Skip to navigation
K C Das Memorial Charitable Trust
Donate
  • Home
  • About
  • Library
    • Dharma Vaani
    • Sri Lalitha Sahasra Naamavali
    • Dharmavaaradhi e-Magazine
    • Guru Vaani
    • Saradamba TV (Grandly Launched)
  • Dharmika Programs
    • All programs
    • Hanuman Chalisa
    • Gayathri Japam
    • Bala Japam
    • Calendar
  • Spiritual Education
  • Community Welfare
  • Contact
Donate
  • Instagram
  • YouTube
  • Facebook
  • Instagram
  • YouTube
  • Facebook
Donate

మనిషి మార్చుకోవాల్సిన లక్షణం – కోపం

మహర్షులు, మన పూర్వీకులు, మన పెద్దలు, మన తాత ముత్తాతలు మన జీవనం ఆనందంగా ఎలా గడుపుకోవాలో సులభమైనటువంటి పద్ధతులలో, తేలికైనటువంటి మాటలలో, చక్కనైనటువంటి అంశాలను వేరు వేరు సందర్భాలలో నీతి సూత్రాలతో, నీతి శతకాల పేరిట, ఆచరణ యోగ్యమైనటువంటి సామెతల రూపంలో మనకు అందిస్తూ వచ్చారు. అందులో ఒకటి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.

కోపం – క్షమ:

మనిషికి ఉండేటువంటి స్వభావం (Emotional Imbalance) మానసిక అసమతుల్యత. ఇందులో ఒకానొక లక్షణము ‘క్రోధం’. దీన్ని అరిషడ్ వర్గములలో ఒకటి అన్నారు. అరి అంటే ‘శత్రువులు’, షడ్ అంటే ‘ఆరు లక్షణాలు’. ఇవి మనిషిని పాడు చేసేటువంటివి. పాడు చేయడం అంటే ‘సన్మార్గంలో వెళ్ళనీయకుండా ఉంచడం’. ఆ లక్షణాలలో ఈ క్రోధం అనేటువంటిది అతి విశేషంగా చెప్తూ ఉంటారు.

ఒకానొకప్పుడు కృష్ణ పరమాత్మని అర్జునుడు అడిగాడు, “కృష్ణా చాలామందిని చూస్తూ ఉంటాను. వాళ్ళు మంచి పని చేద్దామనే అనుకుంటూ ఉంటారు, కానీ ఎవరో వాళ్ళతో చెడ్డ పని చేయించినట్లుగా చేస్తూ ఉంటారు. వాళ్ళంతా మంచివాళ్లే, సహృదయులే, సదాలోచన కలిగినటువంటి వారే, సత్ప్రవర్తనలు ఉన్నటువంటి వారే. కానీ ఎందుకు వాళ్ళు అటువంటి తప్పులు చేస్తూ ఉంటారు?” మనం కూడా మన జీవితంలో అనేక మందిని చూస్తూ ఉంటాం. మంచివాళ్లే, సదాలోచన కలిగినటువంటి వాళ్లే, సత్ప్రవర్తన ఉన్నటువంటి వారే, సత్చింతన కలిగినటువంటి వారే కానీ కోపం వచ్చిందంటే మాత్రం నరరూప రాక్షసులుగా మారిపోతూ ఉంటారు.

“తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు తన సంతోషమే, స్వర్గము తన దుఃఖమే, నరకమండ్రు తద్యము సుమతి”, అని సుమతి శతకం చెప్తుంది. ‘కోపం ఒకటి ఉంటే చాలు తనను తాను పాడు చేసుకోవడానికి, ఇంకా వేరే శత్రువులతో పనే లేదు’, అని చెప్తుంది ఈ శతకం.

 కోపం వచ్చినప్పుడు కావలసినటువంటి గుణం ఏమిటి అంటే ‘క్షమా గుణం’. కోపం రావడం సహజం, ఉప్పుకారాలు తింటున్నాం కాబట్టి కోపం వస్తుంది. కానీ కోపం వచ్చినప్పుడు వెంటనే దాన్ని నిగ్రహించుకొని ‘క్షమ అనేటువంటి గుణాన్ని నేను అలవరుచుకోవాలి’, అని మనకి మనం చెప్పుకొని ఆ క్షమా గుణాన్ని పెంపొందించుకోవాలి. అప్పుడు ఏ వ్యక్తి మీదైతే కోపం వచ్చిందో అతన్ని క్షమించి వదిలేస్తాం.

ఇందుకు సంబందించిన ఒక ఉదాహరణ మనకు మహాభారతంలో కనబడుతుంది.

