Skip to navigation
K C Das Memorial Charitable Trust
Donate
  • Home
  • About
  • Library
    • Dharma Vaani
    • Sri Lalitha Sahasra Naamavali
    • Dharmavaaradhi e-Magazine
    • Guru Vaani
    • Saradamba TV (Grandly Launched)
  • Dharmika Programs
    • All programs
    • Hanuman Chalisa
    • Gayathri Japam
    • Bala Japam
    • Calendar
  • Spiritual Education
  • Community Welfare
  • Contact
Donate
  • Instagram
  • YouTube
  • Facebook
  • Instagram
  • YouTube
  • Facebook
Donate

గణపతి తత్త్వం – 4

గణపతి తత్వం ఏమిటో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ‘ఆదో పూజ్యౌ గణాధిప’, అంటే మొట్టమొదటిగా ఎవరికి పూజ చేయాలి అంటే గణపతికి చేయండి అని చెప్పారు. ఆ గణపతికి ఎప్పుడు చేస్తున్నాము? భాద్రపద మాసంలో శుద్ధ చతుర్థినాడు, గణేశ చతుర్థి అని, వినాయక చవితి అని, ఈ చవితి నాడు పూజలు చేస్తూ ఉంటాం.

అసలు గణపతి అంటే ఏమిటి అంటే విఘ్నాలు తొలగించేటువంటి దైవమని, మనకి వరసిద్ధి వినాయక వ్రతము అని మనం వ్రతం చేస్తాం. అంటే కోరుకున్నటువంటి వరాలన్నీ సిద్ధింప చేసేటువంటి దైవము. ‘ఆదో పూజ్యో గణాధిప’, అని కేవలముగా వరసిద్ధి వినాయక చవితి వ్రతం నాడు మాత్రమే కాకుండా ఇంట్లో మనం ఏ శుభకార్యాలు చేసుకున్నా, ఏ పూజా పునస్కారాలు చేసుకున్నా, లక్ష్మి పూజ చేద్దాం అని ప్రారంభం చేసాం అనుకోండి గణపతి పూజతో ప్రారంభం చేయమన్నారు, అభిషేకం చేద్దామని ప్రారంభం చేశాం అనుకోండి గణపతి పూజతో ప్రారంభం చేయమన్నారు. అక్కడి నుంచి ప్రారంభం చేసి అగ్నిష్టోమ, వాజిపేయ, పౌండరీక, అశ్వమేధాది క్రతువులు చేసినా సరే గణపతి పూజతో ప్రారంభం చేయమన్నారు. ఇది మనకి కల్పం చెప్పినటువంటి విధానం.

కల్పోక్త ప్రకారంగానే మనం ఏ కర్మలు చేసినా చేస్తాం, ఎందుకంటే ‘వేదో నిత్యమధీయతాం, తదుదితం కర్మ స్వనుష్ఠీయతామ్’ అని కదా శంకర భగవత్పాదుల వారు చెప్పింది మనకి. ఒకసారి మనం ఆలోచన చేస్తే ఎందుకు ఆ గణపతికి అంతటి వైశిష్ట్యం వచ్చింది? అసలు గణపతి అంటే ఎవరు అని మనం తెలుసుకోవాలి. మన అందరి అభిప్రాయం ఏమిటంటే గణపతి అంటే అదేదో ఆ Front Order Batsmen, Middle Order Batsmen ఉంటారు చూసారా, First లో వచ్చేసి కాసేపు ఆడేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఉన్న కాసేపట్లో బాగా Runs score చేసేసి వెళ్ళిపోతారు out అయిపోయి, Middle Order Batsmen వచ్చాడంటే నిలబడతాడు కాసేపు. నేను చేసేది అభిషేకం గనుక నా దేవుడు, అభిషేకం చేసేటువంటి పరమేశ్వరుడు ఈశ్వరుడు అనే భావంతోనే ఉంటాడు.

