Skip to navigation
K C Das Memorial Charitable Trust
Donate
  • Home
  • About
  • Library
    • Dharma Vaani
    • Sri Lalitha Sahasra Naamavali
    • Dharmavaaradhi e-Magazine
    • Guru Vaani
    • Saradamba TV (Grandly Launched)
  • Dharmika Programs
    • All programs
    • Hanuman Chalisa
    • Gayathri Japam
    • Bala Japam
    • Calendar
  • Spiritual Education
  • Community Welfare
  • Contact
Donate
  • Instagram
  • YouTube
  • Facebook
  • Instagram
  • YouTube
  • Facebook
Donate

యద్భావం తద్భవతి

సన్మార్గంలో నడవడానికి మన పూర్వీకులు, మహర్షులు మనకి ఎన్నో మార్గదర్శకాలు చేశారు. వాటిల్లో ఏ ఒక్క మార్గం పట్టుకున్నా మనం సన్మార్గాన్ని విడిచిపెట్టే అవకాశమే ఉండదు. అటువంటి ఒకానొక మార్గదర్శకము “యద్భావం తద్భవతి”, అని రెండే రెండు పదాల్లో చెప్తారు.

 ఇది సరిగ్గా మనం అర్థం చేసుకుంటే మనిషిని నడిపిస్తుంది, మహనీయుడిని చేస్తుంది.

బంధనం – మనస్సు:

మహాత్ముడిగా తనను తాను మరల్చుకోవడానికి కావలసినటువంటి ఒకే ఒక వాక్యం ‘యద్భావం తద్భవతి’. ‘యధాభావం తథా భవతి’, అని ఉపనిషత్ పేర్కొంటోంది. “నువ్వు ఎలా ఆలోచిస్తావో You Will Be the Person What You Are in Your Mind”, అని చెప్పడమే దీని యొక్క ఉద్దేశం. దీనికి మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక సూచన చేస్తారు. ఆయన అంటారు, “మనయేవ మనుష్యానాం కారణం బంధ మోక్షయోః”, అంటే ‘మనస్సే మనిషికి తనకు తాను బంధించుకోవడానికి గాని తనను తాను విడిపించుకోవడానికి గాని కారణం’.

 బంధించుకోవడం అంటే ‘ఇది నా వల్ల అవ్వదు, ఇది నేను చేయలేను, ఇది నా శక్తికి మించినటువంటిది’, అని ఆలోచించడం. ‘దివిజ గంగ భువిదింపిన’ భగీరథుడు మానవుడే. ఆయనేమి ఆకాశం నుంచి ఊడిపడ్డటువంటి వాడు కాదే. అలాగే ఒక తారగా మారిపోయినటువంటి ధ్రువుడు కూడా మానవుడే.  సృష్టికి ప్రతిసృష్టి చేసినటువంటి విశ్వామిత్రుడు కూడా నరుడే. ఇవాళ ‘గ్రహరాశులన్నీ దాటి గగనాంతర రోదశిలో గంధర్వ గోళ గతులు దాటి చంద్రలోకమైనా దేవేంద్ర లోకమైనా’, జయించి మళ్ళీ తిరిగి వస్తున్నది మానవులే. ‘నా వల్ల ఎక్కడ అవుతుంది’, అనుకుంటే ఇది అయ్యే పనేనా? కాదు కదా!

ఎవరో ఒకరు ఆలోచన చేశారు, ‘నేను వెళ్ళగలుగుతాను, నేను చేయగలుగుతాను’, అని చేసి చూపించారు. వాళ్ళు చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేము అనేటువంటి ఆలోచన మనకి రాగలగాలి. అది రావడమే యద్భావం. యత్ ‘ఏ విధమైనటువంటి భావన కలుగుతుందో, ఆ విధంగానే జరుగుతుందయ్యా నీకు’. భావనలు ఎలా ఉంటాయో చెప్పడం కోసం మహాభారతంలో ఒక ఘట్టం మనకు కనిపిస్తుంది.

యద్భావం తద్భవతి – మహాభారత కథ

పాండవులు కౌరవులు వీరంతా చిన్నతనం. అప్పుడప్పుడే విద్య నేర్చుకుంటున్నారు. భీష్ముడు వారి దగ్గరికి వెళ్ళారు. “తాతగారు మేము అవి నేర్చుకున్నాం, ఇవి నేర్చుకున్నాం”, అన్ని చెప్తున్నారు. నిండు సభ తీరి ఉన్నది.