మహాభారత ముగిసిన తరువాత జరిగిన సంఘటన ఇది. ఆ సమయంలో ఇక మిగిలింది ఒక అశ్వద్ధామ మాత్రమే. ఈ అశ్వద్ధామకు పాండవులు లేకుండా చేయాలనేటువంటి ఆలోచన కలుగుతుంది. ‘ఉపపాండవులు అనేటువంటి ఐదుగురు పిల్లలు ఉన్నారు కదా, ఈ పాండవ వంశం ఉంటుంది కదా, నిర్వీర్యం చేద్దాం వంశాన్ని’, అనేటువంటి దురాలోచన కలుగుతుంది. రాత్రి సమయంలో నిద్రిస్తున్న ఆ ఉపపాండవులందరినీ చంపివేస్తాడు. ఆ విషయం అర్జునుడికి తెలుస్తుంది. ‘ఏమైనా సరే అశ్వద్ధామను పట్టి తీసుకొస్తానని’ శపదం చేసి పట్టి తీసుకొస్తాడు. అతన్ని చంపబోతుంటే ద్రౌపది అడ్డం పడుతుంది.

“నువ్వు ఇతన్ని చంపావు అంటే నేను నా కొడుకుల్ని పోగొట్టుకొని ఎంత బాధపడుతున్నానో ఇతని తల్లి అంత బాధపడుతుంది కదా? ఆ విషయం మనం ఆలోచించాలి. కాబట్టి క్షమించి వదిలి పెట్టేసేయి”, అంటుంది.  క్షమ అంటే అసమర్థత కాదు అది వీర్య లక్షణం. కోపం వచ్చినప్పుడు క్షమించడం అనేటువంటిది మనం నేర్చుకోగలగాలి, అది అలవాటు చేసుకోవాలి. ‘దయ’ చుట్టం అన్నారు.

దయ, దయాగుణం కలిగి ఉండడం మన చుట్టంగా మనకి చాలా సందర్భాల్లో ఉపయోగపడుతుంది. దీని వల్ల ఏం జరుగుతుంది అంటే ‘తన సంతోషమే స్వర్గము’. శరీరం వదిలిపెట్టేసిన తర్వాత ఎక్కడికో వెళ్తాము, ఎక్కడో సంతోషంగా ఉంటాం అని భావించటం సరికాదు. ఇక్కడ ఉన్నప్పుడే సంతోషంగా ఉండగలగాలి. స్వర్గంలో ఉన్నట్లు సంతోషంగా ఉండాలి అంటే క్రోధాన్ని జయించాలి.

కోపం – మోహం – బుద్ది:

కోపము అసురీ లక్షణం. ‘క్రోధః పారుష్యమేవ చ’, అంటుంది శాస్త్రం. క్రోధం ఆంటే కోపం. కోపము మనిషిని అథః పాతాళానికి తీసుకెళ్లిపోతుంది. “క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః | స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి ||”, అని గీతా వాక్యం.

కోపం వల్ల ‘మోహము’ ఏర్పడుతుంది. మోహము ఆంటే ‘లేని విషయం ఉన్నది అనేటువంటి ఆలోచన’, లేనిది ఉన్నట్టుగా భ్రమింపచేసేటువంటి లక్షణము. అక్కడ జరగకపోయినా జరిగిందేమో అని భ్రమపడటం.   జరగని విషయం ఏదో జరిగిపోయిందని, లేదా జరిగిపోతుందని, జరగకూడని జరిగిపోయిందని ఏవేవో ఊహించేసుకుంటూ ఉంటాడు. ఆలోచన పటిమ తగ్గిపోతూ ఉంటుంది.

ఉదాహరణకు, ద్రౌపది తనను చూసి నవ్వకపోయినా, నవ్వింది అనే భ్రమలో ఉండిపోయాడు దుర్యోధనుడు, తద్వారా మోహానికి, కోపానికి లోనైనాడు. నిజానికి అది జరగలేదు. అతని భావన మాత్రమే. కానీ దాని వల్ల కోపం పెంచుకున్నాడు. ఆంటే లేని విషయాన్ని ఉన్నట్లుగా ఆపాదించుకోవటం. చాలా సందర్భాలలో మనకి కోపం ఎందుకు వస్తుందంటే ఆ భ్రమ వలెనే. “నేనలా అనలేదండి, నా ఉద్దేశ్యం అదికాదండి”, అని అవతలి వ్యక్తి చెప్పేంతవరకు మనము కోపాన్ని పెట్టుకుంటాము.

