పరోపకారార్ధమిదం శరీరమ్
‘పరోపకారం’ యొక్క విశిష్టతను మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ‘పరోపకారాయ ఫలంతి వృక్షాః పరోపకారాయ వహంతి నద్యాః పరోపకారాయ దుహంతి గావః పరోపకారార్ధమిదం శరీరమ్‘, అని సుభాషిత వాక్కు. ఈ వాక్కు ద్వారా పరోపకార విశిష్టతను పెద్దలు మనకందించారు.
పరోపకార విశిష్టత:
‘పరోపకారార్ధమిదం శరీరమ్’ అంటే ‘పరులకు ఉపకరించుటకు నువ్వు పుట్టావు’, అని పెద్దలు మనకు బోధించారు. వెంటనే మనకు వచ్చే ప్రశ్న ఏమిటంటే, ‘పరులకు ఉపయోగపడుటకు నేను పుడితే, నాకు నేను ఎలా ఉపయోగపడతాను?’. దానికి మన పెద్దలు ఏమి చెప్పారంటే, “నువ్వు పరులకు ఉపకరించటం అంటే, నీ శక్తికి మించి ఉపయోగపడటం కాదు”. భగవంతుడు ఇచ్చిన శక్తి ఒక్క మనుష్య జాతికి మాత్రమే విశేషముగా ఉన్నది. 84 లక్షల జీవరాసులలో ఒక మనుష్య జాతికి మాత్రమే ‘బుద్ది’ అనేటటువంటి ఒక ప్రత్యేకమైన లక్షణాన్ని, తాను ఆలోచించుకోగలిగినటువంటి శక్తిని, తనకు తాను మార్చుకోగలిగిన శక్తిని భగవంతుడు ఇచ్చాడు.
45 సంవత్సరాల దాకా మహాత్మాగాంధీ కూడా సాధారణ వ్యక్తే. కానీ ఆ తర్వాత ఆయన మహాత్ముడిగా మారటానికి మొట్టమొదటి అడుగు వేసాడు. ఇతిహాసాలు, పురాణాలు ఎన్ని చూసినా కూడా ఈ మార్పులన్నీ కూడా ఒక్క మనుష్య జాతికి మాత్రమే సాధ్యమైనవి కానీ మిగతా జంతు జాతులకు కాదు. ఉదాహరణకు ఒక కుక్క ఉందనుకోండి, అది ఎలా పుట్టిందో అలాగే పోవాల్సినదే, మార్పు చేసుకోవటానికి దానికి అవకాశం ఉండదు. కేవలము ఆ కుక్క శారీరికంగా మాత్రమే పెరుగుతుంది, అది ప్రకృతి సహజముగా వచ్చేటటువంటిది. మార్పు మానవునికి సాధ్యమే అని చెప్పేందుకు మనకి చరిత్రలో చాలా ఉదాహరణలు కనిపిస్తాయి. ఒక కిరాతకుడు వాల్మీకి మహర్షి అయిన చరిత్ర మనకు తెలుసు. కాబట్టి గతము ఎలా ఉన్న సరే భవిష్యత్తును మార్చుకోగలిగినటువంటి అవకాశం మనకి ఒక్క మానవజన్మలోనే సాధ్యం. ఆ మార్పు ఎలా వస్తుంది అంటే ‘పరోపకారార్ధమిదం శరీరమ్’ అన్నారు.
కొంతమంది ఏమంటుంటారంటే ‘నాకు శక్తి లేదు గురువుగారు, నేనంత ఇవ్వలేను, సహాయపడలేను, నా జీవితమే నాకు సరిపోతుంది’, అంటుంటారు. సహాయపడటం అంటే ఆర్థికంగా సహాయపడటం ఒకటే కాదు. సహాయపడటం అంటే మాటసాయం కావచ్చు, ఇంకే రకమైన సహాయం అయినా కావచ్చు. ‘TIME TALENT TREASURE’ అంటుంటాము. కొంతమందికి భగవంతుడు ధనం ఇవ్వడు, లక్ష్మి అందరి దగ్గిరా ఉండదు. డబ్బు సహాయమే సహాయము అనుకోకూడదు.
