Skip to navigation
K C Das Memorial Charitable Trust
Donate
  • Home
  • About
  • Library
    • Dharma Vaani
    • Sri Lalitha Sahasra Naamavali
    • Dharmavaaradhi e-Magazine
    • Guru Vaani
    • Saradamba TV (Grandly Launched)
  • Dharmika Programs
    • All programs
    • Hanuman Chalisa
    • Gayathri Japam
    • Bala Japam
    • Calendar
  • Spiritual Education
  • Community Welfare
  • Contact
Donate
  • Instagram
  • YouTube
  • Facebook
  • Instagram
  • YouTube
  • Facebook
Donate

ప్రాతఃస్మరణీయులు – ఆదిశంకరాచార్యులు

సన్మార్గంలో భాగంగా మనకి వరిష్ఠమైనటువంటి, విశేషమైనటువంటి వ్యక్తుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జగద్గురువులైన శ్రీఆదిశంకరాచార్యుల వారి వైశిష్ట్యము ఎటువంటిదో, వారు మనకు చూపిన సన్మార్గం ఎటువంటిదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.

“శంభోర్ మూర్తి శంకరాచార్య” అంటారు. ఈశ్వరుడు భూమి మీద నడయాడదలచి శంకరాచార్యులుగా కేరళలోని కాలడి క్షేత్రములో 1200 సంవత్సరాల క్రితం ఆయన జన్మించారు. ఆర్యాంబ, శివగురు ఆయన తల్లి, తండ్రి. వారు ఎన్నో నోములు నోచి, ఎన్నో వ్రతాలు చేసి, ఎన్నో పూజలు చేసిన తరువాత పరమేశ్వరుడు శివగురుల కలలో కనిపించి, “ప్రజ్ఞావంతుడు, వినయసంపన్నుడు అయి అల్పాయుష్షు ఉన్న కుమారుడు కావాలా, సాధారణమైన నూరుగురు సంతానం కావాలా”, అని అడిగితే, “విశేషమైన పాండిత్యం ఉన్నవారు కావాలి”, అని అడగటం, ఆ విధముగా శంకరాచార్యులుగా శివుడు వారికి జన్మించటం జరిగింది. శంకరభగవత్పాదులుగా ఆయనకు పేరు.

శంకరాచార్యులు – ధర్మప్రచారం:

భగవత్పాదులు అంటే ‘ఎవరి పాదం పట్టుకుంటే భగవంతుడిని చూపిస్తారో, వారు భగవత్పాదులు’. ఎలా చూపిస్తారు? శంకరాచార్యులవారు ఆయన రాసిన గ్రంథాల ద్వారా, భాష్యముల ద్వారా, విశేషమైన ధర్మప్రచారం ద్వారా, పండితుల నుంచి పామరుల వరకు, అందరికి కూడా తేలికగా అర్థం అయ్యే విధముగా, స్తోత్రాలు వ్రాసారు. తద్వారా మనందరికి భగవద్ అనుగ్రహము అతి తేలికగా కలిగేలా అనుగ్రహించారు.

సన్మార్గములో ఉండదలచిన వారు, సన్మార్గములో ప్రయాణించాల్సిన వారు, అందరూ గుర్తుంచుకునే విధముగా ‘మోహ ముద్గర స్తోత్రం’ (భజగోవిందం స్త్రోత్రం) మనకందించారు.

మనిషి యొక్క లక్ష్యం ఏ విధముగా ఉండాలి, యావజ్జివన పర్యంతం ఆనందముగా గడపాలి అంటే ఏ విధముగా మనము మన జీవితమును గడపాలి అని ఈ భజగోవిందం స్తోత్రాలలో చాలా తేలికగా సులువుగా అర్థం అయ్యేటటువంటి భాషలో మనకందించారు.  “యావత్ విత్తో పార్జన శక్త: తావన్నిజపరివారోరక్త: పశ్చాత్ జీవతి జర్జరదేహే వార్తాం కోపి న పృచ్ఛతి గేహే”, – “నువ్వు సంపాదన ఉన్నంత కాలమే నీ చుట్టూ మనుషులు చేరుతారయ్యా, అది లేనినాడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో” – భజగోవింద స్తోత్రం

శంకరాచార్యులవారి విశేష లక్షణాలు

ప్రత్యక్షంగా శంకరాచార్యుల వారు భగవత్ అవతారం అయినప్పటికి కూడా ఆయన మనకు సూచనలుగా మాత్రమే అందించారు తప్ప, ఆదేశముగా కాదు.  మిగతా అవతారాల్లో చూస్తే గనుక శత్రు సంహారం జరిగినట్లుగా కాకుండా, రక్తపాతం, హింస లేకుండా మనిషి యొక్క ఆలోచన విధానాన్ని మార్చి, శాంతియుత మార్గంలో అందరికి ఆమోద యోగ్యమైనటువంటి విధానంగా తన యొక్క లక్ష్యాన్ని, తన యొక్క ఉద్దేశాన్ని అనేక రచనల రూపేణా మనకందించారు.

