గణపతి తత్త్వం – 5
శివపురాణంలో విశేషంగా కనబడుతూనే ఉంటాయి గణేశుని చరిత్రలు, ఘట్టాలన్నీ కూడా. ఇప్పుడు బ్రహ్మగారికి ఎప్పుడు ప్రత్యక్షమయ్యారు? ఆరోజు మార్గ బహుళ చతుర్దశి. దాన్ని సంకష్టహర చతుర్థి అన్నారు ఈ చవితి ఏమిటంటే ‘వరద చతుర్థి’ అంటారు దీన్ని. అంటే వరములు ఇచ్చేటటువంటి చవితి, శుద్ధ చవితి. బహుళ చవితి కష్టాలని తొలగించేటటువంటి చవితి. ఏది కావాలి మనకి ? కష్టాలు తొలగిస్తే చాలా, వరాలు కూడా కావాలా అని నిర్ణయించుకుని వరాలు కూడా కావాలి అనుకుంటే రెండు చవితుల నాడు పూజ చేయమన్నారు. శుక్లచవితిలో వరాలు కోరుతూ పూజ చేయాలి, బహుళ చవితిలో కష్టాలు తొలగించమని పూజ చేయాలి. ఆ స్వరూపం ఆరోజు మారాలి గణపతికి. ఇందాక చెప్పాను. నూట పదకొండు అవతారాలు ఉన్నాయి గణపతికని. దాంట్లో ఒకానొక అవతారం గురించి అంటే శ్వేతవరాహకల్పంలో ఈ కల్పంలో జరిగినటువంటి అవతారం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు జరిగేటటువంటి గణపతి పూజలో ఉన్నటువంటి కథలు, ఆ విశేషాలన్నీ కూడా.
ఇప్పుడు మనకి సాధారణంగా వచ్చే ప్రశ్న. అంత పెద్ద గణపతి చిన్నమూషికం పైన ఎలా ఎక్కుతాడు అతని వాహనం ఏమిటి అంటే దాంట్లో విశేషమేమిటోమనం తెలుసుకోవాలి. కథాపరంగా చూస్తే కథలు కథలు గానే ఉంటాయి. కథలో ఉన్నటువంటి తత్వం గనక మనం గ్రహించగలిగితే, అసలు మూషికుడెవరు అంటే యక్షరాజైనటువంటి కుబేరుని కుమారుడు అనింద్యుడు అనేటటువంటి వాడు. ఒకనాడు ఈ కుబేరుడు తన కుమారుడితో కైలాసానికి వెళ్ళాడు. వెళితే కైలాసంలో ఒక పాత్రలో అమృతం ఉన్నది. ఇదేమిటి అని అడిగాడు. ‘అది అమృతం నాయనా, మనకు అర్హత లేదు [యక్షులకు కూడా మరణం ఉంటుంది, అమరత్వం లేదు. యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష, మానవ, రాక్షసులు – వీరందరికీ కూడా మరణాలు ఉన్నాయి. ఒక్క దేవతలకి మాత్రమే మరణం లేదు] కాబట్టి దాన్ని పానంచేయటానికి మనకి అర్హత లేదు’, అని తండ్రి చెప్పాడు. చెప్పినా బుద్ధి దొలచింది అతనికి. దొలచి మెల్లిగా ఎవరూ చూడకుండా వెళ్లి కాస్త తాగేశాడు. వాళ్లకు కూడా ఉంటాయండి ఆ బుద్ధులు, మనకే కాదు. తాగిన విషయం అమ్మవారికి తెలిసింది. ఆవిడ సర్వమంగళ కదండి! ‘అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ’ కాబట్టి ఆవిడకి తెలియని విషయాలు ఏముంటాయి? తెలిసి, ‘ ఎలక లాగా [ ఎలక ఏం చేస్తుంది, ఎవరు లేనప్పుడులైట్లు ఆర్పేసినప్పుడు అప్పుడు వస్తుంది బయటకి. అప్పటిదాకా అది దాని కలుగులోనే ఉంటుంది. వచ్చి అవసరంలేనివి, అక్కర్లేనివి, ఇవన్నీ కూడా పట్టుకు పోతుంటుంది] ఎలక లాగా వచ్చి నీకు అవసరం లేనివి, నీకు సంబంధం లేని విషయాల్ని నీకు అక్కర్లేని వస్తువుల్ని నువ్వు గ్రహించావు కాబట్టి నువ్వు మూషికుడు అయిపోదువుగాక’, అని శాపం ఇచ్చింది . అప్పుడు అనింద్యుడు మూషికుడైపోయాడు. అయితే అప్పటికే అమృతం తాగేశాడు. అమృతత్వం ఉన్నదాయనకి. మరణం లేదు. ఏంచేయాలి అంటే, కామరూపులు కదా యక్షులు, కామరూపం ఉంది కాబట్టి నువ్వు గణపతికి వాహనమై ఉండమని అమ్మవారు అనుగ్రహించింది. అప్పటినుంచి ఆయన గణపతికి వాహనంగా ఉన్నాడు. ఎంత ఆకారం కావలిస్తే అంత ఆకారం ధరించగలడు. పెద్ద ఎలుకలు, ఇంకా పెద్ద ఎలుకలు, మరీ పెద్ద ఎలుకలు అంటాం కదా మనం. అలాగ అవసరాన్ని బట్టి ఎంత పెద్ద రూపమైనా ధరించగల సమర్థుడు, కామరూపుడు.
