శ్రీమద్రామాయణం – సుగ్రీవుడు
సన్మార్గం కార్యక్రమంలో మనము రామాయణంలో వివిధ పాత్రల వైశిష్ట్యము, సమస్త మానవాళికి ఆ పాత్రలు ఇచ్చేటువంటి సందేశాలు, అందులో నుండి మనం నేర్చుకొని ఆచరించి అనుసరించవలసినటువంటి విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాం. రామాయణంలో చాలా విశిష్టంగా కనబడేటువంటి పాత్ర, కిష్కింధ కాండంలో ప్రారంభమయి సుగ్రీవుడి రూపంలో మనకి కనబడుతుంది.
స్నేహ ధర్మానికి ప్రతీక
సుగ్రీవుడి పాత్ర స్నేహధర్మానికి ప్రతీక. రాముడికి సుగ్రీవుడు ఎవరో తెలీదు, అలాగే సుగ్రీవుడికి రాముడు పరిచయం లేదు. కబంధుడు అనేటువంటి రాక్షసుడి చేతిలో రామలక్ష్మణులు ఇద్దరూ బంధింపబడి, ఆ రాక్షస సంహారం తర్వాత అతను శాప విమోచనం పొందిన తర్వాత రాముడికి చెప్తాడు – “రామా, నువ్వు నాకు చేసిన మేలుకి అంటే ఈ రాక్షస ఉపాధి నుండి నాకు విముక్తి కల్పించావు. కనుక నీకు కూడా నేను ఏదైనా ఒక మేలు చేస్తాను”.
అప్పుడు రామలక్ష్మణులు ఇద్దరు కూడా ‘మేము సీత కోసం వెతుకుతున్నాం, జాడ తెలిస్తే చెప్పు’, అని అడుగుతారు. అప్పుడు ఆ కబంధుడు “జాడ నేను చెప్పలేను గానీ, ఇక్కడిలో దగ్గరలోనే ఋష్యమూక పర్వతం మీద సుగ్రీవుడు అని ఉంటాడు. అతను కూడా భార్య విహీనుడిగా ప్రస్తుతం బాధలు పడుతున్నాడు. కాబట్టి అతన్ని గనుక నువ్వు చేరి, అతనితో సఖ్యం చేస్తే నీకు అతను మేలు చేస్తాడు”, అని చెప్తాడు.
ఇందులో మనకి కనపడే సందేశం ఏమిటి అంటే ‘సన్మార్గంలో వెళ్దాం అనుకునేటువంటి వారికి అవసరమైనటువంటి సహాయము నువ్వు చెయ్యగలిగితే చెయ్యి, లేకపోతే అదిగో ఫలానా ఆయన సహాయం చేయగలడు అని నీకు తెలిస్తే ఆ దారి చూపించు’, అని కూడా మనకి మహర్షి వాల్మీకి ఈ సంఘటన ద్వారా సందేశాన్ని అందిస్తారు.
ఆ కబంధుడు చెప్పినటువంటి వివరాలు పట్టుకొని రామలక్ష్మణులు ఇద్దరూ ఋష్యమూక పర్వతానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత హనుమ వారిని సుగ్రీవుడికి పరిచయం చేస్తారు. ఒకరికొకరు వారి వారి కష్టాలను చెప్పుకుంటారు. సుగ్రీవుడు తన అన్న అయినటువంటి వాలి ఏ విధమైనటువంటి ద్రోహం చేశాడో అవన్నీ కూడా వివరిస్తాడు. అక్కడ ఇద్దరు అగ్నిసాక్షిగా స్నేహ ప్రమాణం చేస్తారు. ఇక అక్కడి నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం రాముడు సుగ్రీవుడి తరపున యుద్ధం చేసి వాలిని పడగొట్టి కిష్కిందకు పట్టాభిషక్తుడిని చేసి రాజుని చేస్తాడు.
