సంక్రాంతి పండగ సందేశం
మనము జరుపుకునే అనేక పండుగల్లో “సంక్రాంతి” ఒక విశేషమైన పండగ. సంక్రాంతి పండగ మనకి సన్మార్గానికి సంబంధించి ఏ సందేశం ఇస్తుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.
సంక్రాంతి అంటే?
‘సంక్రాంతి’ అనే పేరులోనే మనకు ఒక పెద్ద సందేశాన్ని అందించారు. సన్మార్గములో ఉండాలి అనుకుంటున్నటువంటి వారు ఈ పేరులో గల అర్థాన్ని విశ్లేషణ చేస్తే విశేషమైన అర్థం ఇందులో కనిపిస్తుంది. సం అంటే ‘మంచి’, క్రాంతి అంటే ‘మార్పు’. విప్లవం అని కూడా వాడతారు. విప్లవం మార్పు కొరకే కనుక క్రాంతి అంటే మార్పు. ‘మంచి కొరకు మార్పు ప్రారంభం కావాల్సిన రోజు’ సంక్రాంతి. ఏది మంచి అంటే, ప్రతి మనిషిలో ఏదో ఒక మంచి లేకుండా ఉండదు. అందరు మనుషులు చెడ్డవాళ్ళు కాదు, అలాగని అందరు మంచివారు కూడా కాదు.
ప్రతి మనిషిలోనూ కొంత మంచి, కొంత చెడు ఉంటూ ఉంటుంది. ఆ చెడుని దూరం చేసుకొని, మంచిని పెంపొందించుకోవడానికి ఈ రోజు ఒక సూచనగా మనము తీసుకోవాలి. మనిషిలో ఉండే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు మనల్ని అథః పాతాళానికి తీసుకొనివెళతాయి. కామము అంటే Desire. Reasonable Desires మనకి పెద్దలు కూడా Permit చేసారు. అయితే ఆ Desires సరి అయిన మార్గములో ఉన్నాయా లేదా అని ఎప్పటికప్పుడు చూసుకుంటూ, వాటిని నియత్రించుకుంటూ, ఎక్కడైనా ఆలోచన గాని వ్యవహారం గాని పెడత్రోవ పడుతూ ఉంటే, ఆలా పెడత్రోవ పెట్టనీయకుండా, కావాల్సిన మార్పును తీసుకురావటానికి ఈ సంక్రాంతి మనకు సందేశం ఇస్తుంది.
ఉత్తరాయణ పుణ్యకాలం వెనుక ఉన్న విశిష్టత?
సంక్రాంతి నుంచి ‘ఉత్తరాయణ పుణ్యకాలం’ ప్రారంభం అవుతుంది.
అంటే సూర్యుడి గమనం దక్షిణం నుండి ఉత్తరం వైపు తిరిగి, ఆయన ఉత్తరం నుండి నడక ప్రారంభిస్తాడు అని. ఈ రోజు నుంచి మంచి రోజులు అని నానుడి. భీష్ముడంతటి వాడు ఈ రోజు కోసం ఎదురుచూసి ప్రాణత్యాగం చేసాడు. అంటే ప్రాణత్యాగం చెయ్యటానికి కూడా మంచి రోజులు చూసుకొని వెళ్లగలిగిన రోజు, సన్మార్గములో ఉండవలసిన రోజు ఈ రోజు.
ఉత్తరము అంటే North. North అంటే Upwards. అంటే మనిషి పైకి ఎదగటానికి కావాల్సిన మార్పు మొదలైన రోజు. సూర్యగమనం ఎలాగైతే దక్షిణాది నుంచి ఉత్తరాదికి మారుతుందో, తాము నడిచే మార్గములో ఏమన్నా మార్పులు చెయ్యాలి అనుకుంటే ఈ రోజు నుంచే ప్రారంభించాలి.
