Skip to navigation
K C Das Memorial Charitable Trust
Donate
  • Home
  • About
  • Library
    • Dharma Vaani
    • Sri Lalitha Sahasra Naamavali
    • Dharmavaaradhi e-Magazine
    • Guru Vaani
    • Saradamba TV (Grandly Launched)
  • Dharmika Programs
    • All programs
    • Hanuman Chalisa
    • Gayathri Japam
    • Bala Japam
    • Calendar
  • Spiritual Education
  • Community Welfare
  • Contact
Donate
  • Instagram
  • YouTube
  • Facebook
  • Instagram
  • YouTube
  • Facebook
Donate

శ్రీమద్రామాయణం – విభీషణుడు

మనిషి నడిచే మార్గములు రెండే రెండు ఉంటాయని చెప్తుంది ధర్మం – సన్మార్గము లేదా దుర్మార్గము. మనం ఈ మధ్యన కొన్ని మార్గాలు కనిపెట్టి ఇది మధ్యే మార్గం అనుకుంటున్నాం. కానీ అయితే సన్మార్గంలో ఉండాలి లేదా దుర్మార్గంలో ఉండాలి. ఏది సన్మార్గము, ఏది సన్మార్గం కాదు అనేటువంటి విషయాలను శాస్త్రాలు, శృతి స్మృతి పురాణాలు ఇత్యాది వేరు వేరు రూపాలలో మహర్షులు మనకందించారు.

పురాణాల్లో అయితే కథల రూపాల్లో, వేదాలలో మంత్ర రూపంలో, వ్యాఖ్యానాల రూపంలో ఇవన్నీ కూడా మనకందించారు. వీటిలో అతిశ్రేష్టమైనటువంటిది, అందరికి బాగా పరిచయమైనటువంటిది, ప్రతి నోట పలికేటువంటిది రామాయణం. రామాయణం కథగా మాత్రమే చూస్తే కథ కథగానే ఉంటుంది. కానీ మహర్షి వాల్మీకి చేసినటువంటి విశేషమైనటువంటి ప్రయత్నం ఏమిటి అంటే రామాయణంలో ప్రతి కథ, ప్రతి నడక, ప్రతి విషయంలో కూడా సన్మార్గబోధ చేశారు. అందులో ఉండేటువంటి వ్యక్తిత్వాలు (ఏ వ్యక్తిత్వం తీసుకున్నా) సమస్త మానవాళకి కావలసినటువంటి నడవడిక ఎలా ఉండాలి, అది సన్మార్గమై ఉండాలంటే ఎలా ఉండాలి అని మనకి విశేషంగా చెప్తూ వచ్చారు.

 దాంట్లో మనం విభీషణుడి పాత్ర గురించి చూద్దాం.

విభీషణుడు అంటే అర్థం ఏమిటి?

విభీషణుడు రాక్షస జాతిలో పుట్టినటువంటి వాడు. రాక్షస జాతిలో పుట్టినటువంటి వాడు కూడా సన్మార్గంలో నడవగలడు అది మనం గ్రహించాలి.  విశ్వవసబ్రహ్మకు కైకసికి కలిగినటువంటి సంతానము రావణుడు, కుంభకర్ణుడు, సూర్పణక, ఆ తర్వాత విభీషణుడు. విభీషణుడు, ఆ పేరులోనే ఉన్నది, భీషః అంటే ‘భయం’. భయపడుతూ ఉంటాడట ఎప్పుడు.

 ‘భీషాస్మాత్ వాతః పవతే, భీషో దేతి సూర్య:’, అంటుంది వేదం. ఈశ్వరుడి యొక్క భయముతో గాలి వీస్తున్నదట.

గాలి వీచలేదు అనుకోండి సమస్త మానవాళి ఆగిపోతుంది. సృష్టి నడవాలంటే గాలి వీచాలి. కానీ అలా అని (వాయుదేవుడు అంటుంటాం కదా ఆయన) ఇష్టమున్నట్టుగా వీచడానికి లేదు. గంటకి 300 కిలోమీటర్ల వేగంతో వీచాడు అంటే మనం ఎవరం నిలబడలేం. కాబట్టి ఎంతవరకు వీచాలో ఆయనే నిర్ణయిస్తాడట. ఈశ్వర ఆజ్ఞకులోనై ఉంటాడు.

