Skip to navigation
K C Das Memorial Charitable Trust
Donate
  • Home
  • About
  • Library
    • Dharma Vaani
    • Sri Lalitha Sahasra Naamavali
    • Dharmavaaradhi e-Magazine
    • Guru Vaani
    • Saradamba TV (Grandly Launched)
  • Dharmika Programs
    • All programs
    • Hanuman Chalisa
    • Gayathri Japam
    • Bala Japam
    • Calendar
  • Spiritual Education
  • Community Welfare
  • Contact
Donate
  • Instagram
  • YouTube
  • Facebook
  • Instagram
  • YouTube
  • Facebook
Donate

హనుమద్వైభవం – 1

మనకి రామాయణ కాలములో త్రేతాయుగములో శ్రీరాములవారు ధర్మానువర్తనులై ‘రామో విగ్రహవాన్ ధర్మః, సాధు సత్య పరాక్రమః’ అనే విధముగా ఆయన నడుచుకుంటే, అటువంటి ఉన్నతమైన, విశేషమైన వ్యక్తిత్వం  ఉన్న పాత్ర మరొకటి మనకు కనపడుతుంది, అది హనుమంతులవారు. ఇవాళ ఆ రామచంద్రుల వారి కృపా, కరుణా వీక్షణాలతో, ఆ స్వామి అనుగ్రహముతో ఆ హనుమంతులవారి వైభవాన్ని ఒక్కసారి మననం చేసుకుందాము.

మిగితా దేవతలందరు వారిని స్తోత్రం చేస్తే ప్రసన్నులవుతారు, ఒక్క హనుమంతులవారి విషయం వచ్చేటప్పడికి ‘యత్ర యత్ర రఘునాధ కీర్తనం, భాష్పవారి పరిపూర్ణలోచనం’ అన్నారు. రామచంద్రులవారిని ఎక్కడైతే స్తోత్రం చేస్తున్నారు, రాములవారి కథను ఎక్కడైతే  గానం చేస్తున్నారో, రాములవారి గురించే ఎవరైతే మననం చేస్తున్నారో, స్తోత్రం చేస్తున్నారో, పఠనం చేస్తున్నారో వారందరిని కూడా హనుమంతులవారు అనుగ్రహిస్తారు. ఎంతటి గొప్ప ఔన్నత్యం అండి? హనుమంతులవారు దేవుడా కాదా అంటే, ప్రస్తుతం ప్రపంచము అంతటా కూడా ఒక సర్వ్ నిర్వహించటం జరిగింది. అందరి కంటే ఏ హిందూ దేవతా/దేవుని ఆలయాలు ఎక్కువ ఉన్నాయి అని. ఆ సర్వే ప్రకారముగా ఏమి తేలిందంటే ఆంజనేయస్వామి దేవాలయాలు ఎక్కువ ఉన్నాయి అని. ఎందువల్ల అంటే పిలిచిన పలికే   దైవం హనుమంతులవారు.

‘శ్రీ గురు చరన రజ‘ అని తులసీదాస్ వారు గానము చేసి ‘తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా‘, అంటే ‘ ఓ హనుమ నీవు సుగ్రీవులవారికి గొప్ప ఉపకారం చేసావు’, అదేమిటంటే ‘రామ మిలాయ రాజపద దీన్హా‘, ‘ నీవు సుగ్రీవులవారిని రాములవారితో కలిపావు’ అన్నారు.

రామాయణం – హనుమ

మనము ఒక్కసారి రామాయణాన్ని విశ్లేషించుకుంటే ఎక్కడెక్కడ హనుమ ప్రసక్తి ఉంటుందో, అంటే మనకు బాలకాండలో గాని, అయోధ్య కాండలో గాని, అరణ్య కాండలో గాని హనుమ ప్రసక్తి గాని, ప్రసంగం కానీ కనపడదు, కిస్కింద కాండ నుంచి మనకు హనుమ ప్రస్తావన  కనిపిస్తుంది. బాలకాండలో హనుమ గురించి వాల్మీకులవారు కొద్దిగా పేర్కొంటారు. 

