Skip to navigation
K C Das Memorial Charitable Trust
Donate
  • Home
  • About
  • Library
    • Dharma Vaani
    • Sri Lalitha Sahasra Naamavali
    • Dharmavaaradhi e-Magazine
    • Guru Vaani
    • Saradamba TV (Grandly Launched)
  • Dharmika Programs
    • All programs
    • Hanuman Chalisa
    • Gayathri Japam
    • Bala Japam
    • Calendar
  • Spiritual Education
  • Community Welfare
  • Contact
Donate
  • Instagram
  • YouTube
  • Facebook
  • Instagram
  • YouTube
  • Facebook
Donate

హనుమద్వైభవం – 3

కపి రూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజః | భిక్షు రూపం తతో భేజే శఠబుద్ధితయా కపిః ||

హనుమ – రాముడు – మొదటి పరిచయం

సుగ్రీవునికి ధైర్యవచనలు తెలిపి హనుమంతులవారు కామరూపం ధరించి (భిక్షువు, సన్యాసి) రామలక్ష్మణుల దగ్గిరకు వెళ్లారు. భిక్షువు రూపములో హనుమ రామలక్ష్మణులను సమీపించి నమస్కరించి వారిని ఇలా ప్రశ్నించారు, “మీరు ఎవరు? మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు రాజర్షుల లాగ, తాపసుల లాగ ఉన్నారు. మీ చేతులలో కొదండాలు, బాణాలు ఉన్నాయి. మీరు ముని కుమారులా, రాజ కుమారులా? మీరు ఇలా ఎందుకు నడిచి వస్తున్నారు. దీనికి కారణం ఏమిటి.”

హనుమ మాటలు విన్న శ్రీరాములవారు లక్ష్మణుడితో ఇలా అంటారు, ” చూశావ లక్ష్మణ, ఆయన మాటలు విన్నావా? ఇలాగ మాట్లాడేవాడు మంత్రిగా దొరికితే కార్యాలు ఎందుకు నెరవేరవు! ఇలా మాట్లాడేవాడు ఎదురుగా వచ్చి నిలబడితే, కత్తి పట్టి ప్రాణం తీసేద్దాము అనుకున్న వ్యక్తి కూడా కత్తిని ఒరలో పెట్టేస్తాడు. ఇటువంటి వ్యక్తి మంత్రిగా కలిగిన ఆ రాజు ఎంత అదృష్టవంతుడు. ఈయన మాట్లాడిన విధానాన్ని చూస్తే, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం తెలియకపోతే ఇలా మాట్లాడలేడు. అన్నిటినీ మించి ఈయన వ్యాకరణాన్ని చాలాసార్లు చదువుకున్నాడు. ఈయనికి ఉపనిషత్తుల అర్ధం పూర్తిగా తెలుసు. అందుకనే ఈయన మాట్లాడేటప్పుడు కనుబొమ్మలు నిష్కారణంగా కదలడంలేదు, లలాటము కదలడం లేదు. వాక్యము లోపలినుంచి పైకి వచ్చేటప్పుడు గొణుగుతున్నటు లేదు, గట్టిగా లేదు. ఈయన మాటలు ప్రారంభించిన దెగ్గరి నుంచి చివరి వరకూ ఒకే స్వరంతో పూర్తి చేస్తున్నారు. కాళ్ళు, చేతులు, శరీరాన్ని కదపడం లేదు. ఏ శబ్దాన్ని ఎలా ఉచ్చరించాలో, ఎంతవరకు ఉచ్చరించాలో అలా పలుకుతున్నారు.”

హనుమ యొక్క మొదటి పరిచయంతోనే వారి విద్వత్తును శ్రీరాములవారు తెలుసుకోగలిగారు, హనుమను ఎంతగానో పొగిడారు. 24000 శ్లోకములు ఉన్న రామాయణములో శ్రీరాములవారు పొగిడినది ఒక్క హనుమంతులవారినే. మనము ఇతరులతో ఎలా మాట్లాడాలో శ్రీమద్రామాయణంలోని ఈ ఉదంతం మనకు తెలుపుతోంది. అనవసర సంబాషణతో కాలయాపన చెయ్యకుండా, సంబాషణను సాగతియ్యకుండా, నేరుగా విషయానికి రావటం (అవిలంబితమ్) ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన విషయం.

