Skip to navigation
K C Das Memorial Charitable Trust
Donate
  • Home
  • About
  • Library
    • Dharma Vaani
    • Sri Lalitha Sahasra Naamavali
    • Dharmavaaradhi e-Magazine
    • Guru Vaani
    • Saradamba TV (Grandly Launched)
  • Dharmika Programs
    • All programs
    • Hanuman Chalisa
    • Gayathri Japam
    • Bala Japam
    • Calendar
  • Spiritual Education
  • Community Welfare
  • Contact
Donate
  • Instagram
  • YouTube
  • Facebook
  • Instagram
  • YouTube
  • Facebook
Donate

గణపతి తత్త్వం – 1

‘శుక్లాంబర ధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే‘, మనము జరుపుకునే అనేక పండుగల్లో “వినాయకచవితి” ఒక విశేషమైన పండగ. గణేష్ చవితి అని, వినాయక చవితి అని, గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాము. వినాయకుడు విఘ్నాలన్నిటికి అధిపతి అని, మనకుండే విఘ్నాలను తొలగిస్తాడని, కష్టాలను దూరం చేస్తాడని, మనందరి యొక్క విశ్వాసం. ఆ విశ్వాసముతోటే ఈ పండగ అత్యంత ఉత్సహముతో జరుపుకుంటాము.

అయితే మనము అర్థం చేసుకోవాల్సినది ‘గణపతి తత్త్వాన్ని’. ఆ తత్త్వాన్ని గనుక మనము అర్థం చేసుకుంటే దాంట్లో చాలా విశేషమైన సందేశాలు సకల మానవాళికి లభిస్తాయి. ఈ గణపతి నామము గనుక మనము అర్థం చేసుకుంటే మనకు అవన్నీ అర్థమవుతాయి.

గణపతి నామాలు – గణేశ తత్త్వం

“సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః । లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ॥ ధూమ్రకేతు-ర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః । వక్రతుండ-శ్శూర్పకర్ణో హేరంబ-స్స్కందపూర్వజః”, అని 16 నామాలతో గణపతిని స్తుతిస్తాము.

గణపతి నామము చెప్పటం, గణపతిని స్తుతించటం, పత్రి వెయ్యటం గణపతి పూజా విధానం. అయితే వీటి వెనుకాల ఉన్న అర్థాన్ని తెలుసుకొని చెయ్యటం ఉత్తమం. “జ్ఞాత్వా కుర్వీత కర్మాణి” – ‘ఏ పని చేసినా దాని అర్థం తెలుసుకొని చెయ్యండి’, అని పెద్దల వాక్కు. మొట్టమొదటి నామము ‘సుముఖుడు‘, అంటే ‘మంచి ముఖము కలిగినవాడు’, అని అర్థము. మంచి ముఖము అనే ఏమిటి? అందముగా ఉన్నటువంటి ముఖమా? గణపతి ముఖము ఏనుగు ముఖము.

కాబట్టి అందము అనే అర్థం కాకుండా ఈ మంచి అనేటువంటి దానికి, ఆ ‘సుముఖము’ అనేటువంటి శబ్దములోని విశేషము మనము అర్థం చేసుకుంటే, సకల మానవాళిని సన్మార్గం వైపు మరలించటానికి అది దోహదపడుతుంది.

 ఏమిటి సుముఖము అంటే? ఎవరిని మంచివాళ్ళు అంటాము? ఎవరైతే మంచి మాత్రమే మాట్లాడతారో, ఎవరి నోట్లో నుంచి మంచి విషయాలు మాత్రమే బయటకు వస్తాయో, వారిని మనము మంచివారు అంటాము. చెడు మాట్లాడేవారిని మంచివారు అనము కదా? వారిది మంచి అనిపించుకోదు.