రామాయణ ప్రారంభములో దశరధుడు యజ్ఞం చేస్తున్న సమయములో, దేవతలందరు కలసి రావణ సంహారం గురించి చర్చిస్తుంటారు. రావణుడు బ్రహ్మగారి నుంచి అజేయ వరాల్ని కోరతాడు. నరులు, వానరులు గడ్డిపరికల వంటి వారు, వారు తననేమి చెయ్యలేరు అని రావణుడి ధీమా. అందువల్ల నరులు, వానరుల చేతిలో తప్ప యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష, దేవి, దేవతల చేతిలో మరణాన్ని పొందకూడదు అని వరాన్ని కోరతాడు రావణుడు. ఎవ్వరితో మరణము లేకుండా ఒక్క నరమానవులను వదిలేసాడు కావున, అయోధ్యలో దశరధ మహారాజు పుత్ర కామేష్టి యాగం చేస్తున్న సందర్బములో, ఆ యాగానికి హాజరైన విష్షు భగవానుడు, బ్రహ్మ, శివుడు రావణ సంహారం గురించి చర్చిస్తున్నప్పుడు హనుమ ప్రసక్తి వస్తుంది.

‘మారుతస్యాత్మజః శ్రీమాన్ హనుమాన్నామ వానరః । వజ్రసంహననోపేతో వైనతేయసమో జవే ॥’, ‘శ్రీమంతుడు. మహాపరాక్రమశాలి, వజ్రమువంటి శరీరము కలవాడు; గరుత్మంతునితో సమామైన వేగము కలవాడు, హనుమంతుడనే పేరుకల వానరవీరుడిని వాయుదేవుడు పుట్టించెను’ (సప్తదశః సర్గః॥)

హనుమ ప్రస్తావన తిరిగి మనకు కిస్కింద కాండ చివరలో కనిపిస్తుంది, ఆ తదుపరి సుందరకాండ ప్రారంభము నుంచి విశేషముగా మనకి కనిపిస్తుంది. రామాయణం కావ్యంలో నిజానికి రాముడు లేకుండా నడిచిన పూర్తి కాండ సుందరకాండ. అందుకే వాల్మీకి మహర్షే స్వయముగా అన్నారు – ‘సుందరే సుందరో రామః సుందరే సుందరీ కథః సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపిః సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం?‘

సుందరుడు హనుమ

సుందరుడైన రామచంద్రమూర్తిని వర్ణిస్తున్నది కావున ఇది సుందరకాండ. సుందరమైన కథ ను చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన సీత కథను చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన అశోకవనాన్ని వర్ణిస్తున్నది కావున సుందరకాండ. సుందరమైన హనుమంతుడి గాథను చెబుతున్నది కావున సుందరకాండ. ఏ విధముగా చూసిన సుందరకాండ సుందరమే. హనుమంతులవారిని సుందరుడు అన్నారు.

వానర రూపములో ఉన్నవాడు సుందరుడు ఏమిటి అనే సందేహం మనకు కలుగవచ్చు. మనము చూసే ఐహికమైన, భౌతికమైన సౌందర్యం నిజమైన సౌందర్యం కాదు. ఎందువల్ల? సందర్యానికి నిర్వచనం ఏమిటి? అంటే, ఏ వస్తువైనా సరే, ఉదాహరణకు ఒక్క పువ్వును చూసాము, అబ్బా ఎంత బాగుందో అనుకున్నాము, మరల మరల అదే విషయం మన స్ఫురణకు రావాలి. కాసేపు వస్తుంది మరల మరో అంశం రాగానే ఈ పువ్వు పక్కకెళ్లిపోతుంది. ఆ పువ్వు సౌందర్యం నిలబడదు. కాబట్టి భౌతికమైన సౌందర్యం కాకుండా, ప్రకృతికమైన సౌందర్యం కాకుండా మనము కలిగి ఉండే అంతః సౌందర్యమే నిజమైన సౌందర్యం.

హనుమను కలిసిన ప్రతి ఒక్కరికి కూడా అయిన మేలు చేస్తూ, అందరికి కష్టాలను తొలగిస్తూ, ఆపదల నుండి ఉద్ధరిస్తూ ఉంటారు హనుమ. ఆపదోద్ధారక హనుమాన్ మంత్రం, కార్యసిద్ధి హనుమాన్ మంత్రం  అని మనకు సుందరకాండలో ఒక శ్లోకం కనిపిస్తుంది – “త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ | హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖ క్షయకరో భవ ||”. ఈ శ్లోకం కనుక పారాయణం చేసుకుంటే ఎటువంటి ఆపదలు అయిన తొలగిపోతాయి అని పెద్దలు చెప్పారు. ఇది  సంప్రదాయంలో ఉన్నటువంటి విషయం, దీన్ని ఆచరణలో పెట్టి  ఎన్నో అద్భుత ఫలితాలు సాధించినవారు ఈ కాలములో కూడా మనకు ఎందరో కనిపిస్తారు.