శంకర భగవత్పాదుల వారు మనకి ‘పంచాయతన పూజా విధానం’, అని ఒకటి చెప్పారు. విష్ణు, ఆదిత్య, అంబిక, ఉమ, గణపతుల తోటి పంచాయతం జరుగుతుంది. గణపతిని మధ్యలో పెట్టుకొని చుట్టూరా మిగతా దేవతలను పెట్టుకొని చేస్తే అది గానాపత్యము. ఈశ్వరుని మధ్యలో పెట్టుకొని శివలింగాన్ని మిగతా వాళ్ళని చుట్టూరా పెట్టుకొని చేస్తే అది శైవము. విష్ణువుని పెట్టుకొని చేస్తే విష్ణు పంచాయతనము. ఇలా మనకి వేరు వేరు పూజా విధానాలు చెప్పారు కానీ గణపతి కూడా పంచాయతన దేవతలలో ఒకరు.

‘పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్‌’, అనేటువంటి పంచతత్వాలలో గణపతి ఒక తత్వం. ఈ పంచాయతర పూజ పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచభూతములు, పంచ ప్రాణములు వీటితోటి అనుసంధానం చేసి సనాతన ధర్మంలో ఋషులు మనకు అందించారు. అందులో మొట్టమొదటిది గణపతి. అందుకని ‘ఆదౌ పూజ్యో గణాధిపనా’. మనకి ఎప్పుడైతే విఘ్నాలు కలుగుతున్నాయో, (ఏదైనా పని ప్రారంభం చేసినప్పుడు తప్పకుండా విఘ్నాలు కలుగుతాయి) అది చిన్న పని అయితే చిన్న విఘ్నము, పెద్ద పని అయితే పెద్ద విఘ్నము. ఆ విఘ్నాలు తొలగడానికి చేసేటువంటి పూజ గణపతి పూజ భాద్రపద మాసంలో ఆచరిస్తాము.

మనం ఒక విశేషం గమనిస్తే ఈ భాద్రపద మాసంలో గణపతి నవరాత్రులను తొమ్మిది రోజులు గణపతికి చేస్తాం. భాద్రపద మాసం అయిపోయి ఆశ్వీజ మాసం రాగానే ఆశ్విజములో అమ్మవారికి చేస్తాం. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాల పెద్దమ్మ ఈయనకి తల్లి కదండీ. ఆ తర్వాత వచ్చే మాసం కార్తీక మాసం. కార్తీక మాసంలో విశేషంగా శివుడికి అభిషేకాలు చేస్తాం. పంచాయతన దేవతా పూజలు ఐదు నెలల్లో వరుసగా వస్తాయి. మార్గశిర మాసంలో విష్ణు భగవానుడి పూజలు చేస్తాం. ఆ తర్వాత మాఘమాసం వస్తే మాఘమాసంలో సూర్యారాధన చేస్తాం విశేషంగా. కాబట్టి గణపతి, అంబిక, ఈశ్వర, విష్ణు, ఆదిత్య వరుసగా, ఐదు నెలలు. ఇక్కడి నుంచి దక్షిణాయణం అంటున్నాం.

దక్షిణాయణం ప్రారంభం అయ్యేది శ్రావణ మాసంలో, అమ్మవారి పూజతో ప్రారంభం అవుతుంది. వరలక్ష్మి వ్రతాలతోటి గత మాసమంతా వరలక్ష్మి వ్రతాలు చేసుకొని అమ్మవారిని ‘నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది కల్పించు, ఇది కల్పించు’, అని కోరికలు కోరాం కదా! ఇప్పుడు ఆ కోరికలతో పాటు వచ్చేటువంటి విఘ్నాలు ఏవైతే ఉంటాయో ఆ విఘ్నాలు తొలగించమని గణపతిని ప్రార్థిస్తున్నాం.

గణేశ తత్వము అంటే గణములకు ఈశుడు. ఈషుడు అంటే అధిపతి. ఏ గణములు? మామూలుగా దేవ గణాలకు అధిపతి అనుకుంటారు. నిజానికి గణము అంటే సమూహం. మనుష్య గణము, రాక్షస గణము, యక్ష గణము, గంధర్వ గణము, కిన్నర గణము, కింపురుష గణము, సిద్ధ గణము, పక్షి గణము, మృగ గణములు. సమూహాలన్నిటిని మనం గణములు అంటూ ఉంటాం. వీటన్నిటికీ నాయకత్వం వహించేటువంటి దేవుడు గణపతి. ఏదో ప్రారంభంలో చేసి పక్కన పెట్టేయడం కాదు.