ఇక్కడ స్నేహధర్మం ఎలా ఉంటుంది అంటే సుగ్రీవుడిని గనుక రాముడు “నీకు రాజ్యం నేను ఇప్పించాను, ఇందులో సగం నాకు ఇవ్వు”, అని అడిగితే మొత్తం రాజ్యాన్ని కూడా ఇచ్చేసేటువంటి స్నేహం ఉన్నటువంటి వ్యక్తి సుగ్రీవుడు. స్నేహధర్మంలో మనకి ఈ రామాయణం నుంచి మరీ ముఖ్యంగా ఈ రామ సుగ్రీవుల మైత్రి అలాగే విభీషణ మైత్రి అలాగే గుహుడితో మైత్రి ఈ మూడు సందర్భాల్లో కూడా మనకి ఈ సందేశాన్ని అందిస్తారు మహర్షి వాల్మీకి.
నిజమైన స్నేహం
స్నేహం (Friendship) అంటే ఏదో Transactional Friendship కాకుండా అంటే అవసరానికి చేసేటువంటి స్నేహము.
అది స్నేహం కాదా అంటే అది కూడా స్నేహమే కానీ అటువంటి స్నేహం నిలవదు. సత్యమై నిత్యమై నిలిచి ఉండేటువంటి స్నేహం. “నీకు అతడే నిజమైనటువంటి స్నేహితుడు”, అతడిని ‘సఖ’ అంటారు. ఖ అనేటువంటి శబ్దము రెండు చోట్ల వాడతాం. ఒకటి సుఖం వచ్చినప్పుడు. సుఖం కలిగినప్పుడు ఉండేటువంటి స్నేహితుడు గనుక నీతోటి ఉంటే నీ సుఖం పదింతలు అవుతుంది. అలాగే రెండవది దుఃఖం. దుఃఖం వచ్చినప్పుడు స్నేహితుడు నీతోటి ఉంటే ఆ దుఃఖం సగం అవుతుంది. ఈ రెండు మనము సుగ్రీవుడి విషయంలో గమనిస్తాం.
సీతమ్మవారి కోసం రాముడు దుఃఖపడుతూ ఉంటే రాముడికి అనునయ వాక్యాలు చెప్పి, “రామా తప్పకుండా సీతను వెతికి పట్టుకుందాం.”
“నీ సీతను నీకు అప్పగించేటువంటి ధర్మము, బాధ్యత నాది” అని రాముడి దుఃఖాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తాడు. కష్టంగా ఉన్నప్పుడు మనిషికి అనునయ వాక్యాలు చెప్పాలి అంటే ఆ కష్టాన్ని తాను కూడా అనుభూతి చెందితే తప్ప అటువంటి మాటలు బయటికి రావు. ఆ కష్టం ఏదో సుగ్రీవుడు కూడా అనుభవించి ఉన్నాడు. సుగ్రీవుడు రాముడికి చెప్తాడు, “నీ దుఃఖంలో నేను కూడా పాలుపంచుకుంటున్నాను”, అని. సుగ్రీవుడి అనునయ వాక్యాల ద్వారా రాముడి దుఃఖం తగ్గుతుంది.
అలాగే రావణ సంహారం జరిగిన తర్వాత రాముడికి పట్టాభిషేకం జరుగుతూ ఉంటే సుగ్రీవుడు ససైన్యంగా, సబంధుమిత్ర పరివార సమేతంగా ఆ యొక్క ఆనందోత్సాహాలలో పాల్గొంటాడు. “ఆప్త మిత్రుడు, ఆత్మీయ మిత్రుడు, సుఖ మిత్రుడు, దుఃఖ మిత్రుడు, సుఖ దుఃఖ మిత్రుడు, సత్య మిత్రుడు, నిత్య మిత్రుడు”, అని మిత్రత్వాన్ని రకరకాలుగా చెప్పింది మనకి శాస్త్రం.
మన జీవితంలో నిజంగా ఉండవలసింది ఎవరు అంటే సుగ్రీవుడు లాంటి మిత్రుడు ఉండాలి. అయితే మనకి అటువంటి మిత్రుడు ఉండాలి అంటే మనము సుగ్రీవుడులాగా ఉండగలిగితేనే రాముడు లాంటి మిత్రుడు మనకి లభిస్తాడు. సుగ్రీవుడు తనకు వచ్చినటువంటి కష్టంలో రాముణని పూర్తిగా విశ్వసించాడు. అంటే Friendship లో ఉండవలసింది ఏమిటి అంటే Trust, ముందు ఆ నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉంటే, ఆ విశ్వాసం ఉంటే ఆ స్నేహం నిలబడుతుంది.