సరే, ఈ కథలో ఉన్న తత్వం ఆలోచిద్దాం. తత్వం ఏమిటి? “తత్వవేత్తలు, విబుధ జనుల వల్ల విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు” అన్నారు పోతనగారే. కాబట్టి పెద్దలు చెప్పిన మాటలు మీకు మనవి చేస్తున్నాను. ఈ కథలో ఎలకంటే ఎవరో కాదండి, ఎలకంటే శరీరంలో ఉన్నటువంటి జీవుడు. గణపతి ఎవరు? దేవుడు. ఈ దేవుడు ఎవరి మీద ఉండాలి? జీవుడు మీద ఉండాలి. ఎందుకు? లేకపోతే ఈ ఎలక ఏం చేస్తుంది? ఈ జీవుడు మాటిమాటికి బయట ప్రపంచం లోకి వస్తుంటాడు. ఈ దేహమనేటటువంటి కలుగులోంచి బయటకొచ్చి, బయటనున్న అక్కర్లేని విషయాలన్నింటినీ సేకరిస్తాడు. ఎలక పూజ గదిలోకి వస్తుందనుకోండి. అదేం చేస్తుంది పాపం? హారతి పళ్లెం పట్టుకుపోతుంది లోపలికి. ఇది నాకు అక్కర్లేదు, నాకు ఉపయోగం లేదు, నాకు ఇది అవసరం లేదు, దీన్నినేనేం చేసుకోలేను, అన్న విషయం దానికి తెలియదు. తర్వాత చూద్దాం అనుకుంటుంది. కలుగులోకి పరిగెడుతుంది. అంటే, అవసరం ఉన్నా లేకపోయినా ఎలాగైతే ఎలుక అన్నీపట్టికెళ్ళి కలుగులో దాక్కుంటుందో, ఈ జీవుడు కూడా ప్రాపంచిక విషయాలన్నీ, అవసరమున్నా, లేకపోయినా, అన్నీతెచ్చి తనపైన పెట్టుకుంటాడు. ఇది నాకు అవసరమా లేదా, అక్కడెక్కడో పది ఎకరాలు భూమి అమ్ముతున్నారు, ఎకరా 300 రూపాయలు అంటే పరిగెడతాడు. అవసరం ఉన్నదా, లేదా అని కూడా ఆలోచించకుండా. దానివల్ల తర్వాత ఇబ్బందులు కొనితెచ్చుకుంటాడు. అటువంటి ఆలోచనలు కలిగినప్పుడు దేవుడుగా ఆయన నొక్కి పెడుతుంటాడు, రక్షిస్తుంటాడు.
