భగవత్ గీత అధ్యయనం – దైవాసురసంపద్విభాగ యోగః 14
శ్రీ కల్వకొలను చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థ
భగవత్ గీత అధ్యయనం
ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః
::శ్రీమద్భగవద్గీత::
అథ షోడశోధ్యాయః ( పదహారవ అధ్యాయం)
దైవాసురసంపద్విభాగ యోగః
అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరానపి ।
ఈశ్వరోఽహమహం భోగీ సిద్ధోఽహం బలవాన్ సుఖీ ।। 14 ।।
నేను నా శత్రువును చంపేశాను, మిగిలిన శత్రువులను కూడా చంపుతాను; నేనే ప్రభువును, భోగాలను అనుభవించేవాడిని, సమర్థుడిని, బలవంతుడిని మరియు సుఖిని. సర్వ సిద్దులు నా వశములోనే వున్నయి.
ఆఢ్యోఽభిజనవానస్మి కోఽన్యోఽస్తి సదృశో మయా ।
యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞానవిమోహితాః ।। 15 ।।
నేను గొప్ప వంశంలో పుట్టాను, అత్యంత ధనవంతుడను; నాకెవరూ సాటి రారు. నేను యజ్ఞాలు చేస్తాను, దానాలు ఇస్తాను, తద్వారా కలిగే సుఖాలను అనుభవిస్తాను” అని అజ్ఞానంతో మోహానికి లోనైనవారు భావిస్తారు.
అనేకచిత్తవిభ్రాంతాః మోహజాలసమావృతాః |
ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేఽశుచౌ” || 16 ||
13 నుండి 15 వరకు ఉన్న శ్లోకాలలో వివరించినట్లుగా, అసుర స్వభావం కలిగిన అటువంటి వ్యక్తుల గతి గురించి పరమాత్మ ఇక్కడ తెలియజేస్తున్నారు.
అటువంటి వ్యక్తులు మోహమాయలో చిక్కుకుని, ‘అనేకచిత్తవిభ్రాంతులు’గా (అంటే అస్థిరమైన మనస్సు కలిగి, శరీరం, పిల్లలు మొదలైన వాటిపై తీవ్రమైన అనుబంధం ఉన్నవారిగా) ఉంటారు. తాము శాశ్వతులమని, తాము చేసేదే సరైనదని భావించే అహంకారపూరితమైన స్వభావం వారిది. వారి యజ్ఞాలు, దానాలు కేవలం అహంకారం మీద ఆధారపడి ఉంటాయి; అంతేకాక, వారు ఇచ్చిన మాటను తప్పడానికి ఏమాత్రం వెనుకాడరు.
“కోరికలు మరిన్ని కోరికలకు దారితీస్తాయి” అనే వాస్తవాన్ని వారు విస్మరిస్తారు. వారి గతి అత్యంత అపవిత్రమైన నరకమేనని భగవానుడు స్పష్టం చేశారు. వారు ఎంత ధనవంతులైనా లేదా ఎంత కీర్తిని కలిగి ఉన్నా, వారి స్థితి అసుర స్వభావం కలిగినదిగానే ఉంటుంది; వారు చిత్తశుద్ధిని పొంది ధర్మ మార్గంలోకి వచ్చేంత వరకు ఆ స్థితి అలాగే కొనసాగుతుంది.
చాలా సందర్భాలలో, జనులు ‘నేను’ అన్నప్పుడు, అది వారి అహంకారము మాట్లాడుతున్నట్టు, వారు కాదు. ఈ అహంకారము అనేది అభిప్రాయాలు, బాహ్య వేషధారణ, కోపావేశాలు వంటి వాటితో వ్యక్తిగత అనుసంధానం అయి ఉంటుంది. ఈ అహంకారము అనేది దానికే ఒక ప్రత్యేక వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటుంది, దాని ప్రభావముచే, జనులు తలంపులు, భావోద్వేగాలు, మరియు జ్ఞాపకాలతో అనుసంధానమై ఉంటారు మరియు వాటిని తమలో భాగమే అనుకుంటారు. ఈ అహంకారమే ‘ఇది నాది’ (యజమానత్వము) అన్న భావన కలిగి ఉంటుంది, కానీ ఈ యజమానత్వము తాత్కాలికమైనదే. దానిలోనే దాగి ఒక ‘ఇది చాలదు’ అన్న గాఢమైన అసంతృప్తి భావన ఉంటుంది. ఈ యొక్క తీరని కోరికే వ్యాకులతని, కలవరపాటుని, విసుగుని, ఆందోళనని మరియు అసంతృప్తిని కలుగ చేస్తుంది. పర్యవసానంగా, యదార్థము యొక్క మరింత వికృతమైన అనుభూతి కలుగుతుంది, అది నిజమైన ఆత్మ నుండి ‘నేను’ ని మరింత దూరం చేస్తుంది.
ఈ అహంకారమే మన జీవితంలో అత్యంత పెద్ద అబద్దాన్నిసృష్టిస్తుంది, మనం-కాని దాన్ని మనముగా చూపిస్తుంది. ఈ విధంగా, ధర్మమార్గంలో పురోగతి కోసం, సమస్త మతధర్మాలూ మరియు సాధువులు, మన అహంకార పూరిత ఆలోచనా పరంపరను విధ్వంసం చేయాలని, వేడుకుంటారు.
సంత్ కబీర్ దీనిని చాలా చక్కగా పేర్కొన్నాడు:
ఊంచే పానీ న ఠికే, నీచే హి ఠహరాయే
నీచా హోయ సో భరి పీ, ఊంచా ప్యాసా జాయ
‘నీరు ఎత్తులో ఉండిపోదు; అది సహజంగానే పల్లమునకు పారుతుంది. అణకువగా నమ్రతగా ఉన్నవారు (భగవంతుని కృపను) తనివితీరా త్రాగుతారు, అదే సమయంలో గొప్పతో, దంభముతో ఉన్నవారు దాహంతోనే ఉండిపోతారు.’
జై శ్రీ కృష్ణ
ధర్మో రక్షతి రక్షితః