Skip to navigation
K C Das Memorial Charitable Trust
Donate
  • Home
  • About
  • Library
    • Dharma Vaani
    • Sri Lalitha Sahasra Naamavali
    • Dharmavaaradhi e-Magazine
    • Guru Vaani
    • Saradamba TV (Grandly Launched)
  • Dharmika Programs
    • All programs
    • Hanuman Chalisa
    • Gayathri Japam
    • Bala Japam
    • Calendar
  • Spiritual Education
  • Community Welfare
  • Contact
Donate
  • Instagram
  • YouTube
  • Facebook
  • Instagram
  • YouTube
  • Facebook
Donate

శ్రీమద్రామాయణం – భరతుడు

మానవుడు ఆనందంగా ఉండాలి అని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాడు. ప్రతి మనిషి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అనే ఆలోచిస్తూ ఉంటాడు. అలా సంతోషంగా ఉండడానికి సన్మార్గంలో ఉంటే తప్ప వేరే అవకాశం లేదు అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. దీని కొరకు వేదకాలం నాటి నుండి పురాణాలు, ఇతిహాసాలు, కథలు, నీతి కథలు, నీతిశాస్త్రాలు ఏవి తెరగేసినా వాటన్నిటిలో మనకి సన్మార్గంలో మానవుడు ప్రయాణించడం తప్ప ఆనందానికి హేతువుగా వేరే ఏది కనబడదు.

అయితే సన్మార్గం అంటే ఏమిటి? సన్మార్గంలో ఉండడం అంటే ఏమిటి? తాను సంతోషంగా ఉంటూ, తన చుట్టూ ఉన్నటువంటి వారిని సంతోషంగా ఉంచుతూ, యావత్ సమాజాన్ని సంతోషంగా ఉండే విధంగా ప్రవర్తించడమే సన్మార్గ ప్రవర్తన. దీనికి అనేక పురాణాల్లో అనేక కథలు మనకి కనిపిస్తాయి. మరీ విశిష్టంగా మనకి రామాయణం తీసుకుంటే, అందులో ఉన్నటువంటి పాత్రలు, వాటి యొక్క ఔచిత్యము, సన్మార్గంలో మనం నేర్చుకోవలసినటువంటి అంశాలను వీటన్నిటినీ సమ్మిళితం చేసి వాల్మీకి మహర్షి మనకు అందించారు.

మనిషి సంతోషంగా ఉండాలి అంటే ఏ విధమైనటువంటి ప్రవర్తన ఉండాలి అనేటువంటిది మనకి రామాయణంలోని ప్రతి పాత్రలో కనబడుతుంది. ఈవేళ మనం భరతుడి పాత్ర తీసుకుందాం. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుజ్ఞుడు ఈ నలుగురు దశరథ మహారాజు యొక్క కుమారులు. అన్నదమ్ములు నలుగురు ధర్మాన్నే ఆశ్రయించి ఉన్నారు.  

భరతుడి గురించి మనం చూస్తే ఆయన యొక్క వైశిష్ట్యము మనకి ఐదు రకాలుగా కనబడుతుంది.

ఆస్తేయము:

భరతుడి దగ్గర ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం గొప్ప విశేషమైనటువంటి లక్షణం ఏమిటి అంటే ఆస్తేయము అని ఒక పదం ఉన్నది మనకు. ‘అహింస, సత్యము, ఆస్తేయము, శౌచము, ఇంద్రియ నిగ్రహము’, ఇవన్నీ కూడా ఆనందంగా జీవితం గడుపుకోవడానికి కావలసినటువంటి ధర్మమార్గముగా మనకి పెద్దలు చెప్పారు.

అహింస అంటే ‘హింస చేయకుండా ఉండడం’. సత్యము అంటే ఎల్లప్పుడూ సత్యమునే పలుకుతూ ఉండడం. మూడవది ఆస్తేయము. స్తేయము అనే పదానికి అర్థం దొంగతనం. ఆస్తేయము అంటే దొంగతనం చేయకుండా ఉండడం. దొంగతనము సమాజంలో ఎవరెవరు చేస్తున్నారు అని ఒకసారి ఆలోచిస్తే, అసలు దొంగతనం అంటే ఏమిటి? యజమానికి తెలియకుండా ఏదన్నా తీసుకుంటే అది దొంగతనం.