నమ్మకం లేకుండా అవసరార్థం ఇప్పుడు ఏదో మనం ఒక రైల్లో ప్రయాణం చేస్తున్నాం, రాత్రిపూట ప్రయాణానికి కాసేపు తోటివారితో స్నేహం చేస్తాం కానీ దిగిన తర్వాత వారెవరో మనం ఎవరమో. అటువంటి వారితో స్నేహాన్ని Transactional friendship అంటారు.
కానీ సుగ్రీవుడిది రాముడితో ఏర్పడ్డటువంటి మిత్రత్వము ఆజన్మాంతము నిత్యము నిలబడ్డటువంటిది, సత్యమై నిలిచినటువంటి మిత్రత్వం.
శ్రీరాముడు – సుగ్రీవుడు
సన్మార్గంలో ఉండేటువంటి వారికి సన్మార్గంలో ఉన్నటువంటి మిత్రుడు సన్మార్గంలో తోడైతే, ఎప్పుడైనా పొరపాటున ఒకవేళ మనిషి ఆ సన్మార్గం నుండి మరలితే అతనిని తిరిగి సన్మార్గములో మరల్చగలుగుతాడు.
ఇందుకు ఉదాహరణ ఒకటి మనకి రామాయణంలో కనబడుతుంది. సుగ్రీవుడికి రాజ్య పట్టాభిషేకం అయింది. “సరే ఇప్పుడు వర్షాకాలము, ఈ రెండు నెలలు గడిచిన తర్వాత సీతాన్వేషణ ప్రారంభించండి”, అని రాముడు చెప్తాడు. రాజైన సుగ్రీవుడు అప్పటిదాకా లేనటువంటి భోగాలను అనుభవించడంలో నిమగ్నమై ఉంటాడు. వర్షాకాలం పూర్తవుతుంది కానీ సుగ్రీవుడికి తన కర్తవ్యము గుర్తుకు రాలేదు. (భోగలాలసలో ఉన్న వాడికి కర్తవ్యం గుర్తుకు రాదు) స్నేహంలో మనిషిని అర్థం చేసుకొని సరైనటువంటి మార్గంలో ఎలా పెట్టాలో ఈ ఘట్టం చెప్తుంది మనకి.
రాముడు లక్ష్మణుడితో కబురు పంపిస్తాడు. ‘ఓ సుగ్రీవా వాలి వెళ్ళినటు వంటి మార్గము ఇంకా మూసుకుపోలేదని గుర్తుంచుకో’, అని చెప్పు లక్ష్మణా అని ఒక రకమైనటువంటి warning లాంటిది ఇచ్చి పంపిస్తాడు. మన భాషలో చెప్పాలి అంటే ‘తప్పు పని చేసావు అంటే చంపేస్తాను జాగ్రత్త’, అది ఆ మాట అర్థం.
ఏమిటి సుగ్రీవుడు చేసిన తప్పు అంటే ‘ఆడిన మాట తప్పడం’. సత్యవాక్ పరిపాలకుడైనటువంటి రామచంద్రమూర్తి ఏమాత్రం సహించలేనటువంటి పని అది.
అందువల్ల సుగ్రీవుడికి ఒక రకమైనటువంటి warning లక్ష్మణుడితో ఇచ్చి పంపిస్తాడు. చెడుద్రోవలో పడుతున్నటువంటి మిత్రుని సరిదిద్దుకోవలసినటువంటి బాధ్యత కూడా సన్మార్గంలో ఉన్నటువంటి మిత్రులకు ఉంటుంది.
