శ్రీమద్రామాయణం – తార
సన్మార్గంలో మానవులందరూ నడుచుకోవాలి అంటే ప్రతి క్షణము, ప్రతి అడుగు, ప్రతి నడక, ప్రతి ఆలోచన సన్మార్గం వైపు నడవాలి అంటే బుద్ధిని ప్రచోదన చేసేటువంటి ఆలోచనను సన్మార్గం వైపు పెడితే తప్ప మనిషి సన్మార్గంలో నడవలేడు. సన్మార్గం అనేటువంటిది ఒక గతుకుల రోడ్డు లాగా, దుర్మార్గము ఒక Highway (చాలా తేలిగ్గా వెళ్ళిపోవచ్చు) లాగా కనబడుతూ ఉంటుంది. కానీ సన్మార్గంలో నడిస్తేనే తనకు ప్రయోజనం, సమాజానికి ప్రయోజనం అని మనకి శాస్త్రాలు, పురాణ ఇతిహాసాలన్నీ కూడా ఘోషిస్తూ ఉన్నాయి.
రామాయణంలో ప్రతి పాత్ర కూడా సన్మార్గంలో ఎలా ఉండాలి అనేటువంటి సందేశాన్ని అందిస్తుంది. రామాయణంలో తార అనేటువంటి ఒక మహిళ పాత్ర గురించి, అందులో సన్మార్గంలో నడవవలసినటువంటి అంశాలను మహర్షి వాల్మీకి మనకి ఏ విధంగా అందించారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తార వాలి యొక్క భార్య. వాలి కిష్కింధాపురానికి రాజు.
తార వాలి సంవాదం
తార అంటే మామూలుగా మనం Star అంటుంటాం (నక్షత్రం). తార పేరుకు తగ్గట్టుగా అందగత్తే కాకుండా ఆవిడ ధర్మమునందు అనురక్తి కలిగి నిలబడ్డటువంటి పతివ్రత. ఆవిడని వాలి కొన్ని కొన్ని సందర్భాల్లో సంప్రదించేవాడు, కొన్ని కొన్ని సందర్భాల్లో ఆవిడ చెప్పిన మాట కాదని ప్రవర్తించేవాడు.
రాముడి అండ చూసుకొని సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలుస్తాడు. వాలి సుగ్రీవుల మధ్య భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. వాలికి ఇంద్రుడు ఇచ్చినటువంటి వరం ‘ఎదుటి వ్యక్తి బలంలో సగం బలం ఇతనికి వచ్చేస్తుంది’. కాబట్టి అతన్ని ఎవరూ కూడా ఎదురుగా ఉండి జయించలేరు. కాబట్టి సుగ్రీవుడు చిత్తుగా దెబ్బలు తిని అక్కడి నుంచి పారిపోతాడు. వాలి అంతఃపురానికి వచ్చి సేద తీరుతున్న సమయంలో మళ్ళీ సుగ్రీవుడు పిలుస్తాడు యుద్ధానికి రమ్మని.
కోపంతో ఊగిపోతున్నటువంటి వాలి గబగబ వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు తార వాలిని ఆపుతుంది.
ఇక్కడ మనం గమనించవలసిన విషయం ‘సన్మార్గంలో ఉండాలి అంటే భార్య మాట వినాలి’. భార్యలు భర్తల క్షేమాన్ని కోరి చెప్తారు. ‘ఆవేశంలో ఉండేటువంటి పురుషుడు ఆలోచనారాహిత్యమైనటువంటి చర్యలకు ఉపక్రమించేటువంటి అవకాశం ఉంటుంది’, అని మహర్షి వాల్మీకి ఈ ఘట్టం ద్వారా మనకు సందేశం ఇస్తారు.
తార ఆపుతుంది వాలిని, ఆపి “నువ్వు మహావీరుడివే అందులో సందేహం లేదు. సుగ్రీవుడు నీ చేతుల్లో ఇప్పుడే చావు దెబ్బలు తిని వెనక్కి వెళ్ళాడు. మళ్ళీ వచ్చి పిలుస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించు. ఏ ధైర్యం ఉంటే చావు దెబ్బలు తిన్న మనిషి మళ్ళీ వచ్చి యుద్ధానికి రమ్మని పిలుస్తాడు? అతని వెనక ఏదో ఒక బలమైనటువంటి శక్తి ఉండాలి కదా? ఆలోచించావా”, అని అడుగుతుంది తార. వాలి తార చెప్పిన మాట వినడు. “నన్ను ఏం చేస్తారులే”, అనుకుంటాడు.