హింసకు తావు లేకుండా తాను చెప్పాలనుకున్న విషయాన్ని అవతల వ్యక్తులకు అందింపచేయడానికి కావలసినటువంటి విశేషమైన Communication Skill శంకర భగవత్పాదుల వారి సొంతం. ఈ రోజుల్లో సన్మార్గంలో మనం ఉండదలుచుకున్నప్పుడు మనకి ముఖ్యమైనటువంటి అవసరం ఈ Communication Skill.

అది విశేషముగా ఉన్నవారు శంకరభగవత్పాదులు.

మనం ఆయన చరిత్ర చదివితే ఇందుకు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. ఉదాహరణకు మండనమిశ్రులు అనేటువంటి వారు బెంగాల్ రాష్ట్రంలో అప్పటికే తనదైనటువంటి ఒక విధానాన్ని బహుళ ప్రచారంలోకి తీసుకువచ్చారు. అది అవైదికము అని చెప్పడానికి శంకర భగవత్పాదుల వారు వారి ఇంటికి వెళ్లారు. వారిద్దరి మధ్య వాదప్రతివాదములు చాలా కాలం జరిగినాయి.

కానీ ఓపికగా, ఓర్పుగా, తన ఆలోచన తాను అందించి, చివరికి మండనమిశ్రులపై విజయం సాధించి, అతనిని తన శిష్యునిగా స్వీకరించారు.

సన్మార్గంలో ఉండదలుచుకున్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో అవతల వ్యక్తి మన ఆలోచనలతో ఏకీభవించకపోవచ్చు. అతని ఆలోచన అతనికి ఉంటుంది, అతనికి ఉన్నటువంటి సమాచారాన్ని ఆధారం చేసుకుని, అతనికి ఉన్నటువంటి అనుభవాన్ని ఆధారం చేసుకుని, అతనికి ఉన్నటువంటి భావాలను ఆధారం చేసుకుని, అతను మాట్లాడతాడు.

మనకు ఉన్నటువంటి ఆలోచనలు, మనకు ఉన్నటువంటి జ్ఞానము, మనకు ఉన్నటువంటి అనుభవము, వీటిని మనం క్రోడీకరించి అతను చెప్తున్నటువంటి దాంట్లో ఏ విధంగా మనం తెలియజేస్తే అతను మన ఆలోచనలతో ఏకీభవిస్తాడో ఆలోచించుకొని దాన్ని Present చేయగలగడం శంకరాచార్యుల వారికి ఉన్నటువంటి విశేషమైనటువంటి నైపుణ్యం. Skill అంటాం దాన్ని. ఆ Skill శంకరాచార్యుల వారి చరిత్ర చదివితే, దాన్ని మనం ఆలోచన చేస్తే, Analyze చేసుకుంటే, మనకు కూడా కొద్దో గొప్పో ఆ skill అబ్బుతుంది.

శంకర పీఠాలు

శంకరాచార్యుల వారు తన 32 సంవత్సరాల వయసులోనే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా గుజరాత్ నుంచి బెంగాల్ దాకా దేశమంతా పర్యటించారు.

ఆ పర్యటనలో తాను నమ్మిన సిద్ధాంతాన్ని, విశేషముగా ప్రచారం చేసారు. అద్వైతం – ‘జీవుడు వేరు, దేవుడు వేరు కాదయ్యా! జీవుడే దేవుడు, దేవుడే జీవుడు’, “జీవో బ్రహ్మైనాపరా”, అనే తత్త్వాన్ని ఆయన విశేషంగా ప్రచారం చేశారు. ఆ విశేష ప్రచారం ద్వారా దేశమంతటా నాలుగు పీఠాలని స్థాపించారు. తూర్పున పూరిలో, ఉత్తరాన బదిరిలో, పశ్చిమాన ద్వారకలో, దక్షిణాన శృంగేరిలో పీఠములను ఏర్పాటు చేసారు. ప్రస్తుత కాలానికి మనం చెప్పుకోవాలి అంటే ‘Legacy’ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసి మనకందించారు.