అలాగే సూర్యుడు కూడా ఈశ్వరుడికి భయపడే ఉదయిస్తున్నాడు అన్నారు. కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలుగా సూర్యోదయం ప్రతిరోజు జరుగుతున్నది. ప్రతిరోజు వస్తున్నాను కదా ఇవాళ ఒక్కరోజు రాను అనడానికి ఆయనకు అవకాశం లేదట. ఈశ్వరుడికి భయపడి ఆయనే ఉదయిస్తున్నాడట.  అలా ప్రతి మనిషికి భయం ఉంటుంది. ఈ భయం అనేటువంటిది ప్రతి మనిషికి ఉండాలి కానీ విభీషణుని చూసి నేర్చుకోవలసినటువంటి అంశం ఒకటుంది. ‘ఎక్కడైనా పొరపాటునైనా ధర్మము తప్పుతానేమో’, అని భయపడుతూ ఉండేవాడట విభీషణుడు.

ఎప్పుడు నిరంతరము ఆయనకు ఒకటే భయం, ఇంక వేరే భయం ఏమీ లేదు. “రావణుడు ఏం చేస్తాడు, నా రాజ్యం ఏమవుతుంది, నాకు ఉన్నటువంటి సంపద ఏమైతుంది, నా పిల్లలు ఏమైపోతారు”, వీటి గురించి ఏ విధమైనటువంటి భయము ఆయనకు లేదట. ఆయనకు ఉండేది ఒకటే భయం, ‘ధర్మము తప్పుతానేమో అనేటువంటి భయం’. అది అత్యంత గొప్ప లక్షణం.

విభీషణుడు – ధర్మం:

సన్మార్గములో ఉండాలనుకునేటువంటి వారు ఎక్కాల్సిన మొట్టమొదటి మెట్టు ఏమిటి అంటే ‘ధర్మం’. ధర్మం అనే చట్రానికి లోబడే జీవనం గడవాలి. ధర్మం అంటే ఏమిటండి? Way of Life. ధర్మం అంటే జీవన విధానం. నువ్వు జీవించే విధానం వల్ల పది మందికి మేలు జరుగుతున్నదా? పది మంది మాట పక్కన పెడదాం ముందు అసలు నీకు మేలు జరుగుతున్నదా, నీకు ఉపయుక్తకరంగా ఉన్నదా? ‘ఆ నాకు బానే ఉన్నదండి’, అనుకోవచ్చు (అధర్మమార్గంలో వెళ్లేటువంటి వారు కూడా). కానీ అది తాత్కాలికమే. అదే మనకి రామాయణం కథ చెప్పేది.

 రావణుడు రాముడి కంటే చాలా బాగా ఉన్నవాడు అనిపించేటట్టుగా ఉంటుంది ఆ కథ అంతా కూడా. కానీ చివరికి ఏమయ్యాడు? రావణుడు అనేవాడట ‘మనుషులు నన్ను ఏం చేస్తారు? గడ్డి పరక లాంటివారు. వీళ్ళ గురించి నేను అసలు భయపడవలసిన అవసరం లేదు’ అని. అంత ధైర్యంగా ఉండేవాడు. ఒక పాము వచ్చి కరుస్తుందేమో అని మనం భయపడతాం, కానీ ఒక చీమ వచ్చి కరుస్తుందేమో అని భయపడతామా, భయపడం.

మనుష్యజాతి అంటే రావణుడికి అటువంటి భావన ఉండేదట. అటువంటిది మానవుడి చేతిలోనే ఆయన మరణాన్ని పొందాల్సి వచ్చింది. కాబట్టి ధర్మ మార్గంలో ఉండేటువంటి వారు ఎప్పుడూ ఆలోచించవలసింది ఏమిటి అంటే ‘ధర్మమార్గం’ అంటే సన్మార్గం. భగవంతుడికి చేయవలసినటువంటి ప్రార్థన ఎప్పుడూ కూడా ‘నన్ను ధర్మమునందే ఉంచేటట్లు చూడు స్వామి’, అని ఉండాలట. విభీషణుడు అదే చేస్తూ ఉండేవాడు, అదే భయపడుతూ ఉండేవాడు.

