Skip to navigation
K C Das Memorial Charitable Trust
Donate
  • Home
  • About
  • Library
    • Dharma Vaani
    • Sri Lalitha Sahasra Naamavali
    • Dharmavaaradhi e-Magazine
    • Guru Vaani
    • Saradamba TV (Grandly Launched)
  • Dharmika Programs
    • All programs
    • Hanuman Chalisa
    • Gayathri Japam
    • Bala Japam
    • Calendar
  • Spiritual Education
  • Community Welfare
  • Contact
Donate
  • Instagram
  • YouTube
  • Facebook
  • Instagram
  • YouTube
  • Facebook
Donate

ఆదిత్య హృదయం – రామాయణ నేపథ్యం, తత్త్వార్థం మరియు ఫలశ్రుతి

ఆదిత్య హృదయం – రామాయణ నేపథ్యం, తత్త్వార్థం మరియు ఫలశ్రుతి

పూజ్య గురుదేవుల ప్రవచనామృతం 

“ఆదిత్య హృదయం”, అనేటువంటిది ఒక అద్భుతమైన స్తోత్రము. మానవ జీవితములో కావాల్సినవన్నీ కూడా అందులో సమకూర్చి అగస్త్యులవారి రూపములో మానవాళి శ్రేయస్సు కొరకై ఇవ్వబడినది, దైవదాయకమైనటువంటి స్తోత్రము, చాలా తేలికైనటువంటి పదాలలో, నిగుడార్దాలు జొప్పించి, మనుష్యులకు నిత్య జీవితములో వచ్చే దుఃఖ, దారిద్య్ర బాధలన్నీ తొలగిపోయి, కష్టాల నుంచి గట్టెక్కటానికి, సుఖసంతోష ఆయురారోగ్య ఐశ్వర్యాలను  పొందటానికి, గ్రహబాధలను తొలగించుకోవటానికి ఆదిత్య హృదయ పారాయణ ఎంతో విశిష్టముగా చెప్పబడినది.

ఆదిత్య హృదయం అంటే ఏమిటి?

మనకి ఆదిత్యహృదయము అనేటువంటిది “రామాయణములో వాల్మీకి మహర్షి అగస్త్యుల వారి రూపములో”, వారినోట్లో నుంచి అందించినట్లుగా మానవాళికి అందించారు. నిజానికి  ఆదిత్యహృదయము అనేటువంటిది సూర్యోపాసన, సూర్యారాధన. ఇది వేదప్రతిపాదితమైనటువంటిది. వేదము అంటే అనాది నుంచి వస్తున్నటువంటిది, అందుకనే ‘సనాతన ధర్మము’ అంటారు. ‘సనాతనము’, అంటే ఆది లేనటువంటి ధర్మము. కాబట్టి ఎప్పటి నుంచి ఉన్నదో చెప్పలేము, కానీ రామాయణములో దాన్ని శ్లోక రూపములో అందించారు, సూర్యుడి యొక్క గొప్పతనాన్ని.

‘ఆదిత్యుడు’, అంటే సూర్యుడు. సూర్యుడు ఒక నక్షత్రం, గ్రహం అంటుంది ఆధునిక శాస్త్రం. మన మహర్షులు కూడా సూర్యుడిని నవగ్రహాలలో ఒకడిగా పేర్కొన్నారు. కానీ ‘చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్యశాస్త్రంబులు నే జదివినవి గలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ!’, అని మనకి పోతనగారి పద్యం ఒకటుంది. పోతన రచించిన శ్రీమద్భాగవతంలోని పద్యం ఇది.

హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుడిని విద్యాభ్యాసం కోసం గురువులైన చండామార్కుల వారి దగ్గర చేర్చుతాడు. కొంతకాలం గడిచాక, కుమారుడు ఎంతవరకు చదువుకున్నాడో తెలుసుకుందామనే ఉద్దేశంతో ఆశ్రమానికి వచ్చి, కొడుకును ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నకు జవాబుగా ప్రహ్లాదుడు చెప్పినదే ఈ పద్యం. “నాన్నగారు! నన్ను గురువులు చక్కగా చదివించారు. ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం మున్నగు ముఖ్య శాస్త్రములు అన్నీ చదివి, అన్ని చదువులలోని సారమూ, రహస్యము సంపూర్ణంగా గ్రహించాను”, అని ఈ పద్యం యొక్క భావం.

“చదువులలో మర్మము”, అంటే ఏ చదువు చదివితే మళ్లీ చదవవలసిన అవసరం రాదో, ఆ చదువు. విద్య మనకి రెండు రకాలు – “లౌకిక విద్య, పారమార్థిక విద్య”. ఇహము, పరము. ఐహికముగా ఇహలోకానికి సంబంధించిన విషయాలను సాధించుకోవటానికి కావాల్సిన విద్య – ‘లౌకిక విద్య’. ఆముష్మికముగా అంటే పరమాత్మకు సంబంధించిన విద్య – ‘పారమార్థిక విద్య’.  ఈ ఆదిత్యహృదయము ఐహికము, ఆముష్మికము రెండు కలసి ఉన్నటువంటిది. అంటే భౌతికంగా కనపడే సూర్యుడు ఒక గ్రహము అనే దగ్గిర ఆగిపోకుండా, మన మహర్షులు దాని అవతల తాత్వికముగా ఏమి ఉన్నది, ఆధ్యాత్మికంగా ఏమి ఉన్నది అని కూడా తెలుసుకున్నారు.

వేమనగారు ఒక పద్యములో “చదివి చదివి చదివి చావంగ నేటికి? చావులేని చదువు చదవవలయు చదువులేక కోటి జనులు చచ్చిరికదా! విశ్వదాభిరామ వినురవేమ!“, అన్నారు. “పనికి రాని చదువులు ఎన్ని చదివినా ఏమి ప్రయోజనం. అసలు చావంటూ లేని చదువు ఐన తత్వం చదివితే సత్యమంటే ఏమిటో తెలుస్తుంది. ఈ విషయం తెలియకుండానే వ్యర్దమైన చదువులు చదివి వ్యర్దంగానే చనిపోతుంటారు”, అని పద్యం యొక్క భావం. ఏ చదువు చదివితే మళ్లీ జననం అంటూ ఉండదో, అటువంటి చదువు చదవమన్నారు. ఆదిత్య హృదయము పారాయణ చేస్తే అటువంటి ఆలోచనలు కలుగుతాయి. ఎందుకంటే ‘పారాయణము’ అంటున్నాము. ఈ శబ్దాల్లోనే ఉన్నాయి. ‘ఆదిత్య, హృదయ, పారాయణ’.

ఆదిత్యుడి

‘ఆదిత్యుడు’, అంటే సూర్యుడు. సూర్యుని యొక్క విశేషమైనటువంటి అంశము మనకు తెలుసుకోగలిగితే, సూర్యుని యొక్క హృదయం ఎటువంటిదో మనము తెలుసుకోగలిగితే, ఆ దారిలో మనము కూడా నడవగలుగుతాము. ఒక మనిషి గురించి తెలియాలంటే వారి హృదయం ఎటువంటిదో తెలిస్తే చాలు. ‘మంచివాడు’ అంటే ఎలా మంచివాడు? హృదయములో మంచివాడు కనుక మంచివాడు అంటున్నాము. మంచి పనులు చేద్దామన్న ఆలోచన కలిగినవాడు, పరులకు మేలు చెయ్యాలన్న ఆలోచన కలిగినవాడు, ఎవ్వరిని దూషించనటువంటి వాడు, వేధించనటువంటివాడు  మంచివాడు. అటువంటి హృదయం కలిగినవాడు కనుక మంచివాడు. కావున సూర్యుడి హృదయం ఎటువంటిదో మనము తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి.