ఇప్పుడు ఉదాహరణకి పిల్లలు పరీక్షలకు చదువుతున్నారు. పరీక్ష రాసేటప్పుడు ముందున్నవాడిదో, పక్కనున్న వాడిదో చూసి కాపీ కొట్టద్దు అంటూ ఉంటాం. అది కూడా అవతల వ్యక్తి యొక్క జ్ఞాన సంపదను దొంగతనం చేయడమే. అతనికి తెలియకుండా రాస్తే కాపీ కొట్టడం కదా. తప్పు అది. అలాగే ఉద్యోగస్తులు ఉన్నారు, ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళ యొక్క విధి నిర్వహణ సమయంలో ఆ సమయం అంతా కూడా ఆ ఉద్యోగం కోసం కేటాయించవలసినటువంటి సమయంలో వేరే వాటికి కేటాయించడం కూడా ఆస్తేయము కిందకే వస్తుంది అని మనకి ధర్మశాస్త్రం చెప్తుంది.

తనకు కానిది ఏదైనా లభించినప్పటికీ కూడా ఆ దొరికినటువంటి వస్తువుని అది తనది కాదు గనుక అది తీసుకువెళ్లి దాని నిజమైనటువంటి యజమాని ఎవరున్నారో తెలిస్తే వాళ్ళకి అప్పచెప్పడం లేదా పోలీస్ స్టేషన్లో ఇవ్వటం. అది సన్మార్గంలో సత్ప్రవర్తన. భరతుడి విషయంలో Exactly అదే జరిగింది.

భరతుడు మేనమామ దగ్గర ఉన్నాడు. కైకేయి రెండు వరాలు కోరటం ఆయనకు అసలు ఏ మాత్రం తెలీదు. ఆయన సంబంధం లేకుండా, ఆయన్ని సంప్రదించకుండా కైకేయి దశరథ మహారాజుని వరం కోరింది. దశరథ మహారాజు సరే అనడం, ఆ తర్వాత రాముడు వనవాసానికి వెళ్ళడం. సరే ఆ కథంతా మనకు తెలుసు. ఎప్పుడైతే దశరథ మహారాజు మృతి చెందారో అప్పుడు వార్త వెళ్తుంది భరతుడికి. భరతుని వెనక్కి పిలిపిస్తారు. అయోధ్యకు వచ్చి ఆశ్చర్య పోతాడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసి. ఏం జరిగిందో తెలియదు అతనికి. తల్లిని ప్రశ్నిస్తాడు “అమ్మా ఏం జరిగింది?” అని. “మీ నాన్నగారు కాలం చేశారయ్యా”, అని చెప్తుంది. దుఃఖిస్తాడు, బాధపడతాడు.

ఆ తర్వాత మెల్లగా రాముడు వనవాసానికి వెళ్ళాడు అని కూడా చెబుతుంది. “ఎందుకు వెళ్ళాడు రాముడు వనవాసానికి? అటువంటి నేరములు చేసేటువంటి వ్యక్తి కాదు. రాముడు నాకు తెలుసు. ఎందుకు వెళ్ళాడు?” అప్పుడు తల్లి చెబుతుంది “నేనే కోరాను, నీకోసం నేను కోరాను, నువ్వు ఈ అయోధ్యకు పట్టాభిషక్తుడవై, ఈ సామ్రాజ్యాన్ని అంతటినీ పాలించే చక్రవర్తి కావాలనేటువంటి కోరిక నేను కోరాను”, అంటుంది.

అప్పుడు ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి భరతుడు తల్లికి ధర్మం గురించి ప్రశ్నిస్తాడు. ‘ధర్మం విషయంలో అనుబంధాలు ముందుపెట్టి ధర్మాన్ని వెనక్కి పెట్టకూడదు, ధర్మమే ముందు ఉండాలి, అనుబంధాలను తర్వాత తీసుకురావాలి’, అని మనము భరతుడి నుంచి నేర్చుకోవలసినటువంటి అంశం.

