కష్టం
Dharma Vaani – K C Das Memorial Charitable Trust
కష్టానికి నిర్వచనం ఎంత పెద్దగా చెప్పినా, అది ఎంత పెద్ద కష్టం అయినా సరే మనిషి మానసికముగా దానికి సిద్దపడి పోతాడు. “వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే”, అని గీతా వాక్యం. దుఃఖం కలిగినప్పుడు ఊరికే దిగులు పడిపోకండి, అలాగే సుఖము కలిగినప్పుడు ఊరికే సంతోషపడిపోకండి. చిన్న కష్టానికి, పెద్ద కష్టానికి ఊరికే దిగులు పడిపోయి, ఇబ్బంది పడిపోయి, మనస్సులో ఆలోచనా శక్తిని పోగొట్టుకుంటాము. (శోకో నాశయతే సర్వము – శోకముతో ఏమి సాధించలేము, సర్వము కోల్పోతాము) అటువంటి శోకస్థితిని పొందకుండా ఉంటే మనిషి ఎప్పుడూ కూడా నిబ్బరముగా ఉంటాడు, నిశ్చలముగా ఉంటాడు.
“సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్త్వం నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః”, అన్నారు శ్రీ శంకరాచార్యులు ‘మోహ ముద్గర స్తోత్రంలో’. మొహం అంటే భ్రాంతి, మాయ. ఏమిటా భ్రాంతి అంటే ఆంతా భ్రాంతే. పంచభూతములు మాయ, బానిసత్వము మాయ, మరణించినట్టు ఈ మనిషి మాయ, ఇంద్రియములు మాయ, ఇంటిచూపులు మాయ, పురుషుండు అనయగా పూర్తి మాయ అన్నాడొక కవి.
కాబట్టి ఈ మాయలోనే ఉన్నాము మనము అనే ఆలోచన కలిగితే అసలు కష్టం అనిపించదు. కానీ కష్టానికి కారణం ఏమిటంటే ‘కాలోతి దురతిక్రమనః’ అంటారు. ఎంతటి వారైనా సరే కాలాన్ని జయించలేరు.

ధర్మాత్ములకు కూడా కష్టాలు ఉంటాయి. చాలా మందికి ఉండే ప్రశ్న ఏమిటంటే ‘ఆయన ధర్మాత్ముడు కదా? ఆయనకు కష్టాలు ఎందుకు?’ ఎందుకంటే వారికి అది కష్టం అని అనిపించదు కనుక. ధర్మములో ఉన్నవారికి, ధర్మానుష్ఠానపరులకు తాము ఎదుర్కొనే కష్టాలకు కారణం ‘కాలోతి దురతిక్రమనః’ అనే గ్రహింపు ఉంటుంది, ఆ కష్టాన్ని వారు కష్టముగా భావించరు. ఉదాహరణకి ఒక పిల్లవాడు రాత్రి మేల్కొని చదువుతునప్పుడు అతని తల్లి, “ఎందుకు నాయనా అంత కష్టపడుతున్నావు”, అంటుంది. అలాగే ఉద్యోగములో కష్టపడుతునప్పుడు కూడా, “ఎందుకొచ్చిన కష్టమురా మనకి”, అంటుంది. అది తల్లి ప్రేమ. కానీ ఆ పిల్లవాడు ఆ కష్టాన్ని ఇష్టముగా భరిస్తున్నాడు కావున అతనికి అది ఒక కష్టం అనిపించదు. కాబట్టి ఎక్కడైతే ఇష్టం ఉంటుందో అక్కడ కష్టం ఉండదు.
ఇష్టానికి, ధర్మానికి సంబంధం ఏమిటి అంటే ఇష్టముగా ధర్మానుష్ఠానం చేస్తున్న వారికి ”కాలోతి దురతిక్రమనః” అని బలముగా నాటుకుపోతుంది. ధర్మం అంటే ఏమిటి? “నా బుద్దిని సక్రమమైన మార్గములో ప్రవేశపెట్టు తల్లి, దాంట్లో నిలబెట్టు. నా బుద్దిని ఎప్పుడు ధర్మము వైపే ఉండేలా చెయ్యి”, అని గాయత్రీ మంత్రం రూపేణా ఆ తల్లిని ధ్యానిస్తున్నాము. ఆలా చేస్తే ఉపయోగం ఏమిటి అంటే ‘నేను ధర్మం వైపే ఉన్నాను గనుక నాకు ఏ ఇబ్బంది రాదు’, అనే ఆత్మస్థయిర్యం ఏర్పరుడుతుంది. ‘నన్ను నా ధర్మమే కాపాడుతుంది’ అనే దైర్యం కలుగుతుంది. ఆ ధైర్యముతో ఏ కష్టానైనా తట్టుకునే మనఃప్రవృత్తి వస్తుంది. దానివలన ఆ కష్టం వచ్చినా ధైర్యముగా ఉంటాడు. కొంతకాలము తరువాత ఆ కష్టం పోతుంది. ఆలా మానవుడు ఎప్పుడు ఆనందముగా జీవించగలుగుతాడు.