గణపతి ప్రధాన దేవతగా అర్చన చేసేటువంటి మతం ఉన్నది, దాన్ని గాణాపత్యం అన్నారు, 111 గణపతులు ఉన్నారు – సిద్ధి గణపతి, బుద్ధి గణపతి, బాల గణపతి, లక్ష్మి గణపతి, క్షిప్ర గణపతి. ఇలా విశేషంగా వేరు వేరు పేర్లతో వేరు వేరు దేవతలు, గణపతులు ఉన్నారు. చెప్పన్ గణపతి అని మనకి కాశీ వెళ్తే కాశీలో కనబడుతుంది. ఒక్కొక్క ఆవృత్తిలో ఎనిమిది మంది చొప్పున గణపతులు ఉంటారు. కేవలంగా గణపతిని ఆరాధిస్తే మాత్రమే సమస్త దేవతా అనుగ్రహం కలుగుతుంది అని మనకి గణేశ పురాణం చెప్తుంది.

అయితే ఈ గణపతి తత్వాలలో మనం నవరాత్రుల్లో చెప్పుకునేటువంటి కథల్లో ఒక ముఖ్యమైనటువంటి ఒక కథ ప్రస్తావన చేద్దాం ఇప్పుడు మనం. మీ అందరికీ తెలిసిన కథే, వినాయక చవితి వ్రతం చేస్తే తప్పకుండా ప్రతి వాళ్ళు చెప్పుకునేటువంటి కథ.

గజాసుర సంహారం చేసి ఈశ్వరుడు తిరిగి వస్తున్నాడనే ఆనందంతో పార్వతి ఒక నలుగు పిండితో ఒక రూపాన్ని సృష్టించి ఒక బాలుడిని సృష్టించి, ‘నేను స్నానం చేస్తున్నాను, ఎవరిని లోపలికి రానియద్దు’, అని ఆ తల్లి బాలుడిని కాపలాగా బయట ఉంచింది. ఆ సమయానికి ఈశ్వరుడు వచ్చాడని, ఆ బాలుడు ఈశ్వరుడిని కూడా లోపలికి రానివ్వలేదని, అమ్మవారి శక్తి వల్ల పరమేశ్వరుడితో కూడా యుద్ధం చేశాడని, అయితే పరమేశ్వరుడి శక్తి ముందు ఆ బాలుడి శక్తి చాలలేదని, పరమేశ్వరుడు ఆ బాలున్ని వధించాడని, ఆ తర్వాత అమ్మవారు బయటికి వచ్చిందని, ఆవిడ భర్తను చూసి ఆనందించి వెంటనే జరిగిన విషయం తెలుసుకొని బాధపడి దుఃఖిస్తూ ఉంటే ఉత్తర దిక్కుగా తలపెట్టి వినిపిస్తున్నటువంటి వాడి శిరస్సు తీసుకురండి అని ఆయన ఆజ్ఞ ఇచ్చాడని, ఆ ఆజ్ఞ ప్రకారముగా గజాసురుడి శిరస్సు తెచ్చారని, అది దీనికి అతికించారని ఇది మనకి కథ. ఈ కథ మీ మనందరికి తెలిసిన కథే.

ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏమిటి? తత్వాలు తెలుసుకోవాలి. పురాణ కథల వెనక తత్వం ఉంటుంది, ఆ తత్వం ఏమిటో మనం పట్టుకోగలగాలి. ఎందుకంటే తేలిగ్గా అర్థం అవ్వడానికి కథల రూపంలో ఇచ్చారు మహర్షులు. కథని కథగా తీసుకోవడం ప్రారంభ దశ. నమ్మకం కోసం, విశ్వాసం కోసం, భక్తి కోసం తీసుకుంటాం. కానీ తర్వాత ఆలోచన చేసి, విచక్షణ చేయమన్నారు (‘నిత్యానిత్య వస్తు వివేకము’)

