Skip to navigation
K C Das Memorial Charitable Trust
Donate
  • Home
  • About
  • Library
    • Dharma Vaani
    • Sri Lalitha Sahasra Naamavali
    • Dharmavaaradhi e-Magazine
    • Guru Vaani
    • Saradamba TV (Grandly Launched)
  • Dharmika Programs
    • All programs
    • Hanuman Chalisa
    • Gayathri Japam
    • Bala Japam
    • Calendar
  • Spiritual Education
  • Community Welfare
  • Contact
Donate
  • Instagram
  • YouTube
  • Facebook
  • Instagram
  • YouTube
  • Facebook
Donate

శ్రీమద్రామాయణం – లక్ష్మణుడు

మానవీయ సంబంధాలను అత్యంత విలువలతో కూడి మనిషి జీవనం ఎలా గడుపుకోవాలి, సన్మార్గంలో ఎలా ఉండాలి అనేటువంటి విషయాలను అక్కడక్కడ స్పృశిస్తూ మహర్షి వాల్మీకి రామాయణ రచన చేశారు. దైనందిన జీవితంలో మనం చూసేటువంటి వేరు వేరు పాత్రలు ప్రత్యక్షంగా అందులో కనబడుతూ ఉంటాయి. ఒక్కొక్క పాత్ర ఔచిత్యాన్ని మనం అర్థం చేసుకుంటే ఉన్నతమైనటువంటి మానవీయ విలువలను ఆవిష్కరించి మనిషి జీవనం ఎలా ఉండాలి అని మనకి బోధ చేశారు. అందుకే “రామాయణం మహాకావ్యం” అన్నారు.

త్యాగ స్వభావం

ఈరోజు లక్ష్మణుడు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. లక్ష్మణుడు రాముడికి అనుజుడు. రాముడు అగ్రజుడు. “అగ్రజుడు రాఘవుడు తమ్ముడా అనుచు పిలువ తపమేమి చేసెనో దశరధుడు”, అని త్యాగరాజు తన కీర్తనలలో పేర్కొన్నారు. “అనుజుడై లక్ష్మణుడు అన్నయ్య అంటు పిలువ తపమేమి చేసెనో సౌమిత్రి”, అంటారు త్యాగరాజు.

 సుమిత్రానందనుడు గనుక సౌమిత్రి అని కూడా పేరు లక్ష్మణుడికి. లక్ష్మణుడు పుట్టినప్పటి నుంచి మనం చూస్తే రాముల వారితో పాటుగానే ఉన్నాడు. వారిద్దరిది విడదీయరాని అనుబంధం అని చెప్తాం. భరతుడితో శత్రుజ్ఞుడు, రాముడితో లక్ష్మణుడు ఎంతవరకు ఉన్నాడు అంటే ‘నీడలా వెన్నంటి ఉన్నాడు లక్ష్మణుడు’ అని చెప్తారు. దశరథ మహారాజు ఆజ్ఞ, ఆయన కైకేయికి ఇచ్చినటువంటి వరములు పూర్తి చేయడం కోసం రాముడు వనవాసానికి బయలుదేరాడు. “నాకేం సంబంధం? నన్ను వెళ్ళమనలేదు కదా? నిన్ను కదా వెళ్ళమన్నారు. నువ్వు వెళ్ళు, నీ తర్వాత నేను రాజ్యం చేస్తాను”, అని అనవచ్చు లక్ష్మణుడు. కానీ అలా అనలేదు.

 “అన్నయ్యా! నీతోటి నేను వస్తాను”, అంటే రాముడు అన్నాడు “నువ్వెందుకు లక్ష్మణ! నన్ను కదా నాన్నగారు వెళ్ళమన్నది.”

“నువ్వు ఇక్కడ ఉండి పెద్దవాళ్ళందరి సేవ చేసుకుంటూ ఉండు”, అంటే “నీ సేవ చేయడమే నాకు పరమావధి అన్నయ”, అని లక్ష్మణుడు తన త్యాగ స్వభావాన్ని అక్కడ చెప్పుకున్నాడు.