భగవంతుడు మన ముఖము మీద ఇచ్చిన అవయాలల్లో నోరు ఒకటి బైటికి ఉంటుంది. కళ్ళు లోపలికి ఉంటాయి, వాటి రెప్పలు మూసి ఉంటాయి. చెవులు కూడా లోపలికి ఉంటాయి. మన నోటిని పెదవులతో మూసి ఉంచుతాము, లేకపోతే నోరు తెరిచి ఉంటుంది. ఈ తెరిచినటువంటి నోటితో మనిషి మాట్లాడుతూ ఉంటాడు. మనము మాట్లాడినటువంటి ఆ మాటలు ‘పది మందికి మేలు జరిగే విధముగా ఉన్నాయా లేవా? మేలు జరిపిస్తాయా లేదా?’, అనే విషయాలు తెలుసుకొని మాట్లాడటం అలవాటు చేసుకోండి లేదా ‘నోరు మూసుకోండి’, అని మనకు పెద్దలు చెపుతారు.

గణపతికి ఉన్న విశేష అవయవం ‘తొండం’. సృష్టిలో ఉన్న సకల జీవరాసులలో ఒక ఏనుగుకు మాత్రమే తొండం ఉంటుంది. ఆ తొండమును ‘కరము’ అంటారు. కరము అంటే ‘చెయ్యి’. నోటికి చెయ్యి అడ్డంపెట్టుకొని, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుతూ, ఎంత మాట్లాడాలో అంత మాట్లాడుతూ, ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాత్రమే మాట్లాడుతూ, ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడుతూ ఉండగలినటువంటి వైశిష్ట్యము కలిగిన రూపము ఈ మహాగణపతిది.

అందుకే మనకు పెద్దలు ఏమి చెప్పారంటే, ‘ సత్యం బ్రూయాత్‌ ప్రియం బ్రూయాత్‌ న బ్రూయాత్‌ సత్య మప్రియం ప్రియం చ నానృతం బ్రూయాత్‌ ఏషః ధర్మః సనాతనః‘ అన్నారు. ‘సత్యం బ్రూయాత్’, అంటే మాట్లాడితే సత్యమే మాట్లాడు, అంటే నిజం మాట్లాడు.

‘ప్రియం బ్రూయాత్’, అవతలి వ్యక్తికి ప్రియము కలిగించే విధముగా మాట్లాడు, అంటే సాత్వికంగా మాట్లాడు, సౌమ్యముగా మాట్లాడు. కష్టమైనటువంటి మాటలు, అవతలి వ్యక్తి మనస్సు నొప్పించే విధముగా మాట్లాడకుండా ఉండాలి.

‘అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్‘ అని గీతలో శ్రీకృష్ణపరమాత్మ పేర్కొంటారు. తాను ఉద్విగ్నతకులోను కాకుండా, ఎదుటి వ్యక్తిని ఉద్విగ్నతకు లోను చెయ్యకుండా, సౌమ్యముగా మాట్లాడటం అలవాటు చేసుకొని, ఎక్కడ అవసరమో అక్కడ మాట్లాడుతూ ఉండాలి. అందుకే పెద్దల దగ్గిర, పీఠాధిపతుల దగ్గిర, యతీశ్వరుల దగ్గిర మాట్లాడేటప్పుడు నోటికి చెయ్యిని అడ్డంగా పెట్టుకొని మాట్లాడమంటారు. ఎందుకంటే పొరపాటున అయినా సరే మన నోటిలోని తుంపరులు గనుక వారి మీద పడితే, అది మహాపరాధం జరిగినట్లు గనుక.

మనము జాగర్తగా మాట్లాడాలి, ఏది పడితే అది మాట్లాడటం (Gossiping) ప్రమాదము అని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. “అనవసరముగా మాట్లాడకండి, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. అప్పుడు మిమ్మల్ని అందరు మెచ్చుకుంటారు, మీరు సుముఖులు అవుతారు”, అని పెద్దలు అంటారు.

సుముఖం అంటే ‘మంచి ముఖము కలిగినటువంటివారు’, అని చెప్పుకున్నాము. అంటే ఎవరు మాట్లాడటానికి అందరూ ఎదురు చూస్తూ ఉంటారో అటువంటివారిగా, మన మాటలు కోసం అందరూ ఎదురుచూసే విధముగా మనం తయారవ్వాలి. గణపతి ఆరాధన చేస్తూ, “స్వామి, ఈ సంవత్సరమంతా కూడా అనవసరముగా మాట్లాడే మాటలు మాట్లాడకుండా, అవసరమైనటువంటి మాటలు మాత్రమే మాట్లాడుతూ, సత్యమును/నిజము మాత్రమే మాట్లాడుతూ ఉండేలా అనుగ్రహించు”, అని వేడుకోవాలి.

