Skip to navigation
K C Das Memorial Charitable Trust
Donate
  • Home
  • About
  • Library
    • Dharma Vaani
    • Sri Lalitha Sahasra Naamavali
    • Dharmavaaradhi e-Magazine
    • Guru Vaani
    • Saradamba TV (Grandly Launched)
  • Dharmika Programs
    • All programs
    • Hanuman Chalisa
    • Gayathri Japam
    • Bala Japam
    • Calendar
  • Spiritual Education
  • Community Welfare
  • Contact
Donate
  • Instagram
  • YouTube
  • Facebook
  • Instagram
  • YouTube
  • Facebook
Donate

దీపావళి పండగ సందేశం – 2

దీపావళి అత్యంత ఆనందోత్సాహాలతో ఒక భారతదేశంలోనే కాకుండా ఎన్నో దేశాలలో కూడా జరుపుకునేటువంటి పండగ. ఈ పండుగ నిజానికి ఐదు రోజులు జరుగుతుంది. త్రయోదశితో ప్రారంభం చేసి ‘ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, గోవర్ధన పూజ, భాయిదూజ్, భగిని హస్త భోజనం’, ఇత్యాది వేరు వేరు పేర్లతో ఆనందోత్సాహాలతో జరుపుకునేటువంటి పండగ.

ఒక పండుగ జరిగితే ఆ పండుగ ద్వారా సమాజంలో విశేషమైనటువంటి మేలు చేకూరేటట్లుగా మన పండుగలన్నీ కూడా రూపొందించారు. ప్రతి మానవుడు కూడా సన్మార్గంలో నడుచుకునే విధంగా ప్రతి పండుగ ఉంటుంది. అత్యంత పెద్ద పండుగగా జరిగేటువంటి దీపావళిలో నిగూఢమైనటువంటి సందేశాలు ఉన్నాయి.

దీపావళి అనగానే మనందరం కూడా సాధారణంగా అనుకునేది ఏమిటి అంటే దీపాల పండగ. ఆవళి అంటే ‘వరుస, దీపముల యొక్క వరుస’. ఇంటి ముందు, ఆవరణలో, అవకాశమున దగ్గర ఎక్కడంటే అక్కడ దీపాలను వెలిగించి ఆనందంతో పిల్లలు కేరింతలు కొడుతూ ఉంటే పెద్దలంతా ముసిమిసి నవ్వులు నవ్వుతూ సంతోషంగా గడుపుతారు.

దీపం వెలిగించడం వెనుక ఉన్న సందేశం:

దీపం వెలిగించడం వెనకాల ఒక సందేశం ఉన్నది. ‘దుర్మార్గాన్ని పారద్రోలి సన్మార్గంలో మనిషి జీవనం ఎలా గడుపుకోవాలి’, అనే సందేశాన్ని ఈ దీపం వెలిగించడంలో భాగంగా పెద్దలు మనకందించారు. దీపం వెలిగించడము అంటే ‘చీకట్లను పారద్రోలడం’. కాంతి వస్తుంది గనుక చీకటి వెళ్ళిపోతుంది. చీకటి అంటే ‘అజ్ఞానం’, దీపం అంటే ‘వెలుగు’, కాంతి అంటే ‘ప్రకాశం, జ్ఞానం’.

సహజంగా (Natural process) అంటూ ఉంటాం. ఒక వస్తువు పైనుంచి వదిలిపెడితే అది సహజంగానే కింద పడిపోతుంది. దానికి ప్రత్యేకమైనటువంటి శ్రమ ఏమి అక్కర్లేదు, కృషి ఏమి అక్కర్లేదు. కింద ఉన్నటువంటి వస్తువుని పైకి తీయాలి అంటే మాత్రం శ్రమ ఖర్చు చేసి తీయాల్సిందే. ఎవరో ఒక వ్యక్తి, ఒక యంత్రము శ్రమ చేస్తే తప్ప అది పైకి రాదు.

