Skip to navigation
K C Das Memorial Charitable Trust
Donate
  • Home
  • About
  • Library
    • Dharma Vaani
    • Sri Lalitha Sahasra Naamavali
    • Dharmavaaradhi e-Magazine
    • Guru Vaani
    • Saradamba TV (Grandly Launched)
  • Dharmika Programs
    • All programs
    • Hanuman Chalisa
    • Gayathri Japam
    • Bala Japam
    • Calendar
  • Spiritual Education
  • Community Welfare
  • Contact
Donate
  • Instagram
  • YouTube
  • Facebook
  • Instagram
  • YouTube
  • Facebook
Donate

హనుమద్వైభవం – 2

పరమేశ్వర స్వరూపమే హనుమగా పుట్టారు గనుక వాయురూపములో ఒక శక్తి ఒక ఆకారాన్ని దాల్చింది. ఎటువంటి ఆకారాన్ని దాల్చింది ఆంటే, ‘సూక్ష్మ రూప ధరి సియహిఁ దిఖావా । వికట రూప ధరి లంక జరావా ॥౯॥  భీమ రూప ధరి అసుర సంహారే । రామచంద్ర కే కాజ సంవారే ॥౧౦॥‘ హనుమ తాను ఏ రూపము కావాలంటే ఆ రూపము ధరించగల శక్తిగల మహనీయుడు. మనకి రామాయణములోనే ఇందుకు సంభందించిన అనేక దృష్టాంతాలు కనిపిస్తాయి.

హనుమ – సుగ్రీవుడు

వాలి సుగ్రీవుడిని తన రాజ్యం నుంచి తరిమివేసిన తరువాత, సుగ్రీవుడు తన మంత్రులైన నలుడు, నీలుడు, హనుమంతుడు, తానుడుతో కలసి ఋష్యమూక పర్వతం మీద నివసించసాగాడు. రామలక్ష్మణులు సీత కోసం అన్వేషిస్తూ ఋష్యమూక పర్వతం సమీపానికి చేరుకుంటారు. సుగ్రీవుడు పర్వతంపై నుంచి వారిని గమనించి, తనను సంహరించటానికి తన అన్న వాలి వారిని పంపించాడని భావిస్తాడు. వాలి తాను స్వయముగా ఋష్యమూక పర్వతం మీదకు రాలేడు కనుక, తనను చంపటం కోసం తన తరుపున వారిని పంపాడని భావించి మరణ భయముతో గజగజ వణికిపోతూ, ఒక పిచ్చివానివలె ఆ పర్వతం మీద నుంచి ఈ పర్వతం మీదకు గెంతుతూ, పరిగెత్తుతూ ఉంటాడు. అప్పుడు హనుమంతులవారు సుగ్రీవునికి ధైర్యవచనలు పలికి అతనిని శాంత పరుస్తారు.  ఇక్కడ హనుమంతులవారు తమ బుద్ది చాతుర్యాన్ని ప్రదర్శిస్తారు.

‘బల బుద్ధి విద్యా దేహు మోహిఁ హరహు కలేస వికార‘ అని తులసీదాస్ హనుమను కీర్తిస్తారు. హనుమంతులవారికి ఉన్న బుద్ది బలం అపారం. ‘బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగతా అజాడ్యం వాక్పటుత్వం చ హనుమాత్ స్మరణాత్ భవేత్ – హనుమంతుని స్మరించటం వలన బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వం, ఆరోగ్యము, జాగరూకత, మాటలలో బలం కలుగుతాయి’  అని పెద్దలు పేర్కొంటారు.

సంభ్రమః త్యజతాం ఏష సర్వైః వాలి కృతే మహాన్ | మలయోఽయం గిరివరో భయం న ఇహ అస్తి వాలినః ||

రామలక్ష్మణులను దూరం నుంచి చూసి భయకంపితుడైన సుగ్రీవునితో హనుమ ఇలా అంటారు, “సుగ్రీవా! ఎందుకయ్యా ఇలా శిఖరముల మీద ఎగురుతున్నావు, నువ్వు మహారాజుగా ఉండవలసిన వాడివి, ఎవరో ఇద్దరిని చూసి నిన్ను చంపడానికే వచ్చారని అనుకొని గెంతులు వేశావు. ఏమిటయ్యా ఈ చపలత్వం. అవతలివారు ఎటువంటి స్థితిలో ఉన్నారో, ఎందుకు వచ్చారో, వారి మనస్సులలో ఏ భావన ఉన్నదో కనిపెట్టి, దానికి అనుగుణంగా నడిచి, తనని, తన ప్రజలని రక్షించుకోగల సమర్ధత ఎవడికి ఉన్నదో వాడు రాజు. అంతేకాని కనపడ్డ ప్రతివాడిని చూసి ఇలా పారిపోతే, నువ్వు రేపు రాచపదివి ఎలా నిర్వహిస్తావు సుగ్రీవా ” అని ప్రశించారు.

