Skip to navigation
K C Das Memorial Charitable Trust
Donate
  • Home
  • About
  • Library
    • Dharma Vaani
    • Sri Lalitha Sahasra Naamavali
    • Dharmavaaradhi e-Magazine
    • Guru Vaani
    • Saradamba TV (Grandly Launched)
  • Dharmika Programs
    • All programs
    • Hanuman Chalisa
    • Gayathri Japam
    • Bala Japam
    • Calendar
  • Spiritual Education
  • Community Welfare
  • Contact
Donate
  • Instagram
  • YouTube
  • Facebook
  • Instagram
  • YouTube
  • Facebook
Donate

శ్రీమద్రామాయణం – శ్రీరాముడు

రామాయణ కథకు మూలపురుషుడు శ్రీరాముడు, కథ అంతా ఆయన చుట్టే నడుస్తూ ఉంటుంది. “రామస్య చరితం రామస్య అయనం ఇతి రామాయణం”, అన్నారు.

 శ్రీరాముడి కథను కథగా పక్కన పెట్టి, కథలో ఉండేటువంటి సందేశాలను మనం చూస్తే రాముడి జీవిత చరిత్ర మనకి చాలా విషయాలు చెబుతుంది. ప్రస్తుతం ఉన్న సమాజంలో మానవాళి సన్మార్గంలో నడవాలి అంటే రాముడిని ఆదర్శంగా తీసుకోవాలి. ఎప్పుడో త్రేతా యుగంలో జరిగినటువంటి రామాయణ గాధను ఇప్పుడు కలియుగంలో కూడా మనం రాముడిని దేవుడిగా ఎందుకు కొలవాలి ఆయన నడిచినటువంటి నడవడిక వలన. శ్రీరాముడి నుండి మానవాళికి ఎటువంటి సందేశం అందుతుంది అని మనం ఒక్కసారి రామాయణం అంతా ఆమూలాగ్రంగా పరిశీలన చేస్తే రాముడిలో ఉండేటువంటి విశేషమైనటువంటి లక్షణాలు ఎన్నో మనకి ఆదర్శప్రాయము, ఆచరణీయము.

రాముడు – ధర్మం:

రాముడిని ధర్మంతో పోలుస్తారు. ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అంటారు. ధర్మం అంటే ఏమిటి? ఏ విధంగా మనిషి ప్రవర్తన ఉంటే సమాజానికి మేలు కలుగుతుందో దాన్ని ‘ధర్మము’ అన్నారు. రాముడు కేవలముగా ధర్మాన్ని మాత్రమే పట్టుకొని, ధర్మాన్ని ఆధారంగా చేసుకొని, ధర్మమే మార్గదర్శనంగా ఉంచుకొని, ధర్మాన్ని మాత్రమే ముందుంచి తన జీవనం గడుపుతాడు.

దశరథ మహారాజు రాముడిని పిలిచి “రామా! రేపటి రోజున నీకు పట్టాభిషేకం చేస్తున్నాను” అంటాడు. ఇంతలోనే మళ్ళీ కైకేయి మందిరం నుంచి కబురు వస్తుంది, రాముడు వెళతాడు. అప్పుడు కైకేయి దశరథుడు తనకు ఇచ్చినటువంటి వరముల ప్రస్తావన చేసి, ‘రామా, నీవు వనవాసానికి వెళ్ళాలి’ అని చెప్తుంది. ఆ మాట చెప్పేటప్పుడు కైకేయికి కూడా మనసులో సందేహం ఉంటుంది. 

అప్పుడు రాముడే చెప్తాడు, “అమ్మా! నన్ను ఒక ఋషిగా చూడు. ఋషులకు ఏది ప్రాధాన్యము అంటే ధర్మమే ప్రధానం. ఈ ఐహికమైనటువంటి విషయాల వెనకాల నేను ఉండడం లేదు. తల్లీ నాకు ధర్మమే మూలము. నాన్నగారు గనుక నన్ను వనవాసం చేయమంటే వనవాసం చేస్తాను, పట్టాభిషిక్తుడు కమ్మంటే పట్టాభిషిక్తుడిని అవుతాను. ఇప్పుడు వనవాసం చేయమని చెప్పారు అని నువ్వు అంటున్నావు కనుక ఆనందంగా వనవాసానికి వెళ్తాను. ఏ సంతోషంతో అయితే నాన్నగారు పట్టాభిషేకం చేయమన్నప్పుడు ఆ మనస్సు ఉందో, అదే మనస్సుతో, అదే మానసిక స్థితితో నేను వనవాసానికి సిద్ధం”, అని రాముడు పేర్కొంటాడు.

