భగవత్ గీత అధ్యయనం – అర్జున విషాద యోగం 22
శ్రీ కల్వకొలను చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థ
భగవత్ గీత అధ్యయనం
ఓం శ్రీపరమాత్మనే నమః
అథ ప్రథమోఽధ్యాయః |
::భగవద్గీత::
అధ్యాయం 1
అర్జున విషాద యోగం
కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్ |
అర్జున ఉవాచ:
దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్ || 28 ||
అక్కడున్న తన బంధువులందరినీ చూసిన కుంతీ పుత్రుడు అర్జునుడు, కారుణ్య భావం ఉప్పొంగినవాడై, తీవ్ర దుఃఖంతో ఈ విధంగా పలికెను. అర్జునుడు ఇలా అన్నాడు: ఓ కృష్ణా, యుద్ధానికి బారులు తీరి ఒకరినొకరు చంపుకోటానికి పూనుకుంటున్న నా బంధువులను చూసి, నా అవయవాలు పట్టు తప్పుతున్నాయి మరియు నా నోరు ఎండిపోవుచున్నది.
28వ శ్లోకంలో ‘కృప’ అనే పదం వాడబడింది. దీనికి దయ, కరుణ, మృదువైన భావన వంటి అర్థాలు ఉన్నాయి. అర్హులైన వారి పట్ల, ధర్మబద్ధంగా నడుచుకునే వారి పట్ల ఇటువంటి భావన చూపడం మంచిదే. కానీ అధర్మ మార్గంలో ఉన్నవారి పట్ల దీనిని ప్రదర్శించడం ప్రతికూల ఫలితాలను ఇస్తుంది; ఎందుకంటే క్షత్రియుడిగా ధర్మాన్ని కాపాడటానికి పోరాడటం అతని కర్తవ్యం.
మరొక పదం ‘విషీదన్’ అంటే ‘దుఃఖంతో కూడినవాడు’ అని అర్థం. అజ్ఞానాంధకారంలో ఉన్నంత కాలం ఏ మనిషికైనా ఇలాంటి భావన తక్షణమే కలగడం సహజం; అర్జునుడి విషయంలోనూ అదే జరిగింది. ఇది ఒక రకమైన మానసిక స్థితి (లేదా అశాంతి). ఎప్పుడైతే ఒక వ్యక్తి తన అజ్ఞానాన్ని జయించి ఆత్మజ్ఞానాన్ని పొందుతాడో, అప్పుడు ఈ అశాంతి తొలగిపోయి మానవాళికి శాంతి, సంతోషం మరియు దుఃఖరాహిత్యం లభిస్తాయి. దీని ప్రాముఖ్యతను గుర్తించిన శ్రీకృష్ణుడు, అర్జునుడికి ఆత్మజ్ఞానం కలిగేలా చూశాడు; తద్వారా త్రికరణశుద్ధిగా గీతను ఆచరించడం ద్వారా మనమందరం కూడా ఆ జ్ఞానాన్ని పొందే అవకాశం కల్పించాడు.
ఈ దశలో అర్జునుడు శ్రీకృష్ణుడిని కేవలం తన మిత్రుడిగా భావించాడు, అందుకే తన బాధను, దుఃఖాన్ని బహిరంగంగా వ్యక్తపరిచాడు మరియు ఈ యుద్ధాన్ని విరమించుకుందామని సూచించాడు. శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు అనే విషయం అతనికి అస్సలు తట్టలేదు. ప్రాణం, సంపద, స్నేహితులు లేదా బంధువులను కోల్పోతామనే భయంతో లేదా ‘అంతా నాదే, నావారే’ అనే భావనతో మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటి స్థితి కలగడం మనలో చాలా మందికి సహజమే.
జై శ్రీకృష్ణ
ధర్మో రక్షతి రక్షితః