సూర్యుడు ఎలాగైతే దక్షిణం నుంచి ఉత్తరం వైపు తిరిగి నడక ప్రారంబిస్తున్నాడో, ఆయనని అనుసరిస్తూ సమస్త మానవాళి కూడా తాము నడిపేటటువంటి నిత్యవ్యవహారాలలో ఎక్కడైతే మార్పు చేసుకోవాలో, ఆ మార్పును ఉన్నత దిశగా, ఔన్నత్యానికి ప్రతీక ఉండేటట్టుగా తమ యొక్క వ్యవహారశైలితో మార్పు చేసుకొని, తమ నడక మార్చుకోవటానికి ఈరోజు నుంచి సమాయత్తం కావాలి.
సంక్రాంతి ఆచారాల విశిష్టత
సంక్రాంతి నాటి విశేషం ‘భోగి మంటలు’ వెయ్యటం. ఒక వీధిలో ఉండేవారందరు తమ ఇంటిలోని పనికిరాని సామాను తీసుకు వచ్చి, తెల్లవారుజామునే భోగి మంటలు వేసి చలి కాచుకోవటం మాములుగా మనకి తెలిసిన అర్థం. కానీ ఇందులో కూడా సన్మార్గానికి కావాల్సిన గొప్ప సందేశాన్ని జోడించారు మనకి పెద్దలు.
మనము గమనిస్తే భోగి మంట వేసేటప్పుడు ఎదురింటి వారు, పొరుగింటి వారు కలిసి, ఆ వీధిలోనివారందరు కలసి ఆ మంటను వేస్తారు. దీన్ని మనము Community Fire అంటున్నాము. ‘కలసి జీవించండి, కలసి ఉండండి, కలసి నడవండి, కలసి కదలండి’ అంటుంది వేదం.
ఈ రోజు భోగిమంట పేరుతో ఆ ప్రాంతములో ఉన్నటువంటి వారందరు కలివిడిగా ఉంటూ, కలసి భోగి మంటను ఏర్పరచుకుంటారు. అంటే Togethernessలో ఉండేటటువంటి ఆనందం. ఎదుటి మనిషితో కలవాలి అన్నపుడు మన ఆలోచనలో మార్పు ఉండవచ్చు, కొన్ని కొన్ని విషయాలలో ఏకీభవించకపోవచ్చు, ఒకరి అభిప్రాయంతో మరొకరు ఏకీభవించే పరిస్థితులు రాకపోవచ్చు. కానీ Let Us Agree to Disagree. ‘కలసి ఎలా ఉండాలో’ అటువంటి పండగల ద్వారా పెద్దలు మనకి చూపిస్తారు.
అలాగే మరొక్క విశేషమైన అంశం ఈ సంక్రాంతికి ‘హరిదాసులు’. ‘హరోలో రంగ హరి’, అని సంక్రాంతికి హరిదాసులు ఇంటింటికి వస్తారు. వారికి తర తమ భేదం లేదు. వారు అందరి ఇళ్లకు వెళ్లి, తర తమ భేదం లేకుండా అందరు ఇచ్చింది తీసుకొని (ధనికులు, పేదలు ఇత్యాదివారందరు తమ శక్తి మేరకు సమర్పించిన బియ్యం, డబ్బు ఇత్యాదివి), ఎవరు ఏది ఇచ్చినా తృప్తిగా, ఆనందముగా స్వీకరిస్తారు. అందరికి కలుపుపోయే తత్త్వాన్ని పెద్దలు హరిదాసుల ద్వారా మనకందించారు.
మరొక ముఖ్యమైన అంశం, పండగ అంటే బంధుమిత్రులందరు వస్తారు, కలసి భోజనం చేస్తారు, కలసి జీవనం గడుపుతారు. సంఘములో ఉన్న వ్యక్తి ఆనందముగా అందరితో ఎలా కలసి జీవించాలో, ఆ రోజు ప్రతి అంశంలో కనపడుతుంది. ఇంతే కాకుండా ముగ్గులు పెడతారు. ఈ ముగ్గులు పెట్టినప్పుడు చుక్కలు చుక్కలుగా ప్రారంభమైన ముగ్గులు చివరికి వచ్చేటప్పటికి అది ఒక రథం ముగ్గు అవుతుంది. ఆ రథం ముగ్గును పక్కింటి రథంతో కలుపుతారు. అంటే ‘మీకు మేము, మాకు మీరు ఒకరికొకరు తోడుగా ఉందాము, మన జీవనాన్ని ఆనందముగా గడుపుకుందాము’, అనేటువంటి సందేశం ఈ ముగ్గుల ద్వారా మహిళామణులతోటి ప్రతిబింబించే విధముగా పెద్దలు మనకి అమర్చారు.