పుట్టడం రాక్షస వంశంలో పుట్టాడు. అన్నగారు రావణుడు. ఆయనకు పది తలకాయలు, పది రకాలుగా ఆలోచించగల సమర్థత కలిగినటువంటి జన్మ ఆయనది. తమ్ముడిని చూద్దామా కుంభకర్ణుడు. కుంభకర్ణుడికి ఆ రోజుల్లో అందరూ భయపడేటువంటివారు. ఇవన్నీ కూడా రావణుడి అహంకారాన్ని పెంచి వేసినాయి. “నాకు అంగబలం ఉన్నది, ఎందుకంటే తమ్ముడు ఉన్నాడు”. కుంభకర్ణుడు లేచాడు అంటే మొత్తం ప్రపంచమంతా గడగడలాడేదట. అంత భయం కుంభకర్ణుడు అంటే. అన్నగారిని చూద్దామా ఆయన కుబేరుడు, డబ్బుకేం లోట్టు లేదు. అన్నగారి కుమారుడా ఇంద్రుని జయించినటువంటి వాడు. ‘నేను ఇంద్రుని కూడా జయించానని’, అహంకారంతో ఉండేటువంటి వాడు రావణుడు.

రామాయణంలో యుద్ధకాండలో విభీషణుడు వెళ్లి వినమ్రపూర్వకంగా చెప్తాడు. “అన్నా! నువ్వు చేసింది అధర్మం. ఇప్పటికైనా సరే నష్టం లేదు సీతను తీసుకువెళ్లి అప్పచెప్పు”. ఏవండీ ఈ మాట చెప్పాలంటే రాజైనటువంటి వాడికి ఎంత తమ్ముడైనా ఎంతో దైర్యం ఉండాలి.

రాచరికపు వ్యవస్థలో రాజుకు కోపం తెప్పిస్తే ఎవరిని క్షమించేవారు కాదు. అది రాచరికపు వ్యవస్థ. ఇవాళ ఉన్నట్టుగా ప్రజాస్వామ్యం కాదు. రాచరికపు వ్యవస్థలో ‘నువ్వు చేసింది అధర్మము’ (అన్నగారైనా సరే) అని చెప్పాలి అంటే ఎంత ధైర్యం ఉండాలండి.

ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది విభీషణుడికి అంటే, సన్మార్గంలో ఉన్నటువంటి వారికి ధైర్యం Automatic గా వస్తుంది.

విభీషణ రావణ సంవాదం:

ధర్మాన్ని ఆశ్రయించుకొని ఉన్నాడు గనుక ఆ ధైర్యం వచ్చింది. ‘నేను ధర్మాన్ని ఆశ్రయించుకొని ఉంటున్నాను, గనుక నాకేమీ కాదు’. ‘ధర్మో రక్షతి రక్షితః’, కనుక సన్మార్గంలో ఉండేటువంటి వారు, అంటే ధర్మాన్ని ఆశ్రయించుకొని ఉన్నటువంటి వారు గనుక వారికి కూడా ఆ ధైర్యం వస్తుంది.

 విభీషణుడు ధైర్యముగా వెళ్లి రావణుడికి చెప్తాడు, “అన్నా! నువ్వు రాముడు మనుష్యుడు అనుకుంటున్నావు. కానీ ఒక కోతి ఇక్కడికి వచ్చి లంకా దహనం చేస్తే నీ సైన్యం అంతా ఏమి చేయలేకపోయింది. ఒకసారి ఆలోచించు. ఇది దైవీ ప్రేరణతో జరుగుతున్నది. నువ్వు అధర్మాన్ని ఆశ్రయించుకని ఉన్నావు గనుక నీకు ఎంత శక్తి ఉన్నప్పటికి కూడా అది నిలబడలేదు”. అంటే దుర్మార్గాన్ని ఆశ్రయించుకొని, దుర్మార్గపు ఆలోచనలు చేసేటువంటి వారు ఈ అంశం నుంచి తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే విభీషణుడు చెప్పినట్లుగా ‘అధర్మాన్ని ఆశ్రయించుకొని ఉంటే అది నిలబడదు’.