పంచముఖ ఆంజనేయుడు

‘నవ వ్యాకరణ పండితులు‘ హనుమ. ‘వందే వానర నారసింహఖగరాట్ క్రోదాస్వ వక్త్రాన్వితం‘ అని హనుమను స్తుతిస్తాము. పరమేశ్వరునికి ఎలాగైతే ఐదు ముఖాలు ఉన్నాయో, హనుమంతులవారికి కూడా ఐదు ముఖాలు ఉన్నాయి. తూర్పున తన సహజసిద్ధమైన వానర ముఖం, పశ్చిమాన గరుడ ముఖం, దక్షిణాన నృసింహ ముఖం. ఉత్తరాన వరాహ ముఖం, ఉర్ధ్వ దిశలో హయగ్రీవ ముఖం. శివాంశ సంభూతుడైన హనుమంతుని పంచముఖాలను శివుని పంచముఖాలైన సద్యోజాత (వానర), అఘోర (గరుడ), తత్పురుష (వరాహ), వామదేవ (నారసింహ), ఈశాన (హయ గ్రీవ) ముఖాలుగా వర్ణి స్తారు.

వాల్మీకి మహర్షి సుందరకాండలో ఒక చిన్న చమత్కారం చేస్తారు, హనుమకు ఒక చిన్న చురక పెడతారు మహర్షులు. లంకలో సీతమ్మవారిని వెతుకుతున్నారు హనుమ. సీతమ్మవారి కోసం లంకంతా వెతుకుతారు హనుమ. సీతాన్వేషణలో భాగంగా రావణుడి అంతఃపురం ప్రవేశించి మందిరం అంతా వెతుకుతూ అక్కడ నిద్రిస్తున్న మండోదరిని చూస్తారు హనుమ. మండోదరిని చూసి సీతగా భ్రమించిన హనుమ కోతి చేష్టలు గావిస్తారు. వాల్మీకులవారు హనుమ చేసిన కోతి చేష్టలను ఎంతో అద్భుతముగా వర్ణిస్తారు.

అస్ఫోటయామాస చుచుంబ పుచ్ఛం ననంద చిక్రీడ జగౌ జగామ|

స్తంభాన్ ఆరోహాన్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం||55||

శ్లోకార్ధం: ( ఆ సంతోషముతో) జబ్బలు చరుచుకుంటూ తోకను ముద్దెట్టుకుంటూ, ఆటపాటలతో స్తంభములను ఎక్కుతూ, క్రిందకు దూకుతూ వానరులకు స్వాబావికమైన ప్రకృతిని ప్రదర్శించెను హనుమ.

మనకి ఎంతో ఆనందం కలిగినపుడు చిటికెలు వేస్తూ, పాటలు పడుతూ మన ఆనందాన్ని ప్రదర్శిస్తాము. కోతులకు ఆనందం కలిగితే తమ తోకని పైకెత్తి ముద్దుపెట్టుకుంటాయి. అది వాటి స్వభావము. మండోదరిని సీతమ్మగా భ్రమించిన హనుమ కూడా పట్టరాని ఆనందముతో తన సహజసిద్ధమైన కోతి చేష్టలను ప్రదర్శించారు అని సుందరకాండలో వాల్మీకులవారు చమత్కారంగా వర్ణించారు. ఆ తరువాత హనుమ వివేకముతో ఆలోచించి తన భ్రమను వీడారు. ‘రాముని సీతా ఇటులుండునా’ అని సుందరకాండ గానములో వస్తుంది. అది వేరే విషయం. ఇక్కడ మనకు వానర లక్షణం కనిపిస్తుంది.

రెండవది నరసింహ లక్షణం. ఈ లక్షణం హనుమంతులవారిలో అక్షకుమారుడితో జరిగిన యుద్ధ సమయములో మనకు కనిపిస్తుంది. హనుమంతులవారు, అక్షకుమారుల మధ్య జరిగిన యుద్ధమును వాల్మీకులవారు సుందరకాండలో వర్ణిస్తారు. అక్షకుమారుడికి ఒక విచిత్రమైన వరం ఉంటుంది. అక్షకుమారుడు తన రథంతో సహా ఆకాశములోకి ఎగురగలడు. భూమి మీదనే కాకుండా ఆకాశములో కూడా అతను యుద్ధము చేయగలడు. అది అతనికున్న వరం.