‘జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ’, అని అంటున్నాము. ‘ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే!’, అని పోతన గారు చెప్పారు కదా. ఆయన సర్వవ్యాప్తి చెందినటువంటి వాడు కదా సకలము తెలిసినటువంటి వాడు కదా! (ఆవిడ గాని, ఆయన గాని) ఆవిడకి తెలియదా తాను నలుగు పిండితో బాలుడిని సృష్టించి స్నానానికి వెళ్ళిన సమయంలో ఈశ్వరుడు రాబోతున్నాడు అనేటువంటి విషయం అమ్మవారికి తెలియదా? అలాగే ఈ బాలున్ని అమ్మవారు తయారు చేసి పెట్టింది నేను సంహరించకూడదు అనేటువంటి విషయం ఈశ్వరుడికి తెలియదా? ఇప్పుడు నేను వెడితే ఆ బాలుడు నాకు అడ్డు వస్తాడు అతనితో నేను యుద్ధం చేయవలసి వస్తుంది అనేటువంటి విషయం ఈశ్వరుడికి తెలియదా? ఇద్దరికీ తెలుసు. కానీ సృష్టిలో కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమానుసారంగా జరగవలసినటువంటివి జరగాలి కనుక అవి అలా జరిపిస్తారు.

మనము ఒక్క పురాణంలో చూస్తే సమాధానాలు దొరకవండి, దేవి భాగవతము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మవైవర్త పురాణము, శివ పురాణము వీటన్నిటిని తిరగేస్తే వీటిలో మనకు సమాధానాలు దొరుకుతాయి. దేవి భాగవతంలోని ఒక కథ. అమ్మవారు జగన్మాత కదా! ఆవిడకి ఒకసారి ఒక ఆలోచన కలిగింది. ‘మాతృత్వం ఎలా ఉంటుందో నాకు అనుభవంలోకి రావట్లేదు, గర్భమును నేను ధరించడం లేదు, పిల్లలను నేను కనడం లేదు. కానీ జగమంతా నాకు పుత్రులే, పుత్రికలే, నా సంతానమే, కానీ అదొక అనుభూతి ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉంది స్వామి’, అన్నదట అమ్మవారు పరమేశ్వరుడితో. ఆయన అన్నారట, ‘అలా కాదు పార్వతి, అది సమంజసం కాదు. నీకు రావలసినటువంటి ఆలోచన కాదు’, అని. అందుకని ఆ కోరిక తీరడం కోసం ఆవిడ సంతానమును తయారు చేసుకున్నది.

అయితే మరి సంహరించడం, మళ్ళీ ఏనుగు తల తెచ్చి పెట్టడం ఇవన్నీ ఎందుకండీ అంటే సృష్టిలో ఏమి జరగాలన్నా ప్రకృతి పురుషుడు ఇద్దరు కలిస్తే కానీ సృష్టిలో నిలబడలేవు. ఏదైనా సరే సృష్టిలో నిలబడాలి అంటే ప్రకృతి పురుషుల కలయిక వల్లనే ఏదైనా నిలబడుతుంది. కాబట్టి పురుషుడి ప్రమేయం లేకుండా ఏర్పడ్డటువంటి ఆ జీవి ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి పరమేశ్వర సంకల్పంతో వచ్చినటువంటి శిరస్సు పార్వతి అనుగ్రహంతో కలిగినటువంటి మొండెం ఈ రెండు కలిపి ప్రకృతి పురుషుల కలయికయే జీవం భూమండలం మీద అని చెప్పడం ఈ కథ యొక్క ఉద్దేశం, దీని వెనకాల ఉన్నటువంటి తత్వం.