ఎప్పటికైనా అధర్మానికి ఓటమి తప్పదు అని విభీషణుడు గట్టిగా చెప్తాడు. అప్పుడు రావణుడు విభీషణుడితో, “నువ్వు నా శత్రువు పక్షంలో మాట్లాడుతున్నావు, నా పక్షంలో మాట్లాడవలసిన వాడివి. అవునులే నీకు ఈర్షా అసూయలు ఉన్నాయి”, అంటాడు.

అహంకారం పెరిగిపోయినటువంటి వారికి మంచి చెప్తే వినబడదు. ‘చెప్పంగా వినకపోతే చడంగా చూడమని’, ఒక సామెత.

అలాగే విభీషణుడి నుంచి మనం నేర్చుకోవాల్సినదేమిటంటే రక్తసంబంధమైనప్పటికి కూడా అధర్మాన్ని ఏమాత్రం ఉపేక్షించకుండా, నిస్సందేహంగా, నిర్భయంగా, భయం లేకుండా, ఏమాత్రం సహించకుండా ఉండగలగడం. విభీషణుడు తన అన్నగారైన రావణుడికి సలహా ఇచ్చి, Directగా ఆయనతోనే చెప్పి, ఆయన కోపానికి గురైనాడు.

ఇది సన్మార్గంలో ఉండేటువంటి వారికి తెలిసినటువంటి విషయమేనండి. మంచి చెబితే వినకపోవచ్చు. ‘సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః’, అని రామాయణంలోనే మనకి ఇంకొక శ్లోకం కనబడుతుంది వేరే సందర్భంలో.

మారీచుడు చెప్తాడు రావణుడితో, “ఓ రాజా, ఎప్పుడైనా సరే సమాజంలో మనకి అనుకూలముగా మాట్లాడే వాళ్ళు ఎక్కువ కనబడతారు, సులభంగా దొరుకుతారు. నువ్వు రాజువి నీకు ఎదురు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. నువ్వు ఏం చేసినా సరే ‘అది బానే ఉంది, మంచిది బాగా జరిగింది, బాగా చేసావు’, అని అంటారు. నీకు ఎదురు చెప్పరు. ఒకవేళ ఎవరన్నా అప్రియమైనటువంటి విషయం చెప్పాలి అనుకుంటే ‘మనకెందుకులే రాజుగారికి చెప్పటం, అనవసరంగా శిక్ష పడుతుంది మనకి. ఆయన వినడు వదిలేద్దాం’, అనుకుంటారు”.  అలాగే ‘చెప్పిన మాట విననటువంటి స్వభావం’ ఉన్నటువంటి వ్యక్తుల పట్ల కూడా ఇది వర్తిస్తుంది.

 సన్మార్గంలో ఉన్నప్పుడు ఎవ్వరు చెప్పినా సరే వినటం నేర్చుకోవాలి. ‘విభీషణుడు నా తమ్ముడు, చిన్నవాడు వాడికేం తెలుసు. నేను సకలశాస్త్ర పారంగతుడను, సర్వశాస్త్రకోవిదుడను, భుజబలదర్పం కలిగినటువంటి వాడిని, ఇంద్రుని జయించాను, నా కుమారుడే ఇంద్రుని జయించాడు, అష్టదిక్పాలకులని శాసించగల సమర్థత కలిగినటువంటి వాడిని’.

ఇవన్నీ కూడా అహంకారానికి చిహ్నాలు. ఈ అహంకారం వల్ల పతనమైపోయినటువంటి రావణుని గాధే రామాయణం.  కావున అహంకారం తగదు.

విభీషణుడి మాటలకు కోపం వచ్చింది రావణుడికి, కోపం వచ్చి విభీషణుడికి దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. అప్పుడు విభీషణుడు అంటాడు, “అన్నా! అధర్మాన్ని ఆశ్రయించుకొని ఉండడం కంటే ధర్మాన్ని ఆశ్రయించుకొని ఉండడమే విశేషం”.

