గణపతి తత్త్వం – 3
వినాయక చవితి సందర్భముగా గణేశ తత్త్వం గురించి పూజ్య గురుదేవుల మాటల్లో తెలుసుకుందాము.
‘గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమమ్ । జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్నూతిభిః సీద సాదనమ్’, అని ఆ మహాగణపతిని మనము కీర్తిస్తాము. ‘(ఓ బృహస్పతీ!) గణములకు నీవు గణపతివని, కవులలో నీవు కవివని, ఉపమ శ్రవులందు ఉత్తముడవని, జ్యేష్ఠరాజువని, బ్రహ్మణములకు నీవు బ్రహ్మణస్పతివని, మా ప్రార్థనలు విని మమ్ము బ్రోచుటకు యజ్ఞ సదనమందు ఆసీనుడవు కమ్ముని ఆహ్వానించుచున్నాము!’, అని ఈ శ్లోకము యొక్క భావం. గణాలు అంటే ఎవరు అనేది ఒక ప్రశ్న? గణాలు అంటే దేవగణాలు అనేది మనకు తెలిసిన సాధారణ భావం. గణాలు అంటే ‘మానవులు, జంతువులు, భూతాలు ఇత్యాది సమస్త గణాలు’, అని అసలు అర్థం. సర్వ గణాలకు అధిపతి ఆ గణనాయకుడే, వినాయకుడే.
‘గణాలు’ అంటే సమూహము అని అర్థం. గణనాయకుడు అనే ఒక సమూహానికి నాయకుడు. అయితే గణాలు అంటే మన కంటికి కనిపించే వివిధ సమూహము మాత్రమే కాదు. గణాలను విభజించుకుంటూ వెళితే కణాల రూపములో, పంచభూతాల రూపములో, ఇంద్రియాల రూపములో (ఇంద్రియ గణములు) మన శరీరము లోపల కూడా అనేక గణ సమూహాలు ఉన్నాయి. వాటికీ అధిపతి కూడా ఆ వినాయకుడే. ‘గణపతి ఎక్కడో లేడయ్యా, నీలోనే ఉన్నాడు, ప్రతి ఒక్కరిలోనూ గణపతి ఉన్నాడు’, అని శాస్త్రం పేర్కొంటోంది. ప్రతి ఒక్కరి శరీరములో ఉన్న గణసమూహాలకు (ఇంద్రియాలు, పంచభూతాలు) వారే గణపతులు అని శాస్త్రం పేర్కొంటోంది. ‘మనలోనే గణపతి ఉన్నాడు అన్న సృహతో ఉంటూ, పాపకర్మలకు దూరముగా ఉంటూ, ధార్మిక మార్గములో జీవనం సాగించాలి అని తెలుపటమే’ గణపతి తత్త్వం.
గణపతి అంటే శివపార్వతుల కుమారుడు అని మనము వినాయకవ్రతకథలో చదువుకున్నాము. అయితే అది గణపతికి ఉన్న ఒక రూపం మాత్రమే. గణపతికి ఉన్న అనేక విశిష్ట రూపాలలో 32 రూపాలు ప్రధానమైనవని మంత్రశాస్త్రం పేర్కొంటోంది. ఒక్కొక గణపతికి ఒక్కొక మంత్రం, ఒక్కొక తర్పణ విధానం, ఒక్కొక పూజా విధానం ఉన్నది. వేరు వేరు సందర్భాలలో ఆయా గణపతుల ఆవిర్భావం జరిగింది అని పురాణాలు పేర్కొంటున్నాయి.