సుగ్రీవుడు వానరుడు, పైగా భోగాలకు అప్పటిదాకా దూరంగా ఉన్నాడు. కిష్కింధలో అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి సుగ్రీవుడిది. ఋష్యమూక పర్వతం దిగి వస్తే వాలి చంపేస్తాడు. అటువంటి భయంతో నిత్యము బ్రతికినటువంటి వాడు. భోగం మాట దూరం. అసలు భయం లేకుండా ఉండే పరిస్థితి లేదు. వాలి ఎప్పుడు ఎటు నుంచి వచ్చి చంపేస్తాడో అని భయంతో ఉన్నవాడికి ఒక్కసారి భోగాలు లభించేటప్పటికి (సహజమైన వానరం యొక్క లక్షణం గనుక) చేసినటువంటి మాట మరచి భోగలాలసందు మునిగిపోయాడు సుగ్రీవుడు.
రాముడు మిత్రుడి యొక్క శ్రేయస్సు కోరినటువంటి వాడు గనుక ‘అగ్నిసాక్షిగా ప్రమాణం చేసావు సహాయం చేస్తానని కానీ ఇవాళ భోగాలు లభించగానే వాటిని మర్చిపోతున్నావు’ అనేటువంటి విషయాన్ని లక్ష్మణుని ద్వారా గుర్తు చేసి సుగ్రీవుని మళ్ళీ కార్యోన్ముఖుడిని చేస్తాడు. కర్తవ్య దీక్షలో మునిగిఉన్నటువంటి వారికి, తన కర్తవ్యాన్ని తాను నిర్వహించాలి అనుకునేటువంటి వారికి కొన్ని కొన్ని సందర్భాలలో ఆ కర్తవ్యం నుంచి పక్కకు జరిగేటువంటి పరిస్థితులు ఎదురవ్వడం సహజం.
ఆ సందర్భంలో నిజమైనటువంటి మిత్రుడు ‘నాకెందుకులే వాడి దారిన వాడు పోతాడు, వాడే పాపం చేస్తున్నాడు, వాడే తప్పు చేస్తున్నాడు, వాడే అనుభవిస్తాడు’, అనేటువంటి వేదాంతపు మాటలు మాట్లాడకుండా మిత్రుడిగా తన కర్తవ్యం ఎలా నిర్వర్తించాలి అనేటువంటిది ఇక్కడ మనకి వాల్మీకి మహర్షి ఈ సుగ్రీవుడి ఘటనలో రాముడి ద్వారా లోకానికి తెలియజెప్పాడు.
మనం నేర్చుకోవలసినటువంటి అంశం ‘మిత్రుడి బాగు కోరవలసినటువంటి వారు గనుక ఎప్పుడూ కూడా మిత్రుడు సరైనటువంటి మార్గంలో సన్మార్గం నుండి పక్కకు జరుగుతున్నాడా అని గమనించుకుంటూ తమ మిత్రత్వాన్ని ముందుకు తీసుకెళ్లగలగాలి. అది నిజమైనటువంటి మిత్రత్వం, అది శాశ్వతమైనటువంటి మిత్రత్వం.
“సుఖములో నీతోటి ఉంటాను కానీ దుఃఖములో నీతోటి రాను”, అనేటువంటిది Fair Weather Freindship. అలాంటి స్నేహం శాశ్వతంగా నిలిచేది కాదు. శాశ్వతంగా నిలబడాలి అంటే సత్య మిత్రత్వము, నిత్య మిత్రత్వము ఉండాలి. సుఖ దుఃఖములలో సమంగా ఆ మిత్రత్వాన్ని ఆనందించాలి, ఆస్వాదించాలి అని మనకి రామాయణంలోని ఈ యొక్క పాత్ర ద్వారా మహర్షి వాల్మీకి ఆ సందేశాన్ని అందిస్తారు. నిజమైనటువంటి మిత్రత్వము, “a friend in need is a friend indeed” అంటారు.
అలాగే “It is better to walk in darkess with a friend rather than walking alone in light”, అంటారు.
మనిషి జీవితంలో ఒడిదుడుకులు కష్ట సుఖాలు సహజంగానే వస్తూనే ఉంటాయి. సుఖం వచ్చినప్పుడు ఎవరు లేకపోయినా ఇబ్బంది లేదు గానీ కష్టం వచ్చినప్పుడు మనిషి తట్టుకోలేని పరిస్థితిలో ఉంటాడు. మనసు విప్పి చెప్పుకోవాలి అంటే ఆ బాధ స్నేహితుడికే చక్కగా చెప్పుకోగలుగుతాడు. అటువంటి స్నేహితుడు, నిత్యం ఉండేటువంటి స్నేహితుడు సుగ్రీవుడు గనుక రాముడు సుగ్రీవుడితో మైత్రి చేశాడు.
