భగవత్ గీత అధ్యయనం – పురుషోత్తమ ప్రాప్తి యోగం 14
శ్రీ కల్వకొలను చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థ
భగవత్ గీత అధ్యయనం
ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః
శ్రీమద్భగవద్గీత
15వ అధ్యాయం
::పురుషోత్తమ ప్రాప్తి యోగం::
సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ |
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేదవిదేవ చాహమ్ ||15||
భావం: నేను సమస్త జీవుల హృదయాలలో నివసిస్తున్నాను; నా వల్లే జీవులకు జ్ఞాపకశక్తి, జ్ఞానం మరియు విస్మృతి (మరిచిపోయే గుణం), ఆపొహనము సందెహములను తొలగించు శక్తి కలుగుతాయి. సమస్త వేదాల ద్వారా తెలుసుకోవలసినవాడిని నేనే, వేదాంతాన్ని (వేదాల సారాన్ని) రూపొందించినవాడిని మరియు వేదాలను పూర్తిగా తెలిసినవాడిని కూడా నేనే.
శ్రీకృష్ణుడు ఇంతకుముందే స్పష్టంగా చెప్పినట్లుగా, సూర్యుడు, చంద్రుడు లేదా అగ్ని తమంతట తాముగా ప్రకాశించలేవు; ఆయన శక్తి వల్లే అవి కాంతిని లేదా తేజస్సును పొందుతున్నాయి. ఆయన అంశలోని ఒక అదృశ్య భాగమే ఈ చరాచర జగత్తుకు (కదిలే మరియు కదలని సమస్త జీవరాశికి) కారణం. పరమాత్మ మరియు జగత్తు రెండూ అనాదిగా (కాలానికి అతీతంగా) ఉనికిలో ఉన్నాయి. అలాగే, భగవంతుడు తన శక్తితో భూమి, చంద్రుడు మొదలైన వాటిలో ప్రవేశించి, ఈ విశ్వంలోని సమస్త జీవరాశికి జీవనాధారాన్ని కల్పిస్తున్నాడు. అంతేకాక, ఆయన సమస్త జీవులలో ‘వైశ్వానరుడు’గా ఉంటూ, నాలుగు రకాల ఆహారాన్ని జీర్ణం చేస్తాడు.
ఈ శ్లోకంలో భగవంతుడు మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు: ఆయన అందరి హృదయాలలో ఉంటూ జ్ఞాపకశక్తిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు; అంతేకాదు ‘విస్మృతి’ అంటే అవసరం లేని వాటిని – ‘బాధ, శోకం, వేదన, కష్టం మరియు విచారం’ వంటి దుఃఖములను మరిచిపోయే గుణం మనకు కలుగజేయునది కూడా ఆయనే.
వేదాల ద్వారా తెలుసుకోవలసినవాడు ఆయనే మరియు ఆయనే స్వయంగా వేదస్వరూపుడు.
పైన పేర్కొన్న విషయాల నుండి స్పష్టమయ్యేది ఏమిటంటే, జీవరాశి ఉనికి వారి స్వంత ప్రయత్నాల వల్ల లేదా తెలివితేటల వల్ల మాత్రమే ఏర్పడలేదు. మన ప్రతి పనికి పరమాత్మయే మూలకారణం. జీవుడి యొక్క పూర్వ సంస్కారాలు లేదా స్థితిని బట్టి, జ్ఞానం మరియు జ్ఞాపకశక్తి వంటి వాటిని ఆయన ప్రసాదిస్తాడు లేదా నిలిపివేస్తాడు. అందుకే పరీక్షలు లేదా ఇంటర్వ్యూల వంటి సందర్భాల్లో మనలో కొందరికి విషయాలు మర్చిపోయే పరిస్థితి ఎదురవుతుంది. ఈ విషయాన్ని తెలుసుకుని అర్థం చేసుకున్న తర్వాత, మన చిత్తాన్ని (మనస్సును) స్వచ్ఛంగా ఉంచుకోవడం మరియు మనలోనే ఉన్న భగవంతుడిని ఆరాధించడం మన కర్తవ్యం కావాలి.
జై శ్రీకృష్ణ.
ధర్మో రక్షతి రక్షితః