‘ప్రియం బ్రూయాత్’ అంటే అవతలి వ్యక్తికి సంతోషాన్ని కలిగించే విషయాలు. కొంతమందిని చూడండి ఏవేవో మాట్లాడుతు ఉంటారు. అవతలి వ్యక్తి యొక్క మనస్సు నొచ్చుకుంటుంది అని కూడా చూడకుండా ఏవేవో మాట్లాడేస్తారు. దాని వల్ల ప్రమాదం. అందువల్ల ”ప్రియం బ్రూయాత్’ అన్నారు.

 అలాగని ‘న బ్రూయాత్ సత్యమప్రియం’ అంటుంది. అంటే అవతలి వ్యక్తికి ప్రియం కలుగుతుంది కాదని అసత్యం మాట్లాడకు. సత్యమే అయినప్పటికి కూడా ఇతరులకు అప్రియమైనటువంటివి మాట్లాడకు. సత్యమే కాదని అవతలి వ్యక్తికి అప్రియం మాట్లాడితే అది మంచిది కాదు. ఈ విషయాలన్నీ కూడా మనము ‘సుముఖుడు’ అనే నామములో అర్థం చేసుకుంటే, గణపతి తత్వము మనకి అర్థం అవుతుంది.

ఒక్కొక నామానికి ఒక్కొక వైశిష్ట్యము. గణపతి తత్త్వాన్ని గనుక మనము అర్థం చేసుకుంటే, ‘మన Personality ఎలా రూపొందించుకోవాలి, ఎలా తయారుచేసుకోవాలి, Personality ఎలా పెంపొందించుకోవాలి, పది మందిలో ఉన్నపుడు ఎలా ఉండాలి’, అని గ్రహించగలుగుతాము.

ఆయనను విఘ్నాధిపతి, గణాధిపతి అంటాము. గణములు అంటే ‘మనుష్య గణములు, దేవతా గణములు, రాక్షస గణములు, పక్షి గణములు’, ఇలా అన్ని ఉన్నాయి. ఒక్క దేవుళ్ళకే ఆయన అధిపతి కాదు, అందరికి ఆయన అధిపతే. ఎలా అయ్యాడు నాయకుడు? నాయకుడికి ఉండవలసిన లక్షణాలలో మొట్టమొదటి లక్షణం ‘సుముఖః’. కాబట్టి ఆ సుముఖత్వము అంటే ఏమిటి అని మనము అర్థం చేసుకోవాలి.

గజకర్ణికః నామం యొక్క తత్వము

గణపతి పూజ చెయ్యటం, పత్రి వెయ్యటం, ప్రసాదం తినటం, వెళ్ళిపోవటం కాదు దాంట్లో ఉండే తత్త్వం ఏమిటో మనము అర్థం చేసుకోవాలి. గణేశ నామములతో మరో నామము ‘గజకర్ణికః‘.  

‘గజకర్ణికః’ అంటే ‘పెద్ద చెవులు ఉన్నవాడు’, అని అర్థం. నోటికేమో చెయ్యి (తొండం) అడ్డంపెట్టుకొని మాట్లాడతాడు, చెవులేమో పెద్దవి.  అంటే ఎవరేమి చెప్పినా వినేటువంటి స్వభావం. ఇది రెండవ స్వభావం మనము అలవాటు చేసుకోవాల్సినది.

ఇది రెండవ తత్త్వం – ‘గజకర్ణికః’.

‘వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనె వేగపడక వివరింపదగున్ గని కల్ల నిజము దెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ…!’ (Listening abilities) అని సుమతి శతకం చెప్తుంది. చాలా మందికి Hearing abilities ఉంటాయి, Listening abilities ఉండవు. అంటే వారు ఒకపక్క వింటూనే ఉంటారు, మరొకపక్క అప్పటికే తమ మనస్సులో ఒక నిర్ణయం తీసుకునే ఉంటారు. అలాకాదయా! గణపతి లాగా రెండు చెవులు పెద్దవి చేసుకొని విను.