 సీతమ్మ తల్లితో సంభాషించిన తరువాత, తాను తిరిగి వెళ్లిపోయే ముందు రాక్షస సంహారం చెయ్యాలని హనుమ భావించి అందుకు నాందిగా అశోకవనాన్ని ధ్వసం చేస్తారు. ఆ తదుపరి తన మీదకు వచ్చిన అనేక రాక్షసవీరులను అవలీలగా సంహరిస్తారు స్వామి. అప్పుడు రావణుడు తన కుమారుడైన అక్షకుమారుడిని హనుమను బంధించమని పంపిస్తాడు రావణుడు. అక్షకుమారుడికి, హనుమకు మధ్య ఎంతో ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఆకాశములో ఎగిరిన అక్షకుమారుడిని ఒక్క పిడిగుద్దుతో సంహరిస్తారు హనుమ. అది నరసింహావతారముగా మనము చెప్పుకోవచ్చు.

మూడవది గరుత్మంతుడి అవతారం. హనుమంతుడే గరుత్మంతుడు, ఎందువల్ల? గరుత్మంతుడు ఏమి చేస్తాడు? నాగముల యొక్క విషమును తొలగిస్తాడు. అందుకనే నాగజాతి గరుత్మంతుడు ఆంటే భయం. ఇవాళ కూడా EAGLES HUNT SNAKES అంటుంటాము మనము. అలాగే హనుమంతులవారు నాగాస్త్రం నుంచి వానరులను, శ్రీరామలక్ష్మణులను విడిపిస్తారు. ఇంద్రజిత్ యుద్దములో సమస్త వానరులపై, శ్రీరామలక్ష్మణులపై నాగాస్త్రం ప్రయోగిస్తాడు. అప్పుడు హనుమ గంధమాదన పర్వతం సమీపానికి వచ్చి, అక్కడ నుంచి పర్వతాలను తీసుకువచ్చి, వారిని ఆ అస్త్రం నుంచి విడిపిస్తారు.

నాలుగవది వరాహ అవతారం. వరాహ అవతారంలో శ్రీమహావిష్ణువు సముద్రములో మునిగిన భూమండలమును పైకి లేపుతారు. అలాగే రావణుడి చేత చిక్కి శోకసాగరములో మునిగిన సీతమ్మను (శ్రీరామ పత్నీ జనకస్య పుత్రీ సీతాంగనా సుందర కోమలాంగీ భూగర్భ జాతా భువనైక మాతా అన్నారు వాల్మీకి మహర్షి రామాయణములో) హనుమ ఆ దుఃఖసాగరం నుంచి బయటపడవేస్తారు వరాహావతార రూపములో.

ఆఖరిది హయగ్రీవ అవతారము. హయగ్రీవ అవతారంలో ఎలాగైతే వేదాలను పునరుద్ధరణ చేసారో విష్ణుభగవానుడు, అలాగే సకల శాస్త్రాలు అధ్యయనం చేసిన హయగ్రీవ స్వరూపమైన హనుమ స్వరూపము. నవవ్యాకరణ పండితుడు హనుమ.

వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్రాంచితం – నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా

హస్తాబ్జె రసి ఖేట పుస్తక సుధాకుంభాం కుశా ద్రిం గదాం – ఖట్వాంగం ఫణి భూరుహం దశభుజం సర్వారి గర్వాపహం

భావం:-

వానర ,నారసింహ ,గరుడ ,వరాహం, అశ్వ (హయగ్రీవ) అనే అయిదు ముఖాలతో, అనేక అలంకారాలతో, దివ్య కాంతితో, దేదీప్యమానమైన 15 నేత్రాలు (ఒక్కో ముఖానికి 3 కన్నులు), పద్మాలవంటి హస్తాలు, ఖడ్గం, ఢాలు, పుస్తకం, అమృత కలశం, అంకుశం, పర్వతం, నాగలి, మంచంకోడు(ఖట్వాంగం), మణులు, పాము, చెట్టు 10 హస్తములతో ధరించిన వాడు, పసుపు వన్నె కలవాడు, గర్వాన్ని హరించే వాడైన హనుమంతునికి నమస్కారం.