 మనిషి జీవితంలో కూడా సహజంగా లోనయ్యేటువంటి, స్వాభావికమైనటువంటి అంశాలన్నీ కూడా దుర్మార్గం వైపు తీసుకువెళ్ళిపోతాయి. అటు వెళ్ళనీయకుండా సన్మార్గం వైపు మరల్చేటువంటి జ్ఞానము కలిగి ఉండడమే ‘దీపము’ అన్నారు.

అరిషడ్ వర్గాలు – కామం:

మనిషిని లోపలినుండి నాశనం చేసే శత్రువులను ‘అరిషడ్ వర్గాలు’, అంటారు. ఆరు లక్షణాలు ఉంటాయట.

ప్రతి మనిషికి సహజంగా (Natural) ఈ ఆరు లక్షణాలు ఉంటాయట. అంటే అవి జీరో ఉండడానికి వీలు లేదు. ఎలా అయితే మనిషిలో Blood pressure ఉంటుందో, ఎలా అయితే మనిషిలో Sugar ఉంటుందో, అలాగే ఈ లక్షణాలు కూడా మనిషిలో ఉంటాయి. ఈ ఆరు లక్షణాలు ఏమిటి? మొట్టమొదటిది కామం. కామం అంటే స్త్రీ పురుషుల మధ్య ఉండేటువంటి ఆకర్షణ మాత్రమే కాదు. మనిషికి కోరిక అనేటువంటిది నిరంతరము కలుగుతూ ఉంటుంది.

ఏదో ఒక కోరిక లేకపోతే మనిషి ఏ పని చేయడు. మనలో ఉండేటువంటి కోరికలన్నీ కూడా దీపంలో ఉండేటువంటి ‘నూనె గాని నెయ్యి గాని’, అని చెప్తారు పెద్దలు. అంటే దేనితోటైతే వత్తిని వెలిగించి ఆ వెలుగు నిలబడడానికి కారణమైందో అది. దీపంలో ఉండేటువంటి నూనె గాని నెయ్యి గాని ‘మనిషిలో ఉండేటువంటి కోరిక’. ఈ కోరిక వల్ల మనిషి తాను చేసేటువంటి శ్రమ అంతా చేస్తూ ఉంటాడు. ఈ శ్రమ దీపంలో ఉండేటువంటి వాయువు. గాలి ఎక్కువ ఉండకూడదు, కాబట్టి దాన్ని శ్రమతో పోల్చారు.

ఆ తర్వాత వత్తి ఒకటి ఉంటుంది దీపానికి. ఈ వత్తిని మనిషి యొక్క మనస్సుతో పోల్చారు. మనము వెలిగించినటువంటి దీపం అగ్నితో సమ్మేళనం చెంది ప్రకాశాన్ని చిందిస్తూ ఉంటుంది. ఇది జ్ఞానము అన్నారు. ‘కోరికలు ఉండడం తప్పు కాదయ్యా! నీకున్నటువంటి కోరికలు సన్మార్గమునందు ఉన్నాయా, దుర్మార్గం వైపు వెళ్తున్నాయా’, అని ఎప్పటికప్పుడు నువ్వు Check చేసుకోవడానికి వీలుగా ఈ పండుగ రోజు దీపాల వరస వెలిగిస్తాము. మనిషిలో ఉండేటువంటి కోరికల వరసకు ప్రతీక అది. కోరికలు కూడా అటువంటివేనండి.