రామాయణంలో మనకి అన్నదమ్ముల మధ్య జరిగినటువంటి సంభాషణ మూడు సందర్భాల్లో ఇస్తారు మహర్షి వాల్మీకి. మొదటిది రాముడికి భరతుడికి మధ్య సంభాషణ జరుగుతుంది. రెండవది వాలి సుగ్రీవుల మధ్య సంభాషణ జరుగుతుంది. మూడవది రావణ విభీషణుల మధ్య సంభాషణ జరుగుతుంది. కుంభకర్ణుడితో కూడా జరుగుతుంది కానీ అది యుద్ధానికి సంబంధించినటువంటిది. ధర్మాధర్మముల గురించి చర్చలు జరిగేది ఈ మూడు సందర్భాల్లో.  అత్యంత విశేషంగా ధర్మాన్ని గురించి చెప్పినది రాముడికి భరతుడికి మధ్య జరిగినటువంటి సంవాదము.

ఇక్కడ విభీషణుడితో జరిగినప్పుడు, విభీషణుడు కూడా అదే మాట చెప్తాడు, “అధర్మాన్ని ఆశ్రయించుకొని నీ ఆశ్రయంలో ఉంటూ సుఖభోగ ఐశ్వర్యాలు అనుభవించే కంటే ధర్మాన్ని పట్టుకొని వెళ్ళడమే ఉత్తమం అన్నా”, అని. దీని ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే ‘సన్మార్గంలో వెళ్ళదలుచుకున్న వాళ్ళకి Detachment Mentality’ ఉండాలి. విభీషణుడికి ఉన్నటువంటిది ఉండాలి.

విభిషణుడు – మాట్లాడేనేర్పు:

“నాకు రాజ్యం ఉన్నది, నాకు అధికారం ఉన్నది, నాకు పదవి ఉన్నది, నాకు ఇక్కడ సుఖభోగాలు ఉన్నాయి. ఇవన్నీ నేను ఎందుకు వదిలిపెట్టుకోవాలి? కొంచెం కళ్ళు మూసుకుంటే అయిపోతుంది. ఆయన కర్మ ఏదో ఆయన అనుభవిస్తాడు”, అనుకోలేదు విభీషణుడు. సొంత అన్నగారు అధర్మాన్ని ఆశ్రయించి పాడైపోతున్నాడని చెప్తాడు.

ఆ మాట సుందరకాండలో కూడా చెప్తాడు. హనుమని బంధించినప్పుడు రావణుడికి కోపం వచ్చి “సంహరించండి”, అని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ హర్షద్వానాలు చేస్తారు, చప్పట్లు కొడతారు.

ఒక విభీషణుడు మాత్రం లేచి నిలబడి, “అన్నా దూతను సంహరించడం సరికాదు”, అంటాడు. సామ, దాన, భేద దండోపాయాలు ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో తెలుసుకోవాలి అంటే విభీషణుడి గురించి అధ్యయనం చేయాలి, అతని పాత్రలో ఉన్నటువంటి ఔచిత్యాన్ని అర్థం చేసుకోవాలి.

 “దూతను సంహరించటం నేరమే. ఆ సాంప్రదాయం లేదు. నువ్వు మొట్టమొదటిసారి ఆ పని చేసినవాడవు అవుతావు. లోకమంతా నిన్ను నిందిస్తుంది. నువ్వు ధర్మం బాగా తెలిసినటువంటి వాడివి కాబట్టి నువ్వే ఇటువంటి తప్పు చేస్తే ఇక దానికి తిరుగుండదు కదా అన్నా? ఒక్కసారి ఆలోచించు”, అంటాడు. అప్పుడు రావణుడు విభీషణుడిని, “ఇతను చేసిన నేరం సామాన్యమైన నేరం కాదు. ఇతనిని శిక్షించకుండా ఎలా వదిలేయాలి?”, అని ప్రశ్నిస్తాడు.

