Skip to navigation
K C Das Memorial Charitable Trust
Donate
  • Home
  • About
  • Library
    • Dharma Vaani
    • Sri Lalitha Sahasra Naamavali
    • Dharmavaaradhi e-Magazine
    • Guru Vaani
    • Saradamba TV (Grandly Launched)
  • Dharmika Programs
    • All programs
    • Hanuman Chalisa
    • Gayathri Japam
    • Bala Japam
    • Calendar
  • Spiritual Education
  • Community Welfare
  • Contact
Donate
  • Instagram
  • YouTube
  • Facebook
  • Instagram
  • YouTube
  • Facebook
Donate

హనుమ – సుందరుడు

వానరరూపంలో ఉన్న స్వామి సుందరుడు ఏమిటి? స్వామి వారి అసలు నామం తెలుసుకుందాము.

          హనుమంతులవారికి అనేక నామాలు ఉన్నాయి – ‘హనుమంతుడు, ఆంజనేయుడు, మారుతి’ – ఇలా ఎన్నో నామాలతో ఆ స్వామిని పూజిస్తాము. పద్మపురాణాన్ని అనుసరించి హనుమ అసలు నామం ‘సుందరుడు‘. “సుందర శుభగ శ్రీమాన్ హనుమాన్ మారుతాత్మజ“, అంటుంది పద్మపురాణం.

హనుమాన్ అంటే ‘ఉబ్బినటువంటి దవడలు గలవాడు’ అని సాధారణ అర్థం. బాలాంజనేయుడు సూర్యుడిని చూసి పండని బ్రమించటం, ఆకాశములోకి ఏగిరి సూర్యుడిని మ్రింగబోవటం, ఇంద్రుడు ఆగ్రహించి హనుమను తన వజ్రాయుధముతో కొట్టడం, ఆ వజ్రాయుధ ధాటికి హనుమ దవడలు ఉబ్బటం, హనుమ నేల మీద పడిపడిపోవటం, వాయుదేవుడు ఆగ్రహించటం, బ్రహ్మది దేవతలు హనుమకు అనేక వరాలను అనుగ్రహించటం, అప్పటి నుంచి ‘హనుమ’ అనే నామముతో ప్రఖ్యాతి గావించటం జరిగిందని రామాయణం పేర్కొంటోంది.

“బాలార్క బింబము ఫలమని పట్టిన ఆలరిచేతల హనుమంతా | తూలని బ్రహ్మాదులచే వరముల ఓలి చేకొనిన ఓ హనుమంత ||” అని హనుమ బాల్య కథను అన్నమాచార్యులవారు తన కీర్తనలో పొందుపరిచి, హనుమను ఎంతో గొప్పగా కీర్తించారు. “తనవజ్రఘాతంబువలన హను వట్లు విఱుగుట నఖిలలోకములు, హనుమంతుఁ డనుపేర నధికుఁడై పరఁగ వానికి వర మిచ్చి వజ్రఘాతమునఁ, జావు లేకుండంగ శతమఖుఁ డపుడు” అంటారు మీసరగండ కాచభూపతి, విఠ్ఠలరాజు కవులు రంగనాథరామాయణములోని ఉత్తరకాండలో.

. ‘హనుమాన్ – ఉబ్బినటువంటి దవడలు గలవాడు’ అనేది ఒక పేరు కాదు, అది ఒక లక్షణం. పురాణాల ప్రకారం హనుమంతులవారి పేరు ‘సుందరుడు.’ కేసరి నందనుడు గనుక  తమిళ సంప్రదాయాన్ని అనుసరించి ‘కే సుందర్’ అనవచ్చు. రామాయణములో గల ఏడు కాండల పేర్లు ఒక్కసారి గమనిస్తే – బాలకాండ (రాములవారి బాల్యాన్ని వివరిస్తుంది), అయోధ్య కాండ (అయోధ్యలో జరిగిన కథ), అరణ్యకాండ (అరణ్యంలో జరిగిన కథ), కిష్కింధకాండ (కిష్కింధ గురించిన కథ), యుద్దకాండ (యుద్ధమును వర్ణిస్తుంది), ఉత్తరకాండ (యుద్ధము జరిగిన తరువాత కథ). హనుమత్ వైభవము వివరించే కాండను ‘హనుమత్ కాండ’ అని అనకుండా ‘సుందరకాండ’ అన్నారు వాల్మీకిమహర్షి. సుందరుడైన హనుమంతులవారి కథను చెప్పే కాండ కావున ‘సుందరకాండ’ అన్నారు మహర్షి.

