కలియుగంలో తరించే మార్గాలు
Dharma Vaani – K C Das Memorial Charitable Trust
‘ఇది కలియుగం, కలికాలం’, అనే మాటలు మనము తరుచు వింటున్నాము. కలియుగములో మనము తేలికగా తరించానికి గల అనేక మార్గాలను గురించి పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్రమూర్తిగారు మనకి తెలియజేస్తున్నారు.
కలియుగములో సులభముగా తరించటానికి చెప్పిన మార్గమేమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. “గీతా గంగా తధా విష్ణుః కపిలాశ్వద్ధ సేవనం ఏకాదశే వ్రతం చైవ సప్తమం న కలౌ యుగే”, అని కార్యకారణ విచారణలో మనకి తెలియవస్తుంది. గీత పారాయణ చేసినా, గంగానది స్నానం చేసినా, విష్ణు సేవనం చేసినా, కపిల గోవును (నల్లటి గోవు) సేవించినా, అశ్వద్ధ వృక్షానికి సేవ చేసినా, ఏకాదశి వ్రతాన్ని పాటించినా కూడా కలిలో తప్పక అభిష్టాలన్నీ నిరవేరుతాయి, కోరిన కోరికలన్నీ తీరుతాయి.
స్మృతలలో తేడా ఉంటే, వాటిలో పరస్పర విరోధము ఉంటే, కలియుగములో పరాశర స్మృతిని ఆచరించాలని శాస్త్రం పేర్కొంటోంది. కృతయుగములో పది సంవత్సరాలు పుణ్యకర్మలు చేసినటువంటి కర్మఫలము, త్రేతాయుగములో సంవత్సరము పాటు ఆచరించిన కర్మఫలముతో సమానము. అదే కర్మఫలము ద్వాపర యుగములో నెలరోజుల పాటు ఆచరించిన కర్మఫలముతో సమానము. అదే కర్మఫలము కలి యుగములో ఒకే ఒక్క రోజు ఆచరించిన కర్మఫలముతో సమానము. అంటే కృతయుగములో పది సంవత్సరాల పాటు పుణ్యకర్మలు ఆచరిస్తే ఎంత ఫలితము లభిస్తుందో, అదే ఫలితము త్రేతాయుగములో ఒక సంవత్సరము పాటు పుణ్యకర్మలు ఆచరిస్తే లభిస్తుంది, ద్వాపర యుగములో నెలరోజుల పాటు పుణ్యకర్మలు ఆచరిస్తే అదే ఫలితం లభిస్తుంది, ఇక కలియుగములో ఒకే ఒక్క రోజు పుణ్య కర్మలు ఆచరిస్తే అదే ఫలితం లభిస్తుంది.
కృతయుగములో పది సంవత్సరాల పాటు పుణ్యకర్మలు ఆచరిస్తే ఎంత పుణ్య ఫలం లభిస్తుందో, అంతటి పుణ్య ఫలం కలియుగములో ఒక్క రోజు పుణ్యకర్మలు ఆచరిస్తే లభిస్తుంది.
‘కలియుగములో పుణ్యకర్మలు కేవలం సంకల్పం మాత్రానే సిద్ధిస్తాయి, కానీ పాపకర్మలు మాత్రం ఆచరిస్తే కానీ సిద్దించవు’, అని భాగవతము పేర్కొంటోంది. ఈ కలి యుగములో ‘పుణ్యం చేస్తాను, పుణ్య కర్మ ఆచరించాలి’, అని మనస్సులో సంకల్పించుకుంటే చాలు, ఆ కర్మ యొక్క ఫలితం మనకు లభిస్తుంది. అదే పాపం అయితే, పాపకర్మ ఆచారిస్తేనే మనకు లభిస్తుంది.
అట్టి మహత్తరమైన కలియుగములో మనము ఉన్నాము. “నేను పుణ్య కర్మ చేస్తాను”, అన్న భావనే మనము ఫలితాన్ని అందిస్తుంది. మానసిక పాపాలకు కలిలో చోటు లేదు. అయితే ‘మానసికముగా పాపాలు చేస్తాను’ అనటం కూడా సరికాదు, అది తప్పు. ఇక్కడ మనం గ్రహించవలసినదేమిటి అంటే ఎక్కువ శ్రమ, కష్టం అవసరం లేకుండా, “కలౌ స్మరనాన్ ముక్తి”, అన్నారు.
అంటే యజ్ఞయాగాది క్రతువుల అవసరం లేకుండానే (అశ్వమేధ, వాజపేయ, స్వాంతపర, పౌండరిక) ‘రామ’ అనే రెండక్షరాలు చాలు. ‘నామస్మరణం తరుణోపాయం’, అన్నారు పెద్దలు, ఈ యుగములో భగవన్నామస్మరణ మనకు ముక్తిని అందిస్తుంది.

“రమించు వారెవరురా రఘోత్తమా నినువినా, శమాది షడ్గుణగణ సకల భువన జనులలో (రమించు) రమయనే సుమర్మము రామయనే శర్మము తదమరవరుల కబ్బెనో త్యాగరాజ సన్నుతా”, అని త్యాగరాజులవారు పేర్కొన్నట్లు, రామ నామము చెప్తే కలిలో తరించవచ్చు. ‘కలౌ స్మరనాన్ ముక్తి’, కలిలో నామస్మరణముతో తరించవచ్చు అన్నారు పెద్దలు. కాబట్టి మనమందరం కూడా నిత్యం ఆ భగవంతుని స్మరిస్తూ ఉందాము.