‘త్రిపంచనయనం’ అంటే పంచముఖములలో ఒక్కొక ముఖమునకు మూడు కళ్ళు గలవాడు అని అర్థం. ముక్కంటి అంటే శివుడు అని మనందరికి తెలిసిన విషయమే. ‘చెంబుడు నీళ్లు పోస్తే కుష్, చిటికెడు భూడిద పోస్తే బస్’ అంటారు పెద్దలు. ఆ పరమేశ్వరుడు భక్త సులభుడు. అట్టి పరమేశ్వరుడే హనుమంతుల రూపములో అవతరించారు. శివుడు వేరే హనుమంతుడు వేరే కాదు, విష్ణువు వేరే హనుమంతుడు వేరే కాదు. ఎందుకు? విష్ణువు హయగ్రీవునిగా అవతరించి రాక్షస సంహారం గావించి ధర్మాన్ని రక్షించారు. హనుమకున్న పంచముఖములలో ఒకటి హయగ్రీవ ముఖం. కావున హనుమ, విష్ణువు ఒక్కటే. ‘శివాయ, విష్ణు రూపాయ, విష్ణు రూపాయ శివాయ’, శివ కేశవులకు అభేదం లేనందున వారిరువురి శక్తి హనుమ రూపములో వచ్చింది. 

శివుడి ఉపాసన చేస్తే ఏ ఫలితము వస్తుందో, విష్ణువు ఉపాసన చేస్తే ఏ ఫలితము వస్తుందో, గరుత్మంతుడి ఉపాసన చేస్తే ఏ ఫలితము వస్తుందో, సర్వ దేవతలను ఉపాసన చేస్తే ఏ ఫలితము వస్తుందో ఆ ఫలితం మనకు హనుమద్ ఉపాసనతో లభిస్తుంది.

హనుమ – అష్టసిద్దులు

‘బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగతా అజాడ్యం వాక్పటుత్వం చ హనుమాత్ స్మరణాత్ భవేత్‘ అన్నారు పెద్దలు. హనుమద్ ఉపాసన చేస్తే ‘బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వం, ఆరోగ్యము, జాగరూకత, మాటలలో’ బలం కలుగుతాయి.

హనుమద్ ఉపాసన మనకి బుద్దిని అందిస్తుంది. ‘బుద్ది లేదురా నీకు’ అని మనము తరుచు ఇతరులను అంటుంటాము. ఇలా ఒకరిని మనము ఎందుకంటాము? చేయరాని పని చేస్తే, అనకూడని మాట అంటే, వెళ్లకూడని చోటుకు వెళ్తే, చూడకూడనివి చూస్తే, చెప్పకుడనివి చెప్తే ఇలా అంటారు. శాస్త్రధూషణ వంటి విషయాలలో కూడా బుద్దితో ప్రవర్తించమంటుంది  శాస్త్రం. మనిషికి ఉన్నటువంటి బుద్ది ఇతర జంతువులకు లేదు.

ఈ సృష్టిలో ఉన్న 84 లక్షల జీవరాసులలో భగవంతుడు ఒక్క మనిషికి మాత్రమే బుద్దిని అందించాడు. ఒక్క కుక్క ఉన్నదనుకోండి, దానికి పరమేశ్వరుని నివేదన కోసం ఉంచిన ఆహారం ఆ నివేదన కాకుండా ముట్టుకోకూడదనే జ్ఞానం, ఆ బుద్ది ఉండదు. కానీ అదే బుద్ది, జ్ఞానం మనిషికి ఉంటుంది. ఇది నైవేద్యం కోసం ఉంచిన ఆహారం, ఆ పరమేశ్వరునికి నివేదన అయిన తరువాత మాత్రమే మనము ఆ ఆహారాన్ని ప్రసాదముగా భావించి స్వీకరించాలి అనే జ్ఞానం, బుద్ది మనిషికి ఉంటుంది. కాబట్టి అటువంటి బుద్ది, ఎటువంటి బుద్ది, ధర్మము యందు అనురక్తులుగా ఉండే బుద్ది, ధర్మా ఢర్మ జ్ఞానము హనుమద్ ఉపాసన వల్ల లభిస్తుంది.