అక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత లక్ష్మణస్వామికి కోపం వస్తుంది. “అన్నా! దశరథ మహారాజు పెద్దవాడు అయిపోయాడు, ముసలివాడు అయిపోయాడు, నిర్ణయాత్మకమైనటువంటి శక్తిని కోల్పోయాడు. జేష్టుడైనటువంటి నిన్ను కాదని భరతుడికి ఎలా పట్టాభిషేకం చేస్తాడు? ఇది ధర్మం కాదు. రాజధర్మం ప్రకారం నీవే రాజు కావాలి. కాబట్టి నువ్వు ఆజ్ఞ ఇయ్యి! ఎవరు అడ్డు వస్తారో చూస్తాను, యుద్ధం చేస్తాను, నిన్ను మళ్ళీ రాజుని చేస్తాను”, అంటాడు.

అప్పుడు రాముడు ఒక మాట అంటాడు, “లక్ష్మణా! ‘నిన్న పట్టాభిషేకం చేసుకో రామా’ అంటే తండ్రి ఇవ్వాళ ‘వనవాసం చెయ్యి రామ’ అంటే తండ్రి కాకుండా పోతాడా? లక్ష్మణా నిన్నటి రోజున పట్టాభిషేకం చేసుకోమని తండ్రిగా ఆయన చెప్పిన మాటకు ఎంత విలువ ఉన్నదో ఇవాళ వనవాసం చేయమని చెప్పిన ఆ మాటకు మనం అంతే విలువ ఇవ్వాలి”, అని లక్ష్మణుడికి నచ్చచెప్తాడు. రాముడిని ‘పితృవాక్యపరిపాలకుడిగా’ మనం ఆదర్శంగా తీసుకోవాలి.

పితృ వాక్య పరిపాలకుడు:

 జన్మనిచ్చినటువంటి తండ్రికి మనం ఏ స్థానం ఇవ్వాలో ఆ స్థానం తప్పక ఇవ్వాలి. సాక్షాత్తు నడిచే దేవుడు, జన్మనిచ్చినటువంటి తండ్రి, ఆయన ఏ స్థితిలో అన్నా ఉండనివ్వండి (ఆయన మనకన్నా ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు, తక్కువ స్థితిలో ఉండవచ్చు) ఆయన స్థానం మాత్రం దైవ స్థానము, దైవ సమానులు.

అందుకే మనకి సనాతన ధర్మంలో ‘మాతృదేవోభవ పితృదేవోభవ’, అన్నారు. భగవంతుడితో సమానమైనటువంటి స్థాయి తండ్రికి ఇవ్వాలి అని ఆచరించి చూపించినటువంటి రాముడు మనకి ఆదర్శవంతుడు.

మరొక సందర్భంలో తాటకి సంహారం అప్పుడు విశ్వామిత్రుడు రాములవారితో, “తాటకి వీర విజృంభణ చేస్తోంది రామా, బాణం వేసి సంహరించు”, అంటారు. ఒక్క నిమిషం ఆలోచిస్తున్నాడు రాముడు. అప్పుడు విశ్వామిత్రుడు శ్రీరాములవారితో, “ఏం రామా ఆలోచిస్తున్నావు? స్త్రీ అని శంకిస్తున్నావు. దుష్ట సంహారం చేయవలసి వచ్చినప్పుడు స్త్రీ పురుష లింగ భేదం చూడకూడదు నాయనా”, అని పేర్కొంటారు.

అప్పుడు రాముడు చెప్తాడు, “నాన్నగారు మీతో వెళ్ళమని చెప్పారు. మీరు ఏది చెబితే అది చేయమని నాన్నగారి ఆజ్ఞ. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ యందు, ఆయన చెప్పినటువంటి మాట యందు గౌరవం ఉంచవలసినటువంటి కర్తవ్యం నాకున్నది.” కర్తవ్యము అంటే Duty.

మనం మామూలుగా చెప్పుకోవాలంటే Dutyలో Options ఉండవు. అలాగే తండ్రి మాటను జవదాటే Option ఉండదు అని స్వయంగా విశ్వామిత్రుల వారితో రాముడు చెప్తాడు. “సందేహం లేకుండా, శంక లేకుండా, అనుమానం లేకుండా, ఆలోచన లేకుండా మా నాన్నగారు మీ దగ్గరికి పంపించారు. మీరు ఏది చెబితే అది చేయడమే నా ధర్మం. మా నాన్నగారి మాట యందు గౌరవం ఉంచడం నా ధర్మం”, అని చెప్తాడు. అందువల్ల పితృవాక్యపరిపాలకుడిగా, తండ్రి మాటను జవదాటని వాడిగా రాముడు మనకి ఆదర్శ ప్రాయుడు.