పరోపకారం TTT సూత్రం:
TIME అంటే మీ యొక్క సమయాన్ని ఇతరుల కోసం వెచ్చించటం. ఎంతో మంది అభాగ్యులు మాట్లాడేవాళ్ళు లేక మానసికముగా ఆందోళనకు గురవుతున్నారు. ఈవాళ యాంత్రికమైనటువంటి జీవితములో, పరుగులుపెడుతున్న సమాజములో, పెద్ద పెద్ద ఉద్యోగాలు, పెద్ద పెద్ద చదువులు చదివినవారికి కూడా Stress అనేటువంటిది (Mental stress, Frustration, Anxiety, Fear) ఉంటున్నది. వీటన్నిటికి కారణం ఏంటి? మనిషి ‘సంఘజీవి’ అంటున్నాము.
సంఘం నుంచి విడివడి యాంత్రికంగా కనుక మనిషి జీవనం గడిపితే, లోపల ఆందోళన ప్రారంభం అవుతుంది. కాబట్టి ‘సహాయపడటం’ అనే లక్షణం గనుక మనము అలవాటు చేసుకుంటే మనకున్నటువంటి సమయంలో (రోజుకో 10 నిముషాలు, లేదా పావుగంట, లేదా అరగంట, లేదా వారానికి ఒక గంట) దగ్గిరలో ఉన్నటువంటి కమ్యూనిటీ సెంటర్, Social service organization, దేవాలయం, చర్చి, మసీద్, ఎక్కడో అక్కడికి వెళ్లి మనకున్నటువంటి సహాయం చెయ్యటం, మనకి వీలైనటువంటి సహాయం చెయ్యటమే ‘పరోపకారార్ధమిదం శరీరమ్‘.
దాని వల్ల జరిగేదేమిటి అంటే, ఎవరైతే సహాయం పొందారో, ఆ సహాయం పొందినటువంటి వ్యక్తి మనస్ఫూర్తిగా నిష్కల్మషమైన మనస్సుతో పూర్తిగా ఆశీర్వదిస్తాడు. మీకు బయటకు చెప్పకపోవచ్చు, కానీ లోపల అతను, “ఇతని వల్ల గదా నేను సహాయం పొందాను, ఇతనికంతా బాగుండాలి”, అని ఆశీర్వదిస్తాడు. దాన్ని Blessing అనండి, Good will అనండి, ఆశీర్వచనం అనండి, తప్పకుండా జరిగి తీరుతుంది అని పెద్దలు అంటారు. “He who thinks about others and secures their future has already secured his future” అని ఇంగ్లీష్ లో మనకి మంచి సామెత ఉంది. ‘యోగక్షేమం వహామ్యహం’ అని గీతలో శ్రీకృష్ణపరమాత్మ పేర్కొన్నారు. ఎవరి యోగక్షేమం? ఎవరైతే ఇతరుల కోసం పాటుపడుతున్నారో, వారి యోగక్షేమం. ఎందువల్ల అంటే, ‘ఇతరులకు సహాయపడటం అనేటువంటిది భగవంతుడి లక్షణం’. అది దైవీ సంపద. ఆ సంపద ఎవరైతే అలవాటు చేసుకుంటారో వారి క్షేమాన్ని భగవంతుడు చూసుకుంటాడు.

‘ఆర్తో జిజ్ఞాసి అర్తార్తి’, అని ఆర్తితో ఉన్నటువంటివారికి మీరు గనక సహాయం అందించారంటే, అది ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కావచ్చు లేదా వస్త్రలోపం ఉన్నవారికి వస్త్రం ఇవ్వటం కావచ్చు, ఏది వీలైతే అది. ఏ విధముగా సహాయపడగలిగితే ఆ విధముగా మీరు సహాయం చెయ్యగలిగితే, ఆ సహాయం ఇంతింతై వటుడింతయై మరియు దానింతై నభోవీధి పై నంతై అన్నట్లు మళ్ళీ మనకి ఏదో ఒక రూపములో తిరిగివస్తుంది.