హనుమంతులవారిని ఆశ్రయిస్తే, స్వామి పాదాలు పట్టుకుంటే, స్వామిని శరణు వెడితే అభయాన్ని ప్రసాదిస్తారు స్వామివారు. అభయాంజనేయస్వామి – తన భక్తులకు అభయాన్ని అనుగ్రహించే స్వామిగా హనుమంతులవారు ప్రసిద్ధి చెందారు.

అభయం వేరు, నిర్భయం వేరు. మనకొక భయం ఉన్నది, ఆ భయాన్ని పోగొట్టటానికి ఒక వ్యక్తో, ఒక వస్తువో, ఒక విషయమో, ఒక వ్యవహారమో ఉంటే నిర్భయముగా మనము జీవిస్తాము. ఉదాహరణకు సరిహద్దులో సైనం మనల్ని కాపాడుతోంది కాబట్టి నిర్భయముగా ఉన్నాము. దేశములో రక్షణ వ్యవస్థ పోలీసుల ద్వారా నిలబడింది కాబట్టి నిర్భయముగా ఉన్నాము. లేకపోతే భయం ఉంటుంది. కాబట్టి ఉన్న భయాన్ని తీసేవేయ్యటం లేదు, ఆ భయం నుంచి ఉపశమనం కలగటానికి కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నాము తద్వారా ఆ భయం నుంచి ఉపశమనం పొందుతున్నాము. మరి అభయము అంటే అసలు భయమే లేకుండా ఉండటం. హనుమంతులవారిని ఆశ్రయిస్తే మనకు అభయం లభిస్తుంది, అంటే అసలు భయపడవలసిన అవసరమే కలుగదు.

హనుమ – రాక్షస సంహారం

‘గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసమ్ – రామాయణ మహా మాలా రత్నం వందే అనిలాత్మజమ్‘ – ‘గోమాత యొక్క పాదాల మధ్య దూరాన్ని దాటినంత సునాయాసంగా సముద్రాన్ని దాటి దోమలను చంపినంత సులభంగా రాక్షసవధ చేసి రామాయణం అనే వజ్రమాలలో ఒక వజ్రంలాగా నిత్యం మెరిసే ఆంజనేయ నీకు నమస్కారము’, అని వాల్మీకుల వారు హనుమను కీర్తిస్తారు.  ఒక గోవు గనుక నడుస్తూ నడుస్తూ ఎలాగైతే ఒక పిల్ల కాలువను అవలీలగా దాటవేస్తుందో అంత సులువుగాను హనుమంతులవారు శతయోజనాల సముద్రాన్ని అవలీలగా దాటవేశారు.

‘ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం – యః శోకవహ్నిం జనకాత్మజాయా – ఆదాయ తేనైవ దదాహ లంకాం – నమామి త్వం ప్రాంజలీరాంజనేయం‘ – ‘ఎవరైతే సముద్రాన్ని ఆడుతూ పాడుతూ సునాయాసంగా దాటగలిగినాడో, జనకుని కుమార్తె అయిన జానకీమాత శోకాన్ని చూసి తట్టుకోలేక ఆ శోకంతోనే లంకని దహింపజేసిన హనుమా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను’ అని మనము హనుమను స్తుతిస్తాము. ఒక చిన్న పిల్ల కాలువను దాటినంత సులభముగా, అవలీలగా సముద్రాన్ని దాటేసారు హనుమ. సీతాన్వేషణ అనంతరం ఎందరో రాక్షసులను అతి సునాయాసముగా సంహరించారు హనుమ. దోమల్ని చంపివేసినట్లుగా, దోమల్ని నలిపివేసినట్లుగా అతి సులువుగా రాక్షస సంహారం గావించారు హనుమ.

రాక్షస సంహారానికి ముందు హనుమంతులవారు గర్జిస్తూ ఇలా పేర్కొంటారు –

“జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహా బలః, రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః,

దాసోహం కౌసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః, హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః,

న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్,

శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రహః, అర్ధ ఇత్వామ్ పురీం లంకాం అభివాద్యచ మైథిలీమ్,

సమృద్ధార్థో గమిష్యామి మిహతామ్ సర్వ రాక్షసాం”