‘అవతలి వాళ్ళు ఏమి చెప్తున్నారు, వాళ్ల ఉద్దేశము ఏమిటి, వాళ్ల భావం ఏమిటి, వాళ్ళు మన నుంచి ఎలాంటి పరిష్కారలని ఆశిస్తున్నారు’, అని తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి.  మనస్తత్వశాస్త్రం ఏమిచెప్తుందంటే “నూటికి 98 శాతం మంది తాము చెప్పింది వింటే చాలు అనుకుంటారట, మనము సమాధానం ఇవ్వనక్కర్లేదు.” వినగలగటం కూడా ఒక Art, అది మనము గణపతి నుంచి నేర్చుకోవాలి. అందుకనే భగవంతుడు మనకు రెండు చెవులు ఇచ్చాడు, ఒక నోరు ఇచ్చాడు. మనము రోజులో ఎంత వింటామో అందులో సగమే మాట్లాడాలి.

ప్రతి రోజు మనల్ని మనము పరీక్షించుకోవాలి, వినేదేంత, మాట్లాడేంత అని. వినటం అలవాటు చేసుకోవాలి. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి, ఎక్కడ వినాలో అక్కడ వినాలి. ఇది గణపతి మనకు తెలిపేది.

గణపతి తత్త్వాన్ని మనము సరిగ్గా అర్థం చేసుకోగలిగితే Listening abilities develop అవుతాయి, speaking abilities develop అవుతాయి. దాంతో పదిమందికి మేలుజేసే విధముగా మన ప్రవర్తన ఉంటుంది. (ఇతరుల కష్టాలు వింటున్నాము కనుక). ‘ఎప్పుడైనా సరే ఆనందాన్ని పంచుకుంటే రెట్టింపు అవుతుంది, కష్టం పంచుకుంటే సగం అవుతుంది’, అంటారు. కష్టాలని పంచుకోవటం అంటే అవతలి వ్యక్తి కష్టాలని వినగలిగే ఓపిక మనకి ఉండటం.

ఆ వినగలిగే ఓపిక మనకి ఉంటే, ఆ ఓపిక ద్వారా మనము అవతలి వ్యక్తికి సంతోషాన్ని కలిగించవచ్చు, ఆనందాన్ని కలిగించవచ్చు, ఆహ్లాదాన్ని కలిగించవచ్చు, సమాజములో అందరికి ఆనందాన్ని పంచి ఇవ్వవచ్చు. కానీ దానికి మూలం ఏమిటి ‘గజకర్ణికః’.

‘సుముఖః’, ‘గజకర్ణికః’ ఈ రెండిటిని పట్టుకోగలిగితే, listening abilities, speaking abilities రెండు ఉంటాయి. దాంతో సమాజములో మనము నడుస్తూ, ఇతరులను నడిపించగలుగుతాము.  ‘యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః । స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే‘, అని శ్రీకృష్ణపరమాత్మ గీతలో పేర్కొన్నారు. గణపతి తత్వాన్ని గనుక సరిగ్గా అర్థం చేసుకోగలిగితే, సన్మార్గములో నడుస్తూ, మనల్ని చూసి పదిమంది నడుచుకునే విధముగా మనము ఉండగలుగుతాము.

“స్వామి, ఏమి మాట్లాడినా సత్యమే మాట్లాడేటట్లు, ప్రియమే మాట్లాడేటట్లు అనుగ్రహించు. అలాగే వినగలిగే ఓపికను, నేర్పును, కౌశల్యాన్ని ప్రసాదించు”, అని ఆ వినాయకుల వారిని వేడుకుందాము.                            ధర్మస్య విజయోస్తు.

K C Das Memorial Charitable Trust

Paropakarardham Idam Sareeram

  • Instagram
  • YouTube
  • Facebook
Address
H.No. 11-13-119, 14/B, Road No. 3, beside Axis Bank, Alkapuri Colony, Ramakrishnapuram, Kothapet, Hyderabad, Telangana 500035
View on map
Contact
contact@kcdastrust.org
+91 94948 77070
04:00 PM to 08.30 PM IST

© 2026 K C Das Memorial Charitable Trust. All rights reserved.

Terms and ConditionsPrivacy Policy