దుర్యోధనుని పిలిచాడు, “దుర్యోధనా మనవాళ్ళందరిలో ఈ సభలో ఒక మంచివాడిని చూపించవయ్యా”, అన్నారట. దుర్యోధనుడు చూశాడు. ఎదురుకుండా తాతగారు కనిపించారు. ఈయన వివాహము చేసుకోకుండా ఉన్నటువంటి వాడు, కాబట్టి ఈయన మంచివాడు కాదు అనుకున్నాడట. తరువాత ద్రోణాచార్యుడి వైపు చూశాడట. ఈయన మట్టికుండలో పుట్టాడు, ఈయన గొప్పవాడు కాదు అనుకున్నాడట. తన తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడిని చూశాడు. ఈయన గుడ్డివాడు కాబట్టి గొప్పవాడు కాదు అనుకున్నాడట.

అలా ఒక్కొక్కరిని చూస్తూ వాళ్ళల్లో ఉండేటువంటి ఏదో ఒక వెలితి మాత్రమే చూడటం మొదలుపెట్టాడు. అందరిని చూసుకుంటూ వచ్చి “తాతగారూ! నాకు ఎవ్వరు కనబడటం లేదండి. అందరికి ఏదో ఒక లోపం ఉన్నది”, అన్నాడట. “ఓహో అలాగా! సరే నాయన సంతోషం”, అని భీష్ములవారు పేర్కొన్నారు.

ధర్మరాజుని పిలిచాడు. “నాయనా ధర్మరాజా! నువ్వు చూడవయ్యా ఎవరన్నా ఒకరిని మంచివాడిని”, అన్నాడట. ఆయన తాతగారిని చూశాడు. ఈయన ఈ వంశం కోసం త్యాగం చేసిన మహనీయుడు, ఈయన మంచివాడే అనుకున్నాడు. అటు పక్కన గురువుని చూశాడు. ఇంతమందికి విద్య నేర్పినటువంటి మహనీయుడు, ఈయన మంచివాడే అనుకున్నాడు. అటు పెదనాన్నగారిని చూశడు. కళ్ళు లేకపోయినా మమ్మల్ని అందరినీ సమానంగా చూస్తున్నారు, ఈయన మహనీయుడే అనుకున్నాడు. అలా ప్రతి వాళ్ళని చూసుకుంటూ వచ్చి “తాతగారూ! నాకు అందరూ మంచివాళ్ళుగా కనబడుతున్నారు.”, అన్నాడట. “యద్భావం తద్భవతి”.

చివరికి ఏమైంది? ఆ ఉన్నటువంటి మహనీయులందరూ కూడా దుర్యోధనుడికి వ్యతిరేకంగా అయ్యారు, ధర్మరాజుకు అనుకూలంగా అయ్యారు. “నీ భావన ఎలా ఉంటుందో, నీ భవిష్యత్తు కూడా అలాగే ఉంటుంది”, అని చెప్పడం కోసం ఈ ఉదంతం. మన ఆలోచనలు ఎప్పుడూ కూడా Positive Mental Attitude ఉండాలి అంటుంది Psychology.

ఆధునిక విద్య కూడా మనస్సును ఎప్పుడూ Positive గానే ఉంచుకోవాలి అని పేర్కొంటోంది. ఎలా సాధ్యం ఇది? ‘సత్సంగము’ ద్వారా ఇది సాధ్యం. సత్పురుషులతో గడిపితే, సత్చింతన చేస్తూ సదాలోచనలు చేస్తే, సన్మార్గంలో నడుస్తూ ఉంటే, ఇది తప్పకుండా సాధ్యం.  కాబట్టి ఆ Positive Mental Attitude అనేటువంటి develop ఎలా చేసుకోవాలి అంటే ‘మన మనస్సు’ ద్వారానే అది సాధ్యం. వదిలిపెట్టినా మనస్సే వదిలిపెట్టాలి, పట్టుకున్నా మనస్సే పట్టుకోవాలి.

గీతలో శ్రీకృష్ణులవారు పేర్కొంటారు, ‘అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేవరమ్’, అని. అంటే ‘శరీరాన్ని విడిచిపెట్టేటువంటి కాలంలో నన్ను(భగవంతుడిని) స్మరణ చేస్తూ వదిలిపెడితే నన్నే(భగవంతుడిని) చెందుతావు’, అని. మన మనస్సుకు ఉండేటువంటి శక్తి అపరిమిత శక్తి. మన ఆలోచనలకు, మన ఊహలకు అందనటువంటి శక్తి కలిగినటువంటిది మన మనస్సు. అయితే ఐహికమైనటువంటి విషయాలలో, లౌకికమైనటువంటి విషయాలలో మన చుట్టూ జరుగుతున్నటువంటి కొన్ని Negative విషయాలలో మనం ఎక్కువ Involve అయిపోయి మన మనస్సును ఆ విధంగా మనమే మలినం చేసుకుంటూ ఉంటాము. అలా చేసుకోకుండా ఉండటమే సన్మార్గం.