మరో విషయం. ఇంకో కథలో ఉన్న అంశం ఏమిటంటే, ఎప్పుడూ సాధారణంగా జరిగేటటువంటి విషయం. ఇది తరచూ వింటుంటారు మీరు. అమ్మవారు స్నానం చేస్తున్నది. నలుగు పెట్టిన దాంతో వినాయకుడిని చేసి పెట్టింది. కాపలా కాయమన్నది. ఆయన కాపలా కాస్తున్నాడు. ఈశ్వరుడు వచ్చాడు. గణపతి అడ్డం పెట్టాడు. ఈశ్వరుడు తల నరికేశాడు. అమ్మవారు వచ్చి బాధపడింది. ఈ కథంతా విన్నారు. దీనిలో తత్వం ఏమిటో మనం తెలుసుకోవాలి. ఒకసారి ఆలోచించండి. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ, “జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ”, అంటున్నాం అవునా? అన్నప్పుడు మొత్తం సకల చరాచర జగత్తులో శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అటువంటిది, ఏం జరుగుతోంది అన్న సారానికి వెళితే, పరమేశ్వరుడు వస్తాడన్న విషయం అమ్మవారికి తెలియదా, అమ్మవారు స్నానంచేసేటప్పుడు వినాయకుడిని ఏర్పాటు పెట్టిందన్న విషయం శివుడికి తెలియదా? ఆలోచించాలి కొంచెం.
పురాణాల్లోనికథలు కథలుగా వింటే లాజికల్ గా అందవు. దాన్ని రీసర్చ్ చేయాలి. కొద్ది సమయం వెచ్చించాలి. పదిమందితో చర్చించాలి. అంటే, ఎవరితో పడితే వారితో చర్చిస్తే, మళ్లీ సరిగ్గా సమాధానం ఇవ్వరు. విజ్ఞతతో, విచక్షణతో తెలుసుకుంటుండాలి. దాన్ని వివేచనం అన్నారు. ఆలోచిస్తే మనకు సందేహాలు వస్తాయి: అమ్మవారికి తెలియదా? అమ్మవారికి తెలుసు పరమేశ్వరుడు రాబోతున్నాడు, ఇతని తల నరకబోతున్నాడు అన్న విషయం ఆవిడకి కూడా తెలుసు. కానీ ఎందుకు జరిగింది అంటే, అమ్మవారు ప్రకృతి రూపం – మాయ. పరమేశ్వరుడు పురుషరూపం. ప్రకృతి పురుషుల కలయిక లేకుండా సృష్టి జరగదు, సృష్టి నడవదు. ఏది జరగాలన్నా ప్రకృతి పురుషుల కలయిక ఉండాలి. అమ్మవారు దేవరూపంగా, శక్తి రూపాత్మకంగా, శక్త్యాత్మరూపంగా ఆవిడ తయారు చేసి పెట్టినటువంటిది. “శక్త్యాయుక్తో భగవతి”, అంటారు శంకర భగవత్పాదుల వారు. శివుడు లేకుండా శక్తి, శక్తిలేకుండా శివుడు, సృష్టిలో ఉండటానికి వీల్లేదు. అయితే దీన్ని మళ్లీ సమయం వచ్చినప్పుడు వివరంగా చెప్పుకుందాం. దేవీ భాగవతంలోకి వెళితే, అమ్మవారి వివాహ సందర్భంలో తాను కూడా గర్భం ధరించి తాను కూడా తల్లి, మాతృవాత్సల్యాలను అనుభవించాలన్న కోరిక అమ్మవారికి కలుగుతుంది. పరమేశ్వరుడు, “ ఇది సరైన కోరిక కాదు మానవులకి ఉండవలసినటువంటిది”, అని చెప్తాడు. పాపం తాను అలా ఆలోచిస్తుంది. సరే వివరంగా ఇంకోసారి చెప్పుకుందాం. అందువల్ల పరమేశ్వరుడు వచ్చి, “నరాకాయో మాయా, గజాకారో పురుషః” అంటారు అందుకనే. అప్పుడే ఆయన గజాసుర సంహారం చేసి వచ్చాడు. గజాసురుడు ఆయన్ని కోరాడు. ఏం కోరాడు? నాతల లోకపూజితం చేయవయ్యా స్వామి” అని కోరాడు. ఆయన, “తథాస్తు”, అని వరం ఇచ్చాడు. కాబట్టి ఆ తలని లోకపూజ్యం చేయటం కోసం ఉత్తరదిక్కుకి తలపెట్టుకుని పడుకున్న వాడు ఎవడున్నాడో చూడండి అన్నాడు. గజాసురుణ్ణి అప్పుడే నంది శృంగంతో పొడిచి ఆయన .శిరస్సు తొలగించి తీసుకొచ్చి ఇక్కడ తగిలించారు.
