శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
938. ప్రగల్భా | ||
సర్వ సమర్ధురాలు, మహా మాయా స్వరూపిణి. సర్వము తానై ఉన్నది కనుక ప్రగల్భా. మాయచేత జీవుడితో అజ్ఞానపు ప్రగల్భాలు పలికిస్తుంది పరమేశ్వరి. మరల ఆ మాయను తొలగించటము ఆ పరమేశ్వరికే సాధ్యం. ప్రగల్భా రూపములో ఉన్న పరమేశ్వరికి నమస్కారము. 🙏 🌺 నాకు ఇంత అనుభవము ఉన్నది, నేను లేకుండా, కార్యక్రమము ఎలా జరుగుతుందో చూస్తాను, నేను ఉన్నాను కాబట్టి ఇంతటి మహత్తరమైన కార్యక్రమము దిగ్విజయమైనది అని మానవుడు మాయలో ఎన్నో ప్రగల్భాలను పలుకుతాడు. పరమేశ్వరియే అన్నింటికీ మూల కారణము, మనము నిమిత్త మాత్రులము. ఈ సారి మనకి అవకాశము ఇచ్చినది, రేపు ఇంకొకరికి ఇస్తుంది. మనము మన అనుభవముతో తోటి వారికి సహాయ పడదాము అన్న జ్ఞాన బుద్ధిని ప్రసాదించమని పరమేశ్వరిని వేడుకుందాము. 🌺 |