 “అమ్మా నేను అడిగానా నిన్ను? ఎందుకు అడిగావు నా కోసం? ఇది రాముడికి చెందినటువంటి రాజ్యం కదా? పెద్ద కుమారుడు రాముడు కదా? ధర్మంగా రాముడే రాజవ్వాలి కదా? నేను ఈ రాజ్యం స్వీకరిస్తానని ఎలా అనుకున్నావు తల్లి?”, అని ఆ తల్లిని ప్రశ్నిస్తాడు. ఆవిడ దగ్గిర సమాధానం లేదు. అక్కడి నుంచి కౌసల్య దేవి దగ్గరికి వస్తాడు. ఆవిడకి చెప్తాడు “నేను అటువంటి అధర్మమైనటువంటి పని చేసేవాడిని కాదు. ఇది రాముడికి చెందిన రాజ్యం.”

ఈ రోజుల్లో పదవుల కోసం పోట్లాడుతున్నారు. పదవుల కోసం ఎంతటి నీచానికైనా వడిగట్టే సమాజంలో మనం ఉన్నాం. కాబట్టి రామాయణంలో భరతుడి నుంచి నేర్చుకోవలసింది తనది కానిది ఏదైనా లభించినా అది ఎవరికి అందించాలో వారికే అందించేటటువంటి వ్యక్తిత్వం. అట్టి ఉన్నత వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి భరతుడు. అక్కడి నుంచి మంత్రులందరూ, పురజనులందరూ కూడా కోరతారు, “నాయనా మీ అన్నగారు లేరు, ఆయన వచ్చేదాకా నువ్వే రాజువుగా”, అంటారు. అయినా సరే, “ఇది నాది కాదు, దీనికి నాకు అర్హత లేదు. రాముడ్ని వెనక్కి తీసుకొద్దాం. మీరందరూ నాతో పాటు రండి”, అని అందరినీ తీసుకొని ఆయన రాముడి దగ్గరికి వెళ్తాడు.

ఇక్కడ మనం గమనించవలసింది తనకు కాని వస్తువు గాని, విషయము గాని, అధికారము గాని, ధనము గాని, సంపద గాని, ఏదైనా తనది కాకపోతే దాన్ని అనుభవిస్తే అది అధర్మము. భరతుడి దగ్గర నుంచి మొట్టమొదట మనం నేర్చుకోవలసిన సూత్రం ‘ఆస్తేయాన్ని ఆయన మనసా వాచా కర్మణ పాటించాడు’.

సేవా భావన

భరతుడు రాముడ్ని దర్శించి ఆయన ప్రార్థన చేస్తాడు, “అన్నయ్యా! ఇది నీకు చెందినటువంటి రాజ్యం”. అంటే రాముడు అంటాడు, “భరతా! ఇది మన తండ్రిగారి కోరిక. నీ తల్లిగారి కోరిక. నీ తల్లి కోరిన కోరికలకు తండ్రిగారు ఇచ్చినటువంటి వరం. ఆయన్ని సత్యమునందు నిలబెట్టడమే కొడుకులుగా మనం చేయవలసినటువంటి పని. కాబట్టి అసత్య దోషం తండ్రికి అంటించవద్దు”, అని రాముడు మరొక ధర్మ సూక్ష్మం చెప్తాడు.

ఈ అన్నదమ్ముల ధర్మములు, ధర్మమిమాంస చూసి ఆశ్చర్యపోతారు అక్కడ ఉన్న వారందరు. “నాకు కావాలి, నాకు కావాలి”, అని కొట్టుకునేటువంటి సోదరులను చూసాం కానీ “నాది కాదు, నాది కాదు” అని రాజ్యము సైతము ధర్మం కోసం వదిలిపెట్టేటువంటి సోదరులను చూస్తున్నామని ఆశ్చర్యపోయి ఆనందపడుతూ ఉంటారు.

కథలో ఉన్నటువంటి అంశాన్ని మనం గమనిస్తే సన్మార్గంలో ప్రవర్తించడానికి భరతుని గనక మనం ఆదర్శంగా తీసుకుంటే, భరతుడి దగ్గర మనం నేర్చుకోవలసింది ముఖ్యమైనటువంటి విషయం ఒకటుంది. రాముడు భరతుడిని తండ్రి గారి ఆజ్ఞను పాలించటానికి ఒప్పిస్తాడు. 14 సంవత్సరాలు పూర్తి కాగానే వెంటనే వస్తాను అంటాడు. ‘సరే నీవు రాకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తాను’, అని ప్రతిజ్ఞ చేసి ‘అన్నగారి ఆజ్ఞగా రాజ్యపాలన చేస్తాను, కానీ రాజ్యం నాది కాదు రాజ్యం నీదే’. ‘నీ పాదుకలను నాకు ఇవ్వవలసింది’, అని ఆ పాదుకలను తీసుకొని శిరస్సు మీద పెట్టుకొని అత్యంత వినయముతో ఆయన అక్కడి నుంచి బయలుదేరుతాడు.