అహంకారం ఎక్కువైపోతే ఎవరి మాట వినరు. అందుకనే Listening is important.
సన్మార్గం – వినటం:
సన్మార్గంలో మనం ఉండాలి అంటే వినడం నేర్చుకోవాలి. శ్రవణం అంటారు దీన్ని. ‘వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనె వేగపడక వివరింపదగున్ గని కల్ల నిజము దెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ’, అని ఒక శతకకారుడు ‘ఎవ్వరు చెప్పినా వినడం అలవాటు చేసుకోండి’ అంటాడు.
వాలి వినకపోతే ఏం జరిగిందో మనందరికి తెలుసు. ఆవిడ చెప్పిన మాట గనుక వాలి విని ఉంటే, ఒకసారి ఆలోచన చేసి ఉంటే, ‘నిజమే కదా! ఇప్పుడే కదా చావు దెబ్బలు తిని వెళ్ళాడు. మళ్ళీ వెనక్కి వచ్చి పిలుస్తున్నాడు. ఎవరి అండ చూసుకొని ఇంత ధైర్యం వచ్చింది?’, అని ఒక్క నిమిషం ఆలోచించి ఉండేవాడు బహుశ.
తార చెప్తుంది అప్పుడు కూడా, “ఇవాళ ఒక్కరోజు ఆగు. రేపు మళ్ళీ కావాలంటే చేద్దువు గాని యుద్ధం”, అని, అక్కడ హితవనాలు కూడా చెప్తుంది. ఆవిడ ధర్మమును వాలికి బోధ చేస్తుంది. “సుగ్రీవుడు ఎవరయ్యా? నీ తమ్ముడు, నీతో పుట్టినటువంటి వాడు. అతనికి యువరాజ్య పట్టాభిషేకం చేసి యువరాజుగా ఈ సామ్రాజ్యంలో ఉంచితే మనతో పాటు అతను, అతనితో పాటు మనము ఆనందంగా ఉంటాం. అనవసరమైనటువంటి ఈ యుద్ధాల జోలికి వెళ్ళకు”, అని కూడా చెప్తుంది.
ఇవాళ సమాజంలో మనం చూస్తున్నాం భార్యలు చెప్పినా భర్తలు వినకుండా దాన్ని పెద్దది చేసుకోవడం, దాని ద్వారా ఫలితాలు అనుభవించడం. అదే జరుగుతుంది.
తార మరొక మాట కూడా చెప్తుంది. ఆవిడ ఊరికే మాట్లాడదు. తార మాట్లాడింది అంటే చాలా విశ్లేషణ చేసి, సమాచారాన్ని సేకరించి, దానికి తగ్గ ఆధారాలను కూర్చి అప్పుడు మాత్రమే మాట్లాడింది. వాలితో చెప్తుంది తార, “నిన్న మన కుమారుడు అంగదుడు విహారం చేస్తున్నటువంటి సమయంలో వేగుల ద్వారా సమాచారం వచ్చింది. రామలక్ష్మణులట, అయోధ్యపురం నుండి వచ్చారట. వారికి సమమైనటువంటి వీరులు లేరట. అటువంటి వారితో సుగ్రీవుడు మైత్రి చేశాడట. ఆ ధైర్యంతో సుగ్రీవుడు నిన్ను పిలుస్తున్నాడు.”
వాలి ఆవేశంలో ఉన్నాడు, ఆలోచనా రాహిత్యంలో ఉన్నాడు. అందుకనే ‘వినడానికి సమమైనటువంటి కళ వేరే లేదు’, అంటారు. మామూలుగా మనం చేసేది చాలా సందర్భాల్లో Hearing. Hearing వేరు, Listening వేరు. ఈ చెవులతో విని ఆ చెవులతో వదిలేస్తే అది Hearing అవుతుంది. విన్నదాన్ని గురించి ఆలోచిస్తే అది Listening.
వినడం అలవాటు లేకపోతే జీవితంలో పైకి రావడం కష్టం, అభ్యున్నతిని సాధించడం కష్టం. వినే ఓపిక ఉండాలి, సమయం ఇవ్వాలి, అలవాటు ఉండాలి, ఆలోచన ఉండాలి, లక్షణము కూడా ఉండాలి. ఇవన్నీ లేక వాలి రాముడి చేతిలో హతమయ్యాడు.