‘పారాయణము’ – పర + ఆయనము. ‘ఆయనము’, అంటే నడక.  దక్షిణాయనము, ఉత్తరాయణము అంటుంటాము. సూర్యుడు దక్షిణం వైపుగా ప్రయాణించటం ‘దక్షిణాయనము’, సూర్యుడు ఉత్తరం వైపుగా ప్రయాణించటం ‘ఉత్తరాయణము’.  రామాయణం అంటే ‘రాముడి యొక్క నడక’. పరమునకు సంబంధించిన ప్రయాణము – ‘పారాయణము’. ఆదిత్యహృదయము పారాయణ చెయ్యటం అంటే భగవత్తత్వము ఎటువంటిదో తెలుసుకునే ప్రయాణం మొదలుపెట్టడం. అయితే మనిషికి ఐహికముగా కావాల్సినవి ఉంటే తప్ప ఆముష్మికము సాధించలేడు. తినటానికి తిండి లేకపోతే ఆ విషయం మర్చిపోయి భజన చెయ్యలేడు కద. కాబట్టి ఆదిత్య హృదయం పారాయణ చేస్తే మనిషికి కావాల్సినదంతా ఆయనే ఇస్తాడు.

సూర్యుడిని ‘అశావాదిత్యో బ్రహ్మ‘ అన్నారు. ఆయనే బ్రహ్మ.  ‘ఆదిత్యుడి రూపములో జగత్తుకంతా వెలుగును కల్పిస్తున్నాను నేను’, అని శ్రీకృష్ణపరమాత్మ గీతలో పేర్కొన్నారు. సూర్యుడు వస్తేనే కదా వెలుగు ఉండేది, ఎవ్వరైనా ఏ పనైనా చేయగలిగేది. ఒక్క పది రోజులు సూర్యుడు రాకపోతే, ఒక పది రోజులు ఆదిత్య ఉదయం జరుగకపోతే, మనందరి హృదయాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. ఆహారం ఉండదు. మొక్కలు సూర్యరశ్మి ఆధారంగానే మొలకెత్తుతున్నాయి. మనము భూమిలో నాటిన గింజలు, మొక్కలుగా ఎదగాలంటే సూర్యరశ్మి కావాల్సిందే. ఒక విత్తనాన్ని భూమిలో నాటటం వరకే మనవంతు, ఏ విత్తనము ధ్యానముగా మారుతుందో నిర్ణయించేది ఆ సూర్యభగవానుడు.

వర్షం ఎలా పడుతుంది? సముద్రములో నీటిని ఇంకింపచేసి తన కిరణముల చేత, వాటిని మేఘములో భద్రపరచి, ఒక రకముగా ఆ నీటిని ఫిల్టర్ చేసి, శరత్కాలంలో, అంటే ఏ కాలములో వర్షం పడాలో ఆ కాలములో వర్షాన్ని కురిపించి ఆహారాన్ని పండింపచేస్తున్నాడు.  ఆలా పండిన ఆహారం మనకి లభ్యం అవుతుంది. మనకే కాదు పశుపక్ష్యాలకు కూడా. అందుకే ఒక్క పది రోజులు సూర్యుడు రాకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక్క పది నిముషాలు ఎండలో కూర్చుంటే విటమిన్ డి లభిస్తుంది అని వైదులు సూచిస్తున్నారు. సూర్యరశ్మి ద్వారా మనకు ఆరోగ్యం లభిస్తుంది. సూర్యరశ్మిలో ఉండే శక్తి విశేషమైన శక్తి, చర్మ వ్యాధులను పోగొడుతుంది, కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇవన్నీ మనకు లభించే  లౌకిక ప్రయోజనాలు. అటువంటి విశేషమైన సూర్యుడి యొక్క హృదయాన్ని తెలుసుకొని  ఆయిన వైపు నడవటమే ‘ఆదిత్య హృదయం’ పారాయణ.

రామాయణంలో ఆదిత్య హృదయం నేపథ్యం

ఈ ఆదిత్య హృదయము అనేది మనకి ‘రామాయణములో యుద్ధకాండలో’ రామరావణ యుద్ధం జరుగుతునప్పుడు వాల్మీకుల వారు అగస్త్యుల వారి ద్వారా మనకందించారు. “రామరావణ యుద్ధం రామరావణ యోరివ” – “వారి యుద్ధానికి మరొకటి పోలిక లేదు”, అని మహర్షి వాల్మీకి రామాయణములో పేర్కొన్నారు. ఆకాశాన్ని ఆకాశముతో, సముద్రాన్ని సముద్రముతో మాత్రమే పోల్చగలము. రామరావణ యుద్ధం కూడా అంతే. వేరొకటి అందుకు సాటిరాదు. రాముడికి, రావణుడికి జరిగే యుద్ధము ‘న భూతొ, న భవిష్యత్.’ అలాంటి యుద్ధం ఇంతకూ ముందు జరగలేదు, ఇక ముందు జరుగబోదు. రామరావణ యుద్ధం జరుగుతున్న సందర్బములో శ్రీరాములవారు వందల సంఖ్యలో, వేల సంఖ్యలో రావణుడి మీద బాణాలు ప్రయోగిస్తున్నారు, అవి రావణుడికి తగులుతున్నాయి, కానీ రావణుడు మళ్లీ మళ్లీ రాసాగాడు. ఆలా వారి యుద్ధం సూర్యాస్తమయం వరకు సాగుతూనే ఉంది. మరునాడు తిరిగి వారి మధ్య పోరు మొదలైంది. ఆలా యుద్ధం చేసి చేసి రాములవారికి కొద్దిగా అలసట ఏర్పడింది. రావణుడిని ఎలా జయించాలో అర్థం కాని స్థితి. శ్రీరాములవారు మానవుడి రూపములో యుద్ధం చేస్తున్నందున మానవులకు ఉండే సహజ అలసట లక్షణం వారికి కూడా కలిగింది. రామాయణములో ఈ యుద్ధ ఘట్టమే ఆదిత్యహృదయం ప్రారంభానికి నాంది.

అగస్త్య మహర్షి ఉపదేశం – భావార్థం

‘తతౌ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం- రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం’, –

అగస్త్య మహర్షి – ఆదిత్య హృదయ ఉపదేశం

అవిశ్రాంతిగా యుద్ధం చేసి అలసిపోయి ఉన్నట్టి రామచంద్రప్రభుకు ఒక చింత బయలుజేరింది. రావణుడిని యుద్దములో గెలవటమెలా అనేదే ఆ చింత. పలు రకాల అస్రాలు, శస్త్రాలు అన్నీ ప్రయోగించినా ఫలితం  లభించలేదు. అన్ని రావణుడికి తగులుతున్నాయి, రావణుడు తట్టుకుంటున్నాడు, తిరిగి యుద్ధం చేస్తున్నాడు. దీనికి అంతం ఎప్పుడు? రావణుడు మరల మరల వచ్చి ఎదురుగా నిలుచుంటున్నాడు, యుద్ధం చేస్తున్నాడు, రావణుడిని సంహరించటం ఎలా అని శ్రీరాములవారు ఆలోచించసాగారు.

దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః

దేవతలందరు రామరావణ యుద్ధమును తిలకించసాగారు. యుద్ధమును చూడటానికి దేవతలతో కలసి అక్కడికి విచ్చేసిన పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరాముని సమీపించి, ఆ ప్రభువుతో మాట్లాడసాగారు.

అగస్త్య మహర్షి సామాన్యమైన మహర్షి కాదు. ఎంతో గొప్ప చరిత్ర కలిగినవారు. తాను ఒక్కడే ఒక వైపు, దేవతలంతా ఒక వైపు ఉండి భూమి భారాన్ని నిలిపినవారు. అట్టి విశిష్టమైన మహర్షులు శ్రీరాములవారితో మాట్లాడటానికి రాములవారిని సమీపించారు.