  నిజానికి ఆయన రాజు ఇప్పుడు, ఆయన చక్రవర్తి ఆయన ఆజ్ఞాపించగల సమర్థత స్థితిలో ఉన్నటువంటి వాడు, కానీ ‘పాలన మాత్రమే చేస్తాను, ఇది రాముని రాజ్యము. నేను సేవకుడిగానే ఉంటాను’, అనేటువంటి నిర్ణయం తీసుకొని అత్యంత వినయముతో అక్కడి నుంచి బయలుదేరుతాడు.

రెండవ లక్షణం మనం నేర్చుకోవలసింది సేవ.

వినయం, త్యాగం

భరతుడి దగ్గర నుంచి మూడవ లక్షణం వినయం, నాలుగవ లక్షణం త్యాగం. ఆయన అన్నయ్య కోసం త్యాగం చేసి “నీవు వనవాసం చేస్తుంటే నేను అంతఃపురంలో కుబేరాసనం మీద ఎలా కూర్చుంటాను అన్నయ్యా?”

“నేను అయోధ్యలో ఉండను. నేను నందిగ్రామంలోనే ఉంటాను’, అని ఊరవతల ఆయన కూడా మునివాసమే ఏర్పరచుకొని తనకున్నటువంటి సంపదలను ఇష్టపూర్వకముగా త్యాగము చేస్తాడు.

త్యాగం అంటే అర్థం లేని దాన్ని వదిలేయడం కాదండి, మనకు ఉన్నదాన్ని వదిలిపెట్టగలగాలి, అది త్యాగం.

‘నకర్మణాన ప్రజ ధనేన త్యాగేనేకే అమృతత్వ మానసహు’, అంటారు. అంటే ‘నీవు చేసేటువంటి పనుల వల్ల గాని, నీకున్నటువంటి సంతానం వల్ల గాని లేదా పరివారం వల్ల గాని స్నేహితులు, బంధువులు, మిత్రులు వీరందరినీ చూసి కొంతమంది మిడిసి పడుతూ ఉంటారు. వారి వల్ల నీకు ప్రయోజనం లేదు.’ ‘నా కర్మణ న ప్రజయ ధనేనా’ – ‘కొంతమంది నాకు చాలా డబ్బు ఉంది, నేను ఏవైనా చేయగలను’ అనుకుంటారు కానీ ఇవి ఏవి కూడా నీకు ఉపయోగపడవు. త్యాగం ఒక్కటే మనకు ఉపయోగపడేది. ‘నీ దగ్గర డబ్బు ఉన్నది అంటే దానం చెయ్’ తద్వారా విశేషమైనటువంటి సత్కర్మలు ఆచరించి సన్మార్గంలో ఉన్నటువంటి వాడివి అవుతావు, విశేషమైనటువంటి పుణ్యఫల సముపార్జన చేసుకుంటావు.

త్యాగం దైవీసంపద. మృతత్వం అంటే మరణించటం. అమృతత్వం అంటే మరణం లేనటువంటి వ్యక్తులు దేవతలు గనుక దైవీ సంపదను అలవాటు చేసుకోవడం త్యాగము ద్వారా మాత్రమే సాధ్యం. భరతుడి నుంచి మనం నేర్చుకోవలసింది రెండవ లక్షణం ఈ ‘త్యాగ సంపద’.

భరతుడుని ఒక సందర్భంలో పురజనులందరూ ఇలా కోరతారు, “మీ నాన్నగారు నీకు రాజ్యాన్ని ఇచ్చారు. ఇది నీకు అధికారికంగా వచ్చినటువంటి పదవి. దీన్ని అనుభవించడంలో తప్పు లేదు.” అప్పుడు భరతుడు వారితో ఇలా అంటాడు – ‘నాహం కామేమి రాజ్యం నా స్వర్గం నా పునరుద్భవం’ – “నాకు రాజ్యం అక్కర్లేదు, స్వర్గం అక్కర్లేదు, పునర్జన్మ మీద కూడా ఆసక్తి లేదు, ఆశ లేదు. నాకు కావలసిందల్లా రాముడ్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడమే. ఎలా తీసుకురాగలుగుతానా అని ఆలోచిస్తున్నాను”, అంటాడు.

