హనుమ – సిందూరం
Dharma Vaani – K C Das Memorial Charitable Trust
మనమందరం కూడా హనుమద్ దేవాలయమునకు వెళ్తుంటాము, ఆ స్వామిని దర్శిస్తుంటాము. మనము గమనించినట్లయితే హనుమద్ దేవాలయాలలో స్వామిని సింధూరముతో అలంకరిస్తారు. మనకున్న అనేక దేవి దేవతా ఆలయములలో ఒక్క గణపతి, హనుమ ఆలయములలో మాత్రమే ఈ సింధూర అలంకరణల పూజ చేస్తారు. హనుమంతులవారిని సింధూరంతో ప్రత్యేకముగా అలంకరించటానికి కారణం ఏమై ఉంటుంది అనే ఆలోచన మనము తప్పక చెయ్యాలి.
హనుమంతులవారికి సిందూరమంటే ప్రీతి, భక్తులు ఆయనకు వళ్ళంతా సిందూరం పూస్తారు. మాములుగా సిందూరం స్త్రీలు పాపిట యందు ధరిస్తారు. హనుమ తన ఒంటి నిండా సిందూరం ధరించటానికి వెనుక ఒక పురాణగాధ ఉన్నది.
ఒక రోజు హనుమంతుల వారు శ్రీరాముని అంతఃపురంలోకి ప్రవేశిస్తారు. ఆ సమయములో సీతమ్మ తన పాపిట సింధురాన్నీ అద్దుకోవడం గమనిస్తారు హనుమ. సీతమ్మ వారు తన పాపిట సింధురాన్నీ అద్దుకోవడం చూసిన హనుమకు ఎంతగానో ఆశ్చర్యం కలుగుతుంది. హనుమ సీతమ్మ చెంతకు సమీపించి, “అమ్మా! మీరు నుదుటిన ఆ సింధురాన్నీ ఎందుకు ధరిస్తున్నారు?”, అని ప్రశ్నిస్తారు. “హనుమా! నా స్వామికి సంతోషాన్ని కలిగించేందుకు ఇలా రోజు సింధురాన్నీ ధరిస్తాను. ఇలా పాపిట సింధురాన్నీ ధరించడం వల్ల స్వామి దీర్ఘాయుష్షులుగా ఉంటారన్నది నా నమ్మకం!”, అంటూ చిరునవ్వుతో సెలవిచ్చింది సీతమ్మ.
సీతమ్మ మాటలు విన్న హనుమంతుని సంతోశానికి అవధులు లేకుండా పోయాయి. సీతమ్మ పాపిట సిందూరాన్ని ధరించటం వెనుక తన స్వామి శ్రేయస్సు, సంతోషం ఉన్నాయా? అనుకొని మురిసిపోతారు హనుమ. వెంటనే హనుమ మనసులో ఓక ఆలోచన కలుగుతుంది. “ఈ కాస్త సింధురాన్నీ ధరిస్తేనే స్వామి వారి ఆయుష్షు పెరుగుతుంది అంటే, మరి ఒంటి నిండా సింధురాన్నీ ధరిస్తే ఇక తిరుగేముంది”, అనుకుంటాడు హనుమ. వెంటనే ఆలస్యం చెయ్యకుండా తన ఒంటి నిండా సింధురాన్నీ ధరిస్తారు హనుమ. శిరస్సు నుంచి పాదాల వరకు సిందూరముతో మెరిసిపోతున్న హనుమ నేరుగా రాముని దర్భారులో ప్రవేశిస్తారు.
సిందూరాన్ని వంటి నిండా అలుముకున్న హనుమను చూసిన శ్రీరాములవారు, “హనుమా! నీ ఒంటి నిండా సిందూరం పూసుకోవటానికి గల కారణం ఏమిటి?” అని హనుమను ప్రశ్నిస్తారు.
“స్వామీ! సీతమ్మ తన పాపిట సింధూరం దరిస్తే మీకు సంతోషమూ, ఆయుష్షు వృద్ది చెందుతాయని సెలవిచ్చారు. మరి నేను ఒంటి నిండా సింధూరాన్ని అలముకుంటే మరెంత కలుగుతుందో కదా! అందుకనే ఇలా…’, అంటూ చెప్పుకొచ్చాడు. హనుమంతుని మనస్సులో తన పట్ల ఉన్న ఆరాదనని గమనించిన రాముని సంతోషానికి అవదులు లేకుండా పోయాయి. “హనుమా నువ్వు నా భక్తులందరికి ఆదర్శంగా నిలిచావు. ఇక మీదట సింధురాన్నీ ఎవరైతే ధరిస్తారో వాళ్లు నీ అనుగ్రహానికే కాదు, నా అనుగ్రహానికి కూడా పాత్రులవుతారు”, అంటూ హనుమను ఆశీర్వదించారు శ్రీరాములవారు. అప్పటి నుంచీ హనుమంతుల వారు నిత్యం సింధూర వర్ణంలో మెరిసిపోవడం, ఆయన సింధూరాన్ని మనమూ కాస్త నుదిటిన అద్దుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సిందూరం ధరించటం వల్ల హనుమ అనుగ్రహము, రామానుగ్రహము భక్తులకు లభిస్తుంది.
సిందూరం ఆంజనేయుడికి ప్రీతిపాత్రం కావడం వెనుక రామాయణ గాథలో ఒక ఘట్టాన్ని మరొక కారణంగా చెబుతారు. రామరావణ సంగ్రామం జరిగే సమయంలో ఒక సందర్భంలో శ్రీరాముడు ఆంజనేయుడి భుజాలపై ఎక్కి యుద్ధం చేశాడు. ఆ సమయంలో రావణుడు విసిరిన బాణాలు తరచుగా ఆంజనేయుడికీ తగిలాయి. హనుమ శరీరమంతా రక్తసిక్తమౌతుంది. అయినా ఏ మాత్రం చలించకుండా దృఢదీక్షతో నిలబడతాడు రాంబంటు. రక్తంతో తడిసి ముద్దయిన హనుమ దేహం ‘పూచిన మోదుగచెట్టువలె ఉంద’ని వాల్మీకి మహర్షి వర్ణించారు. ఆనాటి సన్నివేశం హనుమకు ఎంతో ఆనందాన్ని, సంతృప్తినీ కలిగించింది. ఆంజనేయుడికి స్వామికార్యం తప్ప స్వకార్యం లేదు కదా!
ఈనాటికీ తిరుమల బ్రహ్మోత్సవాలు సహా అన్ని వైష్ణవ ఆలయాల ఉత్సవాల్లో విష్ణుమూర్తికి ‘హనుమత్ వాహనం’ ఏర్పాటు చేసే సంప్రదాయం కనిపిస్తుంది. ఆంజనేయుడికి ఎర్రని సిందూరం అలదినప్పుడు ఆనాడు రామయ్య కోసం శరీరం రక్తసిక్తమైన వేళ తను పొందిన ఆనందం తలపులో మెదిలి హనుమ ఆనందిస్తాడట! వెంటనే భక్తుల పట్ల ప్రసన్నుడౌతాడని పెద్దల మాట.
సిందూరపు రంగు ఎరుపు. ఎర్రని రంగు పరాక్రమానికీ, పవిత్రతకూ, త్యాగానికీ సంకేతం. ఈ గుణాల సమ్మేళనమే హనుమంతుడు. కాబట్టి హనుమత్ అర్చనలో సిందూర పూజ ప్రత్యేకమైనదిగా నిలిచింది.