‘అగస్త్య ఉవాచ:‘ అని ఆదిత్య హృదయం ప్రారంభం అవుతుంది.

రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం యేన సర్వా నరీన్ వత్స సమరే విజయిష్యసి

అగస్త్యులవారు “రామ, రామ”, అని రెండుసార్లు శ్రీరాములవారిని పిలుస్తారు. ఎప్పుడు పిలుస్తాము మనము రెండుసార్లు? “రామమహాబాహో”, అని ఒక్కసారి పిలిచినా సరిపోయేది. “రామరామహాబాహో”, అని రెండు సార్లు పిలువటంలో ఆంతర్యం ఏమిటి? అవతలి వ్యక్తికి మనము ఎట్టి పరిస్థితులలో అయినా సహాయం చెయ్యాలి అని అనుకున్నప్పడు, అవతలి వ్యక్తి మనకు అత్యంత ఆప్తుడు అయినప్పుడు, అవతలి వ్యక్తి కష్టాన్ని తొలగించాలి అనుకున్నప్పుడు, అవతలి వ్యక్తి మీద అమితమైన వాత్సల్యం ఉన్నపుడు, అవతలి వ్యక్తి విన్నాడో లేదో అన్న సందేహం ఉన్నపుడు.

శ్రీరాములవారు రావణుడితో జరుగుతున్న యుద్దములో అలసిపోయి ఉన్నారు. ధర్మాధర్మముల మధ్య జరుగుతున్న యుద్ధం అది. ధర్మం గెలవాలి, అధర్మం ఓడిపోవాలి. అది దేవతలు, అందరు ఎదురు చూస్తున్న పరిణామం. ఆ పరిణామం కోసం ఎదురుచూస్తున్న సందర్బములో రాముడు ధర్మముగా రావణుడితో యుద్ధం చేస్తున్నాడు, గెలువలేకపోతున్నాడు. ఆ సమయానికి చింతాక్రాంతుడై చింతతో ఉన్నాడు రాముడు. అందువలన ‘రామా, రామా’, అని మళ్లీ మళ్లీ పిలుస్తారు అగస్త్యులవారు.

 ‘మహాబాహో’, ఆంటే ‘పొడవైన బాహువులు కలిగిన వాడు’ అని సాధారణ అర్థం. ‘శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపమ్ ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి“, అని శ్రీరాములవారిని కీర్తిస్తాము. అయితే ‘మహాబాహో’ అనే పదానికి విశేషమైన అర్థం కూడా ఉన్నది. రాజైన వాడికి తన రాజ్యమంతా కూడా వ్యాపించగలిగిన చేతులు కలిగి ఉండాలి. ఇందుకు ఒక ఉదాహరణ. ‘మా రాష్ట్రములో అనేక జిల్లాలు ఉన్నాయి. రాజధానికి దూరముగా ఉన్న జిలాల్లో ఎక్కడో ఏదో జరిగితే, మేము ఎందుకు సహాయం చెయ్యాలి”, అని ఏ ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ అనకూడదు. తన రాజ్యములో ఏ మూల ఏమి జరిగినా, ఎవరికి ఏ కష్టం వచ్చినా, తెలుసుకొని ఆదుకోగల వ్యవస్థ కలిగినవాడు కనుక  ‘మహాబాహో’ అన్నారు.

రాజ్యములో ఎక్కడ ఏ అధర్మం జరిగినా, దానిని నివారించవలసిన బాధ్యత తన మీదనే ఉన్నాడని శ్రీరాములవారు భావించేవారు. ఇందుకు ఒక ఉదాహరణ సీతారాముల వనవాసకాలములో మనకి కనిపిస్తుంది. వనవాస సమయములో మునులందరూ రాముడి. వద్దకు పచ్చి, “రామా, అరణ్యాలలో ఉండే మమ్మల్ని రాక్షసులు చెప్పరాని హింసలు పెడుతున్నారు. క్రూరులైన ఈ రాక్షసుల బారినుంచి ఋషులను కాపాడాలి,” అన్నారు. అప్పుడు శ్రీరాములవారు వారితో, “నేను తప్పక రాక్షసుల బారి నుండి మిమ్మల్ని కాపాడతాను,” అన్నాడు. అప్పుడు సీతమ్మ రాములవారిని, “మనకు ఏ కీడూ చేయని రాక్షసులను నీవెందుకు చంపాలి? వారిని చంపుతానని ఈ ఋషులు కెందుకు మాట ఇవ్వాలి?”, అని ప్రశ్నిస్తుంది. అందుకు శ్రీరాములవారు, “ఆ మునులందరూ తమ ధర్మాన్ని తాము పాటిస్తున్నారు. రాక్షసులు వారిని ఆకారణముగా బాధిస్తూ అధర్మానికి పాల్పడుతున్నారు. నా రాజ్యంలో ఎక్కడ అధర్మం జరిగినా నివారించటం నా కర్తవ్యము, ధర్మాన్ని నిలబెట్టవలసిన భాద్యత నా మీద వుంది కావున నేను ఆ మునులకు అలా మాట ఇచ్చాను”, అని సీతమ్మతో పేర్కొంటారు. అగస్త్యులవారు శ్రీరాములవారిని ”మహాబాహో” అని పిలవటం వెనుక ఉన్న అంతరార్థం ఇది.

‘శృణు’ ఆంటే వినటం, ‘వినవయ్యా రామయ్య’.  గుహ్యం ఆంటే  పరమ అత్యంత గోప్యమైనది. సాధారణ భాషలో చెప్పాలంటే ‘సీక్రెట్, రహస్యం’. ఈ కాలములో రహస్యాలు ఎక్కడ ఉన్నాయండి, అందరికి ఆదిత్య హృదయం తెలుసుకదా, అందరు చదువుతున్నారు కదా అనవచ్చు. ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే భౌతికమైన అర్థం వేరు, తాత్వికమైన అర్థం వేరు, పారమార్థిక అర్థం వేరు. ఒక పదాన్ని/స్తోత్రాన్ని భౌతికముగా, తాత్వికముగా, పరమార్థికముగా అనేక రకాలుగా చూడవచ్చు. భౌతికమైన అర్థం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, అది పెద్ద రహస్యం కాదు. ఉదాహరణకు లలితా సహస్ర నామం రహస్య నామం అన్నారు. అయితే అందరు లలితా సహస్ర నామాలను చదువుతున్నారు. భౌతికంగా లలితా సహస్రనామాలకు అర్థం అందరికి తెలిసినదే. లలితా సహస్రనామాలలో శ్రీమాత అని ఆ తల్లిని కీర్తిస్తాము. శ్రీమాత ఆంటే తల్లి అని సాధారణ అర్థం, కానీ తాత్విక, పారమార్థిక అర్థం వేరు. ఒక గురువును ఆశ్రయిస్తేనే ఆ అర్థాలను మనము గ్రహించగలుగుతాము. ఆదిత్య హృదయం కూడా అటువంటిదే.

‘సనాతనం’, ఆంటే అనాది కాలం నుంచి ఉన్నది, ఎప్పటి నుంచో ఉన్నది అని అర్థం. “రామా, ఎప్పటి నుంచో ఉన్నదయా ఇది”, అని అగస్త్యులవారు శ్రీ రాములవారికి వివరిస్తున్నారు. రామాయణకాలం నాటికే సనాతనం ఆంటే ఇక ఈ కాలానికి ఎంత పాతదో మనము అర్థం చేసుకోవచ్చు. “రామా, ఈ ఆదిత్య హృదయం అనేక కాలాల నుంచి ఉన్నది. ఇప్పుడు నేను నీకు ఉపదేశిస్తున్నాను”, అని అగస్త్యులవారు రాములవారికి వివరిస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ. ఎవరైనా మన దగ్గిరకు వచ్చి ఆయుర్వేదం చెప్పమంటే, మనము వారికి ఆ విద్యను బోదిస్తే, ఆయుర్వేదం అప్పుడే పుట్టినట్టు కాదు కదా. అలాగే  అగస్త్యులవారు శ్రీ రాములవారికి చెప్తున్నారు, “శృణు గుహ్యం సనాతనం”.

