శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
551. వియదాది జగత్ప్రసూ | ||
జగత్తు సృష్టి అంతయూ పరాశక్తి స్వరూపమే. ఆకాశము మొదలైన పంచభూతాలతో కూడిన జగత్తు పరాశక్తి వలన ఆవిర్భవించినదే. జగత్తులో ప్రతి వస్తువు పరమాత్మ స్వరూపమే. పరమాత్మే ఆత్మ. నిర్గుణ, నిరాకారమైన ఆత్మ, శబ్దం అనే లక్షణముతో ఆకాశమైనది. స్పర్శ అనే లక్షణముతో వాయువుగా. ఈ రెండు లక్షణాలతో కూడుకుని అగ్ని రూపము దాల్చినది. ఈ మూడు లక్షణాలతో కూడుకొని నీరు, రసం అనే గుణాన్ని సంతరించినది.ఈ నాలుగు లక్షణాలతో కూడుకొని భూమి, గంధం అనే లక్షణాన్ని జత చేసింది. భూమి నుండే అన్నము ఉద్భవించినది. అన్నము నుండి మనిషి , ఇతర భూతాలుగా రూపం దాల్చినట్లు తెలుస్తోంది. ఈ పంచ భూతముల వలన ప్రపంచంలోని అన్ని వస్తువులు ఏర్పడినవి. ఈ పంచభూతములను ఆరాధించడమంటే భగవంతుణ్ణి ఆరాధించడమే🙏 🌺హృదయంలోని ఆ భగవంతుని ఉనికిని అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగితే ఏ తప్పునైనా చేయగలరా ఎవరైనా? భగవంతుడు అంతరంగంలో ఉండి మనని గమనిస్తుంటాడు 🌺 |