‘సొంత లాభము కొంతమానుకోని పొరుగు వారికి తోడపడవోయి’, అని మనకి పెద్దలు బోధ చేస్తూ ఉంటారు. మనకున్నటువంటి సమయము, మనకున్నటువంటి అవకాశాలు, అధికారము వీటిని పది మందికి సేవ చేయడానికి గనుక మనం వినియోగించగలిగితే అది సన్మార్గం అవుతుంది. అలా కాకుండా ఉన్నదంతా తనకోసం తాను వాడుకొని, తానే అనుభవించి అలా జీవితం గడిపేస్తే అది సన్మార్గం కాదు అని భరతుడి నుంచి మనం నేర్చుకోవలసినటువంటి పాఠం.

మరొక లక్షణం భరతుడి విషయంలో మనకు కనిపించేది ఆయనకు ఉండేటువంటి విశేషమైనటువంటి ‘వినయ సంపద’. ఎంత వినయం అంటే అన్నగారు ఇచ్చినటువంటి పాదుకలను (పాదరక్షలు, చెప్పులు అంటూ ఉంటాం) ఆయన నెత్తి మీద పెట్టుకొని, తాను రాజై ఉండి కూడా అహంకారరహితంగా ఉండగలగటం. ఇది ఈనాటి పాలకులందరూ కూడా భరతుడు నుంచి నేర్చుకోవలసినటువంటి అంశం. అధికారం ఉన్నది కదా అని దర్పము, డంబము, క్రోధము, పౌరుషము ఇవన్నీ ప్రదర్శించకుండా క్షమాగుణంతో, ధైర్యముతో వినయముతో ఉండటం.

భరతుడిని మనం ఎటువైపు చూసినా కూడా ఆయన ఆలోచనలు అన్నీ అత్యంత విశిష్టంగా ఉంటాయి. 28 సంవత్సరాల వయసులో ఆయన అయోధ్యకు వస్తాడు. ఆయనకు వచ్చినటువంటి వార్త తండ్రిగారు కాలం చేశారు. అత్యంత ప్రియమైనటువంటి అన్నగారు అడవులకు వెళ్ళిపోయారు. వేరొకరు అయితే కుప్పకూలిపోతారు కానీ భరతుడు అలా కుప్పకూలలేదు, ధైర్యంగా నిలబడ్డాడు.

కష్టం వచ్చినప్పుడు సన్మార్గంలో ఉండాలి అనుకున్న వాళ్ళు ‘ధైర్యంగా ఉండగలగాలి’. అది కూడా మనం భరతుని చూసి నేర్చుకోవాలి.

‘ధైర్యంగా ఉండడం, అస్తేయాన్ని పాటించడం, వినయంగా ఉండడం’. ‘విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం | పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాద్ధర్మం తతః సుఖం ||’, అంటుంది నీతిశాస్త్రం.

విద్య వల్ల వినయం రావాలి తప్ప అహంకారం రాకూడదు. నేర్చుచుకున్నది కొంత, నేర్చుకోవలసింది చాలా ఉన్నది అనేటువంటి ఆలోచన సహజంగా వస్తుంది. భరతుడు విషయంలో జరిగింది అదే. ఆయనకి వినయ సంపద తోడయింది. ఆ వినయం వల్ల ప్రజలందరి మన్ననకు పాత్రుడయ్యాడు. ఆ పాత్రత ఆయన యొక్క వినయం వల్ల ఆయనకు వచ్చింది. ఎవరైతే వినయంగా ఉంటారో వారికి ప్రజాదరణ, పాత్రత తప్పనిసరిగా వచ్చేస్తుంది. అధికారము, వినయము కలిపి విశేషమైనటువంటి ప్రజాదరణ పొందవచ్చు అని మనకి భరతుడి నుంచి తెలుస్తుంది.