తార చెప్పినటువంటి మాట గనుక విని ఉంటే ఈయన కూడా ‘ఏది ధర్మము ఏది అధర్మము’ అని ఆలోచన చేసి ఉండేవాడు. “నీ తమ్ముడితో నువ్వు ఆనందంగా ఉండవచ్చు, మనందరం ఆనందంగా ఉండవచ్చు”, అని తార వాలికి చెప్పినా కూడా వాలి వినిపించుకోకుండా తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ‘100 సంవత్సరాలు జీవించి 100 సంవత్సరాలు వినికిడి శక్తితో జీవించాలి’, అంటుంది వేదం.
మనం వినగలిగితేనే అవతల వ్యక్తి యొక్క కష్టం ఏమిటో, ఆలోచన ఏమిటో, ఉద్దేశం ఏమిటో, లక్ష్యం ఏమిటో, విధానం ఏమిటో, ఇవన్నీ కూడా గ్రహించగలుగుతాము. చాలా సందర్భాల్లో జరిగేది ఏమిటంటే ఎదుటి వ్యక్తి చెప్పడం మొదలుపెట్టగానే ఇతనికి మనం ఏం సమాధానం చెబుదామా అని ఆలోచిస్తూ ఉంటాము. ఎలా ఇతన్ని కాదని చెబుదామా, ఎలా రిజెక్ట్ చేద్దామా అనే ఆలోచన మొదలైపోతుంది. Listening లో అది కూడదు అంటుంది శాస్త్రం. మనస్సును అన్యాపదేశంగా ఉంచకుండా, శ్రద్ధగా గనుక విని ఉంటే వాలి హతుడయ్యేవాడు కాదు. కథ ఎలా ఉండేదో అప్పుడు. రాముడితో మైత్రి చేసుకునేవాడు, వాలి సుగ్రీవుల కథ కూడా సంతోషంగా నడిచి ఉండేది.
సుగ్రీవుడు, విభీషణుడు వీళ్ళద్దరు కూడా రామ పట్టాభిషేక ఘట్టంలో రామలక్ష్మణ భరతశత్రుజ్ఞులని చూసి ముచ్చటపడి ఎంతగానో బాధపడతారు. “మా అన్న లేరే. అన్నదమ్ములు వీళ్ళు చక్కగా ఉన్నారు. మేము కూడా ఇలాగే ఉండి ఉంటే బాగుండేది”, అని. అటువంటి బాధకు అవకాశం లేకుండా ఉండుండేది తార చెప్పినటువంటి మాట విని ఉంటే. ‘భార్యలు పరిపరి విధాలుగా ఆలోచించి చెప్పగలరు’, అని కూడా మహర్షి వాల్మీకి మనకి ఈ సంఘటన ద్వారా సందేశాన్ని ఇస్తారు.
పురుషుడి ఆలోచన ఎంతసేపటికి ‘నాకన్నా బలహీనుడు, ఇప్పుడే నా చేతుల్లో దెబ్బ తిన్నటువంటి వాడు, మళ్ళీ వచ్చి పిలుస్తున్నాడు. నేను వీరుడిని, పిలిస్తే వెనక్కి వెళ్ళకూడదు’, అనే ఆలోచనే తప్ప ఇటువంటి విధముగా వేరు వేరు విధాలుగా ఆలోచన చేయగల సమర్థత వాలిలో లోపించింది.
కానీ తారలో ఉన్నది ఆ ఆలోచనా శక్తి. కాబట్టి ఆలోచనా విధానము ‘ఎలా ఆలోచించాలి, ఎప్పుడు ఆలోచించాలి, ఏ సందర్భానికి ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి’, అని కూడా తార యొక్క చరిత్ర మనం చదివితే మనకు అర్థమౌతుంది.
నిజానికి రామాయణంలో తార యొక్క ప్రసక్తి ఒక ఐదారు సర్గలలో మాత్రమే ఉంటుంది. ఈ యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక సర్గలో, ఆ తర్వాత వాలి పడిపోయినప్పుడు రెండు మూడు సర్గలల్లో హనుమత్ ఉపదేశం జరుగుతుంది. వాలి మరణం తరువాత హనుమంతుల వారు తారకు ఊరడిస్తారు, ఓదార్పు చెప్తారు.