యేన సర్వా నరీన్ వత్స సమరే విజయిష్యసి – “ఓ వత్సా రామా”, అని శిష్య వాత్సల్యముతో అగస్త్యులవారు రాములవారిని పిలుస్తున్నారు. ‘వత్సా, కుమారా, నాయనా’, ఇవన్నీ వాత్సల్యముతో ఇతరులను పిలిచే పేర్లు. ‘సమరే విజయిష్యసి’ – “యుద్దములో గెలుపు కావాలని నీవు కోరుకుంటున్నావు కనుక, నీకు ఈ ఆదిత్య హృదయాన్ని ఉపదేశిస్తాను, నీవు ఈ ఆదిత్య హృదయాన్ని పారాయణ చెయ్యి, నీకు యుద్దములో గెలుపొస్తుంది”.

ఇక్కడ మనకుండే ఒక సందేహం. ఆదిత్య హృదయం పారాయణ చేయటం వలన రాములవారికి యుద్దములో గెలుపొస్తుంది.  ఆదిత్య హృదయం పారాయణతో మనకు కలిగే ప్రయోజనం ఏమిటి? మనము చేసే యుద్దాలు ఏమిటి? మనిషి ప్రతి నిత్యం యుద్ధం చేస్తూనే ఉంటాడు. నిద్ర లేస్తూనే ఆ నిద్రతో యుద్ధం, మనస్సుతో యుద్ధం, ‘పడుకో అప్పుడే లేవకు’, అని మనస్సు చెప్తూ ఉంటుంది, ఆ మనస్సుతో యుద్ధం చేసి గెలిస్తేనే నిద్ర లేవగలం లేదా ఆలా పడుకొనే ఉంటాము. ఇలా ప్రతి నిత్యం అనేక యుద్దాలు చేస్తూనే ఉంటాము.  యుద్ధం ఆంటే సంఘర్షణ. రామరావణ యుద్ధం జరుగుతోంది కనుక ‘సమరే విజయిష్యసి’ అన్నారు.

ఆదిత్య హృదయం పారాయణ వల్ల కలిగే ప్రయోజనాలు

ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం ౪

‘ఆదిత్యహృదయం పుణ్యం’, అన్నారు అగస్త్యులవారు. ఆదిత్య హృదయం పారాయణ చెయ్యటం వలన పుణ్య సముపార్జన చెయ్యగలుగుతాము. పుణ్యం ఆంటే ఏమిటి? ‘పరోపకారాయ పుణ్యం పాపాయ పరపీడనం‘, అని వ్యాసభగవానులు పేర్కొన్నారు. అష్టాదశ పురాణాలు రచించిన వ్యాసులవారికి తాను రచించిన పురాణాలను మానవులు చదువుతారో లేదో, అందునా రానున్నది కలియుగం కావున మానవులు శాస్త్రాల మీద ఆసక్తి కలిగి ఉంటారో లేదో, అనే ఆలోచన వ్యాసులవారికి కలిగింది. కావున వారు తాము రచించిన అన్ని పురాణాల సారాన్ని మానవులకు అందించాలని భావించారు. ఒక మామిడికాయ తినటం కంటే ఆ మామిడికాయ రసాన్ని తాగటం చాలా తేలిక. ఆలా వ్యాసులవారు అష్టాదశ పురాణాల సారనంతటిని పిండి ఒకే ఒక వాక్యంలో మనకందించారు.

అష్టాదశ పురాణాలు:

శ్లో. మ ద్వయం, భ ద్వయం చైవ, బ్ర త్రయం, వ చతుష్టయం | అనాపలింగకూస్కా ని పురాణాని పృథక్ పృథక్ ||

“మ” ద్వయం —  శ్రీ మత్స్య పురాణం,  శ్రీ మార్కండేయ పురాణం

“భ” ద్వయం —  శ్రీమద్ భాగవతం,  శ్రీ భవిష్య పురాణం

“బ్ర” త్రయం —  శ్రీ బ్రహ్మపురాణం,  శ్రీ బ్రహ్మ వైవర్త పురాణం,  శ్రీ బ్రహ్మాండ పురాణం

“వ” చతుష్టయం —  శ్రీ విష్ణు పురాణం,  శ్రీ వరాహ పురాణం,  శ్రీ వామన పురాణం,  శ్రీ శివ మహాపురాణము ( వాయు పురాణం )

అ —  శ్రీ అగ్ని పురాణం  నా —  శ్రీ నారద పురాణం

ప —  శ్రీ పద్మపురాణము లిం —  శ్రీ లింగపురాణం

గ —  శ్రీ గరుడ పురాణం కూ —  శ్రీ కూర్మ పురాణము

స్కా —  శ్రీ స్కాంద పురాణం

పరులకు ఉపకరించే ఏ పని చేసినా పుణ్యం చేసినట్లే, పరులను పీడించే ఏ పని చేసినా పాపం చేసినట్లే. ‘మనసా వాచా హస్తాభ్యం పద్యామ్ ఉదరేణ‘. మనిషి ఎట్లా చేస్తాడు కర్మలను? మనస్సుతో చేస్తాడు. అవతల వ్యక్తికి కష్టం కలగాలని కోరుకుంటాడు, అది పాపం. అవతలి వ్యక్తికి సుఖం కలగాలని, సంతోషం కలగాలని కోరుకోవాలి. వాచా ఆంటే వాక్కుతో. పరుషముగా మాట్లాడుతుంటారు కొంతమంది. వారి మాటల వల్ల అవతల వారి మనస్సు నొచ్చుకుంటుంది.

‘అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్​ । స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే ‘, అని గీతలో శ్రీకృష్ణులవారు పేర్కొన్నారు. ‘అనుద్వేగకరమ్’,​ ఆంటే ఇతరులకు దుఃఖాన్ని కలిగించనిది, మనం మాట్లాడే మాట ఇతరుల మనస్సును నొప్పించకూడదు, కఠినంగానో, వినడానికి బాగోలేనట్లుగానో చెప్పకూడదు. ఉద్విగ్నతకులోనై అవతలివారిని ఉద్విగ్నతకులోను చేసేదిగా మన మాట ఉండకూడదు.  ‘యస్మాన్నోద్విజతే లోకో, లోకాన్నోద్విజతే చ యః|‘, ఎవరిని చూసి లోకం భయపడదో, ఎవరు లోకాన్ని చూసి భయపడరో అటువంటి వ్యక్తిగా ఉండాలి అంటారు.

మనము చేతులతో, కాళ్లతో, కడుపుతో చేసే కర్మలన్నీ లోకాలకు ఉపకరించేవిదంగా ఉండాలి, అదే పరోపకారం, అదే పుణ్యం. పరులకు ఉపకరించే కార్యాలను మనము ఆచరిస్తే కలిగే పుణ్యం ఏమిటంటే ‘సుఖము, భోగము, ఐశ్వర్యము, సంతోషము’ కలుగుతాయి.