అసలు గణపతి ఎలా ఆవిర్భవించాడు అని ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఒకానొక సమయంలో జగన్మాత ఆదేశానుసారం బ్రహ్మదేవుడు సృష్టి చేయడానికి పూనుకోగా, ఆయనకు అనేక విఘ్నాలు, అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. ఎంత ప్రయత్నించినా ఆయన కార్యం ముందుకు కదల్లేదు. అప్పుడు బ్రహ్మదేవుడు, జగన్మాతను ప్రార్థించగా ఆ తల్లి బ్రహ్మదేవునికి ప్రణవనాదం జపించమని ఆదేశించింది. జగదంబ ఆదేశానుసారం బ్రహ్మ ప్రణవం జపిస్తూ తీవ్రమైన తపస్సు చేశాడు. ఎన్నో దివ్యసంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత, ప్రణవం గణపతిగా సాక్షాత్కరించి, సృష్టి కార్యములో ఏర్పడిన విఘ్నాలను తొలగించాడు. బ్రహ్మకి సాక్షాత్కరించి ఏర్పడిన ఆ తొలి వినాయక రూపమే ‘ఆది గణపతి’ (ప్రణవ స్వరూప వినాయక) రూపం.

భాద్రపద శుద్ధ చవితి నాడు పార్వతీ మాత చేత శ్రీ గణేశుడి సృష్టించబడటానికి పూర్వం నుంచి కూడా ఆయన ఉన్నాడు. శివపార్వతుల కల్యాణంలో కూడా గణపతిని పూజించారు. అంటే గణపతి ఈనాటి వాడు కాదు. ఆయన సాక్షాత్తు పరబ్రహ్మము. వినాయకుని మరో రూపం “క్షిప్ర గణపతి.” క్షిప్ర అంటే ‘వెంటనే’. ‘కలౌ చండీ వినాయకః’ అంటే ‘ఈ కలియుగమున పిలవగానే పలికే దేవతలు చండి (దుర్గా), గణపతి’, అని అర్థం. అందుకే స్వామిని “క్షిప్ర గణపతి.” అంటారు. లక్ష్మి గణపతి, వల్లభ గణపతి ఇలా వేరు వేరు గణపతులు మనకి శాస్త్రం పేర్కొంటోంది.
మనకు అందించిన రూపం ఇప్పుడు మనము పూజిస్తున్న గజముఖం కలిగిన రూపం. గణపతికి వేల నామాలు ఉన్నాయి. అందులో షోడశ (16) నామాలు అతి విశిష్టమైనవి. అందులో మొదటి నామం ‘సుముఖుడు.’ ‘మంచి ముఖం కలిగిన వాడు’, అని ఈ నామానికి అర్థం. అయితే ఇక్కడ మనకు ఒక సందేహం కలుగవచ్చు. గణపతి ఏనుగు ముఖం కలిగినవాడు కదా అని? ఏనుగు ముఖము లక్ష్మిప్రదమైనదని శాస్త్రం పేర్కొంటోంది. ప్రతి రోజు ఏనుగు ముఖం దర్శించటం అత్యంత శుభప్రదం. ‘గజ పూజ’ అని ఆలయాలలో చేస్తుంటారు. గణపతి షోడశ నామాలలో తొలి నామములో ‘మంచి ముఖము కలిగినవాడు’ గా మనము గణపతిని కీర్తిస్తున్నాము.
ఆ తరుపరి నామం ‘ఏకదంతం.’ ఏకదంతం అంటే ‘ఒకటే దంతం ఉన్నవాడు’ అని అర్థం. ఇక్కడ మనకు పురాణాల్లో వేరు వేరు గాధలు కనిపిస్తాయి. రాక్షసంహారం కోసం గణపతి తన దంతాన్ని ఉపయోగించాడని ఒక గాథ, ఒక సందర్బములో గణపతి పరశురామునితో యుద్ధం చేసాడని, పరశురాముడు గణపతిపై తన పరశువు ఉపయోగించాడని, ఆ పరశువుకి గణపతి తన దంతాన్ని అర్పించాడని మరొక కథ. ఇలా గణపతిని గురించి వేరు వేరు యుగాల్లో వేరు వేరు కథనాలు మనకి కనిపిస్తాయి.