తార – ధర్మం:
వాలి మరణం తరువాత రాముడు కూడా ఆవిడకి ఉపదేశం చేస్తారు. అక్కడ కూడా ధర్మబద్ధంగానే రాముడితో మాట్లాడుతుంది. ధర్మం తెలిసినటువంటి స్త్రీ గనుక ‘ఇప్పుడు నా భర్త లేడు, నేను ఎందుకు బ్రతకాలి? నన్ను కూడా చంపేసెయ్యి’, అంటుంది రాముడితోటి. అప్పుడు రాముడు, “అమ్మా నీకు నీ కుమారుడు అంగదుడు ఉన్నాడు, సామ్రాజ్యం ఉన్నది, నీ ధర్మం ఉన్నది, నీ బాధ్యత ఉన్నది”, అని గుర్తు చేస్తాడు. భర్తపోయినటువంటి ఆవేశంలో ఆలోచనరాహిత్యంగా ఉన్నది. కానీ ఎప్పుడైతే రాముడు చెప్తాడో అప్పుడు ధర్మాన్ని గ్రహించినటువంటి తార.
వానర జాతి యొక్క లక్షణం గనుక, ఆ జాతిలో ఆ సాంప్రదాయం ఉన్నది గనుక తర్వాత సుగ్రీవుడితో రాజ్యంలో ఉంటుంది.
తార – సుగ్రీవుడు:
మరొక సందర్భంలో తార యొక్క వైశిష్యము అంటే ‘కార్య నిర్వహణ దక్షత’ (Crisis Management), ఆ Capabilities ఎలా ఉన్నాయి అనేటువంటిది మహర్షి వాల్మీకి ఒక example చెప్తారు.
సుగ్రీవుడికి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత “ఇప్పుడు వర్షాకాలము, రెండు నెలలు విశ్రాంతి తీసుకోండి. తర్వాత సీతాన్వేషణ ప్రారంభిద్దామని”, రాములవారు సుగ్రీవుడికి చెప్తారు. సుగ్రీవుడు రాజ్యభోగాలలో మునిగిపోతాడు. రెండు నెలలు పూర్తయపోతుంది, కానీ సుగ్రీవుడు రాడు. “లక్ష్మణా! గడువు ముగిసింది, కానీ సుగ్రీవుడు రాలేదు. నువ్వు వెళ్లి గుర్తు చెయ్యి”, అంటాడు. లక్ష్మణ స్వామి కిష్కిందాపురానికి వెళ్తాడు. అక్కడ అంతఃపురంలో ప్రవేశిస్తాడు. లక్ష్మణుడు వచ్చాడని తెలియగానే సుగ్రీవుడు భయంతో వణకిపోతాడు.
సుగ్రీవుడికి అప్పుడు గుర్తొస్తుంది తాను చేసిన ప్రమాణం. ‘రాముడు ఇచ్చిన సమయం అయిపోయింది, అందువల్ల లక్ష్మణుడు వచ్చాడు. ఇప్పుడు నా వల్ల తప్పు జరిగింది’, అని భయపడతాడు, వణకిపోతూ ఉంటాడు. అప్పుడు తార, “ఎందుకయ్యా అంత వణకిపోతావు? నేను లక్ష్మణుడిని సముదాయిస్తాను”, అంటుంది.
లక్ష్మణమూర్తి అంటే కోపానికి ప్రతీక. ఆ కోపంలో ఉన్నవాడిని సముదాయించాలి అంటే మాటలు సరిగ్గా రావాలి. సరైనటువంటి మాట సరైనటువంటి సందర్భంలో, సరైనటువంటి మోతాదులో, సరైనటువంటి విధంగా ఉండాలి. (Body Language, Tone Communication)
ఆవిడ ధైర్యంగా లక్ష్మణస్వామికి ఎదురు వెళ్లి, “స్వామి, నీకు తెలియనిది ఏముంది? సుగ్రీవుడు నిరంతరము రామదాసుడే. కానీ చాలా రోజుల తర్వాత ఆయనకి రాజభోగాలు లభించాయి.
ఆ భోగాలలో లాలసత్వం పొంది ఉన్నాడు. అది అవలక్షణం కాదు, సహజమైనటువంటి వానరుల లక్షణం”, అని ఒక మాట అంటుంది. ఇక లక్ష్మణుడు మళ్ళీ మాట్లాడలేకుండా, మళ్ళీ మాట్లాడనీయకుండా లక్ష్మణుని కట్టిపడేస్తుంది. “ఈ భోగాలకు విశ్వామిత్రుడు అంతటి వాడే దాసుడయ్యాడు కదా? సుగ్రీవుడు ఎంతటి వాడయ్యా”, అంటుంది.