ధర్మాన్ని ఆచరించాలి అంటే అన్ని బాగున్నప్పుడు ధర్మం ఆచరించడం పెద్ద విషయం కాదు, ఎవరైనా ఆచరిస్తారు.

కానీ కష్టం వచ్చినప్పుడు కూడా ధర్మాన్ని ఆచరించగలగాలి. శ్రీరాముడు భరతుడిని అయోధ్యను 14 సంవత్సరాల పాటు పాలించమని చెప్పినా, భరతుడు తానే అయోధ్యకు రాజు అనేటువంటి అహంభావ ధోరణి లేకుండా వినయంతో అన్నగారి పాదుకులను అక్కడ పెట్టి, ఆ పాదుకుల ద్వారా ‘రామాజ్ఞను నేను పాలిస్తున్నాను, నేను పాలకుడను కాదు, ఆయన ఆజ్ఞానుపాలనావర్తనుడై ఉన్నాను తప్ప స్వయం నేను ప్రభువును కాదు’, అని అందరికి చెప్పేవాడు. ఆ 14 సంవత్సరాలు కూడా ఇది రామాజ్ఞగానే భరతుడు రాజ్యభారం నిర్వహించాడు.

 కనుక ‘ఆస్తేయంతో’ ప్రారంభం చేస్తే భరతుని విషయంలో మనకి ‘వినయము గాని, సేవా భావము గాని’ ఆయన 14 సంవత్సరాల్లో కాదు తర్వాత కూడా చేశాడు. విశేషంగా మనకి 14 సంవత్సరాల్లో కనబడుతూ ఉంటుంది. ప్రతిరోజు భరతుడికి లెక్కలు వివరించేవారట. ఆ లెక్కలు ఎవరికి వివరిస్తారు అంటే రాజుకు, మహారాజుకు వివరిస్తారు. కానీ భరతుడు వారితో “ఇవి నాకు కాదు. రాముడి పాదాలకు వివరించండి” అని చెప్పేవాడు. అది సేవకుడికి ఉండవలసినటువంటి లక్షణం.

రాముడు అంటాడు భరతుడితోటి, “ఎట్టి పరిస్థితుల్లోనూ తండ్రిని సత్యమునందు నిలబెట్టడమే మన ధర్మం.”

“ఇప్పుడు ఆ నాన్నగారు లేరు గనుక ఆయన మాట వద్దు అని చెప్పడానికి అవకాశం లేదు. నేను వనవాసం చేసి తీరవలసిందే. రాజు లేని రాజ్యం ఉండకూడదు కనుక నీవు రాజ్యభారం వహించు”, అని చెప్తే, “నీ ప్రతినిధిగా నేను రాజ్యభారం వహిస్తాను తప్ప నాకుగా నేను రాజుగా ఉండను”, అని భరతుడు అంటాడు.

‘యజమాని చెప్పింది శిరసావహించడమే సేవకుడి యొక్క ధర్మం’, అని సేవ యొక్క వైశిష్యాన్ని భరతుడు తన మాటల్లో రాముడితో చెప్పటమే కాకుండా తర్వాత స్వయంగా తాను కూడా ఆచరించి ఆ 14 సంవత్సరాలు ఒక సేవకుడి జీవితమే గడిపాడు తప్ప పాలకుడిగా గడపలేదు.

అవకాశం వచ్చింది కదా అని అంది పుచ్చుకునే ఆలోచన లేదు. ధర్మమునందు అనురక్తుడై నిలిచి వినయముతో, రాముడి పట్ల అత్యంత విధేయతతో మెలిగాడు భరతుడు. ఈ వినయ విధేయతలు ప్రస్తుత సమాజంలో మనకి ఉద్యోగ క్షేత్రాల్లో చాలా అవసరం. మనకి పై అధికారి పట్ల విధేయత, వినయం ఉండాలి. మన చుట్టూ ఉన్నటువంటి వారి పట్ల విశేషమైనటువంటి ప్రేమ ఉండాలి, సమాజం పట్ల సేవా భావం ఉండాలి. ఇవన్నీ కూడా భరతుడికి స్వయంగా వచ్చినటువంటి విశేషమైనటువంటి విద్యలు.