అందువల్ల “క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః”. ఈ సమ్మోహం వల్ల స్మృతి విభ్రమః కలుగుతుంది, అంటే గతంలో అతని ద్వారా జరిగినటువంటి మేలు గాని సహాయం గాని అన్ని మర్చిపోతాడు. గతములో అతను చేసిన మేలు ఏమిటి, సహాయం ఏమిటి ఇత్యాదివన్నీ కూడా మర్చిపోయి అతని మీద కోపాన్ని పెంచుకుంటాము. “స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి” – కోపం వలన మన ‘బుద్ది’ నశిస్తుంది. తనను తాను నిగ్రహించుకోవడం మర్చిపోతాడు, పశువులాగా ప్రవర్తిస్తాడు.

అందుకనే మీరు గమనించండి కోపంలో ఉన్నటువంటి వారు గట్టిగా అరుస్తూ ఉంటారు. ‘ఎందుకంత గట్టిగా అరుస్తున్నావ్? నేను పక్కనే ఉన్నాను కదా”, అంటాడు అవతల వ్యక్తి. ఎక్కడ ప్రేమ ఉన్నదో అక్కడ ఆనందంగా గడుపుతూ ఉంటారు. ఎక్కడ ద్వేషం ఉంటుందో అక్కడ గొంతు లేస్తుంది, అరుస్తూ ఉంటాడు. కాబట్టి ‘క్రోధాద్భవతి సమ్మోహ’, అది కూడా లక్షణం పనికి రాదు అన్నారు. అందువల్ల మహర్షులు మనకి ఏం చెప్పారంటే, “నాయనా కోపం రావడం సహజం. కోపం వస్తుంది, కానీ వచ్చిన కోపాన్ని (ఉత్తమే క్షణికాత్ కోపం) క్షణంలో నిగ్రహించుకోవడం అలవాటు చేసుకో. కోపం వచ్చిందని ఆ కోపానికి నువ్వు వశుడవు కాకూడదు. కోపం నీ వశంలో ఉండాలి”.

పురాణాల్లో దుర్వాస మహాముని అంటే కోపానికి ప్రతీక. దుర్వాస మహాముని కథలన్నీ కూడా మనకు అలాగే కనబడతాయి. కానీ ఆయన కోపము లోక కళ్యాణ హేతువు. ఆయనకి కోపం వచ్చింది అంటే లోక కళ్యాణం ఏదో జరుగుతోంది అని అర్థం. అలా మనకు వచ్చినటువంటి కోపము ద్వారా మనం లోక కళ్యాణం వరకు పోలేకపోయినా కనీసం మన ఇంట్లో కళ్యాణం (శుభము), మంగళము, ఆనందకరమైనటువంటి విషయాలు జరిపించుకోవడానికి ఆ కోపాన్ని మనం మరల్చుకునే విధంగా చేసుకోగలిగితే అది ఉత్తమం.

కోపం ఎంత సేపు ఉండాలి?

“ఉత్తమే క్షణిక:కోప: | మధ్యమే ఘటికాద్వయమ్‌ | అధమే స్యాత్‌ అహోరాత్రం | పాపిష్టే మరణాన్తక: ||” అన్నారు. “ఉత్తమే క్షణిక:కోప:” – ఉత్తముడైనటువంటి వాడు కోపాన్ని క్షణములో పోగొట్టుకోగలగాలి. ఎలా పోగొట్టుకుంటాడు? తనకు తాను అక్కడ ఉన్న విషయాలేమిటో అర్థం చేసుకోగలగాలి. దానికి పెద్దలు ఏమిచెపుతారంటే – Blame it on yourself, Don’t Blame it on others.

ఉదాహరణకు “ఇవాళ ఆఫీస్ కు ఎందుకు లేటుగా వచ్చావు?” ఆంటే, “బస్సు ఆలస్యమైనది” అంటాము. కానీ కొంచము ముందరగా లేచి రావచ్చు కదా? సహజముగా మన ప్రవృతి ఎలా ఉంటుందంటే అవతలి వ్యక్తి మీద నింద వేస్తాము తప్ప, ‘మనము ఏమిచేసుంటే ఆ పరిస్థితి రాకుండా ఉండేదో’, ఆ ఆలోచన చెయ్యము. ‘అది చేద్దాము’, అప్పుడు మనకు కోపం ఉండదు. ‘బహుశ నేను ఇలా అనకుండా ఉండవలసినది, నేను అన్నందుకు కదా అతను అలా మాట్లాడాడు’, అని గనుక ఆలోచించుకోగలిగితే కోపాన్ని క్షణములో పొగొట్టుకోగలుగుతాము.

