Skip to navigation
K C Das Memorial Charitable Trust
Donate
  • Home
  • About
  • Library
    • Dharma Vaani
    • Sri Lalitha Sahasra Naamavali
    • Dharmavaaradhi e-Magazine
    • Guru Vaani
    • Saradamba TV (Grandly Launched)
  • Dharmika Programs
    • All programs
    • Hanuman Chalisa
    • Gayathri Japam
    • Bala Japam
    • Calendar
  • Spiritual Education
  • Community Welfare
  • Contact
Donate
  • Instagram
  • YouTube
  • Facebook
  • Instagram
  • YouTube
  • Facebook
Donate

ప్రాతఃస్మరణీయులు – వ్యాసమహర్షి

సన్మార్గంలో భాగంగా మనకి వరిష్ఠమైనటువంటి, విశేషమైనటువంటి వ్యక్తుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సాక్షాత్ భగవత్ స్వరూపుడైనటువంటి వ్యాసుల వారి వైశిష్ట్యము ఎటువంటిదో, వారు మనకు చూపిన సన్మార్గం ఎటువంటిదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.

“వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే । నమో వై బ్రహ్మనిధయే వాశిష్ఠాయ నమో నమః“, అని స్వయంగా విష్ణు భగవానుడే వ్యాసుడిగా అవతరించాడు అని మనకు చెప్తారు. ఆయన మనుష్యుడిగా ఈ భూమి మీద నడయాడి, సమస్త మానవాళి గురించి తపన పడి, తాపత్రయపడి, అందరూ ఎలా తరిస్తారా అనేటువంటి ఆలోచనతో మానవాళికి ఎనలేని మేలు జేశారు.

సన్మార్గంలో మనకి మొట్టమొదట చెప్పేది, “నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం కాదయ్యా ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించు”, అని. స్వార్ధము పశువులకు కూడా ఉంటుంది. ఉదాహరణకు ఒక పులికి ఆకలి వేసింది అంటే, అది లేడి కడుపుతో ఉందా, గర్భం దాల్చిందా అని కూడా చూడకుండా ఆ లేడీని వెంటాడి వేటాడి తింటుంది. ఎందుకంటే దానికి ఆకలి తీరాలి. అది స్వార్ధం.

మనుష్యుడికి భగవంతుడు ఇచ్చినటువంటి బుద్ధి అనేటువంటి ఒక లక్షణంతోటి ‘కేవలముగా స్వార్ధం కాకుండా పరార్థం కూడా ఆలోచిస్తూ ఉండు’, అని శాస్త్రం పేర్కొంటోంది. అయితే ‘తనను మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం’, అని కూడా శాస్త్రం పేర్కొంటోంది.

అంటే ‘నీ గురించి నువ్వు చూసుకోకుండా ఎదుటి వ్యక్తికి చేయమని కాదు’. కానీ ‘నీకు సరిపడ వచ్చిన తర్వాత, నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల గురించి, సమాజం గురించి, దేశం గురించి, భూమండలం గురించి ఆలోచించు’, అని మనకి సనాతన ధర్మం చెప్తున్నది. అలా ఆలోచించినటువంటి వ్యక్తి వ్యాస భగవానుడు.

ఇవాళ దేవాలయాల్లో లేదా ఇళ్లల్లో మనందరం కూడా పూజలు చేస్తున్నాం అంటే అది వ్యాసుడు పెట్టినటువంటి భిక్ష, పురాణాలు వింటున్నాం అంటే అది వ్యాసోచ్చిష్టం. అంటే వ్యాసుల వారు చెప్పి వదిలిపెట్టిందే. ఇవాళ ఎవరు చెప్పినా వ్యాసుడు చెప్పిందే చెప్తున్నారు. 18 పురాణాలు ఆ మహానుభావులు రచనలు చేశారు. మనకి వాంగ్మయం అంతా కూడా వేదములు, శృతులు అంటారు. స్మృతులు అంటే ఆ వేదములలో ఉన్నటువంటి ముఖ్య వివరాలు, అవన్నీ స్మృతులు. మహర్షులు వారు గుర్తుంచుకొని మనకు అందించినటువంటి స్మృతులు. ఉదాహరణకు యాజ్ఞవల్క స్మృతి, పరాశర స్మృతి, ఇలాగ మహర్షులు మనకు అందించారు.

అష్టాదశ పురాణాలు

అయితే వీటిల్లో ఉండే సమస్య ఏమిటంటే ఇందులో ఉండేటువంటి సమాచారము అందరికి అర్థం కాదు. ఉదాహరణకు ‘సత్యం వద, ధర్మంచర’, అంటుంది వేదం. సత్యమునే పలుకు, ధర్మమునే ఆచరించు. అంతే తప్ప సత్యమునే ఎందుకు పలకాలి? అలా పలకకపోతే వచ్చే నష్టం ఏమిటి? పలికితే కలిగే ప్రయోజనం ఏమిటి? అనే వివరములన్నీ కూడా మనకి వేదములలో ఉండవు. వేదం చదివితే అందరికి అర్థం కాదు గనుక దాన్ని ‘సత్యహరిశ్చంద్రోపాఖ్యానము’ అనే ఒక ఉపాఖ్యాన రూపంలో, ఒక కథ రూపంలో మనకందించారు.

సత్యమును ఆచరించడం వల్ల జరిగేటువంటి ఫలితం ఎటువంటిది? “అన్ని కష్టాలు వచ్చినప్పటికి కూడా చివరికి గెలిచేది నువ్వే” అని చెప్పే విధంగా వ్యాస భగవానుడు పురాణాలన్నీ కూడా రచన చేసి వాటిని మనకందించారు.