 ఆపత్సమయములో రాజుకు తగిన సలహా ఇవ్వటం, ధర్మాన్ని భోదించటం మంత్రి యొక్క కర్తవ్యము. కావున హనుమంతులవారు సుగ్రీవులవారికి దైర్యం చెప్పి, ఆ రాజకుమారుల గురించి తాను తెలుసుకొని వస్తానని వారి వద్దకు వెళతారు. ఈ వృత్తాంతములో మనకు ప్రధానముగా సుగ్రీవుల వారి భయం, హనుమ అభయం అనే రెండు విషయాలు కనిపిస్తాయి. వాలి భయముతో సుగ్రీవుడు యావత్ భూమండలమంతా తిరిగి ఋష్యమూక పర్వతం మీద నివాసం ఏర్పరుచుకుంటాడు. వాలికి ఉన్న శాపం వలన ఈ పర్వతం మీదకి వస్తే మరణిస్తాడు కావున అక్కడికి వాలి రాలేడు. ఎవరైతే ధర్మాన్ని ఆసరాగా చేసుకుంటారో వారికీ ఎక్కడో అక్కడ ఏదో ఒక ఆలంబన దొరుకుతుంది అని ఈ ఉదంతం మనకు తెలుపుతోంది.

సుగ్రీవుడు ధర్మాత్ముడు కనుక, ధర్మాన్ని ఆశ్రయించి ఉన్నాడు కనుక అతనికి ఆ ఋష్యమూక పర్వతం అనే ఒక అండ లభించింది.  భయకంపితులైన సుగ్రీవునికి హనుమంతులవారు అభయాన్ని ప్రసాదించారు. హనుమంతులవారి నామాన్ని ఎవరైతే స్మరిస్తారో, హనుమ నామ జపం ఎవరైతే చేస్తారో, వారికి ముందుగా దైర్యం వస్తుంది. ‘శోకో నాశయతే ధైర్యం శోకో నాశయతే శ్రుతమ్‘ అని రామాయణం పేర్కొంటోంది. శోకము ధైర్యాన్ని పోగొడుతుంది, మనల్ని ఏ ఆలోచన చేయనివ్వదు. మొదట మనకు దైర్యం అవసరం. హనుమంతులవారి స్మరణ చేస్తే పుష్కలముగా దైర్యం లభిస్తుంది. కొండంతగా స్వామి మనతో ఉండి ఆ ఉన్నటువంటి ఆపదాలన్నీ తొలగిస్తారు అనే దైర్యం మనకు లభిస్తుంది.

ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్

 ‘ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్‘ అని మనము శ్రీరాములవారికి స్మరిస్తాము. హనుమ కూడా శ్రీరాములవారి వలెనే మన ఆపదాలన్నీ తొలగిస్తారు.’ఆపద + అపహర్తారం’ ఆంటే ఆపదలు అపహరిస్తారు అన్నారు పెద్దలు.ఇక్కడ మనము జాగర్తగా అర్థం చేసుకోవాలి. హరించటం ఆంటే మాములుగా తీసివేయడం. మరి అపహరించటం ఆంటే? మన జేబులో ఉన్న డబ్బుల్ని మనకు కూడా తెలియకుండా తస్కరించగలిగాపుడే, వారు ఎవరైనా దొంగ కాగలరు. మనకు సంభందించిన వస్తువును, విషయమును మనకి తెలియకుండా తీసేవాడు  దొంగ అనబడతాడు. మరి హనుమంతులవారు ఏమి చేస్తారు? మనకి రాబోయే ఆపదలను, వాటిని గురించిన సూచనలను మనకు కూడా తెలియకుండా తీసివేస్తారు.

హనుమద్ భక్తులు ఎవరైతే ఉంటారో వారికి కలగబోయే ఆపదలను, ఆ సూచనలను వారికి కూడా తెలియకుండా అపహరించి వేస్తారు హనుమంతులవారు. వారి జీవితం ఎల్లప్పుడు హాయిగా సాగిపోతుంది. అందుకు కారణం హనుమంతుల వారి అనుగ్రహం లభించటం. మానవ జీవితమే కష్ట, సుఖముల సమాహారం. కష్టాలు రాకుండా ఉండవు. కానీ హనుమంతుల వారి అనుగ్రహం లభిస్తే ఆ కష్టాలను అతి సులువుగా దాటగలుగుతాము.