ఇక రెండవది బలం. మనకు బలం కావాల్సింది ఇతరులతో పోరాడటానికి కాదు. మనిషి తాను అనుకున్నది సాధించటానికి బలం కావాలి. ఏ మనిషికైనా తన జీవితములో తాను సాధించాలనుకునే కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలను సాధించాలంటే అందుకు తగిన బలం అవసరం. అది అంగ బలం, అర్థ బలం, బందు బలం, స్నేహ బలం, మిత్ర బలం, సంఘ బలం, ఇలా బలాలు చాలా రకాలుగా చెప్పారు. ఇవన్నీ కూడా   హనుమద్ ఉపాసకులకు లభిస్తాయి.

తరువాత యశస్సు. యావత్ భూమండల పర్యంతం కీర్తి వ్యాప్తి చెందితే దానిని యశస్సు అంటారు. తాను ఉండే ప్రదేశములో తన గురించి తెలిస్తే అది కీర్తి. మన పెద్దలు ‘నువ్వు ఏ పని చేసినా యశోభూషణముగా ఉండాలి, యశోభూషణముగా పని చెయ్యాలి’ అని అంటారు. మనము పది మంది మెచ్చే విధముగా పని చెయ్యాలి ఈ వాక్యాల వెనుక ఉన్న అర్థం. హనుమద్ ఉపాసకులు పదిమంది మెచ్చే విధముగా ఉండే పనులు చేయగలుగుతారు.

ఆ తదుపరి దైర్యం, నిర్భయత్వం.  ప్రతి మనిషికి ఉండాల్సింది దైర్యం. ఆ ధైరం హనుమద్ ఉపాసకులకు  లభిస్తుంది. అభయం వేరు, నిర్భయత్వం వేరు. మనకి అభయం ఉండాలి, నిర్భయం ఉండాలి. ప్రత్యేకించి ఈ కలికాలంలో, కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు నిర్భయం ఉండాలి.హనుమద్ ఉపాసన మనకి నిర్భయాన్ని అందిస్తుంది.

‘ఆరోగతా’ అంటే రోగములు పాలు కలుగకుండా ఉండటం. కరోనా వంటి మహమ్మారుల బారిన పడకుండా ఉండేలా తన భక్తులను హనుమంతులవారు ఎల్లప్పుడు కాపాడుతారు. రోగాలను పెంచకుండా, వాటిని నిరోదించగల శక్తి, హనుమద్ ఉపాసన మనకు అందిస్తుంది.  ‘అజాడ్యం’ అంటే జాడ్యం లేకుండా ఉండగలగడం. జాడ్యం అంటే అశ్రద్ధ, బద్ధకం, విషయాలను వాయిదా వెయ్యటం. ఎప్పుడు మంచిరోజు అంటే ‘శుభస్య శీగ్రమ్’ అంటోంది శాస్త్రము. మంచిపని ఎప్పుడు ప్రారంభించాలంటే ‘ఎప్పుడు సంకల్పం వస్తే అప్పుడు’ అన్నారు పెద్దలు.

ఇక్కడ మనము మహాభారతములో ఉన్న కథ ఒకటి చెప్పుకుందాము. ఒకానొక సందర్బములో ఎవరో ధర్మరాజును దానం చెయ్యమని అడిగారు. అప్పుడు అయిన ఎడమ చేతిలో ఒక విలువైన వస్తువు ఉన్నది. ధర్మరాజు వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా తన ఎడమ చేతిలో ఉన్న ఆ వస్తువును ఎడమచేతితోనే దానం చేసేసాడు. అప్పుడు ధర్మరాజు పక్కనే ఉన్న భీములవారు, “అన్నా, నీవు ధర్మాత్ముడవు కదా? మరి ఎడమ చేత్తో ఎందుకు దానం చేస్తున్నావు” అని ధర్మరాజులవారిని ప్రశ్నించారు. అప్పుడు ధర్మరాజులవారు భీమసేనుడికి ఇలా వివరించారు, “దానం ఇవ్వదలచుకున్న తరువాత ఎడమ చేతి నుంచి కుడి చేతిలోకి వచ్చే లోపల మనస్సు మారిపోగలదు. మనస్సు యొక్క లక్షణం అది. దానికి స్థిరత్వం, నిలకడ ఉండదు. కావున నా బుద్ది మారేలోపల నేను ఆలా ఎడమ చేతితోనే దానం చేసేసాను.” జాడ్యత్వం లేకుండా ఉండటం ధర్మాత్ముల లక్షణం. జాడ్యత్వాన్ని వదిలించుకోగలగటం హనుమద్ ఉపాసనతో సాధ్యం.