రామాయణం అంతా కనబడుతుంది మనకి లక్ష్మణుడు రాముడ్ని ఏ విధంగా కంటికి రెప్పలా కాపాడాడో. లక్ష్మణుడు శ్రీరాముడితో కలసి అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు తల్లి (సుమిత్ర) యొక్క అనుమతి తీసుకోవడానికి వెళతాడు. ఆ మహా సాద్వి లక్ష్మణుడికి చేసినటువంటి హితబోధను మనం అర్థం చేసుకుంటే “ఓహో ఇంతటి మహాసాధ్వికి కుమారుడు” గనుక ఆయన అలా ప్రవర్తించగలిగాడు అనిపిస్తుంది.

సుమిత్ర లక్ష్మణ సంవాదం

సుమిత్ర సౌమిత్రి మధ్య జరిగినటువంటి సంవాదంలో వాల్మీకి మహర్షి ఒక శ్లోకం వేశారు. సుమిత్ర లక్ష్మణుడికి చెబుతుంది, “రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజామ్. అయోధ్యామటవీం విధ్ది గచ్ఛ తాత! యథాసుఖమ్ ৷৷2.40.9৷৷”.

“లక్ష్మణా! వెళ్ళు నాయనా. రాముడితోటే ఉండు. రాముడికి సేవ చేయడమే నీ జీవన పరమావది.” ఇందులో మనం గ్రహించవలసింది అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండాలి అనేటువంటిది రామలక్ష్మణులను చూసి నేర్చుకోవాలి. ‘తమ్ముడికి అన్నగారి పట్ల ఏ విధమైనటువంటి భక్తి భావన ఉండాలి, అలాగే అన్నయ్యకి తమ్ముడి పట్ల ఏ విధమైనటువంటి ప్రేమ ఉండాలి’, అనేటువంటిది మనకి రామాయణం చూపిస్తుంది.

సుమిత్రాదేవి లక్ష్మణుడికి చేసినటువంటి హితబోధ ఏమిటి అంటే, “నాయనా లక్ష్మణా! నువ్వు ఇప్పుడు రాముడితోటి అడవికి వెళ్తాను అంటున్నావు. అడవిలో రాముడే నీకు దశరధుడు అంటే తండ్రి”. అన్నగారు తండ్రి వంటివాడు. తండ్రి ఉన్నప్పుడు తండ్రి బాధ్యతలు తండ్రి చూస్తాడు. తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత పెద్దన్నగారు ఎవరైతే ఉంటారో ఆయన తండ్రి బాధ్యతలు వహించాలి అని మనకి రామాయణం చెప్తున్నది.

అలాగే చిన్నవాళ్ళయినటువంటి తమ్ముళ్ళు అన్నగారిని తండ్రిలాగా గౌరవించాలి అని కూడా రామాయణం మనకు నేర్పిస్తున్నది.

రామాయణాన్ని సరిగ్గా చదివి అర్థం చేసుకుంటే జీవితాలు సంతోషంగా వెళ్ళిపోతాయి, ఆనందంగా గడుస్తాయి అని చెప్పడానికి ఇటువంటి శ్లోకాలే మనకి ప్రధానంగా కనబడుతూ ఉంటాయి.

అంతేకాదు సుమిత్రాదేవి ఇంకో మాట కూడా చెప్పింది, “సీతమ్మవారే నేను”. వదిన గారు తల్లితో సమానము, అని మనకి రామాయణం చెప్తున్నది. తల్లిని ఎలా గౌరవిస్తామో వదినని కూడా అలాగే గౌరవించాలి. తల్లి ఎలా అయితే ప్రేమతో వాత్సల్యంతో కుమారులను చూస్తుందో వదిన గారు కూడా మరుదులను గాని ఆడబడుచులనుగాని అలాగే చూడాలి అని మనకి రామాయణం నేర్పిస్తుంది.