కాశీక్షేత్రములో మనకు ‘చప్పన్ గణపతి’ అని 56 గణపతులు దర్శనమిస్తారు. 8 ఆవరణాలతో, ఒక్కొక్క ఆవరణానికి 7 గణపతులు కలిగిం ఉండి కాశీలో అనేక రూపాలలో కొలువై ఉంటాడు గణపతి. గణపతి అంటే శివ పార్వతుల కుమారుడు మాత్రేమే కాదు. గాణాపత్యము అని విశేషముగా గణపతిని పూజించే మతము ఉన్నది. భగవంతుడు అంటే ఒక శక్తి. ఒకే భగవత్ శక్తి మనకు అనేక రూపాలలో దర్శనమిస్తోంది. అటువంటి శక్తిస్వరూపమే గణపతి.
‘శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ – ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే’, అని మనము వినాయకుని స్తుతిస్తాము. ‘తెల్లని వస్త్రములు ధరించెడివాడు. విష్ణుమూర్తితో సమానుడు. శశియనగా చంద్రుడు. చంద్రవర్ణము కలవాడు. అనగా తెల్లనివాడు. చతుర్భుజుడు నాలుగు భుజములు కలవాడు. ఆయన ప్రసన్నవదనుడు. సర్వవిఘ్నములు ఉపశమించుట కొరకు ఆ గణపతిని ధ్యానించవలయును’, అని ఈ స్తుతి యొక్క అర్థం. ఈ స్తుతిలో మనము ఎక్కడ గణపతి అనే నామము చెప్పలేదు. మనము గమనిస్తే ఈ శ్లోకములో విష్ణు నామము చెప్తున్నాము. భగవంతుడు ఒక్కడే అని ఈ శ్లోకం మనము తెలియజేస్తోంది.

మనకు కలిగే విఘ్నాలు తొలగించటమే కాదు, వాటిని కల్పించేవాడు కూడా గణపతియే. కొన్ని కొన్ని సంధర్భాలలో విఘ్నాలు కలగటమే మనకు మంచిది. మనకు తెలియకపోవచ్చు, విఘ్నం కలిగింది కదా అని మనము బాధపడవచ్చు కూడా, కానీ అంతిమంగా ఆ విఘ్నం మన మేలు కొరకు ఆ స్వామి కల్పించినదే ఆవుతుంది. ఉదాహరణకు ట్రాఫిక్ జాం వల్ల సమయానికి ఒక వ్యక్తి రైలు ఎక్కలేకపోయాడు, ఆ తరువాత కొద్దిసేపటికే ఆ వ్యక్తి ప్రయాణించాల్సిన రైలు ప్రమాదానికి గురైందని అతనికి తెలుస్తుంది. ఇక్కడ ఆ వ్యక్తి ఎదురైనా విఘ్నం వల్ల అతనికి అంతిమంగా మంచే జరిగింది. ఇలా విఘ్నాలు కలిగించి మనము తెలియకుండా మనలను రక్షిస్తూ ఉంటాడు ఆ వినాయకుడు. ఎవరికి ఎప్పుడు ఎలా విఘ్నాలు కల్పించాలో అప్పుడు అక్కడ వాటిని ఆలా కల్పిస్తూ ఉంటాడు, వాటిని అలాగే తొలగిస్తూ ఉంటాడు.
మనము ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో విఘ్నము కలుగకుండా ఉండాలని మనము సంకల్పం చెయ్యాలి. చిత్తశుద్ధితో మనము ఆ స్వామిని ప్రార్థిస్తే ఆ విఘ్నము తప్పక తొలగిస్తాడు లేదా విఘ్నము కలిగించి మనకు తెలియని ఆపదను నివారిస్తాడు. వినాయకుడు అందరివాడు. పిల్లలతో సహా సర్వుల పూజలు అందుకునే వాడు వినాయకుడు. ధర్మవారధి పాఠకులందరికి వినాయకచవితి శుభాకాంక్షలు. ధర్మస్య విజయోస్తు.