వ్యక్తిత్వ వికాసం – జీవరాసుల నుంచి విజ్ఞానం (నిరంతరం నేర్చుకోవటం)
Dharma Vaani – K C Das Memorial Charitable Trust
వ్యక్తిత్వ వికాసానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం “నిరంతరం నేర్చుకునే ప్రయత్నం చేయటం”. మన చుట్టూ ఉన్న ప్రకృతిలోని అనేక జీవుల నుంచి కూడా మనము ఎంతో నేర్చుకోగలము అని పూజ్య గురుదేవులు తమ అనుగ్రహభాషణం ద్వారా మనకు తెలియజేస్తున్నారు.
ఈ సృష్టిలో 84 లక్షల జీవరాసులున్నాయి. వాటన్నిటి నుంచి కూడా ఏదో ఒకటి నేర్చుకోవటానికి మనకు అవకాశం ఉంటుంది. ‘జంతూనాం నార జన్మ దుర్లభం’, అన్నారు శ్రీశంకరులు. భుద్దినుపయోగించి, మానవుడు తన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఉన్న జంతువుల నుంచి ఎదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి.
‘పిపీలికార్జితం ధాన్యం మక్షికా సంచితం మధు లుబ్ధేన సంచితం ద్రవ్యం సమూలం హి వినశ్యతి’ – ‘చీమలు సంపాదించిన ధాన్యం , తేనెటీగలు సేకరించిన తేనె , లోభి కూడబెట్టిన ధనం సమూలంగా నశిస్తాయి’ అని భావం. చీమ ఒక చెక్కర పలుకుని ఎంతో కష్టపడి సేకరిస్తుంది. అది కాస్త ఒక పెద్ద చీమ వచ్చి నోట్లో వేసుకెళ్లిపోతుంది. చీమ నుంచి కష్టపడే తత్వాన్ని నేర్చుకోవాలి. తాను సేకరించిన వస్తువులని ఎవరు అపహరించిన తిరిగి మల్లి మల్లి సేకరిస్తూనే ఉంటుంది. పట్టుదల, శ్రమ చీమ నుంచి నేర్చుకోవాలి.
ఒక కాకికి మనము ఏదైనా ఆహారాన్ని సమర్పిస్తే, అది ఒక్కటే తినదు, ‘కావు కావు’, అని అరుస్తూ పది కాకులను పిలిచి అన్ని కాకులు కలసి ఆ ఆహారాన్ని తింటాయి. కాకిని చూసి సంఘటితముగా జీవించటం, సంఘంలో ఒక్కడిగా ఉండటం, ‘సంగచ్ఛధ్వం సంవదధ్వం సం వో మనాంసి జానతామ్’ – ‘అంతా ఒకే మాటగా ఉండటం, కలసి నడవటం’, సంఘజీవిగా ఎలా బ్రతకాలో కాకిని చూసి నేర్చుకోవాలి. కాకి నుంచి సంఘజీవనాన్ని నేర్చుకోవాలి.
సహనము సింహం నుంచి నేర్చుకోవాలి. సింహము తాను ఎంచుకున్నటువంటి ఆహారానికి బలి కావాల్సిన పశువును చూసి, అది వచ్చేదాకా అలాగే సహనంతో కనిపెట్టుకొని ఉంటుంది. దానికి ఆకలివేస్తున్నా, అలాగే ఓర్చుకొని, తనకు బలి కావాల్సిన జంతువు యొక్క కదలికలను గమనించుకొని, అదును చూసి సరైన సమయములో దాడి చేస్తుంది. కాబట్టి సింహాన్ని నుంచి సహనాన్ని నేర్చుకోవాలి.
అలాగే లేడి నుంచి పరుగును నేర్చుకోవాలి, లేకపోతే సింహానికి ఆహారమైపోతుంది. లేడి గంటకి 90 మైళ్ళు పరిగెత్తగలదు. అదే సింహం, పులి అయితే గంటకు 50 మైళ్ళే పరిగెత్తగలవు. అయితే సింహం, పులి ఆగకుండా ఆలా పరిగెత్తుతూనే ఉండగలవు, కానీ లేడి మాత్రం ఆగుతూ, వెనుకకు గమనిస్తూ ఉంటుంది. ఆలా వెనుక చూపు ఉన్న కారణమున లేడి పులికి, సింహానికి ఆహారము అయిపోతుంది. కావున ‘వెనుక చూపు’ ఉండకూడదని లేడి మనకు తెలుపుతోంది. లేడి యొక్క వేగ్గాన్ని మనము నేర్చుకోవాలి.
హంస నుంచి లౌక్యాన్ని నేర్చుకోవాలి. హంసకు పాలు, నీరు కలిపి అందిస్తే, నీటిని వేరు చేసి తనకు కావాల్సిన పాలను త్రాగేసి వెళ్ళిపోతుంది. అంతే గాని యాగీ చెయ్యదు. ఆ లౌక్యాన్ని హంస నుంచి నేర్చుకోవాలి. నీటిని, పాలని వేరుచేసి పాలను తాగినట్లు, మంచి చెడులను విడదీసి చూడాలి.
కుక్క నుంచి విస్వాసం నేర్చుకోవాలి,అత్యంత విశ్వాసపాత్రమైన జంతువు ఏది ఆంటే కుక్క అనే సమాధానం చెప్తాము. అలాగే ఆవు నుంచి సాధు గుణాన్ని నేర్చుకోవాలి. ఎంత శ్రమ పెడుతున్నా, ఎంత ఇబ్బంది పెడుతున్నా ఆవు తన సాధు గుణాన్ని వీడదు. ఈ సృష్టిలో ఉన్న అన్ని జంతువుల నుంచి, అన్ని పశుపక్ష్యాదుల నుంచి మానవుడు నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇలా ప్రకృతిలోని సంస్థ జీవరాశి నుంచి మనము గ్రహించే ప్రయత్నం చెయ్యాలి.

అంతే కాకుండా ఈ జంతువులన్నీ తాము చనిపోయిన తరువాత కూడా ఏదో విధముగా మానవాళికి ఉపయోగపడుతూనే ఉన్నాయి. పులి గోరు, ఏనుగు దంతం ఇలా అనేక రకాలుగా మనిషి వాటిని వినియోగిస్తున్నాడు. ఇందుకు మరొక ఉదాహరణ చమరీ మృగం యొక్క వెంట్రుకలను మనము ‘చామరం విజయామి’ అని భగవంతుని సేవలు ఉపయోగిస్తాము. జంతువుల యొక్క అవయవాలు, వాటి మాంసము, చర్మం, ఎముకలు, గోళ్లు, దంతం ఇలా ఏదో ఒకటి అవి మరణించిన తరువాత మనకు ఉపయోగపడతాయి.
అయితే మానవుని కళేబరం ఒక్కటే ఎందుకూ ఉపయోగపడదు. అందుకే జీవితం ఉన్నప్పుడే ఇతరులకి ఉపయోగపడటం నేర్చుకోవాలి . పరోపకారం కోసం తగు సమయాన్ని వెచ్చించాలి.