పంచ పాతకములు
Dharma Vaani – K C Das Memorial Charitable Trust
మనోవాక్కయ కర్మలు అంటుంటాము సాదారణముగా. అంటే కర్మ చేసేటప్పుడు మానవుడు ముందు మనస్సుతో చేస్తాడు ఆలోచన “ఇదొక పని చేద్దాము”, అది పాపమైన పుణ్యమైన. ఆ తరువాత అతనికి వాక్కు యొక్క అవసరం ఏర్పడుతుంది. ఈ పని చేద్దాము అని ఆలోచన చేస్తాడు, అవసరమైతే ఎవరితోనైనా అబద్దం చెప్తాడు ఆ పని కోసం.
ఉదాహరణకు ఏదో పొందాలనుకున్నాడు అంటే, ఆ పొందటం కోసం అబద్ధము చెప్తాడు, అంటే వాక్కుతో పాపం చేసాడు. ఆ తరువాత పొందకూడనిటువంటిది, అవసరంలేనటువంటిది, అధికారం లేనటువంటిది, అన్యాయమైనటువంటిది పొందుతాడు, దానికి చేతులు వాడతాడు. ఇప్పడు ఒక పాపం చెయ్యటానికి మనస్సు వాడాడు, చేతులు వాడాడు, వాక్కు వాడాడు, కాళ్ళు వాడాడు (కాళ్లతో వెడతాడు కద), చెవులు వాడాడు (ఇతరులు చెప్పింది వింటాడు కావున). అందుకని ఈ ఇంద్రియాలని జాగర్తగా వాడుకోండి అంటాడు భగవంతుడు.
మనము ఒక పళ్ళ డాక్టర్ దగరికి వెళితే, ఒక్కో పన్ను వేలల్లో ఉంటుంది అంటాడు. 32 పళ్లకు చికిత్సకు అయ్యే ఖర్చు లక్షలోనే ఉంటుంది. ఆలా మన శరీరములో ఉండే అన్ని భాగాలు కొని కోట్ల విలువైనవి. కానీ మనము అది లేదు, ఇది లేదు అనుకుంటాము. అది మానవ నైజం. పరులకు కీడు తలపెట్టడం మనస్సు చేసే పాపం, ఎదుటివ్యక్తికి ఎప్పుడు పొరపాటున కూడా కీడు తలపెట్టకూడదు. అవకాశం ఉన్నంత వరకు ఇతరులకు మేలే తలపెట్టాలి. ఇతరులకు కీడు తలపెట్టాలి అనే ఆలోచన కూడా మనస్సులోకి రానీయకూడదు, లేదంటే అది మనస్సుతో చేసిన పాపం అవుతుంది, ఆ పాపాన్ని మనస్సుతోనే అనుభవించాలి. అందుకే కొంతమంది అన్ని ఉన్నా కానీ మనస్సంతి లేదు అంటుంటారు. వారికి డబ్బు, అధికారం, సంపద, రాజకీయం, తోటలు అన్ని ఉంటాయి, కానీ మనశాంతి మాత్రం ఉండదు. దానికి కారణం వారు గతజన్మలో తమ మనస్సుతో చేసిన పాపం.
అలాగే నోటితో చేసిన పాపాలు పరులను నిందించటం, చాడీలు చెప్పటం, ఒకరిని తక్కువచేసి మాట్లాడటం, వీటిని పరనింద అంటారు. అది మమపాపం. ఇవి నోటితో చేసే కొన్ని పాపాలు. అవినీతి సొమ్ము తీసుకోవటం చేతులతో చేసే పాపం. కొంతమంది ఇతరుల ఇంట్లో నుంచి వస్తువులను దొంగతనముగా తీసుకోకపోవచ్చు, కానీ కొన్ని సందర్భాలలో అది కూడా పాపమే అవుతుంది. ఉదాహరణకు ఇతరుల ఇంట్లో నుంచి ఇక పుస్తకము తీసుకున్నా, లేక మరేదైనా ఒక వస్తువు తీసుకున్నా (అది వారికి తెలిసి కానీ, తెలియక కానీ) వారు దానిని మనస్ఫూర్తిగా అంగీకరించాలి. కొంతమంది ఇతరులను బలవంతపెట్టి, వారి ఇంట్లో నుంచి వస్తువులను తీసుకుంటారు. అది కూడా పాపమే.
అలాగే స్వార్థపరులతో తిరగద్దు అంటుంది శాస్త్రం. ఆలా తిరిగితే అది శరీరముతో చేసిన పాపం. అందుకనే ‘పరోపకారం ఇదం శరీరం’, అని తరుచు గుర్తుంచుకోవాలి అంటుంది శాస్త్రం. “నా గురించి నేను బతకటం కాదు, పదిమంది కోసం నేను ఏమి చెయ్యగలను అనే ఆలోచన చెయ్యాలి”, అన్నారు పెద్దలు. స్వామి వివేకానంద తన బోధనలలో మనకు పరోపకార విషయమై వివరిస్తూ, “కేవలం తన గురించి ఆలోచిస్తూ, తన కోసం మాత్రమే జీవించే మనిషి, చివరికి తనకవసరమైన నాడు తనకంటూ ఎవరు లేకుండా ఒంటరిగా మిగిలిపోతాడు”, అంటారు. స్వార్థపరులతో తిరగటం కాళ్ళు చేసిన పాపం.
చివరిగా పరనిందలు వినటం చేతులు చేసిన పాపం. ఇది చాలా మందికి ఇష్టం, పరులను నిందిస్తూ ఉంటే వారి చెవులకు ఎంతో ఆనందముగా ఉంటుంది. కానీ ఇది మహాపాపం.

మనస్సుతో చేసే పాపమైనటువంటి పరులకు కీడు తలపెట్టడం, నోటితో చేసే పాపమైనటువంటి పరులను నిందించటం, చేతులతో చేసే పాపమైనటువంటి పరుల సొమ్ము హరించటం కానీ, కాళ్లతో చేసే పాపమైనటువంటి స్వార్థపరులతో తిరగటం గాని, చెవులతో చేసే పాపమైనటువంటి పరనింద వినటం గాని పంచపాతకాలు అంటారు. వీటికి దూరముగా ఉండటం మనకి శ్రేయస్కరం.