హనుమంతుడు – పరోపకారం
హనుమంతుల వారి చరిత్రను మనము సరిగా అర్థం చేసుకుంటే ‘పరోపకారార్థం ఇదం శరీరం’ అనే సత్యం మనకు ఆవిష్కారమౌతుంది. ‘పరోపకారార్థం ఇదం శరీరం’ అనే సత్యవాక్కుని అణువణువునా అడుగడుగునా ఆచరించి చూపిన మహనీయుడు హనుమ.హనుమ జీవితము నుండి మనము నేర్చుకోవాల్సిన పాఠము ఏమిటి? హనుమ నడవడిక మనకిచ్చే సందేశం ఏమిటి అని ఆలోచించే ప్రయత్నం చేద్దాము.
హనుమంతులవారిని ‘పర ఉపకారి, రామపుజారి, మహావీర భజరంగబలి’ అంటారు. హనుమత్ చరిత్ర గనక మనము చూస్తే, ప్రతి ఘట్టములో ఆయనకున్న పరోపకార లక్షణం మనకు కనిపిస్తుంది. పరులకు ఉపకారం చెయ్యటం కోసమే హనుమంతుడు ఉన్నాడా అని మనకు అనిపిస్తుంది. “శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం…”, అని “ఆంజనేయ దండకములో” హనుమను కీర్తిస్తాము. హనుమ చేసిన పరోపకార కార్యాలన్నీ ఈ దండకములో మనకు కనిపిస్తాయి.
రామాయణములో హనుమ ప్రవేశ ఘట్టంలోనే వాల్మీకి మహర్షి హనుమకున్న పరోపకార గుణమును మనకు వివరిస్తారు. రామలక్ష్మణులను దూరం నుంచి చూసి భయపడుతున్న సుగ్రీవుడికి దైర్యానిస్తున్న ఘట్టంతో హనుమను రామాయణములోకి ప్రవేశపెడతారు వాల్మీకి మహర్షి. “దొల్లి సుగ్రీవుకున్-మంత్రివై స్వామి కార్యార్థమై యేగి శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి సర్వేశు బూజించి యబ్భానుజుం బంటు గావించి” – సుగ్రీవుడికి శ్రీరాములవారితో స్నేహం గావించినవారు హనుమ. ‘తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా | రామ మిలాయ రాజపద దీన్హా’, అంటారు తులసీదాస్ హనుమాన్ చాలీసాలో. హనుమ సుగ్రీవునికి చేసిన గొప్ప మేలు అతనికి శ్రీరాములవారితో స్నేహం గావించటం, తద్వారా వాలి మరణాంతరం సుగ్రీవుడు కిష్కింధకు రాజు కాగలిగాడు. సుగ్రీవుడు తన సహాయంతో రాజ్యాన్ని సాధించగలిగినప్పటికీ, హనుమ అతని నుంచి ఎన్నడు ఏమి ఆశించలేదు.
“శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్ లంకిణిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్ యభ్భూమిజం జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చి యారత్నమున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషమున్జేసి” – రాముడికి సహాయం చెయ్యటం కోసం, సీతమ్మను వెతకటం కోసం హనుమంతులవారు నూరు యోజనాల సముద్రాన్ని లంఘించి, లంకకు చేరుకొని, సీతమ్మ జాడ తెలుసుకుంటారు.
సీతమ్మకు రాములవారి సందేశాన్ని తెలిపి, ఆ తల్లి దుఃఖాన్ని తీర్చి, తిరిగి సముద్రాన్ని దాటి, రాములవారిని చేరి, ఆ స్వామికి తల్లిని గురించిన వార్త తెలిపి సీతారాములకు యెనలేని ఉపకారం గావించారు హనుమ. హనుమ సముద్రాన్ని లంఘించి సీతమ్మను దర్శించి, తిరిగి మళ్ళీ సముద్రాన్ని లంఘించి ఇవతలి వడ్డున ఉన్న వానరుల వద్దకు వచ్చాక, వానరులు హనుమను కీర్తిస్తూ, “హనుమా, నీవు మా అందరి ప్రాణాలు నిలిపావయ్యా” అంటారు. సర్వవానర జాతి ప్రాణాలు నిలిపి, వానరులందరుకు ఉపకారం చేసిన పరోపకారి హనుమ.