అలాగే మనకి ఇంకొక తత్వం ఉంది, అది కూడా తెలుసుకుందాం. చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి పురాణాలు, పురాణాలుగా కథలు కథలుగా చదువుకుంటే. లంబోదరుడు కదండీ వినాయకుడు, అంటే ఏనుగు. ఆయన వాహనం ఏమిటి ఎలక. ఏనుగు ఎలక మీద ఎక్కుతుందా అండి ఒక్కసారి ఆలోచించండి. మనం మానవులం మనకే ఎక్కడానికి సరైనటువంటి కారు కావాలి. మారుతి అయితే చిన్న కారు తలకాయ దూరట్లేదు పెద్ద కారు కావాలి అనుకుంటున్నాం కదా. ఆయనకి అటువంటి వాహనం ఏమిటి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒక విషయం ఉన్నది. దానికి ఒక పురాణ గాధ ఉన్నది మళ్ళీ.

పురాణిక గాధ ఏంటంటే ఒక సందర్భంలో యక్షరాజు అయినటువంటి కుబేరుడు కైలాసానికి వచ్చాడట పరమేశ్వరుడితో మాట్లాడడానికి. ఆయన కుబేరుడు ధనాధిపతే, కానీ ఐశ్వర్యానికి అధిపతి పరమేశ్వరుడు, ధనం మాత్రం కుబేరుడి దగ్గర ఉంటుంది. ధనం ఒక్కటి ఐశ్వర్యం కాదు, ఐశ్వర్యం అంటే ఇంకా చాలా ఉండాలి, అవన్నీ ఆయన ఈశ్వరుడు ఇస్తాడు. ధనం మాత్రం కుబేరుడు ఇస్తాడు. కుబేరుడు వస్తూ వస్తూ వాళ్ళ అబ్బాయిని కూడా తీసుకొని వచ్చాడు. ఆ అబ్బాయి పేరు అనింద్యుడు. వీళ్ళు యక్షజాతికి చెందినటువంటి వారు.

అక్కడికి వచ్చి చూస్తే కైలాసంలో ఒక పాత్ర కనబడిందట. ఆ పాత్రలో ఏదో పాయసం లాంటిది కనబడింది. వాళ్ళు యక్షులు కాబట్టి కుబేరుడి యొక్క కుమారుడు, ‘నాన్నగారు అది ఏమిటి?’, అని అడిగాడు. ‘అది మనకు అర్హత లేనటువంటిది నాయనా, దాన్ని అమృతం అంటారు. అది మనం తాగకూడదు. ఎందుకంటే యక్షులకు కూడా మరణం ఉంటుంది. యక్ష గంధర్వ కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య మానవ జాతికి అందరికీ మరణం ఉన్నది, ఒక దేవతలకు మాత్రమే మరణం లేనటువంటి జాతి, వాళ్ళు అమృతం తాగారు గనుక. అది మనకు అర్హత లేనటువంటిది’, అన్నాడట.

ఈయన పనిలో ఈయన ఉంటే ఆ అనింద్రుడు అనేటువంటి వాడు ఏం చేసాడంటే, కొద్దిగా చూద్దాం ఎలా ఉంటుందో అని taste చూశాడు. ఏది వద్దంటామో దాని మీద మనసు లాగుతుంది. అది మనసు లక్షణం, వాళ్లకు కూడా తప్పలా అది. సర్వాంతర్యామి అయినటువంటి అమ్మవారికి ఆ విషయం తెలిసింది. ఆవిడకి తెలియకుండా ఏమి చేయలేము. మనం ఏమనుకుంటాం అంటే ‘తలుపులు మూసుకొని నా గదిలో నేను ఉన్నాను, నేను లంచం తీసుకుంటే అంటే ఎవరికీ తెలియదు’, అనుకుంటారు కానీ పంచభూతాల రూపంలో పరమేశ్వరుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు అన్ని సమస్తం. కాబట్టి అన్ని అందరికీ తెలుస్తాయి పరమేశ్వరుడికి ముఖ్యంగా అన్ని తెలుస్తాయి, అమ్మవారికి అన్ని తెలుస్తాయి, ఆవిడకి తెలిసింది.