సుమిత్ర లక్ష్మణుడితో చెప్పిన తదుపరి మాట, “రాముడు ఎక్కడుంటే అక్కడే అయోధ్య. రాముడు అడవిలో ఉంటే అడవే అయోధ్య, అయోధ్య అడవైపోతుందయ్యా. కాబట్టి నువ్వు రాముడితో పాటే ఉండు”, అని. “నీకేం అవసరం? రాముడు వెళ్తాడులే, నువ్వు ఎందుకు వనవాసం చేస్తావ్? ఆ కష్టాలు నువ్వు ఎందుకు భరిస్తావు? నీకు అవసరం లేదు”, అని చెప్పలేదు ఆ తల్లి.

అంతటి సంస్కార మూర్తికి పుట్టాడు గనుక లక్ష్మణుడు కంటికి రెప్పలా రాముడిని కాపాడుతూనే వచ్చాడు.

 అరణ్యకాండలో ఒకచోట కబంధుడు అనే ఒక రాక్షసుడు రెండు చేతులతో రామలక్ష్మణులను పట్టుకుంటాడు. పట్టుకున్నప్పుడు కొద్దిసేపు రాముడు చలించిపోతాడు. “చూసావా లక్ష్మణా! రాజ్యం పోగొట్టుకున్నాం. రాజ్యమే కదా పోయింది అనుకున్నాను, వనవాసం ప్రాప్తించింది. వనవాసానికి వచ్చాను. నాతో పాటు ఉండేటువంటి సీతను పోగొట్టుకున్నాను. ఒక్కగానొక్క తోడు జటాయువు కూడా వెళ్ళిపోయింది. నా దురదృష్టం ఇలా ఉన్నది లక్ష్మణ”, అని విచారిస్తుంటే రాముడికి లక్ష్మణుడు కర్తవ్యబోధ చేస్తాడు.

 “అన్నయ్యా! ఇప్పుడు మనం చేయవలసింది విచారము కాదు. ఆ నిర్వేదము లేకుండా ఉండవలసినటువంటి స్థితి మనది ఇప్పుడు. కాబట్టి ఈ చెయ్యి నేను ఖండిస్తాను, ఆ చెయ్యి నువ్వు ఖండించు”, అని లక్ష్మణుడు రాముడికి మార్గదర్శనం చేస్తాడు. వెంటనే రామలక్ష్మణులు ఇద్దరు ఆ కబంధుడి హస్తాలు తుంచివేయడం జరుగుతుంది.

ఆపదలో ఉన్నటువంటి అన్నదమ్ములు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ, ఒకరి కోసం ఒకరు ఎలా జీవనం గడపాలో లక్ష్మణుడి పాత్ర నుంచి మనకు అర్థమవుతుంది. అది లక్ష్మణుల వారి విశిష్టత. ఇవాళ సమాజంలో అన్నదమ్ములు ఆస్తుల కొరకు కొట్లాడుకుంటున్నారు. నిజానికి ధర్మబద్ధంగా జీవనం గడుపుకోవాలి, ధర్మం కోసం జీవించాలి అని రామాయణం చెప్తుంది.

లక్ష్మణుడి యొక్క వైశిష్ట్యము

మరొక సందర్భంలో యుద్ధకాండంలో మనం చూస్తే ఇంద్రజిత్తు శక్తి అనేటువంటి అస్త్రం వేసి లక్ష్మణుని మూర్చకు గురి చేస్తాడు. లక్ష్మణుడు మూర్చకు గురైన సందర్భంలో రాముడు దుఃఖపూరితమైనటువంటి హృదయంతో, దుఃఖం అతన్ని హృదయాంతరాళలో నుంచి తన్నుకొని వస్తూ ఉంటే, ఎంతో బాధపడుతూ అక్కడ ఉన్నటువంటి వానరులందరి ముందు ఎంతో దుఃఖిస్తాడు.