విశ్వామిత్రుడు అంటే లక్ష్మణుడి యొక్క గురువు. గురు చరిత్ర ఎప్పుడైతే తీసుకున్నదో ఇక మళ్ళీ మాట్లాడే అవకాశం లేదు. అంటే కోపాన్ని ఎలా చల్లార్చాలి, దానికి ఏ విధమైనటువంటి Logic ఇస్తే అవతల వ్యక్తికి ఆ కోపం చల్లారుతుంది అనేటువంటిది తెలిసినటువంటి వ్యక్తి తార. కోపంతో ఉన్నటువంటి వారితో ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి అని తెలిసినటువంటి వ్యక్తి తార.
తార – మనము నేర్చుకోవాల్సిన లక్షణాలు:
ఆవిడ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి అంశము ‘ధర్మాన్ని విశ్లేషణ చేసి చెప్పగలగడం’. తన స్వార్థం కోసం తాను చూసుకోకుండా ‘ఏది ధర్మమో ఏది అధర్మమో’ చెప్పగలగడం.
భర్త అయినా సరే అధర్మమార్గం వైపు వెడుతుంటే నిలదీసి, నిగ్గదీసి విన్నా వినకపోయినా (వినకపోతే వాళ్ళ కర్మ, చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ కర్మం అని) చెప్పడం ధర్మం గనుక ధర్మం ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పడం తార జీవిత చరిత్ర నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం. సన్మార్గంలో ఉండాలి అంటే ‘ధర్మం ప్రధానం’.
ధర్మము అంటే సన్మార్గమే, సన్మార్గమే ధర్మము. తాను సంతోషంగా ఉంటూ, పది మందిని సంతోషంగా ఉంచే విధంగా నడుచుకోవడమే ధర్మం. తార తన సంతోషాన్ని, తన కుటుంబ సంతోషాన్ని, తన భర్త సంతోషంతో పాటు సుగ్రీవుడి సంతోషాన్ని కూడా ఆశించి ఆవిడ వాలికి ఆ బోధ చేస్తుంది. కుటంబ శ్రేయస్సు గురించి ఆలోచించిన వ్యక్తి తార.
రెండవ సందేశం మనకి దీంట్లో ‘వినడం నేర్చుకోవడం’. నీతిశాస్త్రం ఏమంటుందంటే ‘విద్యకు సమానమైనటువంటి కళ్ళు లేవు’. విద్య జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, ఆ జ్ఞానముతో తెలుసుకుంటాం. కళ్ళతో ఎలా అయితే చూస్తూ ఉంటామో అలాగే జ్ఞానము. దానికి సమానమైనటువంటి కళ్ళు లేవు.
అలాగే సత్యాన్ని మించినటువంటి తపస్సు లేదు, రాగాన్ని మించినటువంటి దుఃఖము లేదు, శ్రవణాన్ని మించినటువంటి సుఖము లేదు. రాగము అంటే సంగీతంలో పాడే రాగం కాదు. ‘అనురాగం’ అంటుంటాము. ఈ అనురాగం గాని, ద్వేషము గాని ఈ రెండు కూడా మనిషి దుఃఖానికి హేతువులు. దుఃఖాల వైపు తీసుకుపెడుతూ ఉంటాయి. కాబట్టి అది కూడదు. ‘వినటం అనేటువంటిది అలవాటు చేసుకుంటే అందుకు సమంగా వేరే ఏ సౌఖ్యము ఉండదు’, అని నీతిశాస్త్రం చెప్తుంది. అంతటి ప్రాధాన్యతని ఇచ్చి నీతిశాస్త్రం మనకి వినడం గురించి చెప్పింది. ఆ వినక పాడైపోయినటువంటి వ్యక్తి వాలి.
వినేవాళ్ళకు వినిపించవలసినటువంటి విషయం ధర్మబద్ధమైందా కాదా అనేటువంటిది తారపాత్ర నుంచి మనకు తెలుస్తుంది. ఎవరు చెప్పినా వినడం అలవాటు చేసుకోవాలి.
