Skip to navigation
K C Das Memorial Charitable Trust
Donate
  • Home
  • About
  • Library
    • Dharma Vaani
    • Sri Lalitha Sahasra Naamavali
    • Dharmavaaradhi e-Magazine
    • Guru Vaani
    • Saradamba TV (Grandly Launched)
  • Dharmika Programs
    • All programs
    • Hanuman Chalisa
    • Gayathri Japam
    • Bala Japam
    • Calendar
  • Spiritual Education
  • Community Welfare
  • Contact
Donate
  • Instagram
  • YouTube
  • Facebook
  • Instagram
  • YouTube
  • Facebook
Donate

మన ఆలోచనలు ఎలా ఉండాలి?

సన్మార్గంలో ఈవాళ మనం ‘ఆలోచన’, అనే విషయం మీద ఒక అవగాహన పెంచుకుందాము. లోచనములు అంటే ‘కళ్ళు’. కళ్ళతో మనము ఏమి చూస్తామో, చూసినటువంటి దాని మీద మనస్సు అలా నిలబడి పోతుంది. ‘మనము చూసే దాన్ని బట్టి మన యొక్క ప్రవర్తన ఆధారపడి ఉంటుంది’ అంటారు.

ఆలోచనలు – మనస్సు:

“యతో బుద్ది తతో దృష్టి”, అని పెద్దలు చెప్పారు. ఆంటే మన బుద్ది ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనము చూసే చూపు ఉంటుంది. “యతో ద్రుష్టి తతో మనః”, ఆంటే ఏది చూస్తామో దాని మీద మనస్సు లాగుతూ ఉంటుంది.  ఉదాహరణకు “మనకు స్వీట్ ఆంటే ఇష్టం అనుకోండి ఏ గులాబ్ జామూన్, ఏ హల్వానో చూడగానే దాన్ని తింటే బాగుండనిపిస్తుంది”. అదే చూడనంత వరకు దాని మీద మనస్సు లాగదు. కాబట్టి “యతో బుద్ది తతో దృష్టి, యతో ద్రుష్టి తతో మనః”.

 “యతో మనః తతో భావః”, అంటే మనస్సు ఏమి చెప్తుందో, ఆలోచన కూడా అదే చేస్తుంది. “యద్భావం తత్భవతి”, అన్నారు.

‘ఏ ఆలోచన చేస్తావో నీకు అదే జరుగుతుందయా’, అని చెప్పారు. మన పూర్వీకులు తమ మనస్సులోకి అసలు చెడు ఆలోచనే రానిచ్చేవారు కారు. ఉదాహరణకు ‘బియ్యం అయిపోయింది’ అనేవారు కాదు, ‘బియ్యం నిండుకుంది’ అనేవారు. నిజానికి నిండుకున్నాయి అంటే ‘నిండా ఉన్నాయి’ అని అర్థం. అంటే Negative Thought అనేది రానీయకుండా ఎప్పుడూ మనస్సులో Positive Thinking మాత్రమేచేసేవారు. దీనికి మూలం ఏమిటంటే ‘బుద్ధిని నియంత్రించటం’.

మనకి సద్బుద్ధి కనుక కలిగితే ‘సత్ చింతన’ చేస్తాము, అంటే మంచి ఆలోచనలు. సత్ చింతన కలిగింది అంటే ‘సత్ప్రవర్తన’ ఉంటుంది. మంచి ఆలోచనలు ఉంటే మంచి ప్రవర్తన ఉంటుంది. మంచి ప్రవర్తన ఉంటే మనము మంచి పనులు చేస్తూ ఉంటాము. మంచి పనులు చేస్తే మంచివాళ్ళుగా గుర్తింపబడతాము. కాబట్టి వీటన్నిటికీ మూలం ఎక్కడుంది అంటే మన ఆలోచనా విధానములో ఉన్నది. ఆలోచనకు సహకరించేటటువంటిది బుద్ది.

 మనస్సును, బుద్దిని కనుక సద్విషయాల మీద పెట్టగలిగితే, అంటే మంచి విషయాల మీద మరల్చగలిగితే మంచి ఆలోచనలే వస్తాయి, వేరే ఆలోచనలు వచ్చే అవకాశమే లేదు. “మనస్సును నియంత్రించటం, బుద్దిని నియంత్రించటం ప్రయత్నపూర్వకంగా చేస్తూ, నీ ఆలోచనలను నువ్వు కనుక సద్విషయాల మీద పెట్టగలిగితే అప్పుడు తప్పకుండా సమాజములో మనము మంచివారిగా చెలామణి అవుతాము”, అని పెద్దలు మనకి చెప్పారు. ఇందుకు మనకు పెద్దలు ఇచ్చిన మార్గం ‘సత్సంగం’.