అప్పుడు శ్రీరాముడు సుగ్రీవుడితో, “సుగ్రీవా! స్త్రీకి భర్త కళత్రము, పురుషుడికి భార్య కళత్రము. భర్తలుగా వచ్చేటువంటి వారు ఎక్కడి నుంచి అయినా రావచ్చు. బంధుత్వం అనేటువంటిది ఏ దేశానికి వెళ్ళినా ఏర్పరచుకోవచ్చు.”

“కానీ అన్నదమ్ములు గాని అక్క చెల్లెళ్లు గాని నువ్వు కావాలంటే తెచ్చుకోగలిగేటువంటి వాళ్ళుకారయ్యా. ఈ జన్మకు వాళ్ళు మనతో ఉండవలసినటువంటి వాళ్ళు. అటువంటి లక్ష్మణుడు ఇప్పుడు మూర్చపోతే, నేను మళ్ళీ లక్ష్మణుని తమ్ముడిని తెచ్చుకోలేను” అని రాముడు అంటాడు.

హనుమ సంజీవిని పర్వతం తీసుకురావటం, ఆ తర్వాత ఆయన మళ్ళీ మేలుకొనడం ఇవన్నీ తర్వాత ఘటనలో మనకు తెలిసిన విషయాలే. లక్ష్మణుడి యొక్క వైశిష్ట్యము రాముడు మరొక సందర్భంలో కూడా చెప్తాడు. “ఎవరినైనా వదిలేస్తాను కానీ లక్ష్మణుడిని మాత్రం వదిలి ఉండలేను”, అంటాడు. ఎందువల్ల అంటే లక్ష్మణుడు త్యాగమూర్తి. ఆయన తన సొంత సుఖాన్ని త్యాగం చేసి, అన్నగారి కోసం అహర్నిశలు 14 సంవత్సరాలు వనవాసంలో ఉండడం మాత్రమే కాకుండా తన యావత్జీవన పర్యంతము రాముడికి సేవ చేసి చరితార్థుడయ్యాడు.

 తమ్ముడైనటువంటి వాడు అన్నగారి పట్ల ఎలా ఉండాలో మనకి రామాయణంలో ఈ ఘట్టం చెప్తున్నది. ఇవ్వాళ ఏదో ఆస్తుల కోసం తగాదాలు, అన్నదమ్ములు ఒకరికొకరు కొట్లాటలు. ఒక ఉదాహరణ. “నాకు తెలిసి ఒక కుటుంబం ఉన్నది. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆస్తి కోసం వాళ్ళు కొట్లాడుకుంటూ జీవితం గడిపేశారు. ఆ ఆస్తి మాత్రం ఎవరూ అనుభవించలేదు. వాళ్ళలోనుంచి కొంతమంది వెళ్ళిపోయారు కూడా.”

అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న విషయాలకి కోపం ఎందుకు? అందుకనే ‘కోపం పనికి రాదు’ అని చెప్తుంది శాస్త్రం. నిజానికి కోపానికి ప్రతీక ఎవరు అంటే లక్ష్మణుడు అని చెప్తాం మనం. కానీ ఆయనకి ఎక్కడ కోపం రావాలో అక్కడ వచ్చింది. వేరొక రామాయణంలో ఈ ఘట్టం చెప్తారు, ఈ అన్నదమ్ముల యొక్క ప్రేమను ఆవిష్కరించడానికి.