 సనాతన ధర్మము నందు సన్మార్గంలో ఉండేటువంటి వారికి కావలసినటువంటి నిత్య పారాయణ శ్లోకములు, భగవత్ అనుగ్రహం కొరకు చేసేటువంటి పూజల కొరకు పంచాయత విధానము ఇత్యాదివన్నీ కూడా ఆయన మనకు తయారు చేసి ఇచ్చారు.

శంకరుల వారి చరిత్ర చదివితే తన శిష్య బృందాన్ని ఏనాడు కూడా ఆయన ఒక్క పన్నెత్తు మాట అన్నట్టుగా కూడా మనకు కనపడదు. ఆయా లక్షణాన్ని మనము అపారమైనటువంటి కృప, కరుణ, Compassion అంటాం. అంటే ఎదుటి వ్యక్తిలో ఉండేటువంటి కష్టం ఏమిటో మనం అర్థం చేసుకోగలగాలి. ఆ Compassion అనే లక్షణం విశేషంగా శంకరులలో మనకు కనబడుతుంది.

ఆయన ఒకసారి వ్యాస భగవానుడితో చర్చకు దిగుతారు. శంకర భగవత్పాదుల వారు విశేషంగా అనేక భాష్యాలు రాశారు. భగవద్గీతకు భాష్యం రాశారు, బ్రహ్మ సూత్రాలకు భాష్యం రాశారు, ఉపనిషత్తులకు భాష్యం రాశారు. భాష్యము అంటే Commentry. ఈ మూడింటిని ‘ప్రస్థానత్రయం’ అంటారు. జ్ఞాన సముపార్జనలో శంకర భగవత్పాదుల వారికి విశేషమైనటువంటి జ్ఞానం ఉన్నది. వ్యాస భగవానుడితో చర్చించి తాను రాసినటువంటి బ్రహ్మ సూత్రాల యొక్క భాష్య అర్థం సరిగ్గా ఉన్నది అని ఆయనతోటి అనిపించి, ఆ తర్వాత సమస్త మానవాళికి ఆయన అందించారు.

 శంకర భగవత్పాదుల వారు తాము చేసిన పాదయాత్రలో ప్రతి క్షేత్రము దర్శించి ప్రతి చోట ఇవాళ మనం చెప్పుకుంటున్నటువంటి ‘శివానందలహరి’, ‘సౌందర్య లహరి’, ‘అన్నపూర్ణాష్టకం’, ఇత్యాది అష్టకాలు ఎన్నో రాశారు. ఏక సంతాగ్రాహిగా అప్పట్లో ఉన్నటువంటి శాస్త్రములను, వేదములను ఆయన ఎనిమిది సంవత్సరాల లోపల ఆకళింపు చేసుకొని, ఆ తర్వాత నర్మదా నది తీరంలో పద్మపాదాచార్యుల వారిని గురువుగా స్వీకరించారు.

ఆ గురువు గారి ద్వారా ఆజ్ఞ పొంది, దేశ పర్యాటన చేస్తూ, సన్మార్గంలో ఉండేటువంటి వారికి అనేకమైనటువంటి బోధనలు చేసి, అనేకమైనటువంటి రచనలు, వ్యాఖ్యానాలు చేసి, వాటి ద్వారా సూత్రాలను రచించి, సమస్త మానవాళి కూడా ఆనందంగా సంతోషంగా జీవితం గడుపుకునే విధంగా ఆయన మనకు అందించారు.

సన్మార్గంలో ఉండదలుచుకున్నటువంటి వారు తప్పకుండా చదవవలసింది శంకరుల వారి చరిత్ర. మహనీయుల్లో మహనీయుడు శంకర భగవత్పాదుల వారు.                                         

ధర్మస్య విజయోస్తు.

K C Das Memorial Charitable Trust

Paropakarardham Idam Sareeram

  • Instagram
  • YouTube
  • Facebook
Address
H.No. 11-13-119, 14/B, Road No. 3, beside Axis Bank, Alkapuri Colony, Ramakrishnapuram, Kothapet, Hyderabad, Telangana 500035
View on map
Contact
contact@kcdastrust.org
+91 94948 77070
04:00 PM to 08.30 PM IST

© 2026 K C Das Memorial Charitable Trust. All rights reserved.

Terms and ConditionsPrivacy Policy