హనుమద్ ఉపాసనతో ‘వాక్పటుత్వం’, వాక్సిద్ధి, వాక్సుద్ధి లభిస్తాయి. ‘సురభినో ముఖా కారత్’ అని యజుర్వేదం పేర్కొంటోంది. అంటే, ‘నేను మాట్లాడే మాటలు నా ముఖము నుంచి  సుగంధము వెలువడినట్లుగా ఉండేటట్టు గాక’ అని అర్థం. ‘నేను మాట్లాడే మాట పదిమందికి మేలు కలిగే విధముగా ఉండి సౌరభాలను వెదజల్లు గాక’ అని ఈ వాక్యం యొక్క అంతరార్థం. శ్రీరాములవారు హనుమను ప్రశంసిస్తూ ”ఉచ్చారయతి కల్యాణీం’ అంటారు లక్ష్మణులవారితో. కళ్యాణి రాగం సంగీతం వచ్చిన వారికీ తెలుస్తుంది. కనులున్న చెవులకు వినిపించు రాగం, మనసున్న మనసుకు కనిపిచ్చు రాగం’ అన్నారు కళ్యాణి రాగాన్ని. కల్యాణరాగములో పాట పడితే మనస్సుకు చాలా ఆనందం కలుగుతుంధి.  హనుమంతులవారు మాట్లాడితే కళ్యాణిరాగంలో పాటపాడినంత మృదువుగా, మధురముగా, ఆకర్షణీయముగా ఉంటుంది. అటువంటి మాట్లాడటం మనము నేర్చుకోవచ్చు హనుమద్ ఉపాసనతో.

ఈ లక్షణాలన్నీ హనుమంతులవారు సుందరకాండలో స్వయముగా ఆచరించి చూపించారు. ‘యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరోజనః | సయత్ర్పమాణం కురుతే లోక స్తదను వర్తతే‘ అన్నారు. మనము సుందరకాండ చదివితే, అందులోని ప్రతి సర్గలో వాల్మీకి మహర్షి అందించిన సందేశం మనకు కనిపిస్తుంది. హనుమంతులవారి జీవితము నుంచి, సుందరకాండ నుంచి మనము నేర్చుకోవచ్చు.

హనుమంతులవారు తన భక్తులకు ఏమి చేస్తారు?

తులసీదాస్ రామాయణములో హనుమంతులవారిని కీర్తిస్తూ, ‘తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా । రామ మిలాయ రాజపద దీన్హా ॥ (నీవు సుగ్రీవుకు చేసిన గొప్ప సహాయం ఏమిటంటే, రాముని తో పరిచయం చేసి, అతనికి రాజపదవి ఇప్పించావు)’ అన్నారు. ‘రామ మిలాయ రాజపద దీన్హా’ కాసేపు పక్కన పెడితే, మనందరికీ రాములవారి అనుగ్రహం కావాల్సినదే. మనకు శ్రీరాములవారి అనుగ్రహం లభించాలంటే హనుమంతుల వారే అందుకు మార్గం చూపగలరు. ఎలాగైతే ఒక ప్రధానమంత్రిని కలవాలంటే ముందు ప్రధాన సెక్రటరీని కలుసుకోవాలో, అలాగే రాములవారు కావాలి అనుకున్న వారు హనుమంతులవారి పాదాలను పట్టుకోవాలి. హనుమ పాదాలను ఆశ్రయిస్తే రాములవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇందుకు తులసీదాస్ గారి జీవితమే ఒక ఉదాహరణ. చాలా తేలికగా, తొందరగా, భక్త సులబడిగా ఉన్న హనుమను అందుకోగలిగితే ‘రామ మిలాయ’ మనకు తప్పక లభిస్తుంది.

హనుమంతులవారి వైశిష్ట్యం ఏమిటంటే శ్రీరాములవారికి సహాయం అందించగలగటం. శ్రీరాములవారికి సహాయం చేసిన ఒకే ఒక వ్యక్తి హనుమంతులవారు. రామకార్యం మీద వెళ్తున్నాను. రామకార్యం మీద వస్తున్నాను, రాముడి కోసం చేస్తున్నాను, రాముడి కోసం సంహరిస్తున్నాను, రాముడి వల్ల చెయ్యగలుగుతున్నాను, రాముడి కోసం తిరుగుతున్నాను, ఏది చేసినా రాముడి కోసమే చేసి రాముడికి సహాయపడ్డాడు. అందుకనే రామచంద్రమూర్తి, “నీకు ఏమి ఇవ్వగలనయ్యా, నీకు ఏమి ఇవ్వలేను, నా సర్వస్వాన్ని నీకు సమర్పిస్తున్నాను”, అని గాఢముగా తన హృదయానికి హత్తుకున్నారు.