రామలక్ష్మణుల బంధం

ఒకసారి సీతమ్మ వారికి మామిడి పండు తినాలి అనిపించిందట అరణ్యవాసంలో ఉన్నప్పుడు. ఆమె రాముడికి చెప్పింది, ‘రామా నాకు మామిడి పండు తినాలని ఉన్నది’. వెంటనే రాముడు లక్ష్మణుడి వంక చూసాడు. చూపు చాలు, అదే లక్ష్మణుడికి ఆజ్ఞ. కళ్ళతో మాట్లాడడం ఎలాగా అనేటువంటిది ఆ అన్నదమ్ముల నుంచి మనం నేర్చుకోవచ్చు. రామాయణం చదివితే ఎక్కడెక్కడ రాముడు చూస్తాడో, ఎక్కడెక్కడ లక్ష్మణుడికి ఆదేశాలుగా వెళతాయో కూడా మనకి కనబడుతుంది. అంటే నోటి మాటగా చెప్పవలసిన అవసరం లేకుండా, అన్నగారి హృదయం లోపల ఉన్నటువంటి విషయాన్ని గ్రహించి నడుచుకోగల సమర్థుడు లక్ష్మణుడు.

వెంటనే వెళ్తాడు లక్ష్మణుడు. అడవంతా తిరుగుతాడు. అడవిలో మామిడి చెట్టు కనపడదు. తిరిగి తిరిగి చివరికి ఒక దగ్గర మాత్రం ఒకే ఒక పండు దొరుకుతుంది. ఇంకొకటి దొరుకుతుందేమో సీతారాములు ఇద్దరు తింటారనే ఉద్దేశంతో లక్ష్మణుడు వెతుకుతాడు. ఎంతసేపైనా దొరకదు. ఇంతేలే ఈరోజుకి అనుకొని అన్నగారి దగ్గరికి వచ్చి, ‘అన్నయ్యా! వనమంతా తిరిగాను, ఒకే ఒక చెట్టు దొరికింది. దానికి ఒకే ఒక ఫలం ఉన్నది.’

‘ఇదిగో ఇది నీకు సమర్పిస్తున్నాను’ అని ఇస్తాడు. రాముడు దాన్ని రెండు ముక్కలు చేసి ఒకటి సీతమ్మ వారికి ఇస్తాడు. ‘తిను సీతా ఎలా ఉందో చెప్పు’, అంటాడు. సీతమ్మవారు తిని ‘మధురంగా ఉన్నది’ అంటుంది. ఆ రెండవ ముక్క రాముడు లక్ష్మణుడికి ఇస్తాడు. ‘అన్నయ్యా ఇది నీకోసం, నాకు కాదు’, అంటాడు లక్ష్మణుడు. ‘కాదు లక్ష్మణా! కష్టపడి సాధించింది నువ్వు, ఇది నువ్వు తిని చెప్పు ఎలా ఉందో’, అంటాడు. లక్ష్మణుడు ఆ పండు తిని, ‘అన్నయ్య ప్రేమలాగా ఉన్నది’, అంటాడు.

లక్ష్మణుడు తాను చేసే ప్రతి చర్యలో కూడా అన్నగారిని గురించి ఆలోచించేటువంటి వాడు. లక్ష్మణుడు తను నడిచే ప్రతి అడుగు అన్న కోసం వేస్తాడు.

 ‘ఏవండీ చెప్తున్నారు బానే ఉంది. ఇలా ఉంటే మరి మా జీవితం ఏం కావాలి? మేము కూడా బ్రతకాలి కదా?’ అనిపిస్తుంది కొంతమందికి.

లక్ష్మణుడి లాగా కాకపోయినా కొంతవరకైనా మనం అలవాటు చేసుకుంటే ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య ఉన్నటువంటి గొడవలు ఏమాత్రం ఉండవు, పూర్తిగా సమసిపోతాయి. ఈ కోపాలు, ద్వేషాలు, కార్పణ్యాలు పెట్టుకొని దానివల్ల జీవితాలు నష్టపరుచుకోవడమే గానీ బాగుపరుచుకోవడం ఉండదు, అని మనకి రామాయణంలో లక్ష్మణుడి పాత్ర ద్వారా వేరు వేరు సందర్భాల్లో తెలుస్తుంది.

