భగవత్ గీత అధ్యయనం – సాంఖ్య 1
కల్వకొలను చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థ
ఓం శ్రీ పరమాత్మనే నమః
అథ ద్వితీయోఽధ్యాయః ।
:: భగవద్గీత::
రెండవ అధ్యాయం
సాంఖ్యయోగః
భగవద్గీతలోని రెండవ అధ్యాయాన్ని ‘సాంఖ్యయోగం’ అంటారు.
‘సాంఖ్య’ అంటే విశ్లేషణ, విచారణ లేదా జ్ఞానం ద్వారా ప్రకృతి-ఆత్మల భేదాన్ని స్పష్టంగా తెలుసుకోవడం. మనం ఏదైనా గణించడానికి సంఖ్యల సహాయం తీసుకుంటాం. ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ఒకవైపు 24 లేదా 96 తత్వాలు (పంచభూతాలు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి మొ॥), మరొకవైపు ఏకైక ‘ఆత్మ’ ఉంటాయి. ఈ తత్వాలన్నింటినీ ఒక్కొక్కటిగా విశ్లేషిస్తూ, “నేను ఇది కాదు” అని నేతి-నేతి మార్గంలో తొలగించుకుంటూ వెళ్తే చివరకు ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. ఈ విశ్లేషణా విధానాన్నే ‘సాంఖ్యయోగం’ అంటారు. అలాగే ఇందులో ఆత్మతత్త్వం, పంచభూతాలు, ఇంద్రియాల గురించి విస్తృతంగా వివరించబడింది కాబట్టి దీనికి సాంఖ్యయోగం అనే పేరు వచ్చింది.
’యోగం’ అంటే పరమాత్మతో లేదా సత్యంతో అనుసంధానం కావడం, లేదా ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం.
ముఖ్య అంశాలు:
భగవంతుని ముందు అర్జునుని మానసిక వేదన కొనసాగింపు: {శ్లోకాలు 1 నుండి 10}
ఆత్మ నిత్యత్వం: దేహం నశిస్తుంది, కానీ దేహంలోని ఆత్మ ఎప్పటికీ నాశనం కాదు. ఆత్మకు పుట్టుక గానీ, మరణం గానీ లేవు. {శ్లోకాలు 11 నుండి 30}
కర్తవ్యం (ధర్మం): ఫలితాలపై వ్యామోహం లేకుండా, స్వధర్మాన్ని కర్తవ్యంగా నిర్వర్తించడం. {శ్లోకాలు 31 నుండి 38}
నిష్కామ కర్మ: కర్మ ఫలితాలను ఆశించకుండా బాధ్యతలను నిర్వర్తించడమే నిష్కామ కర్మ. {శ్లోకాలు 39 నుండి 53}
స్థితప్రజ్ఞుని లక్షణాలు: ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని, సుఖదుఃఖాలలో చలించకుండా సమభావంతో ఉండేవాడే స్థితప్రజ్ఞుడు. {శ్లోకాలు 54 నుండి 72}
భగవద్గీత యొక్క సారాంశం:
ఈ అధ్యాయం అర్జునుని శోకాన్ని పోగొట్టి, జ్ఞానమార్గాన్ని ఉపదేశిస్తుంది కాబట్టి దీనిని గీత యొక్క సంక్షిప్త రూపం లేదా సారాంశం అంటారు. భగవద్గీతలో కొన్ని అధ్యాయాలు జ్ఞానానికి, మరికొన్ని కర్మకు ప్రాధాన్యతనిస్తాయి. కానీ సాంఖ్యయోగంలో జ్ఞానము మరియు కర్మ రెండింటి సమన్వయం కనిపిస్తుంది. అలాగే ఇది గీతలోని అధ్యాయాలన్నింటిలోనూ పెద్దది (72 శ్లోకాలు).
ఈ అధ్యాయానికి సాంఖ్యయోగం అని పేరు ఉన్నప్పటికీ, శ్రీకృష్ణ భగవానుని అసలైన ఉపదేశం 11వ శ్లోకం నుంచే ప్రారంభమవుతుంది. అంతవరకు అర్జునుని వేదన కొనసాగుతూనే ఉండటంతో, భగవానుడు మొదట అతడిని మందలిస్తూ, ఆపై ఓదారుస్తాడు.
సంజయ ఉవాచ:
తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణమ్ ।
విషీదన్తమిదం వాక్యమువాచ మధుసూదనః ॥ 1 ॥
భావం: సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు: “ఓ రాజా! కన్నీటితో నిండిన కలత చెందిన కళ్లతో, తీవ్ర విచారంలో మునిగివున్న అర్జునుడి దీనస్థితిని చూసి శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా మాట్లాడటం ప్రారంభించాడు.”
అర్జునుని మానసిక స్థితి:
అర్జునుడు అజ్ఞానంలో, తీవ్ర నైరాశ్యంలో ఉన్నాడు. ఏది ధర్మమో, ఏది అధర్మమో నిర్ణయించుకోలేని స్థితిలో చిక్కుకున్నాడు. అటువంటి స్థితిలో ఉన్న అర్జునుడిని భగవానుడు ముందుగా శాంతపరిచి, జ్ఞానోపదేశాన్ని స్వీకరించే యోగ్యతను అతనికి కల్పిస్తున్నాడు.
”అశ్రుపూర్ణాకులేక్షణమ్” (కన్నీటితో నిండిన నేత్రాలు):
అర్జునునికి భౌతిక ప్రపంచంపై, వైభోగాలపై విరక్తి, సంసారం పట్ల తీవ్ర వైరాగ్యం కలిగాయి. బ్రహ్మోపదేశం పొందడానికి ఇటువంటి తీవ్ర వైరాగ్య స్థితి ఒక ముఖ్యమైన ముందస్తు అర్హత. ఈ అంతఃకరణ శుద్ధి, వైరాగ్యం లేకపోతే ఆధ్యాత్మిక జ్ఞానం బోధపడదు.
”కృపయావిష్టమ్” (కరుణతో ఆవరించబడటం):
కరుణ, దయ కలిగి ఉండటం మంచి గుణమే. కానీ అది అనర్హుల మీద, యుద్ధభూమిలో కర్తవ్యాన్ని విస్మరించేలా చూపించినప్పుడు అది హానికరంగా మారి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఇది క్షత్రియ ధర్మానికి పూర్తిగా విరుద్ధం.
”మధుసూదనః”:
శ్రీకృష్ణుడు పూర్వం ‘మధు’ అనే రాక్షసుడిని సంహరించడం వల్ల ఆయనకు మధుసూదనుడు అనే పేరు వచ్చింది. దీనికి మరొక అంతరార్థం ఏమిటంటే—’మధు’ అనగా తేనె. అహంకారం, భోగాల పట్ల ఆకర్షణ మొదట్లో తేనెలా మధురంగా ఉంటాయి, కానీ మోతాదు దాటితే అవే విషంగా మారుతాయి. కాబట్టి వాటిని త్యజించాలి. ఈ అహంకార, భోగ వాసనలను నశింపజేసేవాడే ‘మధుసూదనుడు’. అటువంటి స్థితిని చేరినవాడే పరమాత్మను చేరడానికి యోగ్యుడవుతాడు.
(సశేషం…)
జై శ్రీ కృష్ణ
ధర్మో రక్షతి రక్షితః