దూతకు శిక్షించే విధానము అతని యొక్క అవయవాన్ని తొలగించడమో లేదా శిరోముండనం చేయడమో అని వివరించి మరొక మాట కూడా చెప్తాడు విభీషణుడు. ఇతరులకు ఎలా నచ్చ చెప్పాలో విభీషణుడి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. “అన్నా ఇప్పుడు ఈ దూతని నువ్వు సంహరిస్తే, ఇన్ని యోజనముల సముద్రము దాటి ఎవ్వరు ఇక్కడికి రాలేరు. ఇక్కడ ఏం జరిగిందో తెలీదు. నీ శత్రువుని నువ్వు సంహరించే అవకాశం నీకు ఉండదు.”

“ఈ దూతను గనుక నువ్వు వదిలి పెట్టేస్తే (శిరోముండనమో, అంగవైకల్యమో చేసి వదిలి పెట్టేస్తే) ఆ దూత అక్కడికి వెళ్తాడు. ఇక్కడ ఏం జరిగిందో వారికి తెలుస్తుంది. నీ శత్రువు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికే వస్తాడు. నువ్వు ఇంద్రుని జయించిన వాడివి కాబట్టి నీకు నీ శత్రువును సంహరించటం పెద్ద విషయం కాదు”, అని ఆ సమయానికి అతనికి నచ్చ చెప్తాడు.

“సరే అయితే హనుమంతుడి తోక తగలబెట్టండి”, అని. లంకాదహనం అంతా అప్పుడు జరుగుతుంది. అన్నగారికి నచ్చ చెప్పే విధానం ఎలా ఉన్నదో ఈ సందర్భంలో చూపించారు. అంటే దానికి ఏం కావాలండి? ‘ఓర్పు కావాలి’.

 అవతల వ్యక్తి అధర్మానువర్తనుడై ఉన్నాడు. ఈయన ధర్మమునందు ఉన్నాడు. 180 Degrees Poles Apart అంటాం. ఒక్కొక్కసారి మన ఆలోచనలతో అవతల వ్యక్తులు అస్సలు ఏకీభవించరు. వారికి మనకి 180 Degrees Poles Apart ఉంటుంది. అయినా అటువంటి వారితో కూడా సఖ్యంగా జీవనం గడుపుకోవడం ఎలాగా అనేటువంటిది విభీషణని చూసి నేర్చుకోవాలి.

విభిషణుడు – ఓర్పు:

ఇక చివరికి లాభం లేదని ఆఖరి దశలో అన్నగారికి ఎంత చెప్పినా వినడం లేదు, యుద్ధం మీదకి వచ్చేస్తుంది, రాముడు వచ్చేస్తున్నాడు, సైన్యం అంతా వచ్చేస్తోంది, సేతు నిర్మాణం జరిగిపోయింది. జరగవలసిన Damage జరిగిపోయింది. ఇంక ఈయన వినేటట్టు లేడు అనే స్థితి దాకా విభీషణుడు నచ్చ చెబుతూనే ఉన్నాడు, ఆ ఓర్పు వహిస్తూనే ఉన్నాడు. సన్మార్గంలో ఉండేటువంటి వారికి కావలసినటువంటి మరొక లక్షణం విభీషణ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ‘ఓర్పు కలిగి ఉండడం, సహనంతో ఉండడం’.

ఈ సహనమే సౌశీల్యంగా పరివర్తన చెంది పదిమందిలో కూడా సన్మార్గానికి గుర్తింపు లభిస్తుంది. ఇక ఎంత చెప్పినా వినకపోతే అప్పుడు విభీషణుడు ధర్మాధర్మముల మధ్య తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

 ఒక పక్కన రక్తసంబంధం, సొంత అన్నగారు కానీ అధర్మములో ఉన్నాడు. మరొక పక్కన శత్రువు ధర్మమునందు ఉన్నాడు. ఇప్పుడు విభీషణుడు ‘ఏం తేల్చుకోవాలి’ అని ఆలోచన చేసి అంటే Long Term Vision విభీషణుడికి ఉన్నది. ఆ Vision ఉన్నటువంటి వాడు గనుక, మనకి విభీషణుడి యొక్క నడవడిక నుంచి సన్మార్గంలో ఉండేటువంటి వారికి ఈ Vision ఎలా ఏర్పరచుకోవాలో విభీషణుడి పాత్రను విశ్లేషణ చేస్తే మనము గ్రహించగలుగుతాము.