భరతుడు – ధర్మం

మనం భరతుని విషయంలో ఆలోచన చేస్తే అసలు ఇవాళ అన్నదమ్ములు ఇలా ఉండగలరా అనిపిస్తుంది. ఇది సాధ్యమేనా అనిపిస్తుంది. ఇలా ఆలోచించగలగడం ఎంతమంది వల్ల వీలవుతుంది అనిపిస్తుంది. ఇది నిజమేనా అని కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో రామాయణం చదువుతూ ఉంటే అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఇవ్వాళ మనం సమాజంలో అటువంటి వారిని చూడటానికి అవకాశం కలగడం లేదు. కనుకనే ఎప్పుడో నాలుగు ఐదు మహాయుగాల వెనక జరిగినటువంటి రామాయణం యొక్క పాత్రల వైశిష్యం ఈరోజు కూడా మనం చెప్పుకుంటున్నాం.

కనీసం వారిలాగా నూటికి నూరు శాతం ఆ విధమైనటువంటి ఆలోచనలతో, ఆ విధమైనటువంటి నడవడికతో, ఆ విధమైనటువంటి నడతతో, ఆ విధమైనటువంటి భావజాలంతో అన్నదమ్ములు గాని సమాజంలో పాలకులు గాని ప్రభువులు గాని అధికారులు గాని పూర్తిగా ఉండలేకపోయినా, ఎంతో కొంత వారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ప్రతి పాత్రలో మనకి రామాయణంలో కనబడతాయి.

భరతుడు చిన్నప్పటి నుంచి కూడా రాముడితో పాటు రాముడ్ని చూసి నేర్చుకునేవాడట. చూసి నేర్చుకోవడం అనేటువంటిది కూడా ఒక మంచి లక్షణం. సన్మార్గంలో ఉండేటువంటి వారు సత్పురుషులను చూసి నేర్చుకోవాలి. అలాగే మనకున్నటువంటి అవలక్షణాలు, దుర్లక్షణాలు ఏమన్నా ఉన్నా వాటిని వదిలిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉండాలి. రాముడ్ని చూసి ‘నిన్ను చూసే నేర్చుకున్నాను కదా అన్నయ్యా’, అని రాముడితో చెప్తాడు భరతుడు.

భరతుడు ఆడిన మాట మీద నిలబడేటువంటి వాడు. ఒక మాట ఇచ్చాడు అంటే ఆ మాటకు కట్టుబడతాడు. ఎంత కష్టమైనా ఆ మాటను నిలబెడతాడు తప్ప ఆ మాట నుండి మరలడు. రావణ సంహారం అయిపోయి 14 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత ఇంకా రాముడు రాలేదు అని తాను ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి అగ్నిప్రవేశం చేయడానికి సిద్ధపడతాడు. ఈ విషయం రామచంద్రమూర్తికి తెలుసు, అందుకని ముందుగానే హనుమని పంపిస్తారు. భరతుడు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని హనుమ వెళ్లి ఆపి, ‘రాముడు వస్తున్నాడు’ అనేటువంటి శుభవార్త భరతుడికి చెబుతాడు హనుమ.

హనుమ ఆ శుభవార్త చెప్పగానే అత్యంత ఆనందంతో రాముడి పాదుకలు శిరస్సు మీద పెట్టుకొని, అదే భక్తి భావంతో, అదే వినయంతో, అదే విధేయతతో 14 సంవత్సరాల తర్వాత రాముడికి స్వాగతం పలికి అయోధ్యలో ఆయన రాజ్యం ఆయనకు అప్పచెప్తాడు. ఇది భరతుడి యొక్క వైశిష్ట్యం, ఇది భరతుడి యొక్క గొప్పతనం. భరతుడి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాల్లో ఏ కొద్దిగా అయినా మనం నేర్చుకోగలిగితే సన్మార్గంలో మనము ఉంటాం.

    ధర్మస్య విజయోస్తు.

K C Das Memorial Charitable Trust

Paropakarardham Idam Sareeram

  • Instagram
  • YouTube
  • Facebook
Address
H.No. 11-13-119, 14/B, Road No. 3, beside Axis Bank, Alkapuri Colony, Ramakrishnapuram, Kothapet, Hyderabad, Telangana 500035
View on map
Contact
contact@kcdastrust.org
+91 94948 77070
04:00 PM to 08.30 PM IST

© 2026 K C Das Memorial Charitable Trust. All rights reserved.

Terms and ConditionsPrivacy Policy