లక్ష్మణ స్వామి మనకందించే సందేశం:

అన్నగారికి ఏ ఏ సందర్భాల్లో తోడుగా ఉండాలో ఆయా సందర్భాల్లో అన్నకు తోడుగా నీడగా నడుస్తాడు.

రామాయణంలో యుద్ధకాండ పూర్తైన తర్వాత పట్టాభిషేక సమయం వచ్చినప్పుడు రాముడు లక్ష్మణుని అడుగుతాడు, “లక్ష్మణా! నాతో పాటు 14 సంవత్సరాలు వనవాసం చేశవు. నా సేవలోనే నీ జీవితం అంతా కూడా అర్పణ చేస్తున్నావు. కాబట్టి నాకు లభించినటువంటి ఈ రాజ్యంలో నీకు భాగస్వామ్యం ఉంటుంది. కాబట్టి యువరాజ పట్టాభిషేకం చేస్తాను.” లక్ష్మణుడు అంటాడు, “అన్నయ్యా ఈ రాజ్యము కంటే, రాజ్య భోగాల కంటే, నీ సేవలో ఉంటేనే నాకు ఆనందం”.

ఎక్కువ సమయం రాజ్యంలో ఉంటే కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలలో ఉంటూ అన్నగారి సేవ చేసుకోలేనేమో అనేటువంటి ఆలోచన లక్ష్మణుడితో అలా మాట్లాడిచ్చింది.

అంటే ఎప్పుడూ కూడా అన్నగారికి సేవ చేద్దాము, అన్నకు తోడుగా ఉందాము, అన్నకు నీడగా ఉందాము అనే ఆలోచన ఉన్నటువంటి త్యాగమూర్తి లక్ష్మణస్వామి. యావజ్జివన పర్యంతము అలాగే గడిపాడు ఆయన. ఆయన్ని చూసి మనం నేర్చుకోవలసింది ఎంతో ఉంది.

అన్నదమ్ములుగా ఉన్నప్పుడు మనకి ఏవో చిన్న చిన్న విషయాలు ఉంటే ఉండొచ్చు, వాటిలో మనస్పర్ధలు రావచ్చు. ఎవరో బయటవాళ్ళు కాదు కదా! నా సహోదరుడే కదా! ఏకోదరుడే కదా! అనేటువంటి ఒక చిన్న ఆలోచన మనం తెచ్చుకోగలిగితే, అటువంటి సందర్భాల్లో ఈ లక్ష్మణ స్వామిని మనం గుర్తు చేసుకుంటే, అన్నదమ్ములందరూ చక్కగా ఆనందంగా సంతోషంగా ఉంటారు. ‘కలిసి ఉంటే కలదు సుఖం’, గనుక కుటుంబాలన్నీ ఆనందంగా ఉంటాయి తద్వారా సమాజమంతా ఆనందంగా ఉంటుంది, ప్రపంచం అంతా కూడా సంతోషంగా ఉంటుంది.

సన్మార్గంలో మనం ఉండాలంటే ప్రప్రథమంగా మనకి పెద్దలు చెప్పినటువంటి సూచన ఆదేశం, దాన్ని పాటిద్దాం, లక్ష్మణుడి నుంచి మనం నేర్చుకుందాం, యధాశక్తిగా దాన్ని ఆచరణలో పెడదాం, ఆనందంగా జీవితం గడుపుదాం.  

   ధర్మస్య విజయోస్తు.

K C Das Memorial Charitable Trust

Paropakarardham Idam Sareeram

  • Instagram
  • YouTube
  • Facebook
Address
H.No. 11-13-119, 14/B, Road No. 3, beside Axis Bank, Alkapuri Colony, Ramakrishnapuram, Kothapet, Hyderabad, Telangana 500035
View on map
Contact
contact@kcdastrust.org
+91 94948 77070
04:00 PM to 08.30 PM IST

© 2026 K C Das Memorial Charitable Trust. All rights reserved.

Terms and ConditionsPrivacy Policy