కర్మణ్యేకం మనస్యేకం
Dharma Vaani – K C Das Memorial Charitable Trust
మనకి ఒక విశేషమైనటువంటి సందేశాన్ని, ఒక ఆదేశాన్ని, ఒక మార్గనిర్దేశాన్ని ఒక శ్లోక రూపములో గీత అందిస్తుంది. “కర్మణ్యేకం మనస్యేకం వచస్యేకం మహాత్మనః| మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనః”. మహాత్ముడుగా మారాలంటే అందుకు మనకు ఏ లక్షణాలు కావాలో, ఏ గుణాలు కావాలో, అలవర్చుకోవాలో, ఆ లక్షణాలను చాలా తేలికైన మాటలలో, చాలా తేలికైన పదాలలో ఈ శ్లోకము చెపుతుంది.
మనస్సులో ఏమ్మునదో అదే మాట బయటకి చెప్తూ, అదే పని చేస్తూ ఉండేవాడు మహాత్ముడు. దురాత్ముడు (దుర్మార్గుడు) ఎవరు అంటే మనస్సులో ఒకటి పెట్టుకొని, బైటికి ఒకటి మాట్లాడుతూ, చేసేది మరొకటి అయితే అటువంటి వాడు దురాత్ముడు (దుర్మార్గుడు) అంటుంది. కాబట్టి మహాత్ముడు కావాలంటే పెద్ద కష్టమైన విషయమేమి కాదు, మనస్సులో ఏమున్నదో దాన్నే చేస్తూ ఉండు. “నా మనస్సులో ఏముందో చెప్తే ప్రమాదం కదండి”, అంటుంటారు కొంతమంది. అటువంటి ప్రమాదం అనిపించినప్పుడు మాట్లాడకుండా ఉండటం ఉత్తమం.
మనస్సులో ఒకటి పెట్టుకొని, పైకి మరొకటి మాట్లాడటం లేదా చెప్పిన పని చెయ్యకుండా ఉండటం ప్రమాదం. ఎందుకంటే ఏ మాట అంటామో, ఆ మాటకు తగ్గ క్రియ కూడా ఉంటే తప్ప ఆ మనిషికి, ఆ మాటకు, ఆ క్రియకు విలువ ఉండదు, సమాజం గుర్తించదు. కాబట్టి విలువ పెంచుకునే విషయం ఏమిటంటే ‘కర్మణ్యేకం మనస్యేకం వచస్యేకం’. మనము ఎందరు మహాత్ముల చరిత్రలు చూసినా ఒక మాట అన్నారు అంటే ఆ మాట నిలబెట్టుకుంటారు, ఆ మాట కోసం ఎన్ని కష్టాలు వచ్చినా పడతారు. ఉదాహరణకు రామాయణం గనుక చూస్తే, శ్రీరాముడు ఒక మాట అన్నాడు అంటే ఆ మాట మీద తప్పక నిలబడి తీరుతాడు అని వాల్మీకి మహర్షి పేర్కొంటారు. ‘కర్మణ్యేకం మనస్యేకం వచస్యేకం’ కు ఒక చకాన్ని ఉదాహరణ శ్రీరాములవారు.
‘కర్మణ్యేకం మనస్యేకం వచస్యేకం’ అంటే ‘ఏ మాట మాట్లాడితే దానికి కట్టుబడి ఉండాలి గనుక ఆలోచించి మాట్లాడటం నేర్పిస్తుంది.’ ఈ శ్లోకము గనుక మనము సరిగా అర్థం చేసుకుంటే ఎలా పడితే అలాగా, ఏది పడితే అది, ఏది తోస్తే అది మాట్లాడటం మానేస్తాడు. ఆలోచించి మాట్లాడటం మొదలుపెడతాడు. అప్పుడు మితభాషిత్వం వస్తుంది. ఆ మితభాషిత్వం నుండి అన్న మాట నిలబెట్టుకుంటాడు అనే పేరు ప్రఖ్యాతలు కలిగి, సమాజములో గుర్తించబడతాడు, తద్వారా మహాత్ముడు అవుతాడు.
అదే ఒక మాట చెప్పి, ఒక ఆలోచన చేసి, ఒక పని చేసేటటువంటి వ్యక్తి, కొన్ని కొన్ని సందర్భాలలో ఆలోచనలు బయటకు వస్తాయి, మాటలు బయటకు వస్తాయి, చేసిన పనులు కనపడతాయి. దీనికి దానికి లంగరు అందాక, పొంతన లేక మనిషి నవ్వులపాలు అయ్యే ప్రమాదం ఉన్నది, కీర్తిని పోగొట్టుకుని, అప్రదిష్ట పాలయ్యే ప్రమాదం ఉన్నది. కనుక మనస్సులో ఏమనుకుంటున్నామో అదే చెయ్యాలి. అలా అని ఎదుటి వ్యక్తికి కష్టం కలిగించే మాటలు మాట్లాడకూడదు అని శాస్త్రం పేర్కొంటోంది.

త్రికరణ శుద్ధి అంటే ”కర్మణ్యేకం మనస్యేకం వచస్యేకం”. మనోవాక్కాయములు అంటాము. మనస్సు, వాక్కు, శరీరానికి సహకరించే ఇంద్రియాలు ఇత్యాదివన్నీ కూడా ఒక లంగరులో తీసుకువచ్చి, ఒక క్రమ పద్దతిలో నడిపిస్తే, వారు మహాత్ములు అవుతారు. అది లేని నాడు, ఈ మూడింటిలో ఏ ఒక్కటి క్రమపద్ధతిలో లేని నాడు, అంటే చేసే ఆలోచన, చెప్పే మాట, చేసే క్రియ, ఈ మూడు కూడా కలవనప్పుడు, మూడింటిలో ఏ ఒక్కటి తేడా వచ్చినా, అది చాలా చాలా చాలా ఇబ్బందిగా కనిపిస్తుంది అవతలి వ్యక్తులకు. ఆ చేసినటువంటి వ్యక్తి సమాజములో తన కీర్తిని కోల్పోతాడు. కనుక మనస్సులో ఏమి ఆలోచిస్తున్నామో, అదే చేద్దాము, ధర్మమార్గములో నడుద్దాము. ధర్మస్య విజయోస్తు.