ఈ శ్లోకాల అర్థం ఒక్కసారి మనము గమనిస్తే – ‘బలవంతుడయిన శ్రీరాముడికి సదా జయం. పరాక్రమశాలి అయిన లక్ష్మణుడికి జయం. శ్రీరాముడికి విధేయుడై, కిష్కింధకు ప్రభువయిన సుగ్రీవుడికి జయం. అసహాయ శూరుడు, కోసల రాజ్యాధిపతి అయిన రాముడికి నేను బంటును. వాయుపుత్రుడిని. నా పేరు హనుమ. శత్రు సైన్యాలను నామరూపాల్లేకుండా చేస్తాను. ఒకడేమిటి? వెయ్యిమంది రావణులు కలిసి ఒకేసారి వచ్చినా ఓడిస్తాను. రాళ్లతో, చెట్లతో రాక్షసులను మట్టికరిపిస్తాను. లంకానగరాన్ని నాశనం చేస్తాను. రాక్షసులు మౌన ప్రేక్షకులుగా చూస్తూ ఉండగా వచ్చినపని ముగించుకుని సీతమ్మను దర్శించి, నమస్కరించుకుని వచ్చినదారినే వెళ్ళిపోతాను.’

వాయుతత్వము – హనుమ

హనుమంతులవారు అంటే వాయుపుత్రుడు అని మనము చెప్తాము. హనుమను ‘వాయునందనుడు’, ‘వాయు పుత్రుడు’ అని కీర్తిస్తున్నాము. వాయువు అంటే ‘wind energy’, శక్తి, భగవత్ శక్తి. భగవంతుడు అంటే energy with intelligence. మాములుగా energy అంటే wind energy అని, hyderal   energy అని, solar energy అని ఇలా రకరకాలుగా పేర్కొంటాము. Energy can neither be created nor destroyed, it can only be converted from one form to another అని సైన్స్ కూడా చెప్తున్నది. శక్తిని మనము ఉత్పత్తి చేయలేము, నాశనము చేయలేము, ఉన్నది శక్తి అంతే. అది ఉన్నది భగవత్ తత్త్వం. ‘ఏకం సత్‌ విప్రాః బహుధా వదంతి’ అనేది ఉపనిషత్‌ వాక్యం. ఉన్నది ఒకటే సత్యం. దానినే పండితులు అనేక రకాలుగా చెబుతారని దీని అర్థం.

భగవత్ తత్త్వం అయిన శక్తిని వాయురూపములో మనము కొలవటం ప్రారంభిస్తే అది హనుమంతుడు. అన్నిటికంటే వేగంగా, అన్నిటి కంటే తొందరగా అన్ని చోట్ల వ్యాప్తి చెందేది వాయువు. ‘ఇందు గలఁ డందు లేఁ డని సందేహము వలదు చక్రి సర్వోపగతుం డెం దెందు వెదకి చూచిన నందందే కలఁడు దానవాగ్రణి’ అని ప్రహ్లాదుడు పేర్కొన్నట్లు భగవంతుడు వాయువులాగా అంతటా ఉంటాడు. కావున హనుమంతులవారు వాయు రూపములో సర్వత్రా వ్యాప్తి చెందిన శక్తి స్వరూపము అని ముందు మనము గుర్తుంచుకోవాలి.

మరి హనుమంతుడు ఆంటే వానర రూపం ఉన్నది కదా అనే సందేహం మనకు కలుగవచ్చు. హనుమాన్ చాలీసాలో హనుమను తులసీదాస్ “హాథ వజ్ర ఔ ధ్వజా విరాజై । కాంధే మూంజ జనేఊ సాజై ॥౫॥ శంకర సువన కేసరీనందన । తేజ ప్రతాప మహా జగ వందన ॥౬॥ విద్యావాన గుణీ అతిచాతుర । రామ కాజ కరిబే కో ఆతుర ॥౭॥‘ అని కీర్తిస్తారు. శంకర సువన ఆంటే శివుని కుమారుడు అని అర్థం.

మరి శంకరుడు ఎవరు? సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన ముఖాల స్వరూపము శంకరుడు. కంచిలో పృద్వి లింగం, జంబుకేశ్వరంలో జలలింగం, తిరువన్నామలైలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం రూపేణా పరమశివుడు మనకు దర్శనమిస్తున్నాడు. వాయులింగ స్వరూపముగా ఉన్న పరమేశ్వరుడే హనుమ. అందుకే ‘శంకర సువన, కేసరి నందన’ అన్నారు.

అయితే ‘కేసరి నందన’ అనేది నిమిత్తమాత్రముగా వచ్చిన నామము. ఆ సందర్బములో ఆ విధంగా అయిన అంజనీ కేసరులకు తనయుడిగా జన్మించాడు. ఈ లోకములో జన్మించిన ఒక సాధారణ వ్యక్తికి తనకు కనీసముగా 18 సంవత్సరాల వయస్సు వస్తేనే లోకజ్ఞానం లభిస్తుంది. కానీ హనుమంతులవారు పుట్టి పుట్టగానే సూర్యబింబాన్ని చూసి పండని భ్రమించి అందుకోవటానికి ఆకాశానికి ఎగిరారు. అంతటి మహనీయులు హనుమ. కావున హనుమను ఒక సాధారణ వానరుడిగా భావించకూడదు మనము. హనుమత్ తత్త్వం అటువంటిది. హనుమత్ తత్వమును  విశేషముగా మనము అర్థం చేసుకోవాలి ఆంటే అది భగవత్ తత్వము కనుక ప్రకృతిలో ఉండే వాయు తత్వమే హనుమంతులవారు.