‘SHOW ME YOUR FRIENDS, I WILL TELL YOUR CHARACTER’ అన్నాడొక కవి. మనము స్నేహం ఎటువంటి వారితో చేస్తున్నామో, దానిని అనుసరించి మన వ్యవహారశైలి ఉంటుంది. మన స్నేహితుల ఆలోచనలు కూడా మన మీద ప్రభావం చూపుతాయి.

మన ఆలోచనలు ఎటువంటి వారి ఆలోచనలకు అనుగుణముగా నడుస్తున్నాయి అని మనల్ని మనం ప్రతినిత్యం పరీక్షించుకుంటూ ఉండాలి. ఎందుకంటే, మనస్సు ఎలా చెపితే మనిషి ఆలా ప్రవర్తిస్తాడు, ఆలోచనలు అటు పోతూ ఉంటాయి.

ఆలోచన అంటే?

మనము కళ్లు మూసుకున్నా కూడా ఆలోచన వస్తుంది. అందుకనే ‘లోచనము’ అన్నారు. కళ్ళు మూసినా కూడా చూడగలిగిన వస్తువు మన ఆలోచన. ఉదాహారానికి మనము ఆలోచనలో విమానంలో వెళ్తున్నాము. ఆలోచనలో నిముషములో అమెరికా వెళ్ళొచ్చాము, ఆలోచనలో దేవాలయానికి వెళ్ళాము, ఆలోచనలో ఒక పార్టీకి వెళ్ళాము, ఒక సినిమాకి వెళ్ళాము. ఏదన్నా మనము ఆలోచించవచ్చు. ఆలోచనకు నియంత్రణ అంటూ ఏమి లేదు. మరి దేనికున్నది నియంత్రణ అంటే ఒక ‘మనస్సుకు’ మాత్రమే. కాబట్టి దానికి ‘ధర్మాధర్మ విచక్షణ’ అవసరం.

ఆలోచనకు మనము ‘ధర్మాధర్మ విచక్షణ’ కలిగించాలి అంటే, ఎప్పుడూ సాధన ద్వారా ధర్మము నందు ఆలోచన చేసే విధముగా మనము కృషి చెయ్యాలి. ధర్మము అంటే, ‘పది మందికి మేలు కలిగే విధముగా మన ఆలోచనలు ఉండే విధముగా మనము మార్చుకోగలిగితే, మన ఆలోచనలు ఆ విధానం అలా వెళ్లగలిగితే, ఆలోచనలు అలా చెయ్యగలిగితే మనిషి ఉన్నత స్థితికి చేరుకుంటాడు’, అని పెద్దలు పేర్కొంటారు. మనిషి యొక్క ప్రవర్తనకు మూలం ఏమిటి అంటే ‘ఆలోచనలు’. ఈ ఆలోచనలు నియంత్రించాలంటే మూలం ఏమిటి అంటే ‘మనస్సును నియంత్రించాలి’. మనస్సును నియంత్రించాలి అంటే మూలం ఏమిటి అంటే, ‘తాను ఎటువంటి వ్యక్తులతో ఉంటున్నాడు, ఎటువంటి స్నేహితులతో ఉంటున్నాడు, ఎటువంటి వారి మనస్తత్వం ఎలా ఉన్నది, వారి ఆలోచనా విధానాలు ఎలా ఉన్నాయి’, అనేటటువంటి దానిని బట్టి, తదనుగుణముగా మన మనస్సును నియంత్రించుకోగలుగుతాము.

అయితే సమాజములో ఉన్నపుడు, పది మందితో తిరుగుతున్నప్పుడు అందరి ఆలోచన ఒక్కలాగా ఉంటుందా? ఉండే అవకాశం లేదు, ఎవరి విధానం వారిది. కాబట్టి మన ఆలోచనలు మనము ఎప్పటికప్పుడు నిర్ణయించుకొని, దాన్ని మనం నియంత్రించుకొని, ‘అది అవతలి వారి ఆలోచన’, అని దాన్ని మనము సర్దుకొనిపోగలగాలి, ఎందుకంటే సమాజములో ఉన్న మనుష్యులము కనుక.