‘దాతారం సర్వ సంపదామ్‘ అనేది అతి పెద్ద మాట. అన్ని సంపదలను ఇచ్చే వారు హనుమంతులవారు. హనుమంతులవారిని స్తోత్రం చేస్తే, పూజ చేస్తే, హనుమద్ ఉపాసన చేస్తే, హనుమాన్ నామం చెప్తే, హనుమద్ పారాయణం చేస్తే, హనుమద్ భజన చేస్తే, వీటిల్లో ఏది చేసినా హనుమద్ అనుగ్రహం మనకు లభిస్తుంది. నవవిధ భక్తి మార్గాలైన ‘శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం‘ లో ఏ మార్గములోనైనా మనము భగవంతుడిని ఉపాసించవచ్చు. మనకు ప్రీతికరమైన దేవతా నామాలను వినటం, ఆ నామాల గురించి ఆలోచించటం, వాటినే మననం చేయటం.

భగవతములో పోతనగారు ప్రహ్లాదుల వారి గురించి పేర్కొంటూ, ‘పానీయంబులు ద్రావుచుం గుడుచుచున్ భాషించుచున్ హాస లీ లా నిద్రాదులు చేయుచుం దిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృ తాస్వాద సం ధానుండై మఱచెన్ సురారిసుతుఁ డే త ద్విశ్వమున్ భూవరా!‘ అంటారు. ప్రహ్లాదుడు అన్నము తింటూ నీళ్ళు త్రాగుతూ మాట్లాడుతూ నవ్వుతూ వినోదిస్తూ నిద్రపోతూ కాని ఎపుడైనా సరే ఏమరుపాటు లేకుండా శ్రీ హరి ధ్యానంలోనే నిమగ్నమైన చిత్తము కలిగి, ఈ ప్రపంచమును మరచిపోయి ఉంటాడు అని ఈ శ్లోకం యొక్క భావం. మనము నిరంతరం భగవాన్ నామాల గురించి మననం చెయ్యాలి. తులసీదాస్, సమర్థ రామదాస్ ఇత్యాది ఎందరో హనుమద్ ఉపాసకులు, హనుమద్ భక్తులు ఈ మార్గాన్ని ఆచరించి చూపారు. వారిని మనము ఆదర్శముగా స్వీకరించాలి.

హనుమంతులవారిని కీర్తించటం, స్మరించటం, సేవించటం, అర్చించటం (పూజ చెయ్యటం) ద్వారా వారి అనుగ్రహాన్ని విశేషముగా పొందగలుగుతాము. మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేస్తే చాలు, హనుమ ప్రసన్నులవుతారు. ఇలా నవవిధ భక్తి మార్గాల్లో ఏ మార్గములోనైనా హనుమను ఆరాదించవచ్చు, ఉపాసించవచ్చు. ఇలా చేసే వారికి హనుమ అన్ని సంపదలను అనుగ్రహిస్తారు.

హనుమ అనుగ్రహించే సంపదలు ఏమిటి?

‘అష్ట సిద్ధి నవ నిధి కే దాతా । అస బర దీన జానకీ మాతా‘ అన్నారు తులసీదాస్ హనుమాన్ చాలీసాలో. హనుమ తన భక్తులకు అష్టసిద్ధులు అనుగ్రహిస్తారు. ఏమిటా అష్టసిద్ధులు? ఈ లోకములో ఉండే ప్రతి ఒక్కరికి ‘క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యం‘ అనే ఎనిమిది సిద్దులు తప్పక అవసరం. తన భక్తులకు వీటిని పుష్కలముగా అనుగ్రహిస్తారు హనుమ.

క్షేమముగా ఉండటం, స్థిరత్వముగా నిలబడగలగటం ప్రతి ఒక్కరికి తప్పక అవసరం. స్థిరత్వం ఆంటే stability. హనుమంతులవారి అనుగ్రహం లభిస్తే మనకి  మరి విశేషముగా మానసిక స్థిరత్వం (Mental  Stability) లభిస్తుంది. ఆంటే భగవంతుని యందు మనస్సు లగ్నం చేసి నిలబడగల స్థిరత్వం లభించటం. అలాగే దైర్యం ఉంటేనే గాని మనిషి ఏది సాదించలేడు. ఒక పని మొదలుపెట్టాలంటే ముందు కావాల్సింది దైర్యం. ఒక జపం చెయ్యాలన్న, నామం చెప్పాలన్నా మొదట అందుకు దైర్యం కావాలి. ఆ దైర్యం మనకు హనుమద్ ఉపాసన వల్ల లభిస్తుంది.