చివరికి విభిషణుడు రాముడి దగ్గరికి వస్తాడు, వచ్చి రాముడితో జతకడతాడు. ఇదంతా కథ తెలిసిందే మనకి.

ఆ సందర్భంలో రాముడితో చెప్తాడు, “అధర్మమునందు ఉన్నటువంటి అన్నగారికి నేను సలహా ఇచ్చాను. ఆయన వినలేదు కనుక నీ పక్షం వచ్చాను. ధర్మము నీ వైపు ఉన్నది గనుక ధర్మం వైపే నేను ఉండాలి. అందువల్ల ఇటువైపు వచ్చాను”, అంటాడు.

రాముడు సంతోషించి వెంటనే విభీషణుడికి పట్టాభిషేకం చేస్తాడు. అప్పటికి ఇంకా యుద్ధం కూడా జరగదు, రావణ సంహారం కూడా జరగదు. కానీ రాముడు మాటలు కాదు చేతలు చేసి చూపిస్తాడు. విభీషణుడికి పట్టాభిషేకం చేసి “లంకారాజ్యాభిషిక్తుడిని చేస్తున్నాను విభీషణా నిన్ను”, అని ఆ సందర్భంలోనే వెంటనే అక్కడే ప్రకటన చేస్తాడు.

విభిషణుడు – యుద్ధ సహాయం:

ధర్మమునందు ఉన్నాడు గనుక, ఒకసారి తెగదింపులు చేసుకున్న తర్వాత అన్నగారి నుంచి దూరం వచ్చేసాడు. విభీషణుడు ధర్మమునందు ఉన్నటువంటి రాముడితో జతకట్టాడు గనుక రాముడికి యుద్దములో తన సహాయ సహకారాలు అందించాడు.

యుద్ధంలో విశేషమైనటువంటి ఒక శక్తిని వేసి లక్ష్మణుడితో పాటు అందరినీ మూర్చకు గురి చేసినటువంటి ఆ బాణ ప్రయోగ సమయంలో విభీషణుడు, హనుమంతుడు మాత్రమే మేల్కొని ఉంటారు. వీరిద్దరూ కాగడా పట్టుకొని వెతుకుతూ ఉంటారు రామలక్ష్మణుల పరిస్థితి ఎలా ఉన్నది అని. అందరూ మూర్చిల్లి ఉన్నారు. రాముడితో సహా అందరూ మూర్చిల్లినప్పుడు విభీషణుడు వెంటనే అక్కడికి వచ్చి హనుమతో, “ఇక్కడున్నటువంటి వైద్యులు మీకు సూచన చేస్తారు”, అని చెప్తారు. ఆ తర్వాత హనుమంతులు సంజీవిని పర్వతం తీసుకురావడం ఇవన్నీ కూడా జరుగుతాయి.

 అంటే ఒక రకంగా వీరందరికి మళ్ళీ జీవం పోసినటువంటి వాడు విభీషణుడు. విభీషణుడి యొక్క సలహా సూచనల మేరకే సంజీవిని పర్వతం తీసుకురావడం, వారందరినీ మళ్ళీ బ్రతికించడం జరుగుతుంది.

“కష్టం వచ్చింది కదా ఇక్కడ, ఇంక అయిపోయింది, ఇక్కడితో వీళ్ళతో నాకు లాభం లేదు”, అనుకొని ఉంటే విభీషణుడు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉండేవాడు. కానీ అలా వెళ్ళలేదు. కష్టమునందు, సుఖమునందు రెండిటి యందు, ఒకసారి స్నేహం చేశారు అంటే ఆ మిత్రత్వాన్ని అలాగే ఎలా నిలబెట్టుకోవాలో విభీషణుడి నుంచి మనం నేర్చుకోవాలి.

విభీషణుడు – నేర్చుకోవాల్సిన అంశం:

విభీషణుని చూసి మనము అర్థము చేసుకోవాల్సిన అంశము, ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటిది, ‘ధర్మమును ఆధారంగా చేసుకుంటే మనిషి సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు, సన్మార్గంలో వెళ్తూ ఉంటాడు’. ఎందుకంటే తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆధారం చేసుకొని మనిషి నడవడిక ఉంటుంది.

