హనుమత్ వైభవము
పరమేశ్వరుడు – హనుమ
హనుమ జన్మ గురించిన విశేషాలు రామాయణంలోని ‘ఉత్తరకాండలో’ పేర్కొనబడ్డాయి. ‘వైశాఖ మాసే దశమ్యాం స్థిర వాస యుక్తాయమ్‘, ‘వైశాఖ బహుళ దశమి’ శనివారం నాడు హనుమ జన్మించారని వాల్మీకులవారు శ్రీమద్రామాయణంలో పేర్కొన్నారు. వాయుదేవుని అనుగ్రహముతో అంజనాదేవికి హనుమంతులవారు జన్మించారని రామాయణం పేర్కొంటోంది. హనుమంతులవారిని అంజనీ సుతుడుగా, కేసరి నందనుడిగా వాల్మీకులవారు వర్ణించారు.
అయితే ‘హనుమ అసలు రూపం ఏమిటి? హనుమ ఎవరు?’, ఇత్యాది ప్రశ్నలకు సమాధానం మనకు ‘పద్మ పురాణం’, ‘పరాశర సంహిత’ ఇత్యాది గ్రంధాలలో లభిస్తుంది. సాధారణముగా జీవులకు తమ యొక్క పూర్వ పుణ్య, పాపముల చేత వారికి తదుపరి జన్మ లభిస్తుంది. అయితే అవతారమూర్తుల జన్మ అట్టిది కాదు. వారు ధర్మకార్యం కోసం ఈ లోకములో అవతరిస్తారు. ఒక రూపము, ఒక శక్తి, ఒక కారణము కొరకు హనుమగా అవతరించింది. ఏమిటా కారణము? రావణ సంహారం, ఏమిటా శక్తి? శివశక్తి. రావణ సంహారం కొరకు ‘విష్ణుశక్తి శ్రీరాములవారిగా, పరాశక్తి సీతమ్మగా, శివశక్తి హనుమగా’ ఈ లోకంలోకి రావటం జరిగింది.
పరమేశ్వరుని స్వరూపమే హనుమ. హనుమంతులవారు, శివుడు వేరు వేరు అని భావిస్తే మనము పొరపడినట్లే. ‘పరాశర సంహితలో‘ హనుమంతుల వారి జన్మ రహస్యం చెప్పబడింది. దుష్ట రావణుడి బారి నుంచి తమను కాపాడమని భూదేవి, ఋషులు, దేవతలు శ్రీమహావిష్ణువును వేడుకుంటారు. దేవతల విన్నపాల్ని ఆలకించిన శ్రీమహావిష్ణువు రావణ సంహారం కొరకై తాను మానవుడిగా (రామావతారం) జన్మిస్తానని పేర్కొంటారు. శ్రీమహావిష్ణువు ఎప్పుడైతే దేవతల విన్నపాన్ని మన్నించి దుష్టరావణ సంహారం కోసం శ్రీరాముడిగా అవతరించాలని సంకల్పించారో, అప్పుడే ఆ సమయములోనే కైలాసములో ఉన్న పరమేశ్వరుడు ధ్యాన నిమగ్నులై ఉంటారు. పరమశివుడు ఎంతకి తన ధ్యానాన్ని విడవకపోవడముతో, పార్వతిమాతకు శివుడు ఎవరి కోసమై ధ్యానం చేస్తున్నాడు అనే సందేహం కలుగుతుంది. కొంతసేపటి తరువాత పరమశివుడు ధ్యానం నుంచి బయటకు వస్తారు. అప్పుడు ఆ జగదంబ పరమేశ్వరులవారిని ఇలా ప్రశ్నిస్తుంది, “స్వామి, మీరు చాలాసేపటి నుంచి అన్యమనస్కులై ధ్యానం గావిస్తున్నారు, మీరు ఎందుకోసం ఈ ధ్యానం చేస్తున్నారు తెలుప ప్రార్థన.”