కాబట్టి మిత్రత్వానికి జాతిభేదము కూడా లేదు అని చెప్తుంది రామాయణం మనకి. సుగ్రీవుడు వానర జాతి, రాముడు నరజాతి కాబట్టి జాతి భేదం కూడా ఉండదు. అలాగే విభీషణుడు రాక్షస జాతి, రాముడు నరజాతి. నరుడికి రాక్షసుడికి కూడా మిత్రత్వం సాధ్యం, నరుడికి వానరుడికి కూడా మిత్రత్వం సాధ్యం. అలాగే రాముడు అయోధ్యాపుర చక్రవర్తి కానీ గుహుడు అడవి జాతిలో ఉండేటువంటి తెగకు చెందినటువంటి నాయకుడు.
కాబట్టి “నువ్వు ఎక్కడున్నావ్, నీ స్థాయి ఏమిటి, నీ స్థితి ఏమిటి, నీ జాతి ఏమిటి అనే దానితో సంబంధం లేదయ్యా!”
“నిజమైనటువంటి స్నేహత్వము నీ యొక్క దృష్టిలో ఉంటుంది, నీ ప్రవర్తనలో ఉంటుంది, నీ ఆలోచనా విధానంలో ఉంటుంది, నీ నడవడికలో ఉంటుంది”, అని మనకి సుగ్రీవుడి ఘట్టం నుంచి తెలుస్తుంది.
సుగ్రీవాజ్ఞ
సుగ్రీవుడి నుంచి నేర్చుకోవలసినటువంటి రెండవ అంశం ‘సుగ్రీవాజ్ఞ’. Administrators అందరూ సుగ్రీవుడి యొక్క చరిత్రను చదివి, అర్థం చేసుకొని, విశ్లేషణ చేసి ‘సుగ్రీవుడి ఆజ్ఞ’ గురించి తెలుసుకోవాలి.
సుగ్రీవుడు సీతాన్వేషణ నిమిత్తమై ఒక ఆజ్ఞ వేశాడు. దక్షిణ దిశగా వెళ్ళిన వానరులందరూ వృక్షబిలంలోకి వెళ్లి అక్కడ దారి తప్పుతారు. వారు బయటికి వచ్చేటప్పటికి తమకి సుగ్రీవుడు పెట్టినటువంటి గడువు ముగిసింది అని గ్రహిస్తారు. Tough Administrator సుగ్రీవుడు. Administration ఎలా చేయాలి? Tough గా ఎందుకు ఉండాలి? అక్కడ మానవత్వం ఉండకూడదా? అంటే సుగ్రీవుడి చరిత్ర చదివితే మనకు అర్థమౌతుంది.
ఏదన్నా ఒక విషయాన్ని మనం సాధించాలి అనుకున్నప్పుడు ఆ లక్ష్యము పట్ల ‘లక్ష్యశుద్ధి, లక్ష్యసిద్ధి’, రెండు ఉండాలి.
ఆ లక్ష్యము పట్ల తదేక దృష్టితో ఉంటే తప్ప అది సాధ్యం కాదు కనుక సీతను వెతకడం అనేటువంటి ఒక లక్ష్యం వానరులందరికి అప్పచెప్పినటువంటి సుగ్రీవుడు ఒక Task తో పాటు ఒక Time Line కూడా ఇస్తాడు. మామూలుగా మనం Projects చేస్తూ ఉంటాం, ఈ Projects Time Lines లో లేకపోతే Efficiency వెనక్కి పడిపోతుంది, కాబట్టి Administrator చూసుకోవాల్సింది.
సుగ్రీవుడికి సీత ఎక్కడుందో, సీతాన్వేషణ ఎంత కాలం పడుతుందో తెలీదు, కానీ రెండు నెలల సమయాన్ని సుగ్రీవుడు నిర్ణయిస్తాడు. “ఈ లోపల మీరు సీతను కనిపెట్టి రావలసిందే”, అని ఆజ్ఞ వేస్తాడు. “దొరికితే చూడండి. వెతకండి, కనబడితే తీసుకురండి, లేకపోతే అలా వచ్చేయండి”, అని చెప్పలేదు సుగ్రీవుడు.