హనుమ – శంకరుడు

మరి ఆ వానర రూపం ఏమిటి ఆంటే భగవంతుడు సాకారుడు, నిరాకారుడు అని రామకృష్ణపరమహంస పేర్కొంటారు. భగవంతుడు ఒక రూపములో ఉంటాడు, రూపము లేకుండా ఉంటాడు, రూపానికి అతీతముగా తత్వములో భగవంతుడు ఉంటాడు, భగవత్ శక్తి ఉంటుంది. కాబట్టి హనుమత్ వైభవము మనము అర్థం చేసుకోవాలంటే ఒక వానర రూపములో మాత్రమే ఆలోచిస్తే కుదరదు. దాన్ని ఒక శక్తి స్వరూపముగా మనము ధ్యానం చెయ్యగలగాలి. అయితే ప్రారంభ దశలో అది అందరికి కుదరదు కనుక, దానికి మనము ఒక రూపం ఏర్పరుచుకొని, రామాయణములో చెప్పబడుతున్న రూపం అటువంటిది కనుక, ఆ రూపములో హనుమను స్తోత్రం చేస్తాము.

హనుమత్ స్వరూపము, హనుమత్  శక్తి ఎటువంటిది అంటే మనలో ఉన్న ‘ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన’ అనే పంచ ప్రాణములే పంచముఖ ఆంజనేయస్వామిగా మనము గుర్తుంచుకోగలిగితే మనము వేసే ప్రతి అడుగు ధర్మం వైపే ఉంటుంది. అప్పుడు ఆయనే మనలను కాపాడుకుంటాడు. ఈశ్వర స్వరూపమే హనుమ స్వరూపము గనుక, సుందర స్వరూపమైన ఆంజనేయస్వామిని మనం ఎల్లప్పుడు మనస్సులో నిలుపుకోవాలి అంటే, ‘మనలో వాయువు రూపములో ఉన్నవారే హనుమ (వాయుసుతుడు)’, అని గుర్తుంచుకోవాలి. హనుమ ఎక్కడో లేరు, వాయు రూపములో మనలోనే ఉన్నారు, మనతోనే ఉన్నారు. మనలోనే హనుమ ఉన్నారు అని భావించి, ఆ స్ఫురణతో హనుమ స్తోత్ర పారాయణ, పూజ, ఆరాధన, అర్చన మనము చెయ్యగలిగితే, అప్పుడు ఆ అనుష్టాన ఫలం మనకు లభిస్తుంది

హనుమ జననం

హనుమకు శనివారం విశేషముగా ఎందుకు చెప్పేరంటే అయిన జననం శనివారం నాడు జరిగింది అని రామాయణం పేర్కొంటున్నది. ‘వైశాఖ మాసే దశమ్యాం స్థిర వాస యుక్తాయమ్’- వైశాఖ బహుళ దశమి శనివారం నాడు హనుమ జన్మించారు అని శ్రీమద్రామాయణంలో వాల్మీకులవారు పేర్కొన్నారు. ఒక రూపము, ఒక శక్తి, ఒక కారణము కొరకు  శివశక్తి హనుమగా వచ్చింది. ఏమిటా కారణము? రావణ సంహారం. విష్ణుశక్తి శ్రీరాములవారిగా, పరాశక్తి సీతమ్మగా, శివశక్తి హనుమగా ఈ లోకంలోకి రావటం జరిగింది. పరమేశ్వరుని యొక్క స్వరూపమే హనుమద్ రూపం.

K C Das Memorial Charitable Trust

Paropakarardham Idam Sareeram

  • Instagram
  • YouTube
  • Facebook
Address
H.No. 11-13-119, 14/B, Road No. 3, beside Axis Bank, Alkapuri Colony, Ramakrishnapuram, Kothapet, Hyderabad, Telangana 500035
View on map
Contact
contact@kcdastrust.org
+91 94948 77070
04:00 PM to 08.30 PM IST

© 2026 K C Das Memorial Charitable Trust. All rights reserved.

Terms and ConditionsPrivacy Policy