Skip to navigation
K C Das Memorial Charitable Trust
Donate
  • Home
  • About
  • Library
    • Dharma Vaani
    • Sri Lalitha Sahasra Naamavali
    • Dharmavaaradhi e-Magazine
    • Guru Vaani
    • Saradamba TV (Grandly Launched)
  • Dharmika Programs
    • All programs
    • Hanuman Chalisa
    • Gayathri Japam
    • Bala Japam
    • Calendar
  • Spiritual Education
  • Community Welfare
  • Contact
Donate
  • Instagram
  • YouTube
  • Facebook
  • Instagram
  • YouTube
  • Facebook
Donate

కోపం

Dharma Vaani – K C Das Memorial Charitable Trust

మనకి సనాతన ధర్మంలో ప్రతి దానికి ఒక అధిష్టాన దేవత ఉంటారు. ఆలా కోపానికి కూడా ఒక అధిష్టాన దేవత ఉన్నారు. “మామన్యుశ్చ, మన్యుపతయశ్చ, మన్యు॑కృతే॒భ్యః ।
పాపేభ్యో॑ రక్షం॒తామ్”, అని సంధ్యావందనములో ప్రార్దిస్తుంటాము. “ఓ కోపది దేవతలారా! నేను కోపానికి లోబడి చేసిన కర్మల యొక్క పాపాల నుంచి నన్ను రక్షించేదరు గాక”, అని మనము సంధ్యావందనములో ఆ కోపాది దేవతలను వేడుకుంటాము.

మనిషి పాపాలు చెయ్యటానికి కారణాలు రెండు విషయాలు అని శాస్త్రం పేర్కొంటోంది. ఏమిటా రెండు అంటే మొదటిది కోరిక, రెండవది కోపం. మొదట కోరిక పుడుతుంది, ఆ కోరిక తీర్చుకోవటానికి, “అన్యాయముగా అయినా సరే సంపాదించి ఆ కోరిక తీర్చుకుందాము”, అనే ఆలోచన వస్తుంది. ఆ కోరిక తీరకపోతే, ఆ తీరకుండా ఉన్న కారణాల మీద గాని, పరిస్థితుల మీద గాని, వ్యక్తుల మీద గాని కోపం వస్తుంది. కాబట్టి కోపము, కోరిక. ఈ రెండు కకారాలు మనిషిని వికారాలు వైపు తీసుకెళ్లాయి, పాపాల్ని చేయిస్తాయి.

కర్మసిద్ధాంతాన్ని అనుసరించి మనము ఏదన్నా పని చేస్తే (సుకర్మ, వికర్మ, అకర్మ), ఆ పనికి ఫలితం వచ్చి తీరుతుంది. అది మంచి పని కావచ్చు, చెడ్డపని కావచ్చు. మంచి పని చేస్తే పుణ్యం వస్తుంది, చెడ్డ పని చేస్తే పాపం వస్తుంది. పూర్తిగా పుణ్యం ఉంటే భగవంతుడు అయిపోతాడు, దేవతలలో ఒకరిగా పుట్టేస్తాడు. పూర్తిగా పాపం ఉంటే వెనక్కి వెళ్ళిపోతాడు. పాప పుణ్యాలు రెండు ఉంటేనే ఆ పాప పుణ్యాల సమాహారమే మానవ జన్మ.

మానవజన్మ ఎత్తిన తరువాత పాపపుణ్యాలు రెండు కలుపుకొని పుడతాము అందరము కూడా. అయితే మనిషి యొక్క ప్రజ్ఞ ఎక్కడ ఉంటుంది? పుణ్యం సంపాదించుకోవడానికి మనకు అనేక మార్గాలు ఉన్నాయి అయితే పుణ్య సముపార్జనతో పాపాలను పోగొట్టుకోలేము. పుణ్యం వలన ఏమి లభిస్తుంది? సుఖము, సంతోషము, ఆనందము. కానీ పాపము అలాగే ఉంటుంది. పాపము వలన దుఃఖము, దారిద్య్రము , బాధ, మనః శాంతి లేకపోవటం, రోగాలు ఇత్యాదులన్నీ లభిస్తాయి. మనిషి యొక్క ప్రజ్ఞ ఎక్కడుంటుంది అంటే పాపాలను తగ్గించుకొని, పుణ్య కర్మలను పెంచుకొని వెళ్ళాలి.