మహిషాసుర మర్ధిని ‘రక్తబీజుడు’ అనేటువంటి రాక్షసుడు సంహారం చేసిందనే కథ మనం విన్నాం. ఒకొక్క రక్తపు బొట్టు పడితే ఒకొక్క రాక్షసుడు పుడుతూ ఉంటాడు. ఆ రక్తపు బొట్లు కోరికలకు ప్రతీక ఎందుకంటే ఇవి ఎప్పటికి తీరేవి కావు. ఒకటి తీరిస్తే ఇంకొకటి వస్తుంది, ఒకటి కలిగితే ఇంకొకటి వస్తుంది. పెద్దలు మనకు ఏం చెప్తారంటే ‘భూమండలం అంతా రాసిచ్చేసినా కూడా ఆ పక్కన ఉన్నటువంటి చంద్ర గ్రహాన్ని వదిలేశారే? కుజ గ్రహాన్ని వదిలేశారే? అది కూడా ఇస్తే బాగుండు’, అనుకుంటాడట మనిషి. మనిషి లక్షణం అది.

ప్రయత్నపూర్వకంగా కోరికలను సన్మార్గము వైపు మరల్చుకొని, కోరికలను ధర్మబద్ధం చేసుకొని ‘ధర్మ అర్థ కామ మోక్ష’, అనేటువంటి నాలుగు సోపానములు చెప్పారు. దీంట్లో మొట్టమొదటిది ‘ధర్మం’. ధర్మం అంటే ‘సన్మార్గంలో మనిషి నడవడికను అలవాటు చేసుకొని నడుస్తూ ఉండడం’.

 ‘ధర్మమును ఎప్పుడైతే మనిషి తన జీవనం యొక్క చట్రంగా ఏర్పరచుకుంటాడో, ఏ కోరిక వచ్చినా ఈ కోరిక ధర్మబద్ధమైందా కాదా’, అని తనకు తాను విశ్లేషణ చేసుకునేటువంటి జ్ఞానాన్ని పొందడమే దీపం వెలిగించటం ద్వారా వచ్చేటువంటి జ్ఞానం.

అరిషడ్ వర్గములు – క్రోధం/ లోభము/ మోహము:

అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని కలిగించడము అంటే మనలోని దుర్లక్షణాలను (అవలక్షణాలు) దూరం చేసుకోవటం. సన్మార్గంలో మనిషి ప్రయాణం చేయడానికి కావలసినటువంటి ఆలోచనా విధానము ఉండాలి. అరిషడ్ వర్గాలలో రెండవది ‘క్రోధం’ (కోపం). ఈ కోపం కోరికల వల్ల వస్తుంది. కోరిక తీరకపోతే కోపం వస్తుంది.

ఎవరినో ఏదో అడుగుతాం, వారు ఇవ్వలేదని కోపం. అడగడం వరకు మనకి హక్కు ఉండచ్చు. మనకి ఎలా అయితే అడగడానికి హక్కు ఉంటుందో, లేదు అనడానికి వారికి కూడా హక్కు ఉంటుంది అనే జ్ఞానం మనకు ఉండాలి. ఆ జ్ఞానం మనకు కలగకపోతే అది ‘అజ్ఞానం’. అటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి అని గుర్తు చేస్తుంది దీపావళి.

 దీపాలు వెలిగించేసి, కాంతులు చూసేసి, ఆనందించి సంబరపడి చప్పట్లు కొట్టి, టపాకాయలు పేల్చి ఇలా చేసే ప్రతి అంశంలో కూడా మనకి సన్మార్గంలో నడవటానికి మార్గం సూచించారు మహర్షులు.

అరిషడ్ వర్గాలలో మూడవది ‘లోభము’. అంటే తనకుండి లేదనుకోవడం. “అలా చేయకు నాయనా! దీపావళి రోజు నీకు తోచినంత దానధర్మాలు చెయ్. దీపావళి పేరుతో కాస్త నీ దగ్గర ఉన్నటువంటి డబ్బును ఖర్చు చెయ్”. ఉదాహరణకి టపాకాయలు కొంటాం. ఆ టపాకాయల వ్యాపారం చేసేటువంటి లక్షలాది మంది జీవనము దాని మీదే ఆధారపడి ఉన్నది. వారంతా దీంట్లో ఆధారపడి పడి తమ బ్రతుకు తెరువు చూసుకుంటున్నారు. కాబట్టి లోభత్వాన్ని చూపించకు. ఇవన్నీ విషయాలు అర్థం కావాలి అంటే ‘జ్ఞాన సముపార్జన చేయాలి’ అనే కోరిక కలగాలి.