రామాయణంలో మనకి ఇటువంటి సందర్భాలు కనబడతాయి. రాముడంతటి వాడికి కూడా కోపం వచ్చింది కానీ తన కోపాన్ని వెంటనే ఉపసంహరించుకున్న లక్షణాలు కనిపిస్తాయి.

ఒకానొక సందర్భములో మూడు రోజుల పాటు సముద్రుని ధ్యానం చేస్తాడు రాముడు. ‘ఈ వానర సైన్యం అంతా లంకా పట్టణానికి చేరడానికి దారి ఇవ్వమని నా అంతటి వాడు కోరితే నువ్వు దారి ఇవ్వవా?’, అని సముద్రుడి మీద కోపం వస్తుంది. రాముడు బాణం ఎక్కు పెడతాడు. అప్పుడు సముద్రుడు ప్రత్యక్షం అయి, “స్వామి! ధర్మమూర్తివి నీవు. నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను తప్ప నీకు వ్యతిరేకిని కాదు”, అనగానే వెంటనే రాముడి కోపం తగ్గిపోతుంది. అలాగే కాకాసుర కథ అని ఇంకొకటి ఉన్నది. అక్కడ కూడా కోపం వస్తుంది. కానీ తన కోపాన్ని వెంటనే ఉపసంహరించుకుంటాడు.

సన్మార్గంలో ఉండాలి అనుకునేవారు తమకి కోపం వచ్చినప్పుడు వెంటనే Self Analysis చేసుకోవాలి. Self Analyze చేసుకొని ‘ఈ కోపం వల్ల ప్రయోజనం లేదు’, అని అనిపించింది అంటే వెంటనే కోపాన్ని నిగ్రహించుకొని, సంభాళించుకొని అవతలి వ్యక్తి యొక్క పరిస్థితిని ఆర్థం చేసుకొని, ఆలోచన చేసుకొని, తనకు తాను సమాధానం చెప్పుకొని, క్షమా గుణాన్ని పెంపొందింపచేసుకొని, తద్వారా కోపాన్ని నిగ్రహించుకోగలగాలి, కోపానికి వశుడు కాకుండా ఉండాలి.

‘ఉత్తమే క్షణికాత్ కోపం’, క్షణంలో కోపం తగ్గించుకుంటే ఉత్తముడు. ‘మధ్యమే ఘటికాద్వయం, అధమేచ అహోరాత్రో’, అంటుంది. మధ్యముడైనవాడు రెండు ఘడియలపాటు (సుమారు గంట సేపు) కోపం పెట్టుకొని, ఆ సమయంలోపు తాను ఏమి చేసింది, ఏమి చెయ్యవలసినది ఆలోచించుకోగలగాలి, తద్వారా ఆ కోపాన్ని పోగొట్టుకోగలగాలి.

అహోరాత్రము అంటే ఒక పగలు, ఒక రాత్రి. “ఒక 24 గంటలు పెట్టుకోవయ్యా కోపం. అంతకంటే ఎక్కువ పెట్టుకోకు. అది నీకు ప్రమాదం.” తెల్లవారింది, కొత్త రోజు ప్రారంభమయింది. కొత్త ఆలోచనలతో ప్రారంభం చేయాలి. నిన్న జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. తెలిసో తెలియకో, ఆలోచనతోనో అనాలోచితంగానో, అర్థవంతంగానో అర్థరహితంగానో, ఏదో ఆ మాట అనేశడు అతను. అన్న మాట గాలికి పోయింది. “నేను దాన్ని మనస్సులో పెట్టుకోవడం లేదు”, అనేటువంటి ఆలోచన చేసుకొని ఆ కోపం నుంచి దూరం అయపోవాలి.

‘అధమే స్యాత్‌ అహోరాత్రం’ – అదమంగా ఒక రోజంతా కోపాన్ని పెట్టుకొని, ఆ రోజులో తనని తాను తెలుసుకొని మరుసటి రోజునాటికి కోపాన్ని పోగొట్టుకోగలగాలి. “నీ వల్ల ఏమి జరిగుంటే ఆ పరిస్థితి రాకుండా ఉండేదో, ఆ మాట అతను అనకుండా ఉండగలిగేవాడో, అతని కోపానికి నువ్వు కారణం కాకుండా ఉండగలిగేవాడివి”, అని గనుక మనము ఆలోచించగలితే మనకే సమాధానం దొరుకుతుంది.