  ‘వనే,రణే,శత్రు,జలాగ్నిమధ్యే,మహార్ణవే,పర్వతమస్తకోవా, సుప్తం ప్రమత్తం,విషమ స్తితంవా , రక్షంతి పుణ్యాని పురాక్రుతాని.’ అన్నారు. ఆంటే ఎక్కడున్నా సరే వనములో ఉన్నా, అగ్ని జ్వాలల మధ్య ఉన్నా, శత్రువుల మధ్య ఉన్నా ఆ పుణ్యం మనల్ని తప్పక కాపాడుతుంది. అందుకే చేసుకున్నవారికి చేసుకున్నంత అన్నారు. ఆదిత్య హృదయం చదివితే పుణ్యసముపార్జన చేసినట్లు అవుతుంది.

పరులకు అపకారం తలపెట్టే కార్యాలను మనము ఆచరిస్తే కలిగే పాపం ఏమిటంటే ‘దుఃఖము, బాధ, రోగము’ కలుగుతాయి. అందుకనే ‘ఏమి పాపం చేసుకున్నానో అనుభవిస్తున్నాను, పగవాడికి కూడా రాకూడదు ‘, అంటుంటారు కొంతమంది. పరులను కష్టపెట్టటం పాపం, పరులను ఇబ్బంది పెట్టడం పాపం, పరులను పీడించటం పాపం, దానికి సంభవించిన ఏ కర్మను మనసా, వాచా, కర్మణా చేసినా అది పాపమే. వచ్చినా కష్టము పాపము రూపములో అనుభవించాల్సినదే.  కాబట్టి అది రాకుండా ఉండాలి అనే పుణ్య కర్మలు ఆచరించాలి.

శ్రీశంకరులు పాపపుణ్యాల గురించి శివానందలహరిలో వివరిస్తూ, “పుణ్యఫలాని మిచ్ఛన్తి  పుణ్యం న కుర్వన్తి మానవ, సహజంగా మానవులు పుణ్య కార్యాలను చెయ్యరు కాని, పుణ్య కార్యాలు చేసినందువల్ల వచ్చే ఫలితం మాత్రం పొందాలని కోరుకుంటారు. అలాగే మానవులు పాపఫలం రాకూడదు అని అనుకుంటారు కాని, ప్రయత్నపూర్వకంగా పాపాలు చేస్తూ పాపఫలాలు పొందుతూ ఉంటారు” అని అంటారు.

మనము మామిడి చెట్టు నాటితే మామిడికాయలే వస్తాయి, అవి తింటే తియ్యగా ఉంటాయి, సంతోషం కలుగుతుంది. అదే కుంకుడుకాయని నాటితే కుంకుడుకాయలే వస్తాయి, అవి తింటే చేదుగా ఉంటాయి, బాధ కలుగుతుంది. కుంకుడుకాయ చెట్టును నాటి మామిడికాయ రాలేదని చింతించటం ఎంత అవివేకమో, పాపకర్మలు చేసి పుణ్యం రాలేదని చింతించటం కూడా అంతే అవివేకం. పుణ్యకర్మలు ఆచరిస్తే పుణ్యం లభిస్తుంది, పాపకర్మలు ఆచరిస్తే పాపం లభిస్తుంది. పుణ్యమైనా, పాపమైనా మనము చేసిన కర్మను అనుసరించే లభిస్తుంది.

ఆదిత్య హృదయం ఫలశ్రుతి

ఆదిత్య హృదయం ఫలశ్రుతి

‘ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం’ అనేది ఫలశృతి లాంటిది. సాదారణముగా ఫలశృతిని స్తోత్ర ఆఖరిలో పేర్కొంటారు, కానీ ఇక్కడ అగస్త్యులవారు ప్రారంభములోనే వివరించారు. ఈ స్తోత్రాన్ని అగస్త్యులవారు శ్రీరాములవారికి యుద్ధరంగములో వివరించారు కావున, ‘ప్రయోజనం చెయ్యకుండా ఏ పని చెయ్యకూడదు అని శాస్త్రం చెప్పిన కారణమున’,  ఫలశృతి ముందుగానే పేర్కొనటం జరిగింది.

‘సర్వశత్రువినాశనం’ అనేది ఒక అద్భుతమైన మాట. ఆదిత్యహృదయం పారాయణ చేసేటువంటి వారికి అన్నివిధమైన శత్రువులు నశిస్తారు అని మహర్షులు పేర్కొన్నారు.

ఆదిత్య హృదయం మరియు అంతః శత్రువుల నాశనం

 శత్రువులు అంటే మనకి ప్రత్యక్షముగా శత్రువులు ఉండాలని ఎక్కడా చెప్పలేదు. నిజానికి చాలామందికి శత్రువులు ఉండరు. అజాతశత్రువులు అని కొందరు ఉంటారు. వారికి శత్రువులు ఉండరు. ఎవరో ఒకరిద్దరికి ఉన్నా కూడా, వారిని ఉద్దేశించి చెప్పలేదు ఇక్కడ. ‘ఉద్ధరేత్ ఆత్మానం‘, అన్నట్లుగా, శత్రువులు అంటే ‘తనను తాను పాడు చేసుకునే అంతః శత్రువులు’ అని అర్థం. అంతః శత్రువులు అంటే బద్ధకం, అలసత్వం. ఉదాహరణకు ప్రాతః కాలములో సకాలములో సంధ్యావందనం చెయ్యాలి అంటే పొద్దునే లేవాలి, ఆలా లేవకుండా అలసత్వం వహించటం. లోకిక వ్యవహారాలైన ‘భోజనం, ఉద్యోగం’ ఇత్యాది విషయాలలో రాని అలసత్వం ఆధ్యాత్మిక విషయాలలో మాత్రం కలుగుతుంది. వీటిని అంతః శత్రువులు అంటాము. బాహ్యశత్రువుల కంటే ముందు అంతః శత్రువులను గెలవటం అత్యంత అవసరం.

“హిత శత్రువు, అహిత శత్రువు”, అనే రెండు రకాల శత్రువులు ఉంటాయి. హిత శత్రువు అంటే మనకి మేలు చేసినట్లుగా కనిపిస్తూ ఉండి, హితము చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉండి, కీడును చేస్తూ ఉంటుంది, మనల్ని అదః పాతాళానికి తీసుకువెళ్లిపోతుంది. అధర్మం ఆచరించాలి అనే ప్రేరణ కలుగుతూ ఉంటుంది. ఎలా సాధించాము అనే దానికన్నా ఏమి సాధించాము అనే విషయముపై మనస్సు నిలిపేలా చేస్తుంది ‘హిత శత్రువు’.  మనము ఏర్పరుచుకున్న లక్ష్యాన్ని సాధించే క్రమములో ధర్మాన్ని వదిలివేస్తాము. ఇది అహితాన్ని కూరుస్తుంది.

‘అంతః శత్రువులు’, అంటే మనలో ఉండే అరిషడ్వార్గాలైన ‘కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు.’  ‘కామః క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్ఠన్తి తస్కరాః  జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత జాగ్రత‘ – “కామము, క్రోధము, లోభము” అనే ముగ్గురు దొంగలు మనదేహంలో మకాం వేసి ఉన్నారు. వారు జ్ఞానమనెడి రత్నమును దొంగిలించుటకే ఉన్నారు మేల్కొనుడు మేల్కొనుడు అని సుభాషిత వాక్కు.

మొదటి శత్రువు “కామము”. కామము అంటే కోరిక. కొరికే అన్నిటికి మూలం. ఈ కోరికను గనుక లేకుండా చేసుకోగలిగితే మనిషికి FRUSTRATION FEAR ANXIETY STRESS FEAR WORRY TENSION ఇవన్నీ కూడా ఉండవు. అయితే కోరికలు లేకుండా మనిషి ఉండగలడా అని ఒక ప్రశ్న.  కోరికలు ఉండకూడదు అని శాస్త్రం చెప్పలేదు, అయితే ఆ కోరికలు ధర్మబద్ధముగా ఉండాలి. మనకుండే కోరిక ధార్మికమైనది అయి ఉండాలి. మన కోరిక ధర్మబద్ధమైనదా కదా అని ఎప్పటిపప్పుడు మనల్ని మనము పరీక్షించుకుంటూ ఉండాలి. ధర్మం అనే filter ఒక్కటి పెట్టుకున్నామంటే ఆ కోరిక ప్రమాదకరం కాదు, లేకపోతే ఆ కోరిక మన శత్రువే అవుతుంది.