శుభగ – “నమో శుభగ శుభమంగళం ఆంజనేయం”, అని మనము హనుమను కీర్తిస్తాము. భగ అంటే ‘ఐశ్వర్యము’. ‘భగ’, ‘భగవంతుడు’ ఆంటే ఎవరో భాగవతములో వివరముగా చెప్పబడి ఉన్నది. ఎవరు భగవంతుడు? “ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసశ్శ్రియః । జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణా ॥ 74 ॥” – ‘సమగ్రైశ్వర్యము, వీర్యము, యశము, శ్రీ, జ్ఞానము, వైరాగ్యములైన’ ఆరు లక్షణాలను ‘భగ’ అంటారు. ‘ఎవరి దెగ్గిరైతే తరగని ఐశ్వర్యం ఉంటుందో, ఎవరి దెగ్గిరైతే సమగ్రమైన ఐశ్వర్యం ఉంటుందో, ఎవరైతే అంతులేని ఐశ్వర్యం కలవాడో’, అతను ‘భగవంతుడు’ అంటుంది భాగవతము. ఈ లక్షణాలన్నీ హనుమంతులవారికి కలవు అని తెలిపేందుకు మనకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.

శ్రీమాన్ ఆంటే ‘శ్రీమంతుడు, సంపదను కలిగినవాడు, కలిగించేవాడు’. ‘అష్టసిద్ది నవనిధికే దాత’, అని హనుమను కీర్తిస్తారు తులసీదాస్ హనుమాన్ చాలీసాలో. మనకు అష్టసిద్దులను అనుగ్రహించగలవారు హనుమ. శ్రీమాన్‌ అనే నామం విష్ణుసహస్రనామావళిలో మనకు కనిపిస్తుంది. ‘రమణీయ స్వరూపం కలవాడని’ ఈ నామం యొక్క స్థూలార్థం.  సంపద అంటే కేవలం ధనం మాత్రమే కాదు. ‘జ్ఞాన సంపద, వైరాగ్య సంపద, ఆరోగ్యం, బంధుమిత్రులు కలిగి ఉండటం’, ఇత్యాదివన్నీ కూడా సంపదలే. ఈ సంపదలన్నిటిని ప్రసాదించేవారు హనుమ.

నిజమైన సౌందర్యం అంటే?  

వానరరూపం కదా హనుమది, మరి సౌందర్యం ఎక్కడిది అనే సందేహం మనకి కలగవచ్చు. సౌందర్యం ఆంటే ఏమిటి? ‘అందము వేరు, సౌందర్యము వేరు’. అవయవ సౌభాగ్యం అంటారు. ఏ అవయము ఎక్కడ ఉండాలో, ఎంత ఉండాలో, ఎలా ఉండాలో అంత ఉంటూ, సౌభాగ్యాన్ని కలిగించగలటమే సౌందర్యం అని పెద్దలు పేర్కొన్నారు.

ఒక వ్యక్తి గురించి మనము ఆలోచించినప్పుడు అప్రయత్నముగా మన మనస్సు అహ్లాదానికి లోనైతే ఆయన ‘సుందరుడు’. ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే నడిచే దేవుడుగా పేరుగాంచిన శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర మహాస్వామి వారు తన దండం పట్టుకొని నడుస్తూ ఉంటే ఎక్కడి వారు అక్కడే ఆగిపోయి వారికి నమస్కరించేవారు. అది నిజమైన సౌందర్యమంటే. ఆయన ఎదురుకుండా లేకపోయినా, వారు చెప్పిన మాటను  వేదముగా భావించేవారు ఎంతో మంది ఈనాటికి మనమధ్య ఉన్నారు. అది సౌందర్యమంటే.  