‘పరోపకారార్ధమిదం శరీరమ్’ అంటే మన శక్తికి మించి చెయ్యమని కాదు. మన శక్తి ఎంతుంటే అంతవరకే. అందులో TIME TALENT TREASURE ఈ మూడు గుర్తుంచుకుంటే, ఏది వీలుంటే అది. TALENT అంటే మనకుండే శక్తి. (ఒక పల్లకి మోయగలిగిన శక్తి) ఉదాహరణకు దేవాలయములో ఒక పల్లకి ఊరేగింపు జరుగుతున్నది, పల్లకి మోసి వద్దాము, అంతే. అది పదిమందికి సహాయపడ్డట్లే. మరొక ఉదాహరణ. ఒక చోట గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి, మండపాలలో మనం చెయ్యగలిగినటువంటి TALENT (ఒక కీర్తన ఆలపించగలిగితే కీర్తన ఆలపించటం, ఒక పాట పాడగలిగితే పాట పాడగలగటం, ఒక మృదంగం వాయించగలిగితే మృదంగం వాయించటం), లేదా software develop చెయ్యగలగటం, ఆ software ని వాడి పదిమందికి మనము ఏ విధముగా మేలు చెయ్యగలుగుతాము అన్న ఆలోచన చెయ్యగలిగితే ఆ software ద్వారా ఆ talent ద్వారా సమాజానికి మీరు హితం చేసినవారౌతారు.
సమాజ శ్రేయస్సును కోరుతూ TIME (సమయం) TALENT (శక్తి) TREASURE (డబ్బు), ఇలా ఏది చేసినా యధాశక్తిగా చెయ్యమన్నారు పెద్దలు. అపాత్రదానం చెయ్యమని శాస్త్రం చెప్పలేదు. మనకున్నంతలో దానధర్మాలు ఆచరిస్తూ సమాజ శ్రేయస్సు కొరకు మీ యొక్క శ్రమను, శక్తిని, సమయమును వెచ్చించగలిగితే అదే ‘పరోపకారార్ధమిదం శరీరమ్’.
పరోపకార విశిష్టత
‘పరోపకారాయ ఫలంతి వృక్షాః’, ఆంటే వృక్షములు ఫలాల్ని ఇస్తాయి. ఒక చెట్టు పళ్ళు ఇచ్చింది ఆంటే, ‘నా పిల్లల కోసం ఈ పళ్ళు ఇస్తున్నాను’ అంటుందా? అనదు కదా. ఎవరొచ్చినా సరే, ఆ పండ్లు ఎవరు తింటారో ఆ ఫలానికి తెలీదు, ఆ వృక్షానికి తెలీదు, ఎవరో ఒకరికి ఉపయోగపడాలి. మనకున్నటువంటి TIME TALENT TREASURE మనకెలాగో ఉపయోగపడుతుంది. ‘తన్నుమాలిన ధర్మం మా చెడ్డ బేరం’, అనే విషయాన్ని ముందు గుర్తుంచుకోవాలి. అయితే అక్కడితో ఆగిపోకండి. ‘నీ దగ్గిర నువ్వు ఆగిపోకు’. వాక్ వైభవము ఉన్నది, సమాజానికి మంచి మాటలు చెప్పు. అలాగే ఏ విధమైనటువంటి శక్తి ఉన్నా సరే, ఆ శక్తిని పదిమందికి ఉపయోగపడే విధముగా దాన్ని రూపొందిస్తే కనుక అది విశేషం.