విజయము ఆంటే కేవలము యుద్దములో గెలవటం కాదు. ఒక ఉద్యోగ పరీక్షలో విజయం సాధించాలన్నా, వివాహ సంబంధం కుదరాలన్నా ఆయా పరీక్షలలో గెలుపు కావాల్సినదే. గెలుపు అనేది ప్రతి రోజు, ప్రతి విషయములోను తప్పనిసరి. ‘సమానానాం ఉత్తమ శ్లోకోస్తు’ అని వేదం పేర్కొంటోంది. అంటే ‘నీ సాటి వారిలో నువ్వు గొప్పవాడిగా అందరితో కీర్తింపబడుదువు గాక’ అని అర్థం. మనము ఉన్న వృత్తిలో (అది ఏ వృత్తి అయిన సరే) ఉండే ఉద్యోగస్తులందరులోకి మనము ఉత్తమముగా ఉండగలగాలి. ఆ స్థితి హనుమద్ ఉపాసన వల్ల లభిస్తుంది.

హనుమ అనుగ్రహముతో భయం అనేటువంటిది అసలు ఆలోచనలోకి రాకుండా జీవనం గడపగలుగుతాము. ఆలా ఎంత మంది ఉండగలుగుతున్నారు? ‘భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్భయం..’ అంటుంది శాస్త్రం. ప్రతి ఒక్కరికి ఏదో భయం తప్పక ఉంటుంది. హనుమంతులవారి పాదాలు పట్టుకుంటే ఆ భయం మన దరికి రాకుండా అనుగ్రహిస్తారు.

స్వామివారి అనుగ్రహంతో ఆయువు కూడా లభిస్తుంది. ‘శతమానం భవతి‘ అంటుంది శాస్త్రం. మానవ జన్మ సార్ధకం చెందాలంటే నూరు సంవత్సరాలు బ్రతికి, తాను ఆచరించవలసిన నిత్య నైమిత్తిక కర్మలన్నీ ఆచరించి, పాప కర్మలను ప్రక్షాళన గావించుకుని, పుణ్య సముపార్జన చేసుకొని, శరీరాన్ని వదిలేటప్పుడు కేవలంగా పుణ్యము మాత్రమే మిగుల్చుకోగలగాలి. హనుమద్ అనుగ్రహముతో తగిన ఆయుస్సును పొంది ధర్మ, అర్థ, కామ, మోక్షము అనే చతుర్విధ పురుషార్ధములను పొందగలుగుతాము.

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు పెద్దలు. మనకు యావజ్జివన పర్యంతము కావల్సినది ఆరోగ్యం. ఆ ఆరోగ్యం హనుమద్ ఉపాసనతో, హనుమద్ పారాయణతో, హనుమద్ నామజపంతో, హనుమద్ అనుగ్రహముతో మనకు లభిస్తుంది. ఇక చివరిది ఐశ్వర్యం. సమస్త ఐశ్వర్యములు హనుమంతులవారి అనుగ్రహముతో తప్పక లభిస్తాయి.

అయితే అష్ట సిద్దులు ఆంటే ‘అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము’ అనే శక్తులు అని పెద్దలు అర్థం చెప్తారు. హనుమంతులవారి అనుగ్రహం ఉంటే ఈ అష్టసిద్దులతో పాటు ‘క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యం’ అనే అష్ట సిద్దులు కూడా మనకు లభిస్తాయి. హనుమద్ ఉపాసకులకు లభించేవి ఇవి.

K C Das Memorial Charitable Trust

Paropakarardham Idam Sareeram

  • Instagram
  • YouTube
  • Facebook
Address
H.No. 11-13-119, 14/B, Road No. 3, beside Axis Bank, Alkapuri Colony, Ramakrishnapuram, Kothapet, Hyderabad, Telangana 500035
View on map
Contact
contact@kcdastrust.org
+91 94948 77070
04:00 PM to 08.30 PM IST

© 2026 K C Das Memorial Charitable Trust. All rights reserved.

Terms and ConditionsPrivacy Policy