“మద్వయం భద్వయం చైవ బ్రత్రయమ్ వచ తుష్వయమ్ అనాపద్లింగ కూస్కాని పురాణాని పృథక్ పృథక్”, అని ‘మత్స్య పురాణము మార్కండేయ పురాణము, భాగవత పురాణము, భారత పురాణము, బ్రహ్మ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము, బ్రహ్మాండ పురాణము, వరాహ పురాణము, వాయు పురాణము, విష్ణు పురాణము, వామన పురాణము, అగ్ని పురాణము, నారద పురాణము, పద్మ పురాణము, లింగ పురాణము, గరుడ పురాణము, కూర్మ పురాణము, స్కాంద పురాణము’, అని 18 పురాణాల రూపంలో వేదములలో ఉన్న విషయాలన్నిటిని కూడా మనకు అందించారు.

పరోపకారం – వ్యాసమహర్షి

వేదము అనే పదము ‘విద్’ అనే శబ్దము నుంచి ఉత్పన్నము అయినది. విద్ అంటే విద్య. విద్య అంటే జ్ఞానము. సమస్త మానవాళికి కావలసినటువంటి సమస్త జ్ఞానములు వేదములలో ఉన్నప్పటికి అది అలా చదివితే మనకు అర్థం కాదు కనుక సామాన్యులకు అందించాలి అని 18 పురాణాలు రచించారు వ్యాసమహర్షి. వ్యాసమహర్షి 18 పురాణాలు రచించిన తర్వాత ఆ మహానుభావుడికి ఒక ఆలోచన వచ్చిందట.

“జనులందరూ బాగుండాలి అని నేను 18 పురాణాలు అయితే రాశాను గాని ఇవన్నీ చదివేది ఎవరు? వీటిని అర్థం చేసుకునేది ఎంతమంది? ఇది ఎంతమందికి ఉపయోగపడుతుంది? కాబట్టి అందరికి ఉపయోగపడే విధంగా నేను వేరొక గ్రంథాన్ని రాయాలి”, అని ఆయన భాగవతాన్ని రచించారు. అప్పటికి తృప్తి పడలేదు ఆయన.

వీటిలోంచి సారాంశాన్ని తీసి ‘అష్టాదశ పురాణాలను మీరు చదవలేరయ్యా! రెండే మాటలు గుర్తుంచుకోండి’ – ‘పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం’. “పరులకు మీరు ఉపకారం చేయగలిగితే అదే పుణ్యం. అదే మనల్ని సన్మార్గంలో నడిపిస్తుంది. పరులను పీడిస్తే అది పాపం. అది దుర్మార్గంలో నడిపిస్తుంది”, అని లోకానికి చాటిన గొప్ప ఋషివర్యులు వ్యాసమహర్షి.  

ఎంతో ఆర్తితో ఇతరుల కొరకు ఆయన తన జీవితాన్ని గడిపారు. మహర్షులందరూ కూడా ఎప్పుడు వారి కొరకు వారు తమ జీవితాన్ని గడపరు. లోకం కోసం, లోక క్షేమం కోసం, లోక కళ్యాణం కోసం, వాళ్ళు తపిస్తూ ఉంటారు. అటువంటి మహర్షులలో మహనీయుడు వ్యాస భగవానుడు. అందుకనే “వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ । పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ॥”, అన్నారు.

తపస్సు చేయడము అంటే తపించడం. దేని కొరకు తపించడం? ఏదో ఒక విషయాన్ని పట్టుకొని. అది లౌకికం అవ్వచ్చు, పారమార్థికం అవ్వచ్చు. మహర్షులంతా పారమార్థికంగా తపస్సు చేస్తూ ఉంటారు. సన్మార్గంలో ఉండేటువంటి వారు సన్మార్గం కొరకు తపస్సు చేయాలి అంటే వ్యాస భగవానుడి చరిత్ర మనము తెలుసుకోవాలి.

 అందరికి ఉపయోగపడాలి అనే ఆలోచనే తప్ప దీని ద్వారా నాకేమి లాభం అని ఆలోచన చేసినటువంటి వ్యక్తి కాదు. సమాజానికి ఉపయోగపడే విధంగా రచనలన్నీ కూడా ఉపకరించి తద్వారా ఆయన సమాజానికి ఇచ్చినటువంటి సందేశం ఏమిటి అంటే ‘పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం’.

కాబట్టి మనం సన్మార్గంలో ఉందాం, సన్మార్గంలో ఉంటూ యధాశక్తి వ్యక్తిగా స్వార్ధం కోసం కాకుండా పరార్థం కోసం కూడా మన యొక్క సమయాన్ని శ్రమను వెచ్చిద్దాం, తద్వారా సన్మార్గంలో మనం విజయం సాధిద్దాం. ధర్మస్య విజయోస్తు.

K C Das Memorial Charitable Trust

Paropakarardham Idam Sareeram

  • Instagram
  • YouTube
  • Facebook
Address
H.No. 11-13-119, 14/B, Road No. 3, beside Axis Bank, Alkapuri Colony, Ramakrishnapuram, Kothapet, Hyderabad, Telangana 500035
View on map
Contact
contact@kcdastrust.org
+91 94948 77070
04:00 PM to 08.30 PM IST

© 2026 K C Das Memorial Charitable Trust. All rights reserved.

Terms and ConditionsPrivacy Policy