జ్ఞాన సముపార్జన అనే కోరికే దీపం. దీపం వెలిగించినప్పుడు మనకి ఆలోచన రావాలి, “నాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని నేను వెలిగించుకోవాలి. దానికి Symbolicగా, ప్రతీకగా నేను ఈ దీపాన్ని వెలిగిస్తున్నాను”. ‘దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్ధన, దీపేన హరతే పాపం, దీపదేవం నమోస్తుతే’, అని ఒక శ్లోకం కూడా చెప్పారు. పాపహరణం జరగాలి అంటే ఎలా జరుగుతుంది? ప్రాయశ్చిత్తంతో పోతుంది.

ప్రాయశ్చిత్తం కలగాలి అంటే ఎలా వస్తుంది? జ్ఞానం కలిగితే గాని, తప్పు చేశాను అనేటువంటి ఆలోచన కలిగితే గాని ప్రాయశ్చిత్తం కలగదు. తప్పు చేశాను అనేటువంటి ఆలోచన ఎలా కలుగుతుంది? జ్ఞాన సముపార్జన చేస్తే తప్ప జరగదు. జ్ఞాన సముపార్జన చేయడమే దీపం వెలిగించడం.

అరిషడ్ వర్గములలో తరువాతి లక్షణం ‘మోహం’. మోహానికి లోనవటం అంటే ‘లేనిది ఉన్నట్టుగా భ్రమ చెందడం’. మోహం అంటే చీకట్లో ఉన్న వ్యక్తికి అక్కడ తాడు ఉందా పాము ఉందా తెలియదు. కానీ ఎప్పుడైతే దీపం వెలిగిస్తాడో అది తాడా పామా అని స్పష్టంగా తెలిసిపోతుంది.

అలాగే జ్ఞాన జ్యోతిని గనుక వెలిగించగలిగితే అజ్ఞానం నుండి బయట పడతాడు గనుక దాన్ని తీయడానికి ప్రత్యేకంగా ఏ ప్రయత్నం చేయక్కర్లేదు. చీకట్లను పారద్రోలడానికి దీపం వెలిగిస్తే చీకటి అదే వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనిషి దీపం వెలిగిస్తాడో అప్పుడు చీకటి వెళ్ళిపోతుంది. అలాగే ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో అప్పడు అజ్ఞానం తొలగిపోతుంది. ‘భ్రమ, మోహం’, అంటే భ్రమించడం. ‘మోహ ముద్గర స్తోత్రం’, అని శంకరాచార్యుల వారు ‘భజ గోవిందంగోవిందం భజ మూఢమతే’ అని శ్లోకాలు చేశారు, తద్వారా జ్ఞానోపదేశం చేశారు.

దీపము వెలిగించినప్పుడు ఆ జ్ఞాన సముపార్జన చేస్తున్నాం అనేటువంటిది మనకి జ్ఞాపకం వస్తుంది, తద్వారా మన మోహాన్ని తొలగించుకోగలుగుతాము.

అలాగే ‘మదమాత్సర్యాలు’ అంటారు. అంటే ‘నాకు ఇది ఉన్నది, నేను ఇంతటి వాడిని’, అని తనకు తాను విర్రవీగడం. ‘తను తన్నేవాడైతే తనని తన్నేవాడు ఇంకొకడు ఉంటాడని’ సామెత.

అంటే నువ్వు ఎంతటి వాడివైనా, ‘నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర అధికారం ఉన్నది, నా దగ్గర మనుషులు ఉన్నారు, నాకు మంది మార్బలం ఉన్నది’, అనేటువంటి అహంభావ ధోరణలోకి వెళ్ళకుండా ‘ఏదీ శాశ్వతం కాదు అశాశ్వతమైనటువంటిది’, అనేటువంటి జ్ఞానంతో ఉండు అని గుర్తు చేయడం కోసమే ఈ దీపావళి నాడు దీపాలు వెలిగిస్తాం.