ఏవండీ, మనిషి శరీరానికి ఏనుగు శిరస్సు పెట్టవచ్చా అని సందేహించే వాళ్ళకి, 2017 లో రష్యాలో డాక్టర్లు రీసెర్చ్ చేసి సైంటిఫిక్ గా మానవ శరీరానికి మృగం తలని తగిలించే ప్రయత్నం చేస్తున్నాం, ఇది సక్సెస్ అవుతుంది, అని చెప్పారు. చేశారు కూడా. అంటే వైద్యప్రక్రియ పరంగా జరిగి ఉండవచ్చు. కాని దానివల్ల వచ్చే ఇబ్బందులు, ఉపద్రవాలేమిటో మనం ఇప్పుడు చర్చించవద్దు. అలా చేయవచ్చో చేయకూడదో తర్వాత చూద్దాం. సాధ్యమా అంటే, సాధ్యమే. యంత్ర శక్తి, మంత్ర శక్తి, తంత్ర శక్తి అని మూడు శక్తులుంటాయి. ‘మననాత్ త్రాయతే ఇతి మంత్ర’. మనస్సులో పదే పదే, పదే పదే మంత్రాన్ని స్మరణ చేస్తూ ఉంటే, ఆ మంత్రం వల్ల తరించ వచ్ఛు.
త్రాయతే అంటే రక్షించేది. మంత్రం వల్ల రక్షించబడుతుంది, రక్షించబడతాడు మంత్రంతో. మననాత్ త్రాయతే ఇతి మంత్ర, యజనాథ్ త్రాయతే ఇతి తంత్రహ, యజ్ఞం. యజ్ఞం అంటే హవిస్సు వేయటం ఒక్కటే కాదండి. ధర్మం చేయటం, కార్యక్రమం చేయటం, ప్లాన్ చేయటం ఇవన్నీ కూడా యజ్ఞం చేయటం కిందకి వస్తాయి. భగవద్గీతలో చాలా విపులంగా చెబుతాడు కృష్ణపరమాత్మ మనకి. మననాత్ త్రాయతే ఇతి మంత్ర, యజనాథ్ త్రాయతే ఇతి తంత్రహ, యత్నాత్ త్రాయతే ఇతి యంత్రహ’ అన్నారు. ఇప్పుడు యంత్రముల తోటి ప్రయత్న పూర్వకంగా ప్రయత్నంచేసి రక్షించబడుతున్నాం, యంత్రములతోటి. కాబట్టి అది సాధ్యమే. ఇక్కడ గజాసురుని శిరస్సు పెట్టడం వల్ల లోకమంతా గజాసురుని కొలుస్తున్నది. ఇది కథ. దాని తత్వం: అమ్మవారికి మమకారం ఏర్పడింది.బ్రహ్మావర్త పురాణంలో ఇంకొక కథచెప్తారు.మనకు సమయం లేదు కానీ, దీని తత్వం వివరిస్తాను.
గణపతి ముఖానికి పెద్ద చెవులు, చిన్న కళ్ళు. చూచేటప్పుడు ఫిల్టర్ పెట్టుకుని చూడాలి లోకాన్ని. వినేటప్పుడు శ్రద్ధగా వినాలి. అందుకని పెద్ద చెవులు. మూతికి చెయ్యి అడ్డంగా ఇలా పెట్టుకుని మాట్లాడతాం. ఎవరితోటి? జనకులు, పెద్దవారు, స్వామీజీలు. మన తుంపర వారి మీద పడుతుందనిమన చెయ్యి అడ్డం పెట్టుకుని మాట్లాడతాం. అంటే నిరంతరం మూతికి తొండం అడ్డం పెట్టుకునేటటువంటి స్వరూపం కలది ఏనుగు మాత్రమే. జంతువుల్లో మూతికి అడ్డంగా ఉన్నది ఏనుగు మాత్రమే.తొండం అడ్డం ఉంటుంది. తొండం ఇలా వస్తుంది మూతికి అడ్డంగా. కాబట్టి, మాట్లాడేటప్పుడు జాగర్తగా మాట్లాడు, చూసేటప్పుడు విచక్షణతో చూడు, వినేటప్పుడు శ్రద్ధగా విను, అని చెప్పటం కోసమే ఆ గజముఖం ఏర్పరచటం జరిగింది.