మరొక ముఖ్యమైన విషయం ఈ రోజు ‘గోపూజతో’ ప్రారంభం చేసి కనుమనాడు వ్యవసాయదారులందరు కూడా ఎడ్లకు పూజ చేస్తారు, గంగిరెద్దులను పూజ చేస్తారు. రకరకాల వేషాలు వేసేవారికి, జానపద కళాకారులకు కూడా అత్యంత ప్రాధాన్యత ఉండే పండగ సంక్రాంతి. ‘సమాజములో నివసించేవారందరు కలసి జీవించాలి’ అని సంక్రాంతి పండగ మనకు తెలిపే సత్యం. ‘ఆత్మవత్ సర్వభూతాని’, సమస్త మానవాళిని, పశుపక్ష్యాదులను కూడా సమానంగా ఆదరించే విధానం ఈ సంక్రాంతిలో కనపడుతుంది.
‘క్రాంతి’ అంటే మార్పు. ఈ మార్పు ఎవరిలో రావాలి అంటే ప్రతివ్యక్తి తనను తాను పరిశీలించికొని, ఆత్మవిమర్శ చేసుకొని, ఏ విషయములో మార్పు చేస్తే ఈ విధముగా తాను ఆనందముగా జీవించవచ్చు అనే ఆలోచన ఈ పండగ నాడు తప్పక చెయ్యాలి. ఎందుకంటే మనిషిలో ఆలోచన లేకపోతే ఎంతమంది ఉన్నా ఆనందముగా ఉండలేరు. ఉదాహరణకు కొంతమంది అందరిలో ఉంటారు, కానీ వారి ద్రోవన వారు ఒక పక్కన కూర్చుంటారు, అందరిలో కలవలేరు. ప్రతి ఒక్కరిని చూస్తే ఏదో ఒక అసూయ, ఏదో ఒక ద్వేష భావన, ఏదో ఒక నూన్యతా భావన. ఇటువంటి వాటితో సతమతమౌతూ ఉంటారు, ఆనందముగా జీవించలేరు.
ఈ సంక్రాంతి పండగ మనకిచ్చే సందేశం ‘ఎప్పుడు ఆనందముగా ఉండాలంటే ప్రతి విషయంలో, ప్రతి వ్యక్తితో, సమాజములో కలుపుకుంటూ ఎలా వెళ్ళాలి’, అని మనకి సంక్రాంతి అనేటువంటి మాటలోనే పెద్దలు మనకి చెప్పారు. క్రాంతి అంటే ‘మార్పు’. కాబట్టి ఎక్కడ మార్పు చేసుకోవాలి. ‘నా విషయములో ఎక్కడ నేను మార్పు చేసుకోవాలి? ఏ మార్పు నేను చేసుకుంటే అది నన్ను, నా చుట్టుపక్కలవారిని, అలాగే సమాజాన్ని కూడా ఆనందముగా ఉంచగలుగుతుంది’, అనేటువంటి సమీక్ష చేసుకోవటానికి ఈ సంక్రాంతి పండగ మనకు విశేషముగా ఉపయోగపడుతుంది, సందేశాన్ని అందిస్తుంది.
ఈ సంక్రాంతి పండగ నాడు మనల్ని మనము ఒక్కసారి అవలోకించుకొని, మన ప్రవర్తనలో తగిన మార్పు చేసుకోగలిగితే, సన్మార్గములో ఉండగలుగుతాము. సంక్రాంతి పండగలోని ఏ అంశాన్ని తీసుకున్నా అందులో ఉండే సందేశము మనిషి ఎదగటానికి కావాల్సిన సహకారం అందిస్తుంది.
ధర్మస్య విజయోస్తు.