దేశభక్తి, దైవభక్తి
స్వాతంత్ర దినోత్సవమును ఒక సెలవ రోజుగా అనుకోవడం సరి కాదు. ఒకసారి మనం చరిత్రను గనుక చూస్తే మన దేశం మీద దండయాత్రలు చేసినటువంటి వారి చరిత్రలు చదివితే, మన యొక్క ప్రాథమిక హక్కులను హరించి, మన దేశవాసులను పెట్టినటువంటి ఇబ్బందులు చదివితే, కళ్ళ వెంట నీళ్లు రాకుండా ఉండవు. స్వాతంత్ర దినోత్సవము నాడు మనం దేశం కోసం త్యాగం చేసిన మహనీయులందరినీ స్మరించుకోవాలి, వారికి నివాళలు అర్పించాలి, శ్రద్ధాంజలు ఘటించాలి.
వారి యొక్క కృషి, వారు పెట్టిన భిక్ష వలన ఇవాళ మనం దేశంలో ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతున్నాం, మన జీవితం మనం గడుపుకోగలుగుతున్నాం. కావున అది మన బాధ్యత అని మనం గుర్తించాలి. ‘జననీ జన్మభూమిశ్చ జాగ్నవీచ జనార్ధన జనకః పంచమస్చైవ జకారా: పంచ దుర్లభః’ అంటుంది శాస్త్రం. జ అనే అక్షరంతో ప్రారంభమయ్యేటువంటిది మొట్టమొదటిది జనని. తల్లిని మించిన దైవం లేదు. కాబట్టి తల్లిని ప్రత్యక్ష దైవంగా పూజించండి అని చెబుతున్నది. రెండవది జన్మభూమి.
‘జననీ జన్మభూమిశ్చ.’ – ‘నువ్వు పుట్టినటువంటి ఈ భారతదేశంలో, (ఈ భారతదేశం పట్ల) తల్లి పట్ల ఎటువంటి బాధ్యతనైతే చూపిస్తావో అటువంటి బాధ్యతనే దేశం పట్ల కూడా చూపించాలి.’ నేను ఒక్కడిని చేయకపోతే ఏమవుతుందిలే అనుకుంటే నీ వల్లనే దేశం పాడవుతుంది అని కూడా నువ్వు ఆలోచించుకోగలగాలి. ఎందుకంటే నీలాగనే ప్రతివారు ఆలోచిస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి అనేటువంటి ఆలోచన చేస్తే అప్పుడు సమాధానం దొరుకుతుంది. మిగతా వాళ్ళ సంగతి నాకు అనవసరం నేను మాత్రం దేశం పట్ల భక్తితో ఉంటాను అనే ఆలోచన మనలో రావాలి. ఎందుకంటే దైవభక్తి వేరు దేశభక్తి వేరు కాదు.
మన దేశం యొక్క గొప్పతనం. ఇది పవిత్ర భూమి. ఇది పుణ్యభూమి. ఇది కర్మభూమి. ఇది వేదభూమి. ఇది శాస్త్ర భూమి. ఇది పురాణ భూమి. ఇది మహర్షుల భూమి, మహనీయుల భూమి, సిద్ధుల భూమి. ఈ భూమి మీద నడిచినటువంటి మహనీయులందరూ ఎందరో. ఎన్నో లక్షల సంవత్సరాల కాలము నుంచి చరిత్రలో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఏదో 1000 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చరిత్ర కాదు మనది. అటువంటి పవిత్రమైనటువంటి భూమిలో పుట్టాము, ఇక్కడ పుట్టడమే అదృష్టం. ఈ భూమి మీద నడవడమే అదృష్టం. రాముడు నడిచిన భూమి, కృష్ణుడు తిరిగిన భూమి. సాక్షాత్ శ్రీ మహావిష్ణువే అవతారాలు ఎత్తి నడిచినటువంటి భూమి మీద ఆయనతో పాటుగా మనం కూడా నడవగలుగుతున్నాం. కాబట్టి ఇటువంటి భూమిని అత్యంత పవిత్రంగా ఎంతో భక్తిగా, ఎంతో శ్రద్ధగా, గౌరవంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకు కూడా ఉన్నది.

ఒక జెండాకు వందనం చేసి మళ్ళీ వచ్చే సంవత్సరం ఆగస్టు 15వ తారీకు చూసుకుందాములే అని కాకుండా, ‘ప్రతిరోజు దేశానికి నేను ఏం చేస్తున్నాను, నా వల్ల దేశానికి ఏమిటి ప్రయోజనం, నేనేమన్నా చేయగలిగి చేయకుండా ఉంటున్నానా?’ (బద్ధకంతో గాని అలసత్వంతో గాని అశ్రద్ధతో గాని నిర్లక్ష్యంతో గాని కారణం ఏదైనా సరే) ‘దేశానికి కావలసినటువంటి ఒక భక్తుడు మౌనంగా ఉండడం కూడా ప్రమాదమే’, అంటారు స్వామి వివేకానంద. దైవము వేరు, దేశము వేరు కాదు అని చెప్పడానికే రామాయణంలో సీతమ్మ భూమి నుండి పుట్టింది. ఆవిడ వేరే దేశంలో ఉన్నటువంటి భూముల నుండి
పుట్టలేదు, భారతదేశంలో ఉన్న భూమి నుండే పుట్టింది. కాబట్టి ఈ భూమి యొక్క పవిత్రత అటువంటిది. ఈ జాతి యొక్క విశిష్టత అటువంటిది. అందులో పుట్టినందుకు మనందరం గర్విద్దాం. భారత్ మాతాకి జై అంటూ బతుకుదాం. ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను’, అని శ్రీశ్రీ గారు అన్నట్లుగా దేశం కొరకు నేను కూడా ఏదో ఒకటి చేశాను అనేటువంటి ఒక ఆత్మ తృప్తితో జీవించే ప్రయత్నం చేద్దాము.
ధర్మశ్రీ విజయోస్తు