‘వనే రణే శత్రు జలాగ్ని మధ్యే మహార్ణవే పర్వత మస్తకే వా । సుప్తం ప్రమత్తం విషమ స్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని‘ అంటుంది శాస్త్రం. పరోపకారం రూపేణా చేసినటువంటి పుణ్యం కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఎక్కడున్నా సరే మనల్ని ఆదుకుంటుంది. మహారణ్యంలో తప్పిపోయినా, యుద్ధంలో శత్రువులతో పోరాడుతున్నా, అగ్నిలో కానీ నీటిలో కానీ చిక్కుకున్నా, నడిసముద్రంలో దారితోచకున్నా, పర్వతశిఖరం మీద ఉన్నా, గాఢనిద్రలో ఒళ్లు తెలియకున్నా, ఎంతటి విషమ స్థితిలో ఉన్నా, మనం చేసిన పుణ్యాలే రక్షగా నిలుస్తాయి. మనము పూర్వములో చేసిన సత్కర్మలు, సన్మార్గములో నడుస్తూ చేసిన మంచిపనులే మనల్ని రక్షిస్తాయి.
పరులకు సహాయం చెయ్యటం ఆంటే ‘మంచికర్మ, సత్కర్మ’. ‘పరోపకారాయ పుణ్యాయ, పాపాయ పరపీడనం’, అని వ్యాసమహర్షి పేర్కొన్నారు. 18 పురాణాలు వ్రాసిన తరువాత వ్యాసులవారికి తన పురాణాలు ఎవరైనా చదువుతారా అనే సందేహం వచ్చింది. అప్పుడు వ్యాసులవారు పురాణాలసారమంతటిని ఒక్క మాటగా అలా చెప్పారు. పరోపకారం ఆంటే ‘నీకు నువ్వు మేలుచేసుకునేటటువంటి మార్గము’ అని పెద్దలు చెప్పారు.
ఎలా అయితే ‘పరోపకారాయ ఫలంతి వృక్షాః’, వృక్షములు ఫలములు ఎవరికి వెళ్తాయో అని తెలియకుండా సేవ చేస్తాయో, అలాగే నువ్వు కూడా ‘నీ, నా అనే భేదం లేకుండా ఇతరుల నుంచి ఏమి ఆశించకుండా సేవ చెయ్యాలి’, అనే భావనను పెంచుకోవాలి. అలాగే ‘పరోపకారాయ వహంతి నద్యాః’, నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ప్రవహిస్తునంతసేపు ఆ నదులు పిల్లలకు, పెద్దలకు, వయో వర్గ లింగ కుల మత భేదము లేకుండా అందరికి నీరును అందిస్తాయి. కాబట్టి పశుపక్ష్యాదులకు, సకల మానవాళికి శ్రేయోవిధముగా ఉండేటటువంటి విధానం ‘పరోపకారార్ధమిదం శరీరమ్’. నీ జీవన విధానం కనుక ఇలా ఉంటే, పరులకు ఉపయోగపడే విధముగా నువ్వు గనుక చేసుకోగలిగితే నీ జీవితము ఆనందముగా ఉంటుంది.

మూడవది ‘పరోపకారాయ దుహంతి గావః’. ఆవు పాలిస్తుంది, ఆ పాలు ఎవరు తాగుతారో ఆవుకు తెలియదు. నిజానికి దూడకు కొద్దిసేపు ఇచ్చి లాగేస్తాము మనము. ఆ పాలు ఎవరు తాగుతారో ఆ ఆవుకు తెలియదు. ఎలా అయితే వృక్షములు అందరికి పళ్ళు ఇస్తాయో, నదులు నీటిని అందరికి అందజేస్తాయో, ఆవులు పాలు అందరికి అందిస్తాయో, మానవులు కూడా తమ శక్తిని ‘పరోపకారార్ధమిదం శరీరమ్’ వినియోగించాలి అంటుంది శాస్త్రం.
‘ఈ విధముగా గనుక మనము గడుపుకోగలిగితే మన జీవితం ధన్యం, మన ఆశయాలు సిద్ధిస్తాయి, మన కుటుంబం ఆనందముగా ఉంటుంది, సమాజం ఆనందముగా ఉంటుంది’, అని పెద్దలు అనుభవపూర్వకంగా చెప్పిన సత్యం, తాము ఆచరించి చూపిన మార్గం.
ధర్మస్య విజయోస్తు.