ఇంకొక కథ ఉన్నది. చంద్రుని చూస్తే నీలాపనిందలు. గణపతికి అందరూ పూజ చేశారనీ, కుడుములు పెట్టారని, ఆయన తిన్నారనీ, పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేద్దామంటే చేతులందటం లేదనీ, దాన్ని చూసి చంద్రుడు నవ్వాడనీ, ఆనవ్వినందుకు ఆయన పొట్టచెక్కలయ్యిందనీ, దాంట్లోంచి కుడుములన్నీకూడా దొర్లిపోయాయనీ, పార్వతి దేవి శాపమిచ్చిందనీ, ఇంతవరకూ ఈ కథంతా మీకు తెలిసిందే. .ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆరోజు నీలాపనిందలబారిన పడ్డారు. ఆలోచించాల్సినదేమిటంటే మానవులందరికీ కూడా కొన్ని సందర్భాల్లో వస్తాయి. కానీ తత్వమేమిటంటే, కృష్ణుడు అక్కడ వదలి పెట్టలే. ప్రయత్నం చేసాడు. మన ప్రయత్నం మనం చేస్తూ,.మనకొచ్చిన నీలాపనిందల్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. మానవజన్మ ఎత్తిన తర్వాత, పదిమందిలో ఉన్నప్పుడు పలు రకాల మనుషులుంటారు. వాళ్ళ ద్వారా వచ్చే నీలాపనిందలన్నిటినీ కూడా ప్రయత్నం ద్వారా తొలగించుకుపోవాలి, తొలగించుకోవచ్చు. “ప్రయత్నేన … దైవచింతనాం”. కథ విని, ధైర్యం తెచ్చుకుని ముందుకు వెళ్ళాలి.
ఇంకొకటి. ఈయనకి గణాధిపత్యం ఇద్దామనుకున్నారు. ఈయనకీ, సుబ్రహ్మణ్యస్వామికి పోటీ పెట్టారు. ఆయన నెమలివాహనం మీద వెళ్ళిపోయాడు. ఈయన ఎలక వాహనం మీద వెళ్ళలేడు. ఏంచెయ్యాలి అని ఆలోచించాడు. పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణం చేసాడు. చెయ్యగానే, సుబ్రమణ్యేశ్వరస్వామికి ఎక్కడకి వెళ్లినా, తనకన్నా ముందుగా వినాయకుడు స్నానంచేసి వస్తున్నట్టుగా కనబడ్డారు. ఇది మనకథ. దాంట్లో ఉన్న అంశమేమిటంటే, మనము గ్రహించవలసినటువంటి అంశం. మనం ఎన్ని కథలు చెప్పుకున్నా, ఎన్ని సత్కర్మలు చేసినా, ఇంట్లో తల్లితండ్రుల్ని గౌరవంగా చూడకపోతే, ఆ సత్కర్మల ఫలితం ఉండదు అని దాని అంశమది. ఎందుకంటే, మాతృదేవోభవ, వేదం చెప్పేటటువంటిదది. పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, చెబుతున్నది కదా! సాక్షాత్తు గణపతికైనా ఎలా సిధ్ధించింది ? అందుకే ఆయనకిద్దరు భార్యలన్నారు. భార్యలూ, పిల్లలూ, ఇవన్నీ చెప్తేకదా, మనకి తొందరగా అర్థమవుతుందని భార్యలు అన్నారు. నిజానికి గణపతికి పెళ్లి జరగలేదు. సిద్ధి, బుద్ధి ఇద్దరు భార్యలు అన్నారు. బుద్ధి కుడివైపుంటుంది, సిద్ధి ఎడమవైపుంటుంది ఆయనకి. సిద్ధించాలంటే, బుద్ధి ఉండాలికదండి! ఏవన్నా సిద్ధించాలంటే, కార్యసిద్ధి కావాలంటే ముందు బుద్ధి కావాలి. ఆ బుద్ధిని పనిమీద పెట్టి పనులు చేస్తుంటే మద్ధ్యలో విఘ్నములొస్తాయి.