మనకుండే రెండవ శత్రువు “కోపం”. ‘తన కోపమె తన శతృవు, తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌఁ, తన సంతోషమె స్వర్గము, తన దుఃఖమె నరకమండ్రు తధ్యము సుమతీ!‘, అని సుమతి శతకకారుడు పేర్కొన్నాడు. మనకి కోపం అనే లక్షణం ఒక్కటుంటే చాలు, ఇక వేరే శత్రువులు అక్కర్లేదు. చెయ్యరాని పనులు ఎన్నో మన చేత చేయిస్తుంది, ద్వేషముతో రగిలిపోతూ ఉంటాము, విచక్షణ కోల్పోతాము. ‘క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్‌ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశా ద్బుద్ధినాశో బుద్ధినాశాత్‌ ప్రణశ్యతి॥‘, అని గీతలో శ్రీకృష్ణులవారు పేర్కొంటారు. కోపం వచ్చిన మనిషి తన నియంత్రణ తాను కోల్పోతాడు. కోపానికి లోనైన మనిషి మోహానికి లోనవుతాడు, దీనివల్ల స్మృతి భ్రమిస్తుంది. స్మృతి భ్రమిస్తే బుద్ధి శక్తి నశిస్తుంది. అప్పుడు మనిషి పతితుడవుతాడు.

మనకుండే మూడవ శత్రువు “లోభము”. లోభత్వము అంటే ‘తనకు ఉండి లేదనుకోవటం’. ‘నాకున్నది’ అని అహంకరించక్కర్లేదు. ‘నాకే ఉన్నది’, అని భావించటం అహంకారం, ‘నాకు లేదు’, అనుకోవటం లోభత్వం. ఒక కోటి రూపాయలు ఉన్నవాడు వంద రూపాయలు దానం చేస్తే అది దాతృత్వం అనిపించుకోదు. తన శక్తికి తగినట్టుగా చేసే గుణం ఉండటం దాతృత్వం. ‘దాతృత్వం ప్రియవక్తృత్వం ధీరత్వముచితజ్ఞతా । అభ్యాసేన న లభ్యన్తే చత్వారః సహజా గుణాః ॥‘, అని సుభాషితం పేర్కొంటోంది. దానగుణం, తీయగా మాట్లాడటం ధైర్యంగా ఉండటం, సముచితమైనదేదో తెలిసి ఉండటం- ఇవి అభ్యాసం వల్ల దొరికేవి కావు. (పుట్టుకతో వచ్చే) సహజమైన గుణాలు.లోభత్వము లేకుండా చూసుకోగలగాలి.

మదం – ‘అవతలి వ్యక్తికి ఏమీ తెలియదు నాకే తెలుసు అనుకోవటం’. ‘నాకే అన్ని తెలుసు’ అనుకోవటం ఒక భావన, ‘అవతలి వ్యక్తికి ఏమీ తెలియదు’ అనుకోవటం మరొక భావన. మనకు తెలిసింది కొంత. ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండాలలో భూమండలం ఎంత అంటే ఆవగింజంత అన్నారు. ఈ భూమండలంలో మనముండే దేశమెంత, అందులో మనముండే రాష్ట్రమెంత, అందులో మన ఇల్లెంత? ఈ విషయము గనుక జ్ఞప్తికి ఉంచుకుంటే మనలో ఉండే అరిషడ్వర్గాలను జయించగలుగుతాము.

మనలో ఉండే అంతః శత్రువులను జయించటానికి ఆదిత్య హృదయ పారాయణ ఒక మార్గం. ఎవరైతే ఆదిత్య హృదయ పారాయణ చేస్తున్నారో, వారు ఈ ఆదిత్య హృదయ పారాయణ ద్వారా అంతః శత్రువులను జయించవచ్చు. అయితే ఒక్క రోజు పారాయణ చేస్తే అది సాధ్యం కాదు. రోజూ పారాయణ చేస్తూ ఉంటేనే మనలోని జన్మ జన్మల మలినాలను తొలగించుకోగలము.

ఆదిత్య హృదయం పారాయణ విధానం

చాలా తేలికైన పదాలతో మహర్షులు మనకు ఆదిత్య హృదయాన్ని అందించారు. ఈ స్తోత్రములో ఉన్న పదాలన్నీ అతి తేలికైనవి, ఎవ్వరైనా తేలికగా పలుకగలరు, ఈ పరాయణకు నియమాలు అంటూ పెద్దగా ఏమి లేవు.  అయితే శుచి, శుభ్రత పాటించటం తప్పనిసరి. స్నానము చేసి, అవకాశం ఉంటే సూర్యుని ఎదురుగా నిలబడి, ఆయనకు నమస్కరిస్తూ పారాయణ చేస్తే ఉత్తమం.

ఎవరు చదవాలి? ఎప్పుడు చదవాలి?

‘జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం’ – ఆదిత్య హృదయ పారాయణ జయములు కలిగిస్తుంది. జయ శబ్దానికి ‘ఇక ఆయన కంటే పైన ఎవరు లేరు’ అని అర్థం. ఇది అసలు సాధ్యమేనా అని ఒక ప్రశ్న. ప్రతి ఒక్కరికి జయం కలుగుతుంది. ‘సమానానాం ఉత్తమ శ్లోకోస్తు‘, అని వేదం పేర్కొంటోంది. ‘సాటివారిలో ఉత్తముడిగా కీర్తి పొందు’, అని ఈ వాక్కు అర్థం. ఉదాహరణకు తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్ధి తన సాటి విద్యార్థులలో గొప్పవాడిగా పేరు తెచ్చుకోవటం, అలాగే పదో తరగతి చదువుతున్న తన విద్యార్ధి సాటి విద్యార్థులలో గొప్పవాడిగా పేరు తెచ్చుకోవటం. కాబట్టి ఆదిత్య హృదయం పారాయణ చేసే వారికీ అన్నిటా జయం లభిస్తుంది. జయం కలగటం అంటే అన్నిటిలో విజయాన్ని సాధిస్తూ ఉండటం, సంకల్పాన్ని సిద్దించుకుంటూ ఉండటం.

అయితే ఇక్కడ ‘జపేన్నిత్యం’ అన్నారు పెద్దలు. అంటే నిరంతరం జపిస్తూ ఉండటం, ప్రతి రోజు పారాయణ చెయ్యటం. ప్రతి రోజు ‘ఆదిత్య హృదయం పారాయణ’ అనే జపం చేస్తూ ఉంటే ఒకనాటికి అది తప్పక సిదిస్తుంది. ‘జకారో జన్మ విచ్చేద: పకారో పాపనాశక: జన్మపాప వినాశిత్వాత్ జప ఇత్యభిదీయతే‘, అని శాస్త్రం పేర్కొంటోంది. జపంలోని ‘జ – జన్మవిఛ్చేదనం చేసేది. ‘; ప అంటె పాపాన్ని నశింపచేసేదని అర్థం. జపం చేయటం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది. ఒక్క మానవులు మాత్రమే చేయదగిన విశేషమైన కర్మ జపం చేయటం. ఒక పావురం, చిలుక ఎంత అందముగా ఉన్నా, అవి జపం చెయ్యలేవు. వాటికీ జపం చెయ్యాలి అనే భావన ఉన్నా, అవి చెయ్యలేవు. భగవంతుడు వాటికి నోరు ఇవ్వలేదు. భగవంతుడు నోటిని ఇచ్చింది ఒక్క మానవునికి మాత్రమే.