‘సీతాపహరణం జరిగింది, దానిని హనుమంతులవారు ఛేదించారు’ అంటారు. రావణుడు సీతమ్మను అపహరించటం, సుగ్రీవుడి ఆజ్ఞ మేరకు వానరులు సీతాన్వేషణ గావించటం, హనుమ సీతమ్మ జాడ కనిపెట్టడం, రాములవారు లంకకు చేరుకొని రావణుడిని సంహరించి సీతమ్మను పొందగలగటం జరిగింది అని రామాయణం పేర్కొంటోంది. హనుమ సీతమ్మజాడ తెలుసుకొని రాములవారికి తెలిపి, ఆ అపహరణాన్ని ఛేదించారు. అది హనుమ విశిష్టత.

హనుమ – రామపహరణం

‘పరాశర సంహిత’ ను అనుసరించి రామపహరణం కూడా హనుమ ఛేదించారు. ఈ కధనం మనకు వాల్మీకి రామాయణములో కనిపించదు, కానీ పరాశర సంహిత, ఇతర కొన్ని రామాయణాల్లో పేర్కొనబడ్డది. మైరావణుడు అనే రాక్షసుడు తన మాయతో రామలక్ష్మణులను అపహరిస్తే, హనుమంతులవారు ఆ మాయను ఛేదించి, మైరావణుడిని సంహరించి రామలక్ష్మణులను అతని మాయ నుంచి విముక్తులను గావిస్తారు.

రామరావణ యుద్దములో ఒక సందర్బములో వానర సైన్యం అంతా మరణిస్తుంది. ఆలా మరణించిన వానర సైన్యము అంతటిని హనుమ సంజీవిని తెచ్చి తిరిగి బ్రతికిస్తారు. అలాగే  భరతుల వారి ప్రాణాలను కూడా హనుమ నిలుపుతారు. రావణ సంహారం జరిగిన తరువాత, అయోధ్యకు తిరిగి వెళ్లే క్రమములో శ్రీరాములవారు సీత లక్ష్మణ సమేతముగా భరద్వాజ ఆశ్రమానికి వెళ్తారు. శ్రీరాములవారు హనుమతో, “హనుమా, అరణ్యవాసం గడువు ముగిసిన తరువాత మేము వెంటనే అయోధ్యకు మరలి వెళ్లకపోతే భరతుడు తాను ప్రాయోపవేశం చేస్తాను అని అన్నాడు. కావున నీవు శీఘ్రముగా బయలుజేరి మా ప్రయాణ ఆగమనం గురించి భరతుడికి వివరించు”, అని చెప్పి ముందుగా హనుమంతులవారిని అయోధ్యకు పంపిస్తారు. శ్రీరాములవారి ఆజ్ఞ మేరకు హనుమ అయోధ్య నగరానికి చేరి భరతులవారికి రాములవారి ఆగమనం గురించి వివరించి, అతని ప్రాణాలను రక్షిస్తారు.

లంకలో రావణ చెరలో  ఉన్న సీతమ్మ జాడ తెలుసుకొని, దుఃఖముతో ఉన్న ఆ తల్లిని ఊరడించి, ఆమె జాడను రాములవారికి తెలిపిన వారు హనుమ. ‘త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ | హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖ క్షయకరో భవ ||’ – ‘ఓ కపీశ్వరా, వానరోత్తమా నీవు ఈ యొక్క కార్యమును ప్రేమ పాశముతో పట్టి వుంచగల సామర్థ్యము గలవాడవు. ఓ హనుమా, నీవు ఢృడ సంకల్పితుడవై మా ధుఃఖ నిర్మూలము చేయుము గాక’ అని సీతమ్మ హనుమతో అంటుంది.