సీతాదేవి క్షేమ సమాచారాన్ని తెలిపిన హనుమని శ్రీరాములవారు ఎంతగానో మెచ్చుకొని, “హనూమ, నీవు రఘు వంశమునకు ఎంతగానో మేలు చేకూర్చినావు. నీవు చేసిన మేలుకు నేను తిరిగి ఏమి ప్రత్యుపకారం చెయ్యలేను, నా ఆలింగన సౌఖ్యం మాత్రమే నీకు అందించగలను”, అని హనుమను ఆలింగనం చేసుకుంటారు. శ్రీరాములవారికి చేసిన ఉపకారాలకు ప్రతిగా హనుమ వారిని ఎన్నడు ఏమి కోరలేదు, ఏమి ఆశించలేదు.
“కుంభకర్ణాదుల న్వీరులం బోర శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ నవ్వేళను న్విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి” – రాక్షసుడైన విభీషణుడికి సైతం మేలు చేసిన వారు హనుమ. విభీషణుడు రావణాసురుడిని ధర్మమార్గములో ఉంచటానికి ప్రయత్నించి విఫలుడై రాముడిని ఆశ్రయించవస్తాడు. అప్పుడు సుగ్రీవుడు, ఇతర వానర ప్రముఖులంతా విభీషణుడిని నమ్మక, అతనికి ఆశ్రయం ఇవ్వవద్దని రాముడితో చెప్తారు. ఒక్క హనుమంతులవారే విభీషణుడికి మద్దతుగా నిలుస్తారు. లంకలో హనుమ ఇంద్రజిత్ అస్త్రానికి కట్టుబడి రావణసభలో ఉన్నపుడు, రావణుడు హనుమను సంహరించాలని భావిస్తే, దూతని వధించరాదనే ధర్మాన్ని విభీషణులవారు రావణుడికి భోదించి, రావణునిచే ఆ ప్రయత్నాన్ని విరమింపచేస్తారు. విభిషణులవారు తనకు చేసిన మేలును గుర్తుంచుకున్న హనుమ, తనకు అవకాశం లభించినప్పుడు విభీషణునకు మద్దతుగా నిలిచి, శ్రీరామునితో స్నేహం గావించి, అతనికి యెనలేని మేలు చేకూరుస్తారు. ‘కృతేచ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతనః‘, మనకు సహాయం చేసిన వారి మేలును ఎప్పుడు మరువకూడదు, వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి అనే నీతిని మనము హనుమ ద్వారా గ్రహించాలి.
తులసిదాస్ రచించిన రామచరితమనస్ అనుసరించి హనుమంతులవారే విభీషణునికి శ్రీరాములవారికి ఆశ్రయించమని సలహా ఇస్తారు. ‘తుమ్హరో మంత్ర విభీషణ మానా | లంకేశ్వర భయే సబ జగ జానా ||’ అంటారు తులసీదాస్ హనుమాన్ చాలీసాలో. హనుమ సలహాతో విభిషణుడు శ్రీరాములవారికి ఆశ్రయించి రావణవధ అనంతరం లంకకు రాజు కాగలిగినప్పటికీ, అతని నుంచి ప్రత్యుపకారముగా తిరిగి ఏమి ఆశించలేదు హనుమ.
“రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్వైచి యాలక్షణున్ మూర్ఛనొందింపగానప్పుడే నీవు సంజీవినిన్దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా” – హనుమంతులవారు సంజీవి పర్వతాన్ని తెచ్చి లక్షణుడిని, సర్వవానరులను కాపాడుతారు. అందుకు ప్రతిగా వారు ఎవ్వరి నుంచి ఏమి ఆశించలేదు. రావణ వధ అనంతరం శ్రీరాములవారు హనుమను ముందుగా అయోధ్యకు వెళ్లి భరతుడిని కలసి, తమ ఆగమన వార్త వివరించమంటారు. శ్రీరాములవారు తమ వనవాస దీక్షా కాలం ముగిసిన తరువాత అయోధ్య మరలిరాకపోతే తాను ప్రాయోపవేశం చేస్తానని భరతులవారు ప్రతిజ్ఞ చేస్తారు. శ్రీరామ ఆగమన వార్త భరతునికి వివరించి, అతనికి యెనలేని ఉపకారం చేసినవారు హనుమ.
హనుమ తన జీవితములో ఎందరికో ఎన్నో ఉపకారాలను గావించినప్పటికీ, అందుకు ప్రతిఫలాన్ని ఎవ్వరి నుంచి ఎన్నడూ ఏమి ఆశించలేదు. సుగ్రీవుడిని గాని, విభీషణుడిని గాని, శ్రీరాముడిని గాని హనుమ రాజ్యం అడిగి ఉంటే, అందుకు వారు సంతోషముగా అంగీకరించేవారు. కానీ తాను ఏమి ఆశించకుండా, పరుల కొరకు తన జీవితాన్ని గడుపుతూ, జనులందరికి ఆదర్శముగా నిలిచిన వారు హనుమ. త్యాగ నిరతి, నిస్వార్థ సేవ, నిరఫలాపేక్ష భావన ఇత్యాది లక్షణాలను హనుమ ద్వారా మనము గ్రహించి, ఆ లక్షణాలను మన జీవితములో ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
పరోపకారం కోసం ఎన్నో కార్యాలను చేసిన హనుమ ఏ మాత్రం అహంకారం లేకుండా, నేను చేశాను అనే భావన లేకుండా, ‘దాసోహం కోసలేంద్రస్య‘ అన్నారు. రాముడి యొక్క దాసుడిగా తనను తాను పేర్కొనటం హనుమ యొక్క వినయాన్ని తెలుపుతోంది. పరోపకారార్థం ఎంత కష్టమైన కార్యం సాధించాల్సిన సరే వెనకడుకు వెయ్యక, పరుల కొరకు సహాయపడుతూ, ‘పరోకారార్థం ఇదం శరీరం’ అనే సత్యానికి అనుగుణముగా మన జీవన విధానం ఉండాలని హిందూ శాస్త్రం పేర్కొంటోంది. ఆలా జీవించినవారు హనుమ. మనిషి తన కోసం తాను ఎలాగో జీవిస్తాడు. పశు పక్ష్యాదులు సైతం తమ కోసం తాము జీవిస్తాయి. కానీ మనిషిగా పుట్టినందుకు మానవుడు చెయ్యవలసింది ఏమిటి అంటే ‘పరోపకారం’. మన కొరకు మనము చూసుకుంటూ, పరులకు ఏ విధముగా మనము ఉపయోగపడగలము అనే ఆలోచన చెయ్యాలి. పరోపకారం అంటే డబ్బు ఇవ్వక్కర్లేదు అందరికి. మనకు భగవంతుడు ఇచ్చిన దాంట్లో, ‘అది శ్రద్ద అయితే ఆ శ్రద్ధను అందించటం, మేధస్సు ఇచ్చి ఉంటే ఆ మేధస్సును ఇతరులకు పంచటం, అలాగే సంపద ఇచ్చి వుంటే ఆ సంపదను లేనివారికి ఇచ్చి ఆదుకోవటం’, ఇలా రకరకాలుగా భగవంతుడు మనకు ఇచ్చినది పరుల కొరకు వినియోగించటం పరోపకార లక్షణం. ఆ లక్షణాలను ప్రదర్శిస్తూ, తన శక్తి సామర్ధ్యాలను రాముని కోసం వినియోగించారు హనుమ.