Task Assign చేసేటప్పుడు Administrators నేర్చుకోవాల్సిన అంశం Positive MInd తో ఉండగలగటం. మనకి అప్పచెప్పిన పని Complete అవ్వాలి అనేటువంటి ఆలోచనతోటే, అది సాధించుకు రావాలి అనేటువంటి దృష్టితోనే, మీరు సాధించగలరు అనేటువంటి నమ్మకంతో ఉండగలగాలి.
సీతాన్వేషణ కోసం బయలుజేరిన Team అంతా కూడా వానర మూక. వాళ్ళ మీద సుగ్రీవుడికి ఎంతో నమ్మకం. అటువంటిది ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో సుగ్రీవుడు వాళ్ళకి TimeLine ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చి ఈ TimeLine లోపల తిరిగి రండి అంటారు. ఈ కదంతా మనకి సుందరకాండలో వస్తుంది. ఉత్తర దిక్కుకు, పశ్చిమ దిక్కుకు, తూర్పు దిక్కు కు వెళ్ళినటువంటి వాళ్ళు వచ్చేస్తారు, కానీ దక్షిణ దిక్కు వెళ్ళినటువంటి వాళ్ళు మాత్రం రాలేదు, ఆలస్యంగా వస్తారు.
సీతాన్వేషణ తరువాత దక్షిణ దిక్కులో ఉన్నటువంటి సైన్యం వెనక్కి తిరిగి వస్తున్నది. హనుమ, జాంబవంతుడు, అంగదుడు అందులో ఉన్నారు. వాళ్ళు వస్తున్నారు అని చూడగానే సుగ్రీవుడు వెంటనే గమనించి లక్ష్మణుడితో చెప్తాడు, “సీత జాడ తెలిసింది, అందుకే వాళ్ళు ఆలస్యమైనా సరే వస్తున్నారు, లేకపోతే నా దగ్గరికి రారు”. సుగ్రీవుడు లక్ష్మణుడితో చెప్పిన ఆ మాటలు అక్షర సత్యం.
రామాయణం చదివితే మనం వృక్షబిలంలో ఆలస్యం అయిన తర్వాత వానర సైన్యం అంతా కూడా నిరాశకు నిస్పృహకు లోనై, “ఆలస్యం అయిపోయింది, మనకి సుగ్రీవుడు పెట్టిన గడువు తీరిపోయింది. ఇప్పుడు మనం వెనక్కి వెళితే ఆయన ఎలాగూ మరణశిక్ష విధిస్తాడు. ఆ మరణశిక్ష ఏదో అక్కడికి వెళ్లి ఆయన చేతుల్లో అనుభవించే బదులు ఇక్కడే మనం ప్రాణత్యాగం చేద్దాం, నిరాహార దీక్షగా ఉందాం”, అనేటువంటి స్థితికి చేరుతారు.
ఆ స్థితిలో వాళ్ళకి సంపాతి కనబడడం, సీతమ్మవారు లంకలో ఉన్నదని చెప్పడం, హనుమ వెళ్ళడం ఇవన్నీ తర్వాత జరిగేటువంటి ఘటనలు. సుగ్రీవుడి యొక్క ఆజ్ఞకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో మనకి ఘట్టాలు చెప్తాయి.
అలాగే సుగ్రీవుడి యొక్క ఆజ్ఞను అమలుపరచగలిగినటువంటి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో కూడా ఆయనకు తెలుసు. అందుకే ఎప్పుడైతే వీళ్ళు వెనక్కి కిష్కింధకి వస్తూ ఉంటారో ఆ వస్తూ వస్తూ కోలాహలంగా వస్తుంటారు. అప్పుడు లక్ష్మణుడితో అంటారు, “లక్ష్మణా ఆలస్యమైనప్పటికీ కూడా ఈ సైన్యం అంతా కోలాహలంగా వస్తున్నది. అంటే ఆనందంగా ఉన్నారు. కాబట్టి తప్పకుండా సీతమ్మవారి జాడ కనిపెట్టారు”, అని చెప్తాడు సుగ్రీవుడు.
