షి అష్ఠాది పురాణాల రూపంలో మనందరికీ అర్థమయ్యేటట్లుగా ‘సత్యం వద’ అనేటువంటి వేద వాక్యాన్ని హరిశ్చంద్రోపాఖ్యానం అనేటువంటి కథగా మనకు అందించి, అలాగే ‘ధర్మంచర’ అనేటువంటి వేదవాక్యాన్ని రామాయణంలో మనం చూస్తే రాముడి చరిత్ర వాల్మీకి మహర్షి మనకు అందించారు. ఈ దేశం యొక్క గొప్పతనం ఏమిటి అంటే, సనాతన ధర్మాన్ని ఎప్పటి నుంచి ఉన్నది అంటే ఎవరూ చెప్పలేకపోతున్నారు. సనాతనము అన్నారు అందుకే. ‘రామ రామ మహాబాహో శృణగుహ్యం సనాతనం’, అని ఆదిత్య హృదయంలో చెప్తాం. అగస్త్యుల వారు రామచంద్రమూర్తికి చెప్పింది రామాయణంలో, ‘ఇది సనాతనమయ్యా’, అని చెప్పారు.
ఒక తరం వాళ్ళు చేసింది తర్వాత తరం వాళ్ళకి అందనటువంటి స్థితిలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నాము మనము ఇవాళ. కానీ పరంపరగా ‘సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమం’, అని పరంపరగా ఈ వేళ మనం వేదములో ఉన్నటువంటి విషయాన్ని వేద మంత్ర రూపంలో కాకపోయినా దాని సారాన్ని మనకు అందించినటువంటి వారు వ్యాస భగవానులు. ఇవాళ భగవద్గీత చదువుతున్నాం. భగవద్గీతలో సమస్తము ఉన్నది అంటున్నాం. ఆ భగవద్గీత ఇచ్చింది వ్యాస భగవానుడే. భారతం నుండి ఇచ్చాడు. అసలు భగవంతుడు అంటే ఏమిటి ఇవన్నీ వేదంలో ఉన్నాయి. కానీ మంత్ర రూపంలో చెప్తే మనకు అర్థం కాదు గనుక కథల రూపంలో, భాగవత కథల రూపంలో, భాగవతాన్ని అందించి బ్రహ్మ సూత్రాలు, ఉపనిషత్తులు వీటన్నిటినీ సారం తీసుకొని, మనిషి ఆనందంగా జీవితం గడుపుకోవడానికి ఎలా ఉండాలి అని చెప్పే విధానం అంతా కూడా మనకు అందించినటువంటి మహనీయులు వ్యాస మహర్షి.
ఆనందంగా జీవనం గడుపుకోవడం ఎలాగా అనేటువంటిది అర్థం కావాలి అంటే ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి పురాణాలు చదివితే అర్థమవుతుంది. మనం ఇంజనీర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు చార్టర్డ్ అకౌంటెంట్లు కావచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీర్లం కావచ్చు ఏదన్నా కావచ్చు కానీ ప్రతి వాళ్ళకి కావలసింది ఏమిటి అంటే ఆనందంగా ఉండాలి అని కోరుకుంటారు. అది ఒక్కటి ముఖ్యమైనటువంటి, ప్రధానమైనటువంటి కోరిక. కూటి విద్యలు కోటి కొరకే అని, ఎన్ని చదువుకున్నా, మంచి ఉద్యోగం రావాలి, ఆనందంగా జీవితం గడవాలి ప్రతి మనిషి కోరుకుంటాడు, దాంట్లో తప్పేమీ లేదు. వేద విధితమైనటువంటి జీవితం కూడా ఆనందంగానే గడుపుకోండి అని చెప్తున్నది. కానీ అవి తెలియక మనం దుఃఖానికి, ఉద్వేగానికి, బాధకు లోనవుతూ ఉంటాం, సమయం గడిపేస్తూ ఉంటాం. నిత్యానందం అనుభవించాలి అంటే ఎలాగ అనేటువంటిది ఆ మహనీయుడు మనకి పురాణాల రూపంలో ఇచ్చారు.
మనసులో మన భావన స్థిరంగా నిలబడాలి అంటే భగవంతుడు అంటే ఏమిటి ఫస్ట్ మనకు అర్థం కావాలయ్యా, ఆ భగవంతుని చూపించి చేటువంటి వాడు గురువు అని వ్యాస భగవానుడు ముందు మనకు అందించాడు. ఆ పరంపరను అలా కొనసాగిస్తూ కలియుగంలో 1200 సంవత్సరాల క్రితం మనకి ‘శంకర శంకర సాక్షాత్ వ్యాసో నారాయణో హరి”, అని సాక్షాత్తు పరమేశ్వరుడే శంకరాచార్యుల వారి రూపంలో మనకి అవతరించి మళ్ళీ మర్చిపోయినటువంటి సమాజాన్ని మళ్ళీ మేలుకొలిపారు.
