శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
140. నిష్కళా | ||
కళ అంటే అంశము, భాగము, విభజనము. ఈశ్వరునియుక్క నిర్గుణముగావున్న అఖండ స్వరూపము సగుణముగా మారుటను కళ అంటారు. కళయే మహామాయా స్వరూపిణియైన జగతజనని స్వరూపము. అఖండ నిరపేక్ష నిరాకార నిర్గుణ నిరంజనమే నిష్కళ. అఖండ -అద్వయ -ఆనంద పరచితి లక్షణములు కలది. నిష్కళ అంటే అంశరహిత పరిపూర్ణము. అనగా విభజన కానటువంటి అఖండ తత్వం. ఆకులమార్గములో ప్రయాణించే జ్యోతి, జ్ఞాత, జ్ఞాన, జ్ఞేయము అనే త్రిపుటిని భంగము చేసి తానే "బ్రహ్మేవాహమస్మి" నేనే బ్రాహ్మనై వుండగా మరొక బ్రహ్మ ఎక్కడో వున్నాడు అన్న బ్రాంతిని, మాయని ఎందుకు సృష్టించుకున్నాను అన్న భావనతో ఆజ్ఞాచక్రము పైనుండి నిష్కళంగా ఉన్మని పర్యంతము వెళుతుంది. ఉన్మని దగ్గర నేనే బ్రహ్మనై వున్నాను అన్న మాటను కూడా విస్మరించి సకల, నిష్కళ అన్నియు తానే సహస్రారమందున్న తేజస్సును చేరుతుంది. ఆ సదాశివ తేజస్సుతో కలిసినప్పుడు ఆమె అఖండమైపోతుంది. ఆమెనే శ్రీమహాత్రిపురసుందరి, శ్రీరాజరాజేశ్వరీ. ఇక్కడ శివ శక్తి లో బేధం లేదు. అట్టి తురీయ అంతమును నిష్కళ అంటారు. నిర్గుణ ధ్యాన పరమావధి నిష్కళ. ఆ తల్లికి నమస్కారము 🙏 🌺విభిన్న రూపాలుగా, భాగాలుగా కనిపించే వాటన్నిటిలో మూలమును చూడగలిగే విజ్ఞత కలుగుతుంది. 🌺 |