అంటే తన బృందం యొక్క కదలికలను బట్టి కూడా కార్యదీక్షా దక్షత కలిగినటువంటి వాడు, కార్యాన్ని ఆలోచనతో నియంత్రించి నడిపించగల సమర్ధుడు సుగ్రీవుడు.
నిజమైన స్నేహితుడు
సుగ్రీవుడి యొక్క వ్యవహార శైలిలో మనం నేర్చుకోవలసింది ముఖ్యంగా రెండు అంశాలు. మొదటిది స్నేహధర్మం. అగ్నిసాక్షిగా చేసినటువంటి స్నేహాన్ని ఎట్టి పరిస్థితుల్లో అయినా నిలబెట్టుకోవాలి. రావణుడి మీద యుద్ధానికి సుగ్రీవుడు తన సైన్యముతో లంకలో చేరగానే దూరం నుంచి రావణ మందిరాన్ని చూస్తాడు. రావణుడు అక్కడ కూర్చొని ఉంటాడు.
తన యొక్క మిత్రుడికి చేసినటువంటి ద్రోహాన్ని తట్టుకోలేక సుగ్రీవుడు ఒక్క ఉదుటున ఎగిరి రావణుడి దగ్గరికి చేరుతాడు, చేరి రావణుడితో కలబడతాడు, యుద్ధానికి సంసిద్ధం అవుతాడు.
“నా పేరు సుగ్రీవుడు, రాముడి స్నేహితుడిని. నువ్వు చేసిన అధర్మానికి నీకు శిక్ష విధించడానికి వచ్చాను”, అంటాడు. అప్పుడు రావణుడు “సుగ్రీవా! గ్రీవము అంటే ‘కంఠము’. సు అంటే ‘మంచి’. సుగ్రీవ అంటే ‘మంచి కంఠము కలిగినటువంటి వాడు’ అని అర్థం. ఇప్పుడు ఆ గ్రీవము లేకుండా నిన్ను చేస్తాను”, అని రావణుడు యుద్ధం ప్రారంభం చేస్తాడు. సుగ్రీవుడికి రావణుడికి యుద్ధం జరుగుతుంది.
కానీ ఓడిపోతున్న స్థితిలో రావణుడు మాయా యుద్ధం వైపు వెళ్ళిపోతాడు. ఇక మాయా యుద్ధం తట్టుకోలేమని సుగ్రీవుడు వెనక్కి రాముల వారి దగ్గరికి వచ్చేస్తాడు. రాముడు సుగ్రీవుడిని ఆప్యాయంగా కౌగలించుకొని ఒక మాట అంటాడు, “సుగ్రీవా! కాస్త ఆవేశపడి వెళ్ళిపోయావు. నాకు ఒక మాట ఇవ్వు.”
“ఇక నుంచి ఎట్టి పరిస్థితిలోనూ ఇటువంటి ఆవేశపూరిత చర్యలకు పూనుకోను అని మాట ఇవ్వు. ఎందుకంటే యుద్ధంలో జయాపజయాలు మన చేతుల్లో ఉండవు. జరగరానిది ఏదైనా నీకు గనుక జరిగి ఉంటే అప్పుడు సీత, లక్ష్మణుడు, ఈ వానర సైన్యం వీరెవ్వరూ నాకు ఎక్కువ కాదు. నువ్వు లేకపోతే నేను కూడా ప్రాణత్యాగానికి సిద్దపడతాను”, అంటాడు రాముడు సుగ్రీవుడితో. అంటే స్నేహానికి రాముడు ఇచ్చే విలువ ఎటువంటిదో, సుగ్రీవుడి పట్ల రాముడికి ఉన్నటువంటి ప్రేమ ఎటువంటిదో, సుగ్రీవుడికి రాముడి పట్ల ఉన్నటువంటి నిబద్ధత ఎటువంటిదో మనము గ్రహించవచ్చు.