దురాలోచన:

 సరైనటువంటి ఆలోచన కలిగితే, భావనలు గనుక సరిగ్గా ఉంటే (Positive, Productive, Constructive), పది మందికి ఉపయోగపడే విధంగా మన ఆలోచనలు గనుక మనం మరల్చుకోగలిగితే మనమే మహనీయులుగా మారతాం. ఎవరు మహాత్ముడు అంటే ‘పది మంది గురించి ఆలోచించగలిగేవాడు మహాత్ముడు, తన గురించి మాత్రమే తాను ఆలోచించేవాడు సామాన్యుడు’ అన్నారు. సామాన్యుడికి మహాత్ముడికి తేడా ఎక్కడ ఉన్నది అంటే ‘ఆలోచనలోనే ఉన్నది, భావనలలోనే ఉన్నది’.

 మనకి నీతిశాస్త్రంలో ఒక కథ చెప్తారు. ఒకరిని చూసి మరొకరు పోటీ పడుతూ ఉంటే దాని ప్రమాదం ఎలా ఉంటుంది అని చెప్పడం కోసం ఈ కథ.

ఒక అడవిలో ఒక ఋషి కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడట. ఒకాయన అటుగా వచ్చాడు. ఆయన్ని చూసాడు. ఆయన్ని చూసి ఈయనకు కూడా తపస్సు చేయాలనిపించింది. ఈయన కూర్చొని తపస్సు చేస్తున్నాడు. కొంతకాలం తరువాత వారిలో ఒకరికి (ముందు ఎవరు అయితే తపస్సు చేశారో వారి ముందు) దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు, అక్కడి నుంచి మళ్ళీ ఈయన దగ్గరికి వచ్చాడు. ఈయనకి ఏం కావాలో ఈయన అడగొచ్చు కదా, అడగకుండా “ఆయన ఏమి అడిగాడో దానికి రెండింతలు ఇవ్వండి స్వామి”, అని అడిగాడు. అప్పుడు భగవంతుడు అతనితో, “నాకు ఒక కన్ను తీసేయమన్నాడయ్యా ఆయన. కాబట్టి నీకు రెండు కళ్ళు తీసేస్తున్నాను”, అన్నాడు.

ఇటువంటి ఆలోచనలు అవసరమా అండి? ఎందుకు అటువంటి ఆ శ్రమ పడడం, ఎందుకు ఆ ఆలోచన చేయడం? మన మనస్సులో ఎటువంటి ఆలోచన కలుగుతుందో ఆ ఆలోచనకు అనుగుణంగానే మన పనులు కూడా ఉంటాయి. మనస్సులో కలిగేటువంటి ఆలోచనలు ఎప్పుడూ కూడా సత్చింతనతో ఉంచుకోగలిగితే, అంటే దురాలోచనలు, దుర్మార్గపు ఆలోచనలు రానీయకుండా, మనస్సులో ఎప్పుడూ సదాలోచనలే కలిగి ఉంటే అప్పుడు మనం సంతోషంగా ఉండొచ్చు.

అందుకని ‘యద్భావం తద్భవతి’ అన్నది. మనకి మహర్షులు ఇచ్చినటువంటి మార్గదర్శకం అందుకోసమే ఇచ్చారు.

మనస్సు – సదాలోచన:

‘నీ ఆలోచనలు సరిగ్గా ఉన్నాయా లేవా అని నువ్వు చూసుకో. ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. ఈ ఆలోచనలు గనుక చెడు మార్గములో వెళ్తూ ఉంటే వాటిని పోగొట్టుకో’. ఎలా పోతాయి? పుస్తకాలు చదవడం ద్వారా పోతాయి. Reading Should Become a Habit. Leaders are readers అంటారు. జీవితంలో పైకొచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, పుస్తకాలు చదివే పైకి వచ్చినటువంటి వారు. వారి Hobby ఏమిటి అని అడగండి, Reading A Book అంటారు.

పనికొచ్చే పుస్తకాలు, సదాలోచన కలిగించే పుస్తకాలు, సద్బుద్ధిని ప్రేరేపించే పుస్తకాలు, మహర్షుల జీవితాలకు సంబంధించిన పుస్తకాలు, వారి యొక్క నడవడికను మనకు నేర్పేటువంటి పుస్తకాలు. ఇటువంటి పుస్తకాలు చదవడం ద్వారా మనస్సును నిర్మలముగా ఉంచుకోవచ్చు.