జగద్గురువులు ఆదిశంకరుల వారు “శాస్త్రస్య గురువాక్య సత్య బుద్ధ అవధారయ” అని పేర్కొన్నారు. శాస్త్రం ఏం చెప్తుందో నువ్వు అలా చేస్తే నీకు నీకు ఫలితం వస్తుంది. ఆ శాస్త్రాన్ని సరిగ్గా మనకు అన్వయం చేసి చెప్పేటువంటి వారు గురువులు, కనుక గురుబ్రహ్మ అని అన్నారు. అంటే మనలో ఆధ్యాత్మికతను సృష్టించి, పరమాత్మలో లయం చేయడానికి కావలసినటువంటి మార్గాన్ని చూపించేటువంటి వాడు గురువు. అందువల్ల మనం ఏం చేయాలి? గురువు అనేటువంటి వాడు దైవాన్ని చూపిస్తున్నాడు. అదిగో దైవం అంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం? గురువును చూస్తున్నాం. గురువు ఏం చేస్తున్నాడు? అదిగో దైవం అంటున్నాడు. ఇంకొంచెం కాన్సంట్రేట్ చేస్తే గురువు యొక్క చేతిని చూస్తున్నాం, గురువు యొక్క వేలుని చూస్తున్నాం. మన చూపు అక్కడ ఆగిపోతుంది. గురువు కూడా ముందు కాస్త దాని గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తే తప్ప ఆ దైవాన్ని పట్టుకోవడానికి చూపించేటువంటి మార్గం ఏదో అది మనం అనుసరిస్తే తప్ప గురు పూజకు ఫలితం లేదు.
గురువు అనేటువంటి వ్యక్తికి పూజ చేయడం కాదు గురుపూజ అంటే. పరంపరగా గురువులు మనకు అందించినటువంటి శాస్త్రముల యొక్క సారాంశమును మనం అర్థం చేసుకొని, దాన్ని మన జీవితంలో అన్వయం చేసుకొని, ఆ విధంగా ఆచరణలోకి తెచ్చుకొని, పరమార్థ తత్వాన్ని పరమాత్మ తత్వాన్ని మనం అర్థం చేసుకొని, అన్వయం చేసుకోవాలి. మన జీవితాన్ని మనం సార్ధకం చేసుకోవడానికి మనమే నడవాలి, గురువు నడవడు. కాబట్టి మనం గురువు దగ్గరికి వచ్చి ఆశ్రయించినప్పుడు, గురువుని ఆశ్రయిస్తే గురువు ఇచ్చేటువంటి విషయం ఏమిటి? ఐహికమైనటువంటి విషయాల కోసం గురువుని ఆశ్రయించమని చెప్పలేదు శాస్త్రం. ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం కోసం గురువుని ఆశ్రయించండి అన్నది. గురువు క్షేమం కోరేటువంటి వాడు గనుక కష్టాలు చెప్పుకోవడంలో తప్పులేదు. పరమాత్మ తత్వాని బోధించేటువంటి వాడు గురువు. అసలు గురువు అంటే ఏమిటి అంటే ‘గుకార అంధకారస్తు నిరోధితే అంధకార నిరోధత్వా గురిచదీయతే’, అని వచనం చెప్పారు.
చీకటిలో ఉన్నటువంటి వాళ్ళని – గు అంటే అంధకారం, చీకటి – రు అంటే దాన్ని తొలగించేటువంటి వాడు. అంటే దారి చూపించేటువంటి వాడు. మార్గం చూపించిన వాళ్ళందరూ గురువులే, కాబట్టి సద్గురువును పట్టుకోమంటుంది శాస్త్రం. గురువును కాదు ఆశ్రయించవలసింది. సద్గురువు ఎవరు అంటే సత్తును చూపించేటువంటి వాడు సద్గురువు, అంటే సత్యాన్ని చూపించేటువంటి వాడు సద్గురువు. సత్, అసత్ అని రెండు ఉంటాయి. ఏది సత్యము, ఏది అసత్యము అని చెప్పేటువంటి వాడు సద్గురువు. సద్గురువును ఆశ్రయిస్తే నువ్వు తరిస్తావు తప్ప కేవలముగా గురువు కాదు. ఆ సద్గురువు అనేటువంటి వాడు ఆత్మోద్ధరణకు బోధ చేస్తాడు తప్ప ఐహికమైనటువంటి విషయాల గురించి పెద్దగా పట్టించుకోడు. దానికి మనకి ఉదాహరణలు అనేకం ఉన్నాయి.