అన్ని రోజులుగా రాముడు పడుతున్నటువంటి బాధ ప్రత్యక్షంగా చూసినటువంటి సుగ్రీవుడికి ఒకసారి రావణుని చూడగానే ఆవేశం కట్టలు తెంచుకొని వచ్చేసింది. తన స్నేహితుడికి ద్రోహం చేసినటువంటి వాడిని వెంటనే శిక్షిద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఎగిరి వెళ్ళిపోతాడు.
మళ్ళీ వచ్చిన తర్వాత రాముడు ఇవన్నీ చెప్పగానే అప్పుడు రాముడికి చెప్తాడు, “రామా నీ బాధ చూసి నిన్ను బాధ పెట్టినటువంటి దుర్మార్గుడు కంటపడితే చూస్తూ ఎలా ఊరుకోమంటావు? అలా ఉండలేక నేను ఈ సాహసానికి వడిగట్టాను. కానీ మాయా యుద్ధానికి దిగాడు. అందువల్ల ఈ రావణ సంహారం నీ చేతుల్లోనే జరగాలి రామ”, అంటాడు సుగ్రీవుడు.
సుగ్రీవ మైత్రి
స్నేహంలో సుఖ దుఃఖం యందు సమంగా ఉండేటువంటి వాడు, సా అంటే ‘సమంగా ఉండడం’, ఖ అంటే ‘సుఖము-దుఃఖము’. ఈ రెండిటిలో సమంగా తనతో పాటు ఉండేటువంటి వాడే నిజమైనటువంటి స్నేహితుడు.
అటువంటి స్నేహం రామాయణంలో మనకి రాముడికి సుగ్రీవుడికి మధ్య కనబడుతుంది. సన్మార్గంలో ఉండాలనుకునేటువంటి వారు అటువంటి స్నేహధర్మాన్ని తాను పాటిస్తూ, ఆ స్నేహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకుండా, స్నేహాన్ని నిలబెట్టుకోవాలి. అది సన్మార్గం యొక్క వైశిష్ట్యము, సన్మార్గం యొక్క ప్రయోజనము. సన్మార్గంలో రామ సుగ్రీవ మైత్రి ఒక మణిపూసగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే మిత్రత్వములు రకరకాలుగా ఉండవచ్చు కానీ నిత్యమై నిలిచేటువంటిది అసలైన మిత్రత్వము గనుక, అటువంటి మిత్రత్వానికి ప్రతీక ఈ రామ సుగ్రీవ మైత్రి.
అందుకనే ‘సుగ్రీవ మైత్రి’ అంటూ ఉంటారు.
సుగ్రీవ మైత్రి ఒక విశేషమైనటువంటి అంశం. రాముడికి సుగ్రీవుడికి మైత్రి ఏర్పడింది ఒకే ఒక అంశం మీద. ఇద్దరూ ఒకే కష్టంలో ఉన్నారు, ఇద్దరికి కావలసింది ఒకటే. సుగ్రీవుడి భార్యని వాలి తీసుకెళ్ళిపోతే రాముడి భార్య ఎక్కడుందో తెలియలేదు. అది ఒక్కటే అంశం. అంతే తప్ప ఎంతకాలంగానో ఇద్దరికి పరిచయం, ఇద్దరు ఒకరికొకరు తెలిసిన వాళ్ళు అనేటువంటి విషయం కాదు. స్నేహానికి పరిచయం కూడా అవసరం లేదు.
మనస్సు నిష్కల్మషముగా ఉంచుకొని, అవతల వ్యక్తి యొక్క కష్టాలను, సుఖాలను అర్థం చేసుకోగలిగినటువంటి మనస్తత్వం ఉంటే సన్మార్గంలో మనం ప్రయణిస్తూ, సన్మార్గంలో ఉన్నటువంటి మిత్రులను మనం సంపాదించుకోవచ్చు. ఆ మిత్రత్వమే మనకు శ్రీరామ రక్ష. సుగ్రీవుడికి రాముడి రక్ష అంటే ఆ మిత్ర ధర్మాన్ని పాటించాడు గనుక సుగ్రీవుడికి రాముడి రక్ష. అలాగే మనకు కూడా అదే శ్రీరామ రక్ష లభిస్తుంది మిత్రుడి ద్వారా. ధర్మస్య విజయోస్తు