‘నువ్వు చేయకూడని పని చేసావు, వద్దన్న పని చేసావు, కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి ఎలకవైపోవు గాక’, అని ఆవిడ శాపం ఇచ్చింది. అమ్మవారి పాదాల మీద పడ్డాడు. ‘అమ్మ తప్పు అయిపోయింది క్షమించు’, అని. ఇప్పుడు అతనికి already అమృతం తాగేసాడు, మృతత్వం లేదు, జాతి యక్ష జాతి కానీ దైవీ సంపద వచ్చేసింది, అమృతత్వం ఉన్నది. కాబట్టి ఇప్పుడు అతను అమృతత్వం ఉన్నటువంటి వాడు. యక్షులు కామరూపులు అంటే చిన్న ఎలుక, పెద్ద ఎలుక, ఇంకా పెద్ద ఎలుక కాగలరు వాళ్ళు, ఎంత కావాలంటే అంత. హనుమంతుల వారు గనుక లంక ప్రవేశం చేయకముందు, చేసే ముందు, లంకలోకి వెళ్ళే ముందు ఉన్నట్లుగా.

సముద్రం దాటటం కోసం నందీశ్వరుడు ఉన్నట్టుగా ఉన్నారు ఆయన అంత పెరిగిపోయారు ఒకటేసారి, అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లి లాగా అయిపోయారు. అలా శరీర ఆకృతిని మార్చుకోగలగడం కామరూపత్వము అంటారు. ఆ శక్తి యక్షులకు కూడా ఉన్నది. కాబట్టి యక్షుడు ఎంత పెద్దగా అయినా అవ్వగలడు, ఎంత చిన్నగా అయినా అవ్వగలడు. అప్పటినుంచి ఆ వరం అలా ఉంది. ఇది కథ. దీంట్లో తత్వం ఏంటో తెలుసుకుందాం మనం.

దీంట్లో తత్వం ఏమిటి అంటే నిజానికి ఎలుక జీవుడు. జీవుడు ఎప్పుడు దేవుణ్ణి మోస్తూ ఉండాలి. పైన దేవుడు ఉన్నాడు ఎవరు ఆ దేవుడు? గణపతి. జీవుడి పరిణామం ఎలుక లాంటిది అయితే దేవుడు ఏనుగు లాంటి వాడు. అంటే జీవుడి శక్తి సామర్థ్యాలు కొంతే ఉంటాయి కానీ దేవుడికి అపరిమిత శక్తి. అపరిమితమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు దేవుడు. జీవుడు గనుక దేవుణ్ణి మోయకపోతే, ఈ ఎలుక లక్షణం ఏమిటంటే పగలంతా కలుగులో దాక్కుంటుంది, రాత్రి లైట్లు ఆపేసిన తర్వాత అప్పుడు బయటికి వస్తుంది, ఇంట్లో
నుంచి వచ్చి ఇల్లంతా తిరుగుతుంది.

ఎలుకకు అక్కర్లేదు అంటూ ఏమి ఉండదు. పూజా గదిలోకి వెళ్ళింది అనుకోండి పూజా గదిలో గంట కొట్టేది ఉంటుంది లేదా హారతి ఇచ్చేది ఉంటుంది ఏక హారతి అంటాం అది పట్టుకుపోతుంది. దీనితోటి నేను ఏం చేస్తాను, దీనివల్ల నాకు ఏం ఉపయోగము, ఇది నాకు అవసరమా లేదా అనేటువంటి విచక్షణ దానికి ఉండదు. మానవుడు (జీవుడు) కూడా అంతే. కలుగు లాంటి ఈ శరీరంలో దాక్కొని ఉన్నాడు. లోపల దాక్కొని అప్పుడప్పుడు విశ్వవాసనలకు లోనై ప్రాపంచిక విషయాలు తెలుసుకోవడం కోసం బయటికి వస్తుంటాడు. బయటికి వచ్చినప్పుడు ‘ఇది నాకు కావాలి, ఇది అక్కర్లేదు’, అనేటువంటిది లేకుండా అన్ని కావాలి. వీడికి అక్కర్లేనిది ఏమి ఉండదు. అన్ని కావాలని తెచ్చుకుంటూ ఉంటాడు, దాని వల్ల కష్టాలు తెచ్చుకుంటాడు. అందుకని ‘నువ్వు కష్టాలు తెచ్చుకోకురా నాయనా’, అని ఆ ఎలుక లాంటి జీవుడి మీద ఏనుగు లాంటి దేవుడు స్వారీ చేస్తూ ఉంటాడు. అప్పుడు దేవుని ఆధీనంలో ఈ జీవుడు కూడా జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది.