అందుకు పరమేశ్వరులవారు చిరునవ్వుతో, “దేవి, నేను రామతారక మంత్రాన్ని ధ్యానిస్తున్నాను”, అని పేర్కొని పార్వతిదేవికి రామనామ విశిష్టతను వివరిస్తారు. “శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే.” “ఓ మనోరమా (నా మనస్సుకు రమ్యమును కూర్చిన దాన), నేను రామనామముతో రమిస్తున్నాను. ‘శ్రీరామ రామ రామ’ అనే ఒక్క నామాన్ని పారాయణ చేస్తే మొత్తం విష్ణు సహస్ర నామాలను పారాయణ చేసిన ఫలితం లభిస్తుంది.”
“త్రిపురాసుర సంహారం జరిపినపుడు శ్రీమహావిష్ణువు బాణమై నాకు సహకరించాడు. రావణ సంహారం కోసం శ్రీమహావిష్ణువు రాముడిగా అవతరిస్తున్న కారణముగా, నేను ఆయనకు సహకరించటానికి హనుమగా అవతరించనున్నట్లు”, పార్వతిదేవికి పరమేశ్వరుడు వివరిస్తాడు.సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఈ లోకములో హనుమగా అవతరించాడు.
ఈశ్వరునికి, హనుమకు తేడా లేదు, అయితే రూపాలు మాత్రం వేరు. ఎందుకు వేరు అంటే, ఆ కారణం చేత రావణ సంహారం జరగాలి గాబట్టి. రావణాసురునికి బ్రహ్మ ఇచ్చిన వరం ‘నరవానరుల‘ చేతిలో తనకు మరణం ఉండకూడదని. రావణుడు నరుల్ని, వానరుల్ని దోమలుగా, చీమలుగా తలిచేవాడు. రావణసంహారం కోసం విష్ణువు రాముడిగా, శంకరులవారు హనుమగా వచ్చారు. ఒక కార్యం నిమిత్తం అవతరించిన మహాపురుషులు హనుమ. అవతార పురుషులు వారి వారి అవతారాన్ని తీసుకున్నప్పుడు ఆ అవతారానికి ఒక ప్రయోజనం ఉంటుంది. రామకార్యం జరగాలి గనుక తాను రావణుడిని సంహరించట్లేదు అంటారు స్వామి హనుమ లంకలో సీతమ్మతో.
హనుమ యొక్క ‘పంచముఖ ఆంజనేయ‘ స్వరూపం కూడా హనుమ శివాంశ సంభూతులు అనే సత్యాన్ని మనకు తెలుపుతోంది. ఈ రూపములో హనుమకు ఐదు ముఖములు, ప్రతి ముఖానికి మూడు కళ్ళు. ఆ పరమేశ్వరుడు కూడా త్రినేత్రుడు, పంచముఖుడు. ‘చెంబుడు నీళ్లు పోస్తే కుష్, చిటికెడు భూడిద పోస్తే బస్’ అంటారు పెద్దలు. ఆ పరమేశ్వరుడు భక్త సులభుడు. అట్టి పరమేశ్వరుడే హనుమంతుల రూపములో అవతరించారు. శివుడు వేరే, హనుమంతుడు వేరే కాదు. విష్ణువు వేరే, హనుమంతుడు వేరే కాదు. ఎందుకు? విష్ణువు హయగ్రీవునిగా అవతరించి రాక్షస సంహారం గావించి ధర్మాన్ని రక్షించారు. హనుమకున్న పంచముఖములలో ఒకటి హయగ్రీవ ముఖం. కావున హనుమ, విష్ణువు ఒక్కటే. ‘శివాయ, విష్ణు రూపాయ, విష్ణు రూపాయ శివాయ’, శివ కేశవులకు భేదం లేనందున వారిరువురి శక్తే హనుమ రూపములో వచ్చింది.