‘ఆహార నిద్రా భయ మైధునాని సామాన్యమేతత్పశుభిర్నరాణాం జ్ఞానంహి తేషా మధికో విశేషః జ్ఞానేన హీనః పశుభిస్సమానః‘, అని శాస్త్రం పేర్కొంటోంది. ఆహార నిద్రా భయ మైథునాలు మనుషులకు, జంతువులకు సమానమే! మిగిలిన జంతు సమూహం నుంచి మనిషిని వేరు చేసే లక్షణం జ్ఞానం మాత్రమే! జపం చేసే శక్తి ఒక మానవులకు మాత్రమే ఉంటుంది, జంతువులకు, ఇతర ప్రాణులకు ఉండదు. కాబట్టి ‘జపేన్నిత్యం’ అన్నారు. ప్రతి రోజు నియమముగా ఒక సమయం పెట్టుకొని, ఆ సమయములో పారాయణ చెయ్యటం విశిష్టం.

‘అక్షయం పరమం శివం’. అక్షయం అంటే నాశనము కానిది, క్షయం అంటే నాశనం అయ్యేది. ‘అక్షయ పాత్ర’, అని మనకు భారతములో వస్తుంది. ఎన్నిసార్లు తిన్నా, ఎంత తిన్నా ఆ పాత్ర నుంచి వస్తూనే ఉంటుంది. అలాగే ‘కోరికలన్నీ అయిపోయాయి’ అనటానికి లేకుండా ఎన్ని కోరికలు ఉన్నపటికీ ఆ భాస్కరుడు, ఆ ప్రభాకరుడు, ఆ దివాకరుడు, ఆ సూర్యభగవానుడు అన్ని అందిస్తూ ఉంటాడు.

‘శివం’, అంటే మంగళకరం, శుభకరం. కాబట్టి మంగళకరమైన విషయాలన్నీ మన జీవితములో కలగాలంటే ఆదిత్య హృదయం పారాయణ చెయ్యాలి అని శాస్త్రం పేర్కొంటోంది. ఆదిత్య హృదయ పారాయణ మంగళములకు మంగళము చేకూరుస్తుంది, శుభములకు శుభము చేకూరుస్తుంది.

సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం

ఆదిత్య హృదయం పారాయణ చేసేటంటువారికి కేవలం మంగళప్రదంగా ఉండటమే కాకుండా, మంగళప్రదంగా ఉండటానికి కావాల్సిన పరిస్థితులు కూడా సమకూరుతాయి. ఆదిత్య హృదయ పారాయణ సమస్త పాపములను తొలగిస్తుంది.

సాదారణముగా మనలను సత్యనారాయణస్వామి పూజ, ఇత్యాది అనేక పూజలను ఆచరించమని పెద్దలు పేర్కొంటారు. అయితే ఆ పూజలు పుణ్యాన్ని మనకందిస్తాయి కానీ మన పాపాలను తొలగించలేవు. పాపాలను తొలగించుకోవాలంటే కొన్ని మార్గాలు మాత్రమే ఉన్నాయి. వాటిని ప్రాయశ్చిత్త కర్మలు అన్నారు. కర్మలు ఎన్ని రకాలు అంటే, “నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు మరియు ప్రాయశ్చిత్త కర్మలు”.

నిత్యకర్మలు అంటే, ‘మనము ప్రతిరోజు క్రమము తప్పకుండా చెయ్యాల్సిన పనులు’. ప్రతిరోజు దీపారాధన చెయ్యడము,  పరమాత్మను పూజించటం, ఇంటికి  వచ్చిన అతిథుల్ని ఆదరించడము ఇత్యాదివన్నీ మనము చేయాల్సిన నిత్యకర్మలే.

నైమిత్తిక కర్మలంటే, ‘ఒక నిమిత్తం కారణంగా ఏర్పడే కర్మలు.’ ఉదాహరణకు గ్రహణం వంటివి ఏర్పడినప్పుడు చేయాల్సిన కర్మలు. భగవంతుడికి ప్రీతికరమైన పుణ్యదినాలు, పర్వదినాలు, పుణ్యమాసాలు, గ్రహణాది సమయాలు ప్రతినిత్యము సంభవించేవి కావు. అవి ఆసన్నమయినపుడు విధిగా చేయవలసిన కర్మలు నైమిత్తిక కర్మలు. మన జీవితములో వచ్చే ముఖ్య సందర్భాలలో చేయాల్సిన కర్మలు కూడా నైమిత్తిక కర్మలే. ఉదాహరణకు పితృ దేవతలకు చేయవలసిన తర్పణాది క్రతువులు, జాతకర్మ, నామకరణం, అన్నప్రాశనం, ఉపనయనం, వివాహం ఇత్యాది అనేక ఆచారాలు కూడా నైమిత్తిక కర్మలే. నిత్యము కాకుండా, ఒకానొక సందర్భాన్ని పురస్కరించుకుని మనము చెయ్యవలసిన కర్మలే నైమిత్తిక కర్మలు.

ఇక కామ్యకర్మలు అంటే, ‘మన కోరికలు తీర్చుకోవడం కోసము ఆచరించే కర్మలు’. ఉదాహరణకు ఆరోగ్యం కోసము, సంపద కోసము లేదా సంతానం కోసము మనము చేసే కర్మలు. విద్య, ధనం, ఐశ్వర్యం, సంతానం, అధికారం, కీర్తి, ప్రతిష్ఠలు, ఇత్యాది ఎన్నో కోరికలను పొందేందుకు మనము చేసే హోమాలు, యజ్ఞయాగాదులు, మొక్కే మొక్కులు ఇత్యాదివన్నీ కామ్యకర్మలు. 

ప్రాయశ్చిత్త కర్మలు అంటే మనము చేసిన పాపాలను పోగొట్టుకోవడానికి చేసే కర్మలు.  కర్మ చేసి ఆ కర్మ ఫలితాన్ని భగవంతునికి సమర్పిస్తే పాపాలకు ఉపశమనం కలుగుతుంది. “పెద్ద పెద్ద ప్రాయశ్చిత్త కర్మలు ఆచరించాల్సిన అవసరం లేకుండా, భగవంతుడు ఇచ్చిన నోటితో ఈ పారాయణ చెయ్యవయ్యా, సర్వపాప ప్రశమనం, పాపాలన్నిటి నుంచి ఉపశమనం పొందుతావు”, అని మహర్షులు పేర్కొన్నారు.

పాపాన్ని అనుభవించటం ఎంతో కష్టం. పుణ్య కర్మను ఆచరించటం తేలిక ఎందుకంటే పుణ్యకర్మల ఆచరణ చేత సంతోషము, సుఖము, ఆనందము, ఐశ్వర్యము, భోగము లభిస్తాయి. పాపఫలితం ఎలా ఉంటుందంటే కష్టము, దుఃఖము, అశాంతి, బాధ, దరిద్రము ఇత్యాదివి లభిస్తాయి. పుణ్యకర్మల వలన మనఃశాంతి కలిగితే పాపకర్మల వలన అశాంతి కలుగుతుంది. ఈ పాప పుణ్యాల సమాహారమే మానవజన్మ. కానీ పాపాలను తొలగించుకొని, పుణ్యాలను సంపాదించుకుంటే ఉత్తమ జన్మ లభిస్తుంది. ఆ పాపాలను తొలగించుకునే మార్గమే ఆదిత్య హృదయ పారాయణ.