గణపతికి మనం చూస్తే పెద్ద చెవులు. Hearing కి Lisitioning కి చాలా తేడా ఉంది. చాలా మంది Hearing చేస్తుంటారు. Hearing వేరు Lisitioning వేరు. Hearing చేసేటప్పుడు ఏం చేస్తాం అంటే వాళ్ళు చెప్పేది వింటూ, మనం ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాం. వింటున్నావా అంటాం, వింటున్నాను అంటాడు. వింటుంటాడు కానీ మనసు మాత్రం ఎక్కడో ఆలోచన ఉంటుంది Hearing లో. Lisitioning లో అలా కాదు. You have to listen అందుకని తక్కువ మాట్లాడు. చిన్న నోరు – ఎక్కువ విను.

పెద్ద చెవులు. మరొక విషయం మీరు గమనిస్తే పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం (జగద్గురువులు, గురువులు, పీఠాధిపతులు) నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని మాట్లాడతాం. ఎందుకు మాట్లాడతాం? మన తుంపర వాళ్ళ మీద పడకూడదు, అది దోషం. అందుకని ఇలా చెయ్యి పెట్టుకొని మాట్లాడతాం. ఏ ప్రాణికి కూడా ప్రయత్నపూర్వకంగా చెయ్యి అలా పెట్టుకోవాల్సిందే తప్ప సృష్టిలో దానంతట చెయ్యి అడ్డం ఉండేటువంటి ప్రాణి లేదు. ఒక్క ఏనుగు మాత్రం మూతికి అడ్డంగా ఉంటుంది, తొండం, కరము అంటారు దాన్ని.

మన చేతిని కూడా కరము అంటారు. ‘కరాగ్రే వసితే లక్ష్మి కరమూలే సరస్వతి కరమధ్యే స్థితే గౌరీ ప్రభాతే కరదర్శనం’, అని నమస్కారం చేసుకుంటాం. మనకి ఇది కరమే, కానీ నోటికి అడ్డం లేదు. నోటికి అడ్డం లేకపోతే ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు. ‘కంజాక్షునకుఁ గాని కాయంబు కాయమే? పవన గుంఫిత చర్మభస్త్రి గాక వైకుంఠుఁ బొగడని వక్త్రంబు వక్త్రమే?’, అన్నాడు పోతన. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడకయ్యా, దానికి ఒక అడ్డం పెట్టుకో అని చెప్పడమే గణపతి యొక్క స్వరూపానికి లక్షణం.

అలాగే లంబోదరుడు అంటున్నాం అంటే చాలా పెద్ద పొట్ట కలిగినటువంటి వాడు అని మామూలుగా చెప్తాం. కానీ దాని తత్వం ఏమిటంటే పొట్ట పొడిస్తే అక్షరం ముక్క లేదండి వాడికి అంటుంటారు చూసారా. గుండె పొడిస్తే అక్షరం ముక్క లేదండి, వెన్ను పొడిస్తే అక్షర ముక్క లేదండి అనరు. పొట్ట పొడిస్తే అక్షరం ముక్క లేదు అంటారు లేదా వాడికి పొట్ట నిండా చదువు ఉందండి అంటారు. విద్య ఎక్కడ ఉంటుంది అంటే పొట్టలో ఉంటుంది.
సకల విద్యా పారంగతుడైనటువంటి, సర్వశాస్త్ర పండితుడైనటువంటి గణపతి ఆయన. అన్ని విద్యలు ఆయన కడుపులోనే ఉన్నాయి. అందుకని లంబోదరుడు అన్నారు.