ఇతరుల ఆలోచనలకు కూడా మనము విలువిస్తూ, అది గనుక ఆమోదయోగ్యమైన ఆలోచన అయితే, ఆ ఆమోదయోగ్యమైన ఆలోచనతో ఏకీభవిస్తూ, ఒకవేళ ఏకీభవించలేని పరిస్థితి ఉంటే (Agree or Disagree) అవతలి వ్యక్తితో, “అయ్యా! నీ ఆలోచన నీది, నా ఆలోచన నాది. మనము ఈ ఆలోచనల విషయమై ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నాము. కనుక నీ ఆలోచనతో నువ్వు ఉండు, నా ఆలోచనతో నేను ఉంటాను”, అని చెప్పి అక్కడినుంచి తప్పుకోవటం విశేషం అని Personality behavioursలో పెద్దలు చెప్తూ ఉంటారు.

‘పరోపకార పుణ్యాయ, పాపయ పరపీడనం’ అన్నారు కనుక మన ఆలోచనలు ఎప్పుడూ పరులకు ఉపయోగపడే విధముగా ఉండేలా ఉంటూ, ఆ ఆలోచనలకు అనుగుణముగానే మనము ముందుకు వెళ్లగలిగితే, మనకు విశేషమైన ఫలితం లభిస్తుంది అని అనుభవపూర్వకంగా పెద్దలు చెప్పారు.

ఆలోచనలు నియంత్రించటం ఎలా?

ఆలోచనలు నియంత్రించటంలో పెద్దలు మనకు ఒక కథ చెప్తారు.

 ఒక ముని భగవంతుడి గురించి విశేషముగా తపస్సు చేసాడు. భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ‘నాకు మూడు వరాలు కావాలి’, అన్నాడు. ‘సరే’, అన్నాడు భగవంతుడు. ఆ ముని పేదవాడు కావున ‘నాకు ఒక పెద్ద ఇల్లు, ఆస్తి’, ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. వర ప్రభావమున అతనికి ఇల్లు, ఆస్తి సమకూరాయి. రెండవ వరముగా అత్యంత సౌందర్యవతి అయిన భార్యను కోరుకున్నాడు. అతనికి ఒక చక్కని భార్య లభించింది.

వెంటనే అతనికి ఒక అనుమానం కలిగింది, “నేను కోరుకున్నవన్నీ వెంటనే నేరవేరుతున్నాయి, ఇవన్నీ పోవు కదా”, అనుకున్నాడు. అంతే వెంటనే అవన్నీ పోయాయి. ‘యద్భావం తద్భవతి’.

‘మనము ఏ ఆలోచన చేస్తామో, Negative Thoughts గనుక మన మనస్సులోకి రానించామంటే, అది అలాగే జరుగుతుంది’, అని ఈ కథ ద్వారా మనము తెలుసుకోవాలి. మరొక చిన్న కథ. ఇద్దరు మునులు ఒకచోట కూర్చొని తపస్సు చేస్తున్నారు. వారిరువురికి పడదు, ఒకరంటే ఒకరికి ద్వేషం. కొంతకాలానికి వారిలో ఒకరికి భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. “నీకు ఏమి వరం కావాలి”, అన్నాడు భగవంతుడు.

అప్పుడతను, “స్వామి నా పక్కనున్న వాడు ఏమి కోరాడో దానికి రెట్టింపు నాకు అనుగ్రహించు”, అన్నాడు. ‘సరే’ అన్నాడు భగవానుడు. తరువాత రెండవ వానికి భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ రెండవవాడు, “స్వామి నాకు ఒక కన్ను పోవాలి”, అన్నాడు. ‘తధాస్తు’ అన్నాడు స్వామి. అంతే రెండవ వాడికి ఒక కన్ను పోయింది, మొదటి వానికి రెండు కళ్ళు పోయాయి.

ద్వేషభావనతో, చెడు ఆలోచనలతో వారిరువురు చివరికి ఆ స్థితిని తెచ్చుకున్నారు.  ఇలాంటి భావనలు ఉండకూడదు, వాటి వలన ఎవరికి ఉపయోగం ఉండదు. మనము ఎప్పుడూ ‘సద్బుద్ధి, సత్ చింతన, సదాలోచన’, కలిగి ఉండాలి. అప్పుడే మన జీవితం ఆనందమయముగా ఉంటుంది.

 ధర్మస్య విజయోస్తు.

K C Das Memorial Charitable Trust

Paropakarardham Idam Sareeram

  • Instagram
  • YouTube
  • Facebook
Address
H.No. 11-13-119, 14/B, Road No. 3, beside Axis Bank, Alkapuri Colony, Ramakrishnapuram, Kothapet, Hyderabad, Telangana 500035
View on map
Contact
contact@kcdastrust.org
+91 94948 77070
04:00 PM to 08.30 PM IST

© 2026 K C Das Memorial Charitable Trust. All rights reserved.

Terms and ConditionsPrivacy Policy