‘మనోబుద్ధి అహంకార చిత్తములని’, ఉన్నటువంటి వాటిలో మనస్సు పరిపరి విధాలా సంకల్పం చేస్తూ ఉంటుంది. కానీ బుద్ధి నిర్ణయాత్మకంగా, నిశ్చయాత్మకంగా అతనికి నిర్ణయాలు చెప్తూ ఉంటుంది.

అందుకనే ‘నీ బుద్ధి ఏమైంది’, అంటుంటారు. కాబట్టి ఆ బుద్ధి సరైనటువంటి నిర్ణయం చేయాలి అంటే మనిషి ఆలోచనా విధానం ఎప్పుడూ కూడా Balanced గా ఉండాలి. Balanced గా ఉండాలి అంటే ధర్మ మార్గమునందు ఉంటేనే Balance గా ఉండగలుగుతాము అని పెద్దలు చాలా కథలలో, చాలా సందర్భాల్లో మనకి చెప్పి ఉన్నారు.

ఈ ధర్మమునందు ఉన్నటువంటి విభీషణుడు మొదటి నుంచి కూడా దేనికి భయపడ్డాడు అంటే ‘అధర్మము జరుగుతుందేమో’, అని భయపడుతూ ఉండేవాడట. ఇంకేది భయం లేదు ఆయనకి. అలాగే “రాజ్యము పోయినా పర్వాలేదు, ధర్మమునందు ఉండాలి నేను”, అనేటువంటి కాంక్ష. ఈ ధర్మకాంక్షే అతన్ని సన్మార్గంలో నిలబెట్టింది.

అతన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది రాజ్యం పోయినా సరే ధర్మం నిలబడాలి అంటే నేను సన్మార్గంలోనే ఉండాలి. ఏదో చెప్తారు చెప్పేవాళ్ళు. వాళ్ళ వాళ్ళ ఆలోచనా విధానానికి అనుగుణంగా వాళ్ళు చెప్తారు. కానీ నేను చేసేది Correct అవునా, కదా, నా ఆలోచనా విధానం Enlighten అయి ఉందా లేదా, నా బుద్ధి సన్మార్గం వైపు వెళ్తున్నదా లేదా, నా నిర్ణయాలన్నీ సన్మార్గంలో ఉన్నాయా లేవా, అని మనం విశ్లేషణ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఈ ఆలోచనతో మన అడుగులు వెయ్యాలి.

సన్మార్గంలో ఉంటేనే ఎప్పటికైనా గెలుపు, దుర్మార్గానికి ఎప్పటికైనా ఓటమే. మనం రామరావణ యుద్ధం చూసినా, ఏ పురాణం చూసినా చివరికి దుర్మార్గం ఓడిపోతుంది, సన్మార్గమే గెలుస్తుంది. కాబట్టి సన్మార్గంలోనే మనందరం ప్రయాణం చేద్దాం. ఈ విభీషణుడి పాత్రలో ఉన్నటువంటి ఔచిత్యాలను ఎప్పటికప్పుడు నెమరువేసుకుంటూ ఉందాము.

మన జీవితంలో కూడా మనకి ఇటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అధర్మం వైపు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ అక్కడ గట్టిగా నిలబడి “ఇది అధర్మము, ఇటువైపు నేను వెళ్ళను. నేను సన్మార్గంలోనే ఉంటాను”, అనేటువంటి నిర్ణయం తీసుకోని సన్మార్గం వైపు ప్రయాణం చేద్దాం, ఆనందంగా మన జీవితాలు గడుపుకుందాం.                                                           ధర్మస్య విజయోస్తు

K C Das Memorial Charitable Trust

Paropakarardham Idam Sareeram

  • Instagram
  • YouTube
  • Facebook
Address
H.No. 11-13-119, 14/B, Road No. 3, beside Axis Bank, Alkapuri Colony, Ramakrishnapuram, Kothapet, Hyderabad, Telangana 500035
View on map
Contact
contact@kcdastrust.org
+91 94948 77070
04:00 PM to 08.30 PM IST

© 2026 K C Das Memorial Charitable Trust. All rights reserved.

Terms and ConditionsPrivacy Policy