ఇప్పుడు పాపాలను తగ్గించుకోవటానికి వేరే కర్మలను చెప్పలేదు శాస్త్రం. ప్రాయశ్చిత్త కర్మలు అని కొన్ని కర్మలను శాస్త్రం పేర్కొన్నా, అవి అన్ని పాపాలను పోగొట్టలేవు. కర్మలలో నిత్య కర్మ, నైమిత్తిక కర్మ, కామ్య కర్మ, నిషిద్ధ కర్మ అని రకరకాల కర్మలు ఉంటాయి అని శాస్త్రం పేర్కొంటోంది. కాబట్టి ఏ రోజు చేసిన పాపం ఆ రోజే పోగొట్టుకోవడానికి మార్గము ఈ నిత్యకర్మలలో భాగంగా చెప్పారు మనకి. పాపాలు పోగొట్టుకుంటే కష్టాలు తగ్గుతాయి. పాపాలకు ముఖ్య కారణం కోపం. కాబట్టి కోపాన్ని తగ్గించుకోవాలి అని పెద్దలు పేర్కొంటారు.

అయితే మనిషి అన్నాక కోపం రాకుండా ఉంటుందా? “ఉప్పు, కారం” తింటున్నాము కనుక కోపం రాకుండా ఉండదు. ఎవరో ఏదో చేస్తారు, మనకి కోపం వస్తుంది. కోపం రావటం సహజం కానీ వచ్చిన కోపాన్ని నిగ్రహించుకోగలగాలి. “ఉత్తమే క్షణిక:కోప: | మధ్యమే ఘటికాద్వయమ్‌ | అధమే స్యాత్‌ అహోరాత్రం | పాపిష్టే మరణాన్తక: ||”, అని నీతి శాస్త్రం పేర్కొంటోంది. ఉత్తముడైనవాడికి కోపం వచ్చినా క్షణములో కోపం పోగొట్టుకుంటాడు. తాటాకు మంట ఎలా అయితే వెంటనే చల్లారి పోతుందో, అలాగే ఉత్తముడి కోపం క్షణములో పోతుంది. రెండు ఘడియల్లో గనుక కోపాన్ని పోగొట్టుకోగలిగితే వారు మధ్యములు.

సుమారు ఒక గంటసేపు కోపాన్ని కలిగి ఉండి తనను తాను సంబాళించుకొని, తన కోపానికి కారణమైన వారిని క్షమించగలిగితే (పోన్లే ఏదో అజ్ఞానముతో చేసాడు, తెలియక చేసాడు, చిన్నవాడు, పసివాడు తెలియదు కనుక చేసాడు, వాడి పాపాన వాడే పోతాడులే) వాడు మధ్యముడు అన్నారు. అదే ఒకరోజంతా కోపాన్ని పెట్టుకొని కనుక ఉంటే వాడు అధముడు అన్నారు. కొంతమంది మాత్రం తాము మరణించేదాకా కోపాన్ని పెట్టుకొని ఉంటారు. అట్టివారు నీచులు అంటుంది శాస్త్రం. ఉదాహరణకు, “ఎప్పుడో 1996 వ సంవత్సరంలో జరిగినదానికి 2026 లో కూడా కోపాన్ని మనస్సులో పెట్టుకోవటం”. ఇలాంటి వాటి వలన ఎవరికి ఏ ప్రయోజనం ఉండదు.

మనిషికి లోపల తనను తాను పాడుచేసేది కోపం. “క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః | స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి ||”, అని గీతా వాక్యం. కోపం వస్తే బుద్ది నశిస్తుంది. అందుకనే మీరు గమనించండి కోపంలో ఉన్నటువంటి వారు గట్టిగా అరుస్తూ ఉంటారు. ‘ఎందుకంత గట్టిగా అరుస్తున్నావ్? నేను పక్కనే ఉన్నాను కదా”, అంటాడు అవతల వ్యక్తి. ఎక్కడ ప్రేమ ఉన్నదో అక్కడ ఆనందంగా గడుపుతూ ఉంటారు. కోపం ఉన్నచోట ద్వేషం అంటుంది. ఎక్కడ ద్వేషం ఉంటుందో అక్కడ గొంతు లేస్తుంది, అరుస్తూ ఉంటాడు. తనను తాను నియంత్రణ కోల్పోతాడు మనిషి కోపానికి లోనైనప్పుడు.

కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి అని శాస్త్రం పేర్కొంటోంది.

K C Das Memorial Charitable Trust

Paropakarardham Idam Sareeram

  • Instagram
  • YouTube
  • Facebook
Address
H.No. 11-13-119, 14/B, Road No. 3, beside Axis Bank, Alkapuri Colony, Ramakrishnapuram, Kothapet, Hyderabad, Telangana 500035
View on map
Contact
contact@kcdastrust.org
+91 94948 77070
04:00 PM to 08.30 PM IST

© 2026 K C Das Memorial Charitable Trust. All rights reserved.

Terms and ConditionsPrivacy Policy