సీతమ్మ వారి దుఃఖమునే కాదు రామచంద్రమూర్తి దుఃఖమును పోగొట్టినవాడు హనుమ. అట్టి  హనుమకు మాన దుఃఖాలను, కష్టాలను పోగొట్టడం ఒక లెక్కా? మనము ఒక్కసారి ఆ స్వామికి నమస్కరించి, ప్రార్థిస్తే మన దుఃఖాలను, కష్టాలను చిటికెలో పోగొడతారు హనుమ. ఆయనకి అది పెద్ద విషయము కాదు. హనుమద్వైభవము అత్యంత విశేషమైనది.

మనకి సుందరకాండలో ఒక్కొక ఘట్టము, ఒక్కొక ఘట్టము, ఒక్కొక విషయములో అయిన యొక్క విశేషాలను తెలియజేసారు వాల్మీకులవారు. సుందరకాండలో హనుమను చారులు కీర్తిస్తూ ‘దృతి, ద్రుష్టి, మతి, దాక్ష్యం’ అంటారు. హనుమంతులవారు సముద్ర లంఘనం ప్రారంభించినప్పటి నుంచి, ‘యధా రాఘవ నిర్ముక్త శర స్వాసన విక్రమ.’ – ‘నేను రాముడు వదిలిన బాణం వంటి వాడిని’ అంటారు. సుందరకాండలో విశేషమైన హనుమద్ వైభవాన్ని మొత్తం వాల్మీకులవారు ఆవిష్కరించటం జరిగింది.

శ్రీమద్రామాయణములో హనుమ గురించి బాలకాండలో కొద్దిగా పేర్కొనబడి, తిరిగి కిష్కింధకాండ  నుంచి వారి ప్రస్తావన మనకు కనిపిస్తుంది. సుగ్రీవుల వారి ఆదేశం మేరకు రామలక్ష్మణులతో మాట్లాడుతు హనుమ మనకు కనిపిస్తారు.  హనుమంతుల వారి జననం గురించి, వారి బాల్యం గురించి శ్రీమద్రామాయణములోని ఉత్తరకాండలో వాల్మీకులవారు మనకందించారు. ‘పరాశర సంహిత’ అనే గ్రంధములో హనుమ వైభవం, లీలలు అత్యంత విస్తారముగా చెప్పబడ్డాయి. అతి విశేషమైన, అతి గొప్పవారైన, అతి మహిమకలవారైన హనుమను సూర్యునితో సమానముగా జనులు కీర్తిస్తారు.

హనుమంతులవారు సూర్యుని పట్టుకోవటానికి వెళ్ళినప్పుడు, ‘బాలార్క యువో భానుః‘ అని వర్ణిస్తారు వాల్మీకులవారు. బాలుడిగా ఉన్న హనుమ, బాల బింబము రూపములో ఉన్న సూర్యుడిని చూసి ఫలమని భ్రమించి, తినదామని ఆకాశానికి ఎగిరారు అని రామాయణములో వాల్మీకి మహర్షి పేర్కొన్నారు. విద్యాబ్యాసం కాలములో సూర్యుని దగ్గిరే సమస్త విద్యలను అభ్యసించారు హనుమ. సూర్యునితో పాటు తాను తిరుగుతూ, సూర్య గమనాన్ని తట్టుకుంటూ విద్యని అభ్యసించారు హనుమ. గురువు దగ్గిర విద్యను అభ్యసించాలంటే ఆ గురువుతోనే ఉంటూ, ఆ గురువుతో కలిసి తిరుగుతూ ఉండాలి. హనుమ విద్యాబ్యాసం కోసం సూర్యుడిని ఆశ్రయించినప్పుడు తనతో పాటు వస్తే విద్యను అందిస్తాను అన్నారు సూర్యులవారు. అప్పుడు హనుమ అందుకు అంగీకరించి, సూర్యునితో  పాటు తాను కూడా తిరుగుతూ విద్యను నేర్చుకుంటారు.

K C Das Memorial Charitable Trust

Paropakarardham Idam Sareeram

  • Instagram
  • YouTube
  • Facebook
Address
H.No. 11-13-119, 14/B, Road No. 3, beside Axis Bank, Alkapuri Colony, Ramakrishnapuram, Kothapet, Hyderabad, Telangana 500035
View on map
Contact
contact@kcdastrust.org
+91 94948 77070
04:00 PM to 08.30 PM IST

© 2026 K C Das Memorial Charitable Trust. All rights reserved.

Terms and ConditionsPrivacy Policy