మనము చూసే ఐహికమైన, భౌతికమైన సౌందర్యం నిజమైన సౌందర్యం కాదు. ఎందువల్ల? సౌందర్యానికి నిర్వచనం ఏమిటి అంటే, ఏ వస్తువైనా సరే, ఉదాహరణకు ఒక్క పువ్వును చూసాము, ‘అబ్బా ఎంత బాగుందో’, అనుకున్నాము, మరల మరల అదే విషయం మన స్ఫురణకు రావాలి. కాసేపు వస్తుంది మరల మరో అంశం రాగానే ఈ పువ్వు పక్కకెళ్లిపోతుంది. ఆ పువ్వు సౌందర్యం నిలబడదు. కాబట్టి భౌతికమైన సౌందర్యం కాకుండా, ప్రకృతికమైన సౌందర్యం కాకుండా ఉండే అంతః సౌందర్యమే నిజమైన సౌందర్యం. వస్తు సౌందర్యము నిలకడలేనిది. మార్పుకు లొంగిపోయేది. అటువంటి వస్తు సౌందర్యము సౌందర్యమనిపించుకోదు. మనలోని అంతరానందాన్ని బయటకు తెచ్చేది, బయటకు తేవటానికి సహాయము చేసేది ‘అందము’. అందగాడు అంటే ‘మనస్సులోని ఆనందాన్ని బయటకు తెచ్చేవాడు’.

అమ్మవారికి ‘సుందరి’ అని పేరు ఉన్నది. ‘సుందరి, సుందరుడు’ అంటే అర్థం ‘అందమైనవారు’ మాత్రమే కాదు. సుతరాం ఆద్రియతే ఇతి సుందరః’-  ‘అందరినీ ఆకర్షించేవాడు, అందరి ఆదరణ పొందేవాడు, విశిష్టమైన గుణమహిమ రూపాలు కలవాడు సుందరుడు’. శ్రీమద్రామాయణ కథ విన్నవారినీ, చదివినవారినే కాదు, సాక్షాత్తూ సీతారాములతో సహా అందరినీ ఆకట్టుకున్న ఒకే ఒక్కడు… హనుమంతుడు. నాడే కాదు, నేటికీ అందరికీ ప్రీతిపాత్రుడు. ఆ సుందరుని కథే సుందరకాండ. సుందరుడు అనగా “ఆనందము కలిగించువాడని” అర్ధము.

హనుమ యొక్క సౌందర్యం ఎక్కడ ఉంది అనేది సుందరకాండలో మనకు ఆవిష్కరామౌతుంది. ఒక ఉదాహరణ. మనము ఏదో ఒక చిన్న పని చేస్తే, నేను చేసానండి అని చెప్పుకుంటాము. కానీ ఎన్ని ఘనకార్యాలు సాధించినా కూడా హనుమ ఎన్నడు తన గొప్ప తాను చెప్పుకోలేదు.  వారధి లంఘించినప్పుడు రామబాణంలా దూసుకుపోతానన్నాడు కానీ… తన శక్తి సామర్థ్యాలే కారణమని చెప్పలేదు. ‘యథా రాఘవ నిర్ముక్తః శరః శ్వసన విక్రమః – గచ్చేత్ తద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం! నహి ద్రక్ష్యామి యది తాం లంకాయాం జనకాత్మజాం!!‘ –“నేను రాముని బాణం వలే వెళతాను, ఇది నా శక్తి కాదు, నాకు నేనుగా లంకకు వెళ్ళటం లేదు, రాముని యొక్క అనుగ్రహముతో లంకకు వెళ్తున్నాను’ అంటారు హనుమ. అది సౌందర్యమంటే.

రుద్ర తేజుడైనప్పటికీ ప్రశాంత గాంభీర్యం, ఉగ్రతేజుడైనా మృదు మధుర వాక్కులు పలికే సంస్కారవంతుడు. బలాన్ని ప్రదర్శించాల్సిన వేళ బలాన్ని, బుద్ధి చతురత ప్రదర్శించాల్సిన వేళ బుద్దిని ప్రదర్శించి, పరిస్థితులను చక్కదిద్దినవాడు. నిస్వార్థ కర్మయోగి. అది హనుమంతులవారి సౌందర్యమంటే.

హనుమంతుడు – పరోపకారం

K C Das Memorial Charitable Trust

Paropakarardham Idam Sareeram

  • Instagram
  • YouTube
  • Facebook
Address
H.No. 11-13-119, 14/B, Road No. 3, beside Axis Bank, Alkapuri Colony, Ramakrishnapuram, Kothapet, Hyderabad, Telangana 500035
View on map
Contact
contact@kcdastrust.org
+91 94948 77070
04:00 PM to 08.30 PM IST

© 2026 K C Das Memorial Charitable Trust. All rights reserved.

Terms and ConditionsPrivacy Policy