భగవత్ గీత అధ్యయనం – దైవాసురసంపద్విభాగ యోగః 9
శ్రీ కల్వకొలను చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థ
భగవత్ గీత అధ్యయనం
ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః
శ్రీమద్భగవద్గీత
అథ షోడశోధ్యాయః ( పదహారవ అధ్యాయం)
దైవాసురసంపద్విభాగ యోగః
ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోఽల్పబుద్ధయః |
ప్రభవన్త్యుగ్రకర్మాణః క్షయాయ జగతోఽహితాః || 9 ||
భావం: వికృతమైన ఆలోచనా విధానం, అల్పబుద్ధి మరియు నాస్తిక భావన కలిగిన అటువంటి వ్యక్తులు, క్రూరమైన పనులకు పాల్పడుతూ ఈ ప్రపంచ వినాశనానికి కారణమయ్యేలా జన్మిస్తారు.”
భగవంతుడు అసుర స్వభావం కలిగిన వారిని “నష్టాత్ములు” (చెడిపోయిన మనస్తత్వం కలవారు) అని పేర్కొన్నారు. అంటే, వీరు నాస్తికులు మరియు ఏ మార్గంలోనైనా సరే తమ కామవాంఛలను తీర్చుకోవడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నవారు. వీరి బుద్ధి ఎల్లప్పుడూ స్వార్థపూరితంగా, సంకుచితంగా మరియు దూరదృష్టి లేనిదిగా ఉంటుంది.
“క్షయాయ జగతః” (ప్రపంచ వినాశనం కోసం): అసుర స్వభావం గల ఇటువంటి వ్యక్తుల జననం అభివృద్ధి కోసం కాదు, పైగా ఇతరులను అధోగతి పాలు చేయడానికి ఉద్దేశించినది. ఇది ఇతరులపై చేసే అకృత్యం తప్ప మరొకటి కాదు. వీరి చర్యలు ఇతరులకు మరియు సమాజానికి హాని కలిగిస్తాయి. వీరు లోక హితం కోరేవారు కాదు, లోకానికి ముల్లులాంటివారు (లోకకంటకులు). వీరు లోకానికి బంధువులు కాదు, వినాశనకారులు; ఎల్లప్పుడూ ఈ భూమికి భారంగానే మిగిలిపోతారు.