‘పాపిష్టే మరణాన్తక:’ అన్నారు – కొంతమంది తాము మరణించేదాకా ఆ కోపాన్ని తమ మనస్సులో పెట్టుకుంటారు. అది తప్పు అన్నారు.

కోపం దుష్పరిణామాలు:

“నీచేత్ మరణాంతకం” అంటుంది శాస్త్రం. అప్పటిదాకా పెట్టుకోకండి కోపాలు. కోపాలు పెట్టుకుంటే దాని వల్ల నష్టము. Blood Pressure పెరుగుతుంది, అనవసరమైనటువంటి ఆందోళనలు పెరుగుతాయి. మానసికంగా ఆందోళనతో ఉంటాము, ఉద్వేగంతో జీవితం గడుపుతాము. దాని వల్ల ప్రయోజనం ఉండదు. మనస్సు ప్రశాంతతగా ఉండదు.

మన మనస్సును ప్రశాంతముగా ఉంచుకోగలిగితే చక్కటి నిద్ర పడుతుంది తద్వారా ఆరోగ్యంగా ఉంటాము. ఆరోగ్యమైనటువంటి శరీరంతో ఆరోగ్యమైనటువంటి మనస్సు ఏర్పడుతుంది. తద్వారా ఆరోగ్యవంతమైనటువంటి ఆలోచనలు వస్తాయి. తద్వారా ఆరోగ్యమైనటువంటి నడక ఉంటుంది. సన్మార్గంలో మనిషి నడుస్తూ ఉంటాడు. ఈ రెండు కూడా ఒక Viscious Circle. కోపాన్ని గనుక పెంచి పోషిస్తూ ఉంటే, ఆ కోపం వల్ల Negative Circle లోకి వెళ్ళిపోతాడు. దాని బదులు అక్కడే క్షమాగుణాన్ని అలవాటు చేసుకొని, కోపాన్ని నిగ్రహించుకోగలిగితే Positive Circle లోకి వెళ్ళిపోతాడు మనిషి. దాని ద్వారా అభివృద్ధిలోకి రావడం Guarantee. తప్పకుండా సన్మార్గంలో అభివృద్ధిలోకి వచ్చి, ఆ అభివృద్ధి ఫలాలు పొందుతూ, సంతోషంగా జీవితాన్ని గడుపుకోవడానికి కోపాన్ని నిగ్రహించడం తప్ప మరో మార్గం లేదు. (Management, Anger Management)

కొన్ని కొన్ని ఉంటాయి జీవితంలో, వాటిని మనం ఏమి చెయ్యలేము. దాన్ని ఎలా Manage చెయ్యాలో తెలియాలి. ఉదాహరణకు సముద్రంలో ఒక పెద్ద అల వచ్చింది అంటే దానికి తలవంచక తప్పదు. అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో (ఎలా అయితే వచ్చిన ఆ అల మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుందో), ఆ సందర్భం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ సాధారణమైపోతుంది, మన జీవితం యధాప్రకారంగా ఆనందమయంగా ఉంటుంది. కాబట్టి కోపాన్ని నిగ్రహించుకోవడం అత్యంత విశేషమైనటువంటి, చాలా ప్రాధాన్యమైనటువంటి, చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనకి మహర్షులు చెప్తూ ఉంటారు. కోపము లేనటువంటి మనిషి మహాత్ముడు. ‘ఆయన మహాత్ముడండి, ఆయన ఎప్పుడూ కోపగించడం చూడలేదు’, అంటారు. ‘అలుగుటయే ఎరుంగని మహా మహితాత్ముడు అజాత శత్రువే అలిగిననాడు’, అని ఇప్పటికి కూడా ధర్మరాజుని మనం పొగుడుతూ ఉంటాము.

కోపం లేనటువంటి మనిషి భగవంతుడితో సమానం. ఆ లక్షణాన్ని అలవాటు చేసుకుందాం.

ధర్మస్య విజయోస్తు.

K C Das Memorial Charitable Trust

Paropakarardham Idam Sareeram

  • Instagram
  • YouTube
  • Facebook
Address
H.No. 11-13-119, 14/B, Road No. 3, beside Axis Bank, Alkapuri Colony, Ramakrishnapuram, Kothapet, Hyderabad, Telangana 500035
View on map
Contact
contact@kcdastrust.org
+91 94948 77070
04:00 PM to 08.30 PM IST

© 2026 K C Das Memorial Charitable Trust. All rights reserved.

Terms and ConditionsPrivacy Policy