మనస్సును నిగ్రహించడం చాలా కష్టం. మనస్సుకు కావలసింది, అక్కర్లేనిది అంటూ ఏమీ ఉండదు. భావనలు సృష్టించేది మనస్సే, భావనకు కారణం మనస్సే. ఈ మనస్సుకు అక్కర్లేనిది అంటూ ఏమీ ఉండదు. అందుకని సనాతన ధర్మంలో మహర్షులు మనస్సుని కోతితో పోలుస్తారు. కోతికి అక్కర్లేనిది అంటూ ఏమి ఉండదు. మీరు అక్కడ ఒక Passport పెట్టండి అది పట్టుకొని వెళ్ళిపోతుంది. దానికి ఎందుకు ఆ Passport? ఏం చేసుకుంటుంది? ఆ ఆలోచన దానికి ఉండదు. అందుకని మనస్సును కోతితో పోలుస్తారు. మనస్సుకు అక్కర్లేనిది అంటూ ఉండదు, అన్ని విషయాలను పట్టుకుంటూ ఉంటుంది.

ఒక సాధనా మార్గము ద్వారా మనస్సును నియంత్రించగలగాలి. మనస్సు అనేటటువంటి పరిగెత్తే గుర్రం వంటిది. పరిగెడుతూ ఉన్నటువంటి ఆ గుర్రాన్ని బుద్ధి అనేటువంటి కళ్ళెం వేసి గనక మనం పడితే అప్పుడు అది సద్విషయాల మీదకు మాత్రమే పోతూ ఉంటుంది, సత్చింతన మాత్రమే చేస్తూ ఉంటుంది, సదాలోచనలో ఎప్పటికి ఉంటుంది, సన్మార్గంలోనే మనల్ని నిలబెడుతుంది.

ఈ మనస్సును నిగ్రహించడం అంత తేలిక కాదు.

భగవద్గీతలో అర్జునుడు అంటాడు కృష్ణుడితోటి, “ఈ మనస్సు చంచలంగా ఉంది. కృష్ణా నువ్వు చెప్తున్నావు, కానీ దాన్ని నియంత్రించడం కష్టంగా ఉంది. ఇది చాలా ప్రమాదంగా ఉంది, బలంగా ఉంది, దృఢంగా ఉంది. దీన్ని నియంత్రించడం చాలా కష్టంగా ఉంది కృష్ణా”, అని. అప్పుడు, “అంత తేలిక కాదయ్యా మనస్సు నిగ్రహించడం. కానీ అభ్యాసము (Practise) ద్వారా మనస్సును సద్విషయాల యందు మాత్రమే ఉంచి, దుర్విషయాలు దుర్వ్యసనాల వైపు ఆలోచనలు పోనీయకుండా మనస్సును నిగ్రహించి, మనస్సును నియంత్రించగలగాలి”.

తద్వారా ఆలోచనలను మనం కట్టడి చెయ్యగలిగితే, అప్పుడు సదాలోచనలు మాత్రమే కలుగుతాయి.

సదాలోచనల ద్వారా సత్కర్మలను మాత్రమే ఆచరిస్తాం, సత్కర్మల ద్వారా సత్ఫలితాలను మాత్రమే పొందుతాం తద్వారా సన్మార్గంలోనే మన ప్రయాణం ఉంటుంది. దానివల్ల ఉత్కృష్టమైనటువంటి ఫలితాలు మనకు లభిస్తూ ఉంటాయి. కాబట్టి సన్మార్గంలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే ‘యద్భావం తద్భవతి’.

మన భావనలు ఎప్పుడూ కూడా Positive గానే ఉండాలి. ఆలోచనలు Negative వైపు రానియకూడదు. మంచి విషయాలను మాత్రమే చూస్తూ ఉండాలి, మంచిని మాత్రమే మనస్సుకు అందిస్తూ ఉండాలి, మంచిని మాత్రమే ఆచరిస్తూ ఉండాలి, మంచి ద్వారా సన్మార్గంలోనే మనం నడుస్తూ ఉండాలి.

                         ధర్మస్య విజయోస్తు.

K C Das Memorial Charitable Trust

Paropakarardham Idam Sareeram

  • Instagram
  • YouTube
  • Facebook
Address
H.No. 11-13-119, 14/B, Road No. 3, beside Axis Bank, Alkapuri Colony, Ramakrishnapuram, Kothapet, Hyderabad, Telangana 500035
View on map
Contact
contact@kcdastrust.org
+91 94948 77070
04:00 PM to 08.30 PM IST

© 2026 K C Das Memorial Charitable Trust. All rights reserved.

Terms and ConditionsPrivacy Policy