రామ చరిత్ర మనం చూసినట్లయితే భరతుడితో జరిగిన సంవాదంలో కూడా తండ్రి మాట ప్రస్తావనకు వస్తుంది. భరతుడు అరణ్యవాసంలో ఉన్న రాముడి దగ్గరికి వచ్చి, “అన్నయ్యా! ఇప్పుడు నాన్నగారు లేరు. మనిషే లేనప్పుడు ఆ మాటకు మనం ఎందుకు విలువ ఇవ్వాలి”, అని ప్రశ్నిస్తాడు. అప్పుడు రాముడు చెప్తాడు, “మనిషి లేకపోయినా మాట నిలిచిపోతుంది భరతా.

నాన్నగారు ఇచ్చినటువంటి మాటను మనము పాటించి తీరాలి, అంటే జీవించి ఉన్నప్పుడు తండ్రి మాట వినడం మాత్రమే కాదు, గతించినటువంటి తండ్రికి ఇచ్చిన మాటను కూడా శిరసావహించి, దాన్ని ఆచరించడం పుత్ర ధర్మము”, అని ఆచరించి చూపించినటువంటి వాడు రాముడు.

“జీవించినంత కాలము తల్లిదండ్రుల మాట వినండి, వాళ్ళు చెప్పింది చేయండి, ఆ తర్వాత ప్రతి సంవత్సరము వారి పేరు మీద వారు గతించిన రోజునాడు అన్నదానాలు చేయండి” అని శాస్త్రం పేర్కొంటోంది. కానీ గతించిన తర్వాత కూడా తండ్రిని సత్యలోకములందు నిలబెట్టాలనేటువంటి కర్తవ్యదీక్ష రాముడిది. మనం తెలుసుకోవాల్సింది రామాయణంలో రాముడి యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం “పితృవాక్యపరిపాలన దక్షత”.

పితృవాక్యాన్ని పరిపాలన చేస్తూ, తండ్రి గారి మాటను నిలబెట్టడం కోసం పట్టాభిషేకం ఎంత సంతోషంగా ఒప్పుకున్నాడో, వనవాసం కూడా అదే సంతోషంతో, మానసికంగా ఏమాత్రం తేడా లేకుండా అంతే ఆనందంగా ఒప్పుకుంటాడు రాముడు. తండ్రి మాట చెప్పారు అంటే ఇంక ఆ మాట దాటడానికి వీలులేదు.

‘తండ్రిని ఎలాగైనా సరే సత్యవంతుడిగా చేయవలసినటువంటి ధర్మము, సత్యమునందు నిలబెట్టవలసినటువంటి ధర్మము పుత్రుడిగా కుమారులకు ఉంటుంది’, అని రాముడి యొక్క జీవన విధానం నుండి, రామాయణంలోని రాముడి కదలికల నుండి మనము గ్రహించాలి.

రాముడి విషయంలో గుణవంతుడు, సత్యవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, వీరుడు, శూరుడు, బలవంతుడు ఇలా రకరకాల సందర్భాల్లో వేరు వేరు గుణాలను ప్రదర్శించారు. ఒక పితృవాక్యపరిపాలకుడుగా మనం చూసినట్లయితే రాముడి యొక్క జీవన విధానం నుండి సత్యాన్ని గ్రహించి, ప్రస్తుతం మానవాళి అంతా కూడా సన్మార్గంలో ఉంటూ, తండ్రి చెప్పినటువంటి మాటను వింటూ ఆనందంగా ఉంటే, సమాజమంతా సంతోషంగా ఉంటుంది.

   ధర్మస్య విజయోస్తు.

K C Das Memorial Charitable Trust

Paropakarardham Idam Sareeram

  • Instagram
  • YouTube
  • Facebook
Address
H.No. 11-13-119, 14/B, Road No. 3, beside Axis Bank, Alkapuri Colony, Ramakrishnapuram, Kothapet, Hyderabad, Telangana 500035
View on map
Contact
contact@kcdastrust.org
+91 94948 77070
04:00 PM to 08.30 PM IST

© 2026 K C Das Memorial Charitable Trust. All rights reserved.

Terms and ConditionsPrivacy Policy