చింత–శోక నివారణలో ఆదిత్య హృదయం పాత్ర

‘చింతాశోకప్రశమనం’, – ఇది ఒక అద్భుతమైన పదం. మానవాళికి అవసరమైన రెండు పదాలు – చింత, శోకం ఇందులో ఉన్నాయి. ఒకఒకటి గతానికి సంబందించిన శోకం, మరొకటి భవిష్యత్ కి సంబందించిన చింత. ఈ రెండు మనిషిని ఎప్పుడు పీడిస్తూ ఉంటాయి. ఉదాహరణకు ‘వాడికి నేను అంత మంచి చేశాను, కానీ వాడు నన్ను పట్టించుకోవట్లేదు’, అనే శోకం మనకు ఉంటుంది. కానీ అది తప్పు అని శాస్త్రం పేర్కొంటోంది. ‘ఒకానొక బలహీన క్షణములో నేను గారెంటీ సంతకం పెట్టాను, ఇప్పుడు నేను బలయ్యాను’, అని ఎప్పుడో జరిగిపోయిన దానిని తలచుకొని మనిషి శోకిస్తూ ఉంటాడు. గతాన్ని సంబందించినది శోకం.

చింత భవిష్యత్ కి సంబందించినది. ‘నాకు ఉద్యోగం వస్తుందో రాదో, నాకు వీసా వస్తుందో రాదో, పెళ్లవుతుందో లేదో, పిల్లలు పుడతారా లేదో’, అని భవిష్యత్ గురించి చింతించటం. “చితి చింతా ద్వ యోర్మధ్యే చింతా నామ గరీయసీ చితా దహతి నిర్జీవం చింతా ప్రాణయుతం వపుః“, అని ధర్మశాస్త్రం పేర్కొంటోంది. చిత (శవాన్ని కాల్చే కట్టెల రాశి), చింత ( దిగులు లేదా విచారము) ఈ రెండింటి మధ్య రెండవదే మిక్కిలి బాధాకరము. మొదటిది చనిపోయిన శవాన్ని తగులబెడితే, రెండవది బ్రతికి ఉండగా మనిషిని కాల్చివేస్తూ ఇబ్బందిని కలుగజేస్తుంది. జీవము లేని శరీరాన్ని చితి కాలిస్తే, జీవమున్న శరీరాన్ని చింత కాలుస్తుంది.

మానసికముగా మనలను బాధించేది చింత, బయటకు కనిపించే విదంగా మనలను బాధించేది శోకము. కాబట్టి చింత లేకుండా జీవితం గడపాలి అనుకుంటే, శోకము లేకుండా మనముండాలి అనుకుంటే, ఆదిత్య హృదయం పారాయణ చెయ్యాలి.

‘ఆయుర్వర్ధన ముత్తమం’: ఆదిత్య హృదయం పారాయణ వలన ఆయుస్సు పెరుగుతుంది. ఆయుస్సు పెరగటమేమిటి అనేది ఒక ప్రశ్న. ‘లలాట లిఖితే రేఖః పరిమాష్టం న శక్తతే హరినాపి హరేనాపి బ్రహ్మనాపి సురైరపి‘, – ‘నుదుటిమీద రాయబడిన రేఖలిక చెరగవు. శివుడి కైనా అంతే, విష్ణువు కైనా అంతే, బ్రహ్మకైనా, దేవతలకైనా అంతే’ అని శాస్త్రం పేర్కొంటోంది. అయితే వీటితో పాటు ‘అకాల మృతువు’ అని ఒకటి ఉంటుంది. అనేక కారణాల చేత ఎప్పుడు వెళ్ళిపోతాడో మనిషి తెలియదు. ఆ అకాల మృతువును నివారించేది ఆదిత్య హృదయం పారాయణ. ఏమి కోరాలి భగవంతుడిని అంటే ‘అకాల మృతు హరణం, సర్వవ్యాధినివారణం, సకలబాధ ఉపశమనం‘, అనే మూడింటిని కోరామన్నారు పెద్దలు. “ఎందుకంటే తరువాత జన్మ మానవజన్మ వస్తుందని చెప్పలేము కావున ఇప్పుడు ఈ ప్రార్థన చేస్తున్నాను స్వామి”, అని ఆ భగవంతుడిని వేడుకోవాలి. అప్పుడు మనకి ఉత్తమ జన్మలు లభిస్తాయి.  

ఆదిత్యహృదయం

ధ్యానమ్

నమస్సవిత్రే జగదేక చక్షుసే
జగత్ప్రసూతి స్థితి నాశహేతవే
త్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణే
విరించి నారాయణ శంకరాత్మనే

తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ |
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 1 ||

దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ |
ఉపగమ్యా బ్రవీద్రామమ్ అగస్త్యో భగవాన్ ఋషిః || 2 ||

రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ |
యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి || 3 ||

ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనమ్ |
జయావహం జపేన్నిత్యమ్ అక్షయ్యం పరమం శివమ్ || 4 ||

సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనమ్ |
చింతాశోక ప్రశమనమ్ ఆయుర్వర్ధన ముత్తమమ్ || 5 ||

రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్ |
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ || 6 ||

సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః |
ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః || 7 ||

ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః |
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః || 8 ||

పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః |
వాయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః || 9 ||

ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ |
సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః || 10 ||

హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తి-ర్మరీచిమాన్ |
తిమిరోన్మథనః శంభుః త్వష్టా మార్తాండకో‌உంశుమాన్ || 11 ||

హిరణ్యగర్భః శిశిరః తపనో భాస్కరో రవిః |
అగ్నిగర్భో‌உదితేః పుత్రః శంఖః శిశిరనాశనః || 12 ||

వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్యజుఃసామ-పారగః |
ఘనావృష్టి రపాం మిత్రో వింధ్యవీథీ ప్లవంగమః || 13 ||

ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః |
కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వభవోద్భవః || 14 ||

నక్షత్ర గ్రహ తారాణామ్ అధిపో విశ్వభావనః |
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్-నమో‌உస్తు తే || 15 ||

నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః |
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః || 16 ||

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః |
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః || 17 ||

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః |
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః || 18 ||

బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్య-వర్చసే |
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః || 19 ||

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయా మితాత్మనే |
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః || 20 ||

తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే |
నమస్తమో‌உభి నిఘ్నాయ రుచయే లోకసాక్షిణే || 21 ||

నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః |
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః || 22 ||

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః |
ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్ని హోత్రిణామ్ || 23 ||

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ |
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః || 24 ||

ఫలశ్రుతిః
ఏన మాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ |
కీర్తయన్ పురుషః కశ్చిన్-నావశీదతి రాఘవ || 25 ||

పూజయస్వైన మేకాగ్రో దేవదేవం జగత్పతిమ్ |
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి || 26 ||

అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి |
ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతమ్ || 27 ||

ఏతచ్ఛ్రుత్వా మహాతేజాః నష్టశోకో‌உభవత్-తదా |
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్ || 28 ||

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ |
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ || 29 ||

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ |
సర్వయత్నేన మహతా వధే తస్య ధృతో‌உభవత్ || 30 ||

అధ రవిరవదన్-నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః |
నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి || 31 ||

|| ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మికీయే ఆదికావ్యే యుద్దకాండే పంచాధిక శతతమ సర్గః ||

K C Das Memorial Charitable Trust

Paropakarardham Idam Sareeram

  • Instagram
  • YouTube
  • Facebook
Address
H.No. 11-13-119, 14/B, Road No. 3, beside Axis Bank, Alkapuri Colony, Ramakrishnapuram, Kothapet, Hyderabad, Telangana 500035
View on map
Contact
contact@kcdastrust.org
+91 94948 77070
04:00 PM to 08.30 PM IST

© 2026 K C Das Memorial Charitable Trust. All rights reserved.

Terms and ConditionsPrivacy Policy