అలాగే మూడవ అంశం ‘కోపములో ఉన్నటువంటి వారితో ఎలా ప్రవర్తించాలి? ఎలా ఉన్నా సరే నేను వారితో మాట్లాడి సముదాయించగలను’, అనేటువంటి ధైర్యము, ఆత్మస్థైర్యము, తన మీద తనకి నమ్మకము, విశ్వాసము ఉన్నటువంటి వ్యక్తి తార.
తార – ఆత్మవిశ్వాసము, ధైర్యము:
ఆవిడ జీవిత చరిత్ర నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటివి ‘ఆత్మవిశ్వాసము, ధైర్యము’. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా తన ధర్మం ఏమిటో తాను నిర్వర్తిస్తూ ఉండాలి, ఎప్పుడైనా సరే, ఎక్కడున్నా సరే.
ముందు వాలికి ఎలా అయితే సహాయపడ్డదో మంచి మాటలు చెప్పి (ఆయన వినలేదు అనుకోండి అది వేరే విషయం, కానీ చెప్పడం మంచి మాటలు చెప్పింది), అలాగే సుగ్రీవుడికి కూడా ఆపద సమయంలో ఆదుకున్నటువంటి వ్యక్తి తార.
మనకి రామాయణంలో విశేషమైనటువంటి మహిళ తార. అందుకనే ‘అహల్య ద్రౌపది తార సీతా మండోదరి’, అని అగ్రగణ్యులలో పేరు సంపాదించింది ఈ తార అనేటువంటి పాత్ర. ఈ పాత్ర నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఒకటి కాదు రెండు కాదు. ధర్మం దగ్గర ప్రారంభం చేస్తే ‘ఆత్మవిశ్వాసము, ఆత్మస్థైర్యము, నడవడిక, నడత, మాటతీరు, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఆ పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మరల్చుకోగల ఆత్మతత్వము, (Character)’, ఇవన్నీ తార యొక్క లక్షణాలు, తార నుండి మనం నేర్చుకోవలసినటువంటి విషయాలుగా మహర్షివాల్మీకి ఒక కథ రూపంలో మనకు అందించారు.
లక్ష్మణుడు వచ్చాడనగానే సుగ్రీవుడు కంగారుపడతాడు, కానీ తార కంగారు పడలేదు. ఆవిడ నిశ్చలంగానే ఉన్నది, నిర్భయంగానే ఉన్నది, నిర్మొహమాటంగానే మాట్లాడింది. కానీ Sweet గానే మాట్లాడింది, polite గానే మాట్లాడింది, Firm గానే మాట్లాడింది. మాట్లాడడం ఎలా మాట్లాడాలో కూడా తార యొక్క చరిత్రను గనుక మనం తెలుసుకుంటే, అధ్యయనం చేస్తే, మనకు అర్థమౌతుంది.
రామాయణములో తార యొక్క నడవడిక, మాట, ఏది చూసినా ప్రతి శ్లోకంలో మనకో సందేశం కనబడుతుంది. ‘ఓహో ఇలా ఉండాలన్నమాట, ఇలా ఆలోచించగలగాలన్నమాట, ఇలా మాట్లాడగలగాలన్నమాట, ఇది ఆలోచనా విధానం అన్నమాట”, అనిపించేటట్టుగా తార యొక్క చరిత్ర సాగుతూ ఉంటుంది రామాయణం అంతా కూడా.
తార అంటే ‘ఒక నక్షత్రం, ఒక మెరుపు’. ఆ మెరుపు ఎలా మెరుస్తుందో ఆ మెరుపుని మహర్షి వాల్మీకి తార పాత్ర ద్వారా మనకందించారు.
తార యొక్క లక్షణాలైనటువంటి ‘ఆత్మస్థైర్యము, కోపాన్ని ఎలా నిగ్రహించాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఎవరితో ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలి, ఎవరికి ఏ విధమైనటువంటి బోధ చేయాలి, ధర్మాన్ని ఆధారంగా తీసుకొని ధర్మబద్ధంగా ఎలా జీవనం గడపాలి’, అనేటువంటివి మనకి ఈ తార చరిత్రను చదివితే గ్రహించగలము. అందరూ కూడా అవకాశం ఉన్నంతవరకు చదివి ఆచరణలో పెట్టి సన్మార్గంలో నడుస్తారని ఆశిస్తున్నాను.
ధర్మస్య విజయోస్తు.