చంద్రశేఖర మహాస్వామి వారని శృంగేరిలో భారతీతీర్థ స్వామి వారికి పరమేష్టి గురువు. వారి దగ్గరికి వచ్చి అందరూ భస్మం తీసుకుంటే, వారి కోరికలు అన్నీ తీరేవి. ఒకసారి వారికే అనారోగ్యం చేసింది. ఆ అనారోగ్యంతో ఆయన అనుభవిస్తున్నారు. శిష్యులు అన్నారట “స్వామి! మీరు అందరికీ విభూతి ఇచ్చి నయం చేస్తున్నారు కదా? మీరు ఎందుకు నయం చేసుకోరు అని.” అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, “వాళ్ళందరూ ఆ కర్మ ఫలితాన్ని Postpone చేస్తున్నారు అయ్యా, నేను అనుభవించదలుచుకున్నాను, అక్కడితో కర్మ క్షయం అయిపోతుంది”, అన్నారు.
ఈ విషయం మనకు అర్థం కావాలి అంటే అసలు కర్మ ఏమిటి, ఫలితం ఏమిటి, శరీరం ఏమిటి, రుగ్మతలు ఏమిటి, కష్టాలు, దుఃఖాలు, బాధలు ఇత్యాదివన్నీ ఎందుకు వస్తాయి, దేనివల్ల ఇవి వస్తాయి, దాన్ని ఎలా పోగొట్టుకోవాలి వీటిని సూచించేటువంటి వాళ్ళు సద్గురువులు. అందుకనే ఆత్మ శుద్ధి కలగాలి అని సద్గురువు బోధ చేస్తాడు. ఆత్మ శుద్ధి అంటే ఏమిటి? మీ ఆలోచనలు ఎప్పుడూ కూడా ఆలోచనలలో నెగిటివిటీ రానీయకుండా పాజిటివ్ గానే నువ్వు ఆలోచించడం నువ్వు అలవాటు చేసుకోగలగటం.
ఇవాల్టి రోజున ఆ గురు పరంపరని మనం గుర్తుంచుకోవాలి, ఆ కృతజ్ఞతను మనం ఆవిష్కరించుకోవాలి. మన హృదయాలలో ఆ విధమైనటువంటి కృతజ్ఞత భావన నిండి ఉండాలి. తద్వారా సనాతన ధర్మం చెప్పినటువంటి రీతిలో మనం నడుచుకొని, మనం ఆనందంగా ఉండాలని, మన సంతోషం కోసం చెప్పినటువంటిదే తప్ప మనం పూజ చేస్తే వాళ్ళకి ఏదో వచ్చేస్తుంది అని మనం అనుకోవడానికి లేదు. గురువులకు పూజ చేస్తే అది ఎందుకు అంటే మన సంతోషం కోసం గురు వాక్యాన్ని మనం ఆచరిస్తాం, తద్వారా మనం ఆనందంగా ఉంటాము అనేటువంటి ప్రతిజ్ఞ మనం తీసుకొని, ఇవాళ గురుపౌర్ణమి నాడు మనని మనం ఉద్ధరించుకుందాం. ఈ అంశాలు ఒక రోజుతో దిగేవి కావు. వీటిని మీరు మననం చేసుకుంటూ ఉండాలి, పునః పునః వీటిని ఆలోచిస్తూ ఉండాలి, వాటిలోనుంచి ఏదో ఒక్క అంశం మీ హృదయానికి ఏది తగులుతుందో దాన్ని పట్టుకోండి. దాని ద్వారా మీరు తరిస్తారు. ఇవాళ ఈ వ్యాస భగవానుడి అనుగ్రహము, అలాగే ఆచార్య పరంపర, గురు పరంపర అనుగ్రహము, ఆ పరమేశ్వరుడితో మొదలుపెట్టి శృంగేరి పీఠాదీశ్వరులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామి వారి వరకు వారందరి ఆశీస్సులు మనకు లభించాలని, సంస్థ సభ్యులందరూ కూడా వారి ఆశీస్సులతో ఆధ్యాత్మ విద్యలో అడుగులు ముందుకు వేసి, సుఖభోగ ఆనంద సంతోష ఐశ్వర్యాలతో తులతూగుతూ సంతోషంగా కాలం గడపాలనే సంకల్పంతోనే ఇవాళ మనం ఆ పూజ చేసాము. గురువుల అనుగ్రహం మనందరికీ తప్పకుండా లభిస్తుంది. ధర్మస్య విజయోస్తు