ఇలాగ ఆయన పేర్లలో అష్టోత్తరాలు, సహస్రనామాలు. ప్రతి చోట గణపతి దేవాలయాలు ఉంటాయి, ప్రతి వీధి వీధికి ఉంటాయి గణపతి దేవాలయాలు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కంటే కూడా ఇంకా తమిళనాడులో సాంప్రదాయం ప్రతి వీధిలో ఒక గణపతి దేవాలయం. ప్రతి వాళ్ళు బయట నుంచి అన్నా కనీసం నమస్కారం చేసుకొని లెంపలు వేసుకొని, వాళ్ళ నామం చెప్పుకొని, వాళ్ళ కోరిక ఏంటో చెప్పుకొని, ఈరోజు నాకు విఘ్నం లేకుండా అనుగ్రహించి స్వామి అని నమస్కారం పెట్టుకొని వెళ్ళిపోతారు.

గణపతి శక్తి స్వరూపము, గణపతి శివ స్వరూపం, గణపతి విష్ణు స్వరూపము, గణపతి ఆదిత్య స్వరూపం. అసావాదిత్యో బ్రహ్మ అంటుంది కదా వేదం కాబట్టి గణపతి వేరు ఆదిత్యుడు వేరు కాదు. గణపతి వేరు శివుడు వేరు కాదు. గణపతి వేరు విష్ణువు వేరు కాదు. గణపతి వేరు అమ్మవారు వేరు కాదు. ఆ స్వరూపమే, అందులో ఒకానొక శక్తి. ఎందుకంటే మనం దేవతలు 33 కోట్ల మంది అంటూ ఉంటాం. కోటి అంటే సమూహం. మనకి ద్వాదశ ఆదిత్యులు అని ఉన్నారు. 12 మంది ఆదిత్యలు, వాళ్ళ సమూహాలు ఉన్నాయి అవి 12 కోట్లు అన్నమాట. అలాగే ఏకాదశ రుద్రులు వీళ్ళు 11 మంది. 12 + 11 ఎంతమంది అయ్యారు 23. అష్టవసులు, అశ్విని దేవతలు ఇద్దరు. వీళ్ళంతా కలిపి 33 మంది అవుతారు. వీళ్ళకి వెనకాల ఉన్నటువంటి సమూహము 33 కోట్ల దేవతల సమూహం. ఈ దేవతా సమూహం ఏమిటి అంటే దేవతా శక్తి.

ఒకే దేవుడు వేరు వేరు శక్తుల స్వరూపంలో ఆవిష్కరించినట్టుగా గణపతిగా మనకి విఘ్నములు తొలగించడానికి వచ్చినటువంటి పరమాత్మ. శక్తి తత్వమే గణపతి. కాబట్టి గణపతి పూజ చేసేటప్పుడు ఈ పరమాత్మ శక్తి తత్వాన్ని మనం ధ్యానం చేసుకుంటూ, ఆయనే శివుడు, ఆయనే విష్ణువు, ఆయనే ఆదిత్యుడు, ఆయనే అమ్మవారుగా మనం ధ్యానం చేస్తే కోరికలన్నీ తప్పక సిద్ధింప చేస్తాడు, విఘ్నాలు తొలగిస్తాడు.

ఆయనకు ఒక నమస్కారం పెడితే, కొబ్బరి, బెల్లము, అటుకులు ఆయనకి నైవేద్యం పెట్టి నమస్కారం చేస్తే విశేషంగా అనుగ్రహిస్తాడు. ఆ గణపతి అనుగ్రహంతో ఈ సంవత్సరం అంతా కూడా మీ అందరికీ కుటుంబాల్లో ఆయురారోగ్య భోగ భాగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధించాలని ఆ గణపతిని ప్రార్థిస్తూ, ధర్మస్య విజయోస్తు.

K C Das Memorial Charitable Trust

Paropakarardham Idam Sareeram

  • Instagram
  • YouTube
  • Facebook
Address
H.No. 11-13-119, 14/B, Road No. 3, beside Axis Bank, Alkapuri Colony, Ramakrishnapuram, Kothapet, Hyderabad, Telangana 500035
View on map
Contact
contact@kcdastrust.org
+91 94948 77070
04:00 PM to 08.30 PM IST

© 2026 K C Das Memorial Charitable Trust. All rights reserved.

Terms and ConditionsPrivacy Policy