నరక చతుర్దశి వెనుక ఉన్న విశిష్టత:

దీపావళికి ముందురోజు ‘నరక చతుర్దశి’. నరక చతుర్దశి నాడు నరకాసుర సంహారం జరిగిందని, కృష్ణుడు నరకాసురుని సంహరించాడని, అలాగే దీపావళికి రాముడు రావణ సంహారం చేసి వెనక్కి తిరిగి వచ్చాడని పెద్దలు పేర్కొంటారు. ధన త్రయోదశి లక్ష్మీదేవి సాగరంలో ఉద్భవించిన రొజు. ఇలా మనకి కథలు కథలుగా చెప్తూ ఉంటారు. కానీ వీటి వెనకాల సన్మార్గంలో ఎలా ఉండాలో అంతర్లీనంగా మనకు అందించారు. నరకాసురుడు ఎవరు అంటే అసురుడు. దేవతలు సురులు. అసురుడు వేరు, సురులు వేరు కాదు.

ప్రతి మనిషిలో సన్మార్గానికి సంబంధించినటువంటి ఆలోచనలు, దుర్మార్గానికి సంబంధించినటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. సృష్టిలో మంచి చెడు రెండు ఉంటాయి. ఆ రెండిట్లో మనిషి నడుస్తూ ఉంటాడు గనుక మంచిని, చెడును రెండు చూస్తూ ఉంటాడు. ఇవాళ మనం News పేపర్ తిరిగేసాము అంటే చెడు వార్తలు కూడా చదువుతున్నాం. మనము మంచిని మాత్రమే స్వీకరించి, చెడును వదిలి పెట్టేయగలగాలి.

‘ఆసురీ సంపద’ అంటే ఏమిటి అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో వివరించారు. మనిషిలోనే ‘దైవీ సంపద, ఆసురీ సంపద’ (రాక్షస లక్షణాలు, దేవతా లక్షణాలు) ఉంటాయి.

ఈ దేవతా లక్షణాలను పెంపొందించుకుంటూ, రాక్షస లక్షణాలను తగ్గించుకోవడమే నరకాసుర వధ వెనుక ఉన్న అంతరార్థం.

అసురీ లక్షణములు:

వినయం దైవీ సంపద, డంబము అసురీ సంపద. “డంబము ప్రదర్శన చేయడం, దర్పంగా ఉండడం, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కాలు మీద కాలు వేసుకొని కూర్చోకు నాయనా! వాళ్ళు నిలబడి ఉంటే నువ్వు కూర్చొని మాట్లాడకు నాయనా! వినయము, విధేయత కలిగి ఉండు నాయనా!”, అని పెద్దలు చెప్తారు. దర్పాన్ని ప్రదర్శించడం కాదు, (నువ్వు అధికారివై ఉండవచ్చు, నీ దగ్గర అధికారం ఉండి ఉండవచ్చు) సంస్కారము అలవాటు చేసుకొని సన్మార్గంలో ఉండకపోతే దుర్మార్గుడు అనిపించుకుంటారు.

క్రోధము అసురీ సంపద. క్రోధము పనికి రాదు. “కోపము నుబ్బును గర్వము నాపోవకయునికియును దురభిమానము కాపురుషగుణంబులండ్రు కౌరవనాథా”, అంటాడు విదురనీతిలో విదురుడు.

మహాభారతంలో దుర్యోధనుని లక్షణం గురించి దృతరాష్ట్రుడితో చెప్తూ, “తొందరగా కోపగించుకుంటాడయ్యా మీ అబ్బాయి. అది మంచి లక్షణం కాదు. అలాగే తొందరగా ఉబ్బిపోతాడు పొగడగానే. గర్వం ప్రదర్శిస్తూ ఉంటాడు”. ‘ఆపోవకనునికియు’, అంటే Gossiping, ‘వాళ్ళ గురించి వీళ్ళ గురించి అక్కరలేని విషయాలు మాట్లాడుకోవటం’.

పాండవులు అరణ్యవాసము, అజ్ఞాతవాసము చేసినంత కాలము వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికే సమయం గడిపేవాడట దుర్యోధనుడు. ఇతరుల గురించి తెలుసుకోవాలనేటువంటి తపన, తాపత్రయము ఇదంతా. ఇది పనికి రాదు. ఈ లక్షణాలను ‘పనికిరాని లక్షణాలు’ అన్నారు. కాపురుషః అంటే సంస్కృతంలో ‘ఏం మనిషి అనిపించుకుంటాడు’ అని.

పౌరుషంగా మాట్లాడడం అజ్ఞానం. ఈ అజ్ఞానం తొలగించుకోవడానికే మనం దీపావళి రోజు దీపాలు పెట్టి, ‘నాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించు స్వామి’, అని దేవతలకు ప్రార్థన చేస్తాము. అలా ప్రార్థన చేయగా చేయగా మార్గం అదే గోచరిస్తుంది, సన్మార్గం వైపు ఎలా వెళ్ళాలో తెలుస్తుంది. అది లేకపోతే ఈ లక్షణాలు మనిషిలో అలాగే ఉండిపోతాయి.

ఈ ఆసురీ సంపదలను వధించడమే నరకాసుర వధ. మనలో ఉండేటువంటి ఆసుర సంపద అంటే రాక్షస లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని వధించి వాటి స్థానంలో దైవీ లక్షణాలు పెంచుకునే ప్రయత్నం చెయ్యాలి. అదే దీపావళి పండగ మనకు తెలిపే తత్త్వం.

దైవ లక్షణములు:

“తేజః క్షమా ధృతిః శౌచమద్రోహో నాతిమానితా | భవంతి సంపదం దైవీమభి జాతస్య భారత”, అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ దైవీ లక్షణాలను గురించి వివరించారు.

సన్మార్గంలో ఉండేటువంటి వాళ్ళకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి? క్షమాగుణం అంటే Forgiveness, క్షమించి వదిలివేయగలగడం. ఎవరన్నా ఏమన్నా అనరాని మాట అన్నా, చేయకూడని పని చేసినా వాళ్ళ యొక్క Weakness గమనించి, గ్రహించి తెలుసుకొని ‘అంతకంటే ఎక్కువ ఆలోచించడులే, అతని పరిమితి అటువంటిది’ అని వారిని క్షమించగలగడం.

క్షమాగుణం ఉదాత్త లక్షణం, సన్మార్గంలో గొప్ప విషయం అని చెప్తారు.

ఆ తర్వాత ధృతి. ‘పట్టుదల, కార్యదీక్షాదక్షత’ అంటారు. ఏదైనా పని సాధించాలి అంటే మనిషికి పట్టుదల లేకపోతే సాధించలేడు. సన్మార్గంలో ఉన్నటువంటి వారు మొదలుపెట్టిన పనిని వదిలి పెట్టరు. మొదలుపెట్టారంటే మాత్రం ఆ పని పూర్తి అవ్వాల్సిందే. అలా వదిలి పెట్టవద్దు అని కూడా చెప్తుంది. ‘ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్’, అన్నారు.

అందుకని వదిలిపెట్టకూడదయ్యా! మొదలుపెట్టిన పని అవుతూ ఉండాలి. అంటే Determination ఉండాలి. ఆ దృతి కావాలి.

ఆ తర్వాత శౌచం. ఈ లక్షణం కూడా సన్మార్గంలో ఉండేవారికి తప్పక అవసరం అని పెద్దలు చెప్పారు.

ఇటువంటి ఆలోచనలన్నీ కూడా మనకి మనం, ఎవరికి వారు ఆలోచించుకోవాల్సినవి. “గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి నాలో ఏమన్నా అసురీ సంపద తగ్గిందా? గత సంవత్సరం కోపం ఎలా ఉండేది? ఈ సంవత్సరం కొంచెం అన్నా తగ్గిందా? గత సంవత్సరం లోభం ఉండేదా? ఈ సంవత్సరం తగ్గించుకున్నానా? గత సంవత్సరం మోహం ఉన్నదా? ఆ భ్రమలు తొలగిపోయినాయా లేవా? గత సంవత్సరం ఏదన్నా మదమాత్సర్యాలు ప్రదర్శించానా? ఈ సంవత్సరం వాటిని రానీయకుండా ఉండగలనా”, అని Check చేసుకోవడం కోసం మనకి నరకాసుర వధ కథారూపంలో చెప్పారు.

రావణుడి కథ కూడా మనకి పెద్దలు అందుకే ఇచ్చారు. రావణ సంహారం జరిగింది అంటుంటాం.

రావణుడు, దశగ్రీవుడు, దశకంఠుడు ఇత్యాది పేర్లు ఆయనకి ఉన్నాయి, పది తలకాయలు ఉన్నాయి. ఈ పది తలకాయలు మనిషిలో ఉండేటువంటి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలకు ప్రతీక. (పంచకర్మేంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు) ఈ ‘కర్మేంద్రియ జ్ఞానేంద్రియ సమ్మేళనమే’ రావణ భావన. ఈ పది ఇంద్రియాలు ఏం చేస్తాయి అంటే మనిషిని ఎటుపడితే అటు తీసుకువెళ్తూ ఉంటాయి. దుర్మార్గం వైపు తీసుకువెడతాయి. దుర్మార్గం వైపు వెళ్ళనీయకుండా సన్మార్గం వైపు నడిపించాలి అంటే రావణ సంహారం చేస్తే తప్ప అది సాధ్యం కాదు.

అంటే ‘ఇంద్రియాలను వశం చేసుకుంటే తప్ప అది సాధ్యం కాదు’ అనే సత్యాన్ని మనకి గుర్తుచేసే పండుగ ఈ దీపావళి పండుగ. దీపావళి రోజు Sweets పంచుతాం అందరికి. మనము కూడా తీపిని తింటాం.

మనకి పెద్దలు ఏం చెప్పారంటే, “నాయనా! నీ మాటల్లో తియ్యదనం ఉండాలి. నువ్వు మాట్లాడే మాట అవతల వ్యక్తికి వినసొంపుగా ఉండాలి. మళ్ళీ మళ్ళీ వినాలనిపించాలి. నువ్వు ఎప్పుడు మాట్లాడతావా అని ఎదురు చూస్తూ ఉండాలి. అలా మాట్లాడడం అలవాటు చేసుకో”. కాబట్టి మిఠాయిలు పంచడం అంటే ఉద్దేశం ప్రియంగా మాట్లాడటానికి ప్రతీక.

‘సత్యం బ్రూయాత్‌ ప్రియం బ్రూయాత్‌ న బ్రూయాత్‌ సత్య మప్రియం ప్రియం చ నానృతం బ్రూయాత్‌’, అని ‘సత్యమే పలుకు. అవతల వ్యక్తికి ఇష్టమైనటువంటిదే పలుకు, అతనికి ఇష్టం కానటువంటిది సత్యమైనా సరే పలుకకుండా ఉండు, మౌనంగా ఉండు’, అని చెప్తుంది శాస్త్రం. కాబట్టి తియ్యగా మాట్లాడటానికి ప్రతీకగా దీపావళి రోజు మనం తీపిని పంచుకుంటాము.

దీపావళి సందేశం:

“అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ”, అంటుంది వేదం. అంటే ‘చీకటిలో దారి చూపుతూ, వెలుగులు ప్రసాదన చేస్తూ, నా జీవితం గడిపేటట్టుగా నన్ను ఆశీర్వదించు’, అని ఈ ప్రార్థన యొక్క ఉద్దేశం. కాబట్టి దీపావళి నాడు మనకి ‘తమసోమా జ్యోతిర్గమయ’ అనేటువంటిది ఈ జ్యోతుల యొక్క ఆవళి. దీపాల వరుస క్రమం కనబడుతూ ఉంటే ప్రతి ఇంట్లో, ప్రతి మనిషిలో ఈ జ్ఞాన జ్యోతి ప్రకాశించి, అజ్ఞానం పోయి దుర్మార్గం నశిస్తుంది. ఎందుకంటే ఎప్పటికైనా సరే దుర్మార్గం నశించాలి, సన్మార్గం నిలబడాలి. సన్మార్గం నిలబడితేనే సమాజం బాగుంటుంది, దాని ద్వారా దేశం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది.

సనాతన ధర్మం యొక్క లక్ష్యము ‘వసుధైక కుటుంబం’. మనుష్యులే కాదు ‘ద్విపాద పశునాంచ చతుష్పాద పశునాంచ’ అంటుంది. సమస్త జీవరాశి, జీవకోటి ఆనందంగా ఉండాలి అంటే సన్మార్గంలో మనుష్య జాతి ఉండడం చాలా అవసరం. ఈ దీపావళి పండుగ మనకి ఆ సందేశాలు విరివిగా అందిస్తూ ఉంటుంది.

ఉదాహరణకి తలంటి పోసుకుంటాం, తలస్నానం చేస్తాం. ఆ రోజు తలస్నానం చేస్తున్నాము అంటే తలలో ఉండేటువంటి చెడు ఆలోచనలన్నీ తలంటి పోసి తీసేయాలి. ‘ఇక్కడితో జరిగింది ఏదో జరిగిపోయింది, అటువంటి ఆలోచనలు నా తలలో నేను భరించను, నేను తీసుకురాను’, అని నిర్ణయం తీసుకొని తలంటి పోసుకోమ్మని చెప్పారు.

కొత్త బట్టలు ధరించమన్నారు అంటే ‘కొత్త ఆలోచనలు తీసుకురా, ఏ పాత ఆలోచనలు అయితే నిన్ను ఎదగనీయకుండా చేస్తున్నాయో, సన్మార్గంలో నిన్ను పైకి రానీయకుండా అడ్డుపడుతున్నాయో, వాటిని గుర్తించి గ్రహించి, ఎలా అయితే పాత బట్టలు తీసేసి కొత్త బట్టలు వేసుకుంటామో అలాగే కొత్త ఆలోచనలు ధరించి నువ్వు ఉత్తముడిగా ఉండాలి’.

మనకి దీపావళి పండుగలో ప్రతి అంశంలో, ప్రతి నడకలో, ప్రతి విషయంలో కూడా విశేషమైనటువంటి సందేశాన్ని మహర్షులు అందించారు. వీటన్నిటిని మనం ఒకసారి నెమరు వేసుకొని, గుర్తు చేసుకొని, ఆచరణలోకి తెచ్చుకుందాం, సన్మార్గంలో ప్రవర్తిద్దాం.      

                        ధర్మస్య విజయోస్తు.

K C Das Memorial Charitable Trust

Paropakarardham Idam Sareeram

  • Instagram
  • YouTube
  • Facebook
Address
H.No. 11-13-119, 14/B, Road No. 3, beside Axis Bank, Alkapuri Colony, Ramakrishnapuram, Kothapet, Hyderabad, Telangana 500035
View on map
Contact
contact@kcdastrust.org
+91 94948 77070
04:00 PM to 08.30 PM IST

© 2026 K C Das Memorial